చిరంజీవి: 'బిగ్గర్ దేన్ బచ్చన్' అనేంత పాపులారిటీ తెచ్చుకున్న 'మెగాస్టార్'కి జీవితంలో ఆ లోటు అలాగే ఉండిపోయిందా?

ఫొటో సోర్స్, @KChiruTweets
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
అది 1992 జూలై చివరివారం...
విజయవాడ గాంధీనగర్ సినిమా థియేటర్ల రోడ్...
రాజ్ యువరాజ్ థియేటర్‌లో ఘరానా మొగుడు తెలుగు సినిమా .
శైలజా థియేటర్లో ఆజ్ కా గూండారాజ్ అనే హిందీ సినిమా.
ఊర్వశి కాంప్లెక్స్‌లో 'ది హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్'.. కొదమసింహం ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీ ఆడుతున్నాయి.
ఇలా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకే హీరో నటించిన మూడు సినిమాలు ఒకే సమయంలో ఆడటం ఓ రికార్డ్.
ఆయనే చిరంజీవి.
అది చిరంజీవి ప్రైమ్ టైమ్ నడుస్తున్న కాలం. అందుకే ది వీక్ ఆంగ్ల మేగజైన్ చిరంజీవి పారితోషికం ఎంతస్థాయికి వెళ్లిందో వివరిస్తూ 'బిగ్గర్ దేన్ బచ్చన్' అనే ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
అప్పటికి చిరంజీవి సినిమాల్లోకి వచ్చి 14 ఏళ్లైంది.

పున్నమినాగుతో తొలిబ్రేక్
చిరంజీవి 1978లో సినిమాల్లోకి వచ్చారు. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన సినిమా పునాది రాళ్లు. కానీ, విడుదలైన మొదటిసినిమా ప్రాణం ఖరీదు. తరువాత విలన్ పాత్రలు వేశారు.
ఇది కథ కాదు చిత్రంలో జయసుధ భర్తగా ఆయన నెగటివ్ పాత్రలో ఒదిగిపోయారు.
కృష్ణ హీరోగా వచ్చిన కొత్తపేట రౌడీ, శోభన్‌బాబు హీరోగా వచ్చిన మోసగాడు సినిమాల్లో విలన్‌గా... ఇలా ఏ పాత్ర దొరికితే ఆ పాత్రలో నటిస్తూ ఏడాదికి వేగంగా పదుల సంఖ్యలో చిత్రాలు చేస్తూ వచ్చిన చిరంజీవికి తొలిబ్రేక్ ఇచ్చిన చిత్రం పున్నమినాగు.
1980లో వచ్చిన పున్నమినాగు సినిమా చిరంజీవిలోని విభిన్నమైన నటనను ఆవిష్కరించింది.
ఆ తర్వాత 1981లో క్రమంగా చిన్న చిత్రాల హీరోగా, తాను విలన్‌గా నటించిన కృష్ణ, శోభన్‌బాబులతోనే తోడుదొంగలు, చండీప్రియ సినిమాల్లో సెకండ్ హీరోగా నటిస్తూ వచ్చారు.
అదే ఏడాది, ఎన్టీ రామారావు సినిమా ఎదురులేని మనిషిలోనూ నటించారు.
ఇక ఆ ఏడాది చివర్లో వచ్చిన చట్టానికి కళ్లు లేవు సినిమా వసూళ్లు అప్పుడే విడుదలైన ఓ అగ్రహీరో హిట్ సినిమా వసూళ్లకి దగ్గరగా ఉండటంతో సినిమా పరిశ్రమ దృష్టి చిరంజీవిపై పడటం మరింత పెరిగింది.

ఫొటో సోర్స్, Chiranjeevi
ఖైదీతో కథ మారింది..
ఇక 1982లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలతో తారాపథంలోకి దూసుకొచ్చిన చిరంజీవి... 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
తరువాత 1992 వరకూ చిరు చిత్రాలే కలెక్షన్ల విషయంలో ఒకదానికి మించి ఒకటి పోటీ పడ్డాయి.
సరికొత్త డ్యాన్సులు, డ్యాన్సులో వేగం, రియలిస్టిక్ ఫైట్లతో చిరంజీవి అప్పటిదాకా ఉన్న మూసధోరణిని బద్దలు కొట్టారనే చెప్పాలి.
1983 నుంచి 1985 వరకు వరుస సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చిరంజీవి.. 1987 నుంచి 1992 వరకు వరుసగా తెలుగు సినిమాకి ఇండస్ట్రీ హిట్‌లు అందించారు.

ఫొటో సోర్స్, Chiranjeevi/FB
ఈ చిత్రాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించి చిరంజీవికి తెలుగు సినిమా హీరోల వరుసలో ప్రత్యేక స్థానాన్ని అందించాయి.
అప్పటికే తెలుగునాట సూపర్‌స్టార్ ట్యాగ్ కృష్ణకి ఉండటంతో 1988లో కేఎస్ రామారావు నిర్మించిన మరణమృదంగం సినిమాలో చిరంజీవికి తొలిసారిగా మెగాస్టార్ ట్యాగ్ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Chiranjeevi
సినిమాల్లో చిరంజీవి ప్రైమ్ టైం అంటే అదే...
చిరంజీవి అసలైన ప్రైమ్ టైం అంటే 1992 వరకే అనే విశ్లేషణ ఒకటి బలంగా ఉంది.
ఎందుకంటే బాలచందర్, భారతీరాజా, బాపు, కె.విశ్వనాథ్ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న విభిన్నమైన పాత్రలు పోషించడం, కోదండ రామిరెడ్డి, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ వంటి స్టార్ డైరెక్టర్ల చిత్రాల్లో మాస్ మసాలా సినిమాలు చేయడం. జంధ్యాల దర్శకత్వంలో కామెడీ హీరోగా చంటబ్బాయ్ సినిమాలో నటించడం.. ఇలా విభిన్న జోనర్లలోనూ చిరంజీవి నటించారు.
డ్యాన్సులు, ఫైట్లు, యాక్షన్, కామెడీ... ఇలా అన్ని కోణాల్లోనూ సరికొత్త ముద్రవేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.
1992లో వచ్చిన ఘరానామొగుడు తెలుగు సినీ పరిశ్రమకు మొదటిసారి రూ.10 కోట్ల వసూళ్లతో రికార్డులు సృష్టించింది.
చిరంజీవి బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో డాక్టర్ రాజశేఖర్ నటించిన అంకుశం చిత్రాన్ని 'ప్రతిబంద్'గా రీమేక్ చేసి.. చిరంజీవి తొలిసారిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు.
ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తాను తెలుగులో నటించిన గ్యాంగ్‌లీడర్‌ను 'ఆజ్ కా గూండారాజ్ ' పేరుతో రీమేక్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నో ఎత్తుపల్లాలు
విజయం వెన్నంటే అపజయం ఉంటుందని చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమా నిరూపించింది.
దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్.. మొదటిసారి కోటి పాతిక లక్షల రూపాయలు తీసుకున్న నటుడిగా.. ఈ ఆపంద్భాంధవుడితోనే ఆయనకి ఖ్యాతి రాగా, 1992 ద్వితీయార్ధంలో విడుదలైన ఆ సినిమా అట్టర్ ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.
ఆ సినిమాలో నటనకు చిరంజీవికి నంది అవార్డు వచ్చినప్పటికీ, వాణిజ్యపరంగా బాగా దెబ్బతీసింది. దీంతో ఆ సినిమా నిర్మించిన పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ మళ్లీ సినిమాలు తీయలేదు.
శంకరాభరణం, సప్తపది. సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి వంటి చిత్రాలు తీసిన చరిత్ర ఆ సంస్థకు ఉంది.
తరువాత 1993లో ముఠామేస్త్రీ, అనుకున్నస్థాయిలో హిట్ కాలేదు. దీని తరువాత మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, ఎస్పీ పరశురాం, అల్లుడా మజాకా అనుకున్న స్థాయిలో ఆడలేదు. బిగ్‌బాస్, రిక్షావోడు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
ఆ తరువాత ఓ ఏడాది గ్యాప్ తీసుకున్న చిరంజీవి 1997లో హిట్లర్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా మాస్టర్, బావగారూ బాగున్నారా, చూడాలని ఉందితో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.
ఈ క్రమంలో 2001లో వచ్చిన మృగరాజు డిజాస్టర్ అయింది. ఈ సినిమా పరాజయం నిర్మాత దేవీ వరప్రసాద్‌ను కోలుకోలేని దెబ్బతీసింది.
ఎన్టీ రామారావుతో సినిమాలు తీసిన దేవీవరప్రసాద్.. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నా హీరో చిరంజీవే.. ఆయన ఒక్కరితోనే నా సినిమాలు అని ప్రకటించి.. ఆ మేరకు అలానే తీశారు.
కొండవీటి రాజా, ఘరానా మొగుడు, అల్లుడా మజాకా తదితర చిత్రాలు తీసిన ఆయన ఓ హాలీవుడ్ చిత్రం స్ఫూర్తితో రూపొందించిన మృగరాజు డిజాస్టర్ దెబ్బకి మళ్లీ కన్నుమూసే వరకూ దేవీ వరప్రసాద్ సినిమాల నిర్మాణం చేపట్టలేదు.
2002లో అశ్వనీదత్ నిర్మించిన ఇంద్ర సినిమా తెలుగు సినిమాకి తొలిసారిగా రూ.30 కోట్ల కలెక్షన్లు చూపించింది. ఆ వెంటనే వచ్చిన ఠాగూర్ కూడా హిట్ అయినా, అంజి చిత్రం మాత్రం నిరాశపరిచింది.
2007లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయాల్లో 'చిరు'ముద్ర..
1992లో గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన ఘరానా మొగుడు సినిమా విజయోత్సవ సభ సమయంలోనే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది.
2008 ఆగస్టులో తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చిరంజీవి ప్రకటించారు. అదే ఏడాది తిరుపతి బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీ పేరును ప్రకటించారు.
పార్టీ పెట్టిన 9నెలల్లోనే ఎన్టీఆర్ సీఎం అయిన రికార్డును ఛేదించాలనే ఉద్దేశంతోనే చిరంజీవి ఎన్నికలకు 8 నెలల ముందు పార్టీని ప్రకటించారని అప్పట్లో రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజారాజ్యం పరాజయం పాలైంది.
2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఆయన పాలకొల్లు, తిరుపతిలో రెండుచోట్ల పోటీచేస్తే తిరుపతిలో మాత్రమే గెలిచారు.

ఫొటో సోర్స్, @KChiruTweets
వచ్చే ఎన్నికలు నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని చిరంజీవి ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలో ప్రకటించారు. కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
తాను రాజ్యసభ సభ్యుడయ్యారు. అలా కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఏడాదిన్నర పాటు పనిచేశారు.
పార్టీ విలీన నిర్ణయంపై ఇప్పటికీ ఆయన విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. పార్టీని నడిపిస్తేనే బాగుండేదని, అలా విలీనం చేయడం సరికాదనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తుంటారు.
అయితే, చిరంజీవి వర్గీయుల వాదన మాత్రం మరోలా ఉంటుంది. అప్పటి రాజకీయ పరిస్థితులకు అదే సరైన నిర్ణయమని అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఓ రాజకీయ నాయకుడు బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.
అయితే నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన.. అంటూ జై జనసేన అని ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయాలకు దూరంగా..
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చిరంజీవి.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో సోదరుడు నాగేంద్రబాబు ఏపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
కాగా, ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయిలో లేకపోయినప్పటికీ చిరంజీవి వర్గం ప్రభావం చూపించే పరిస్థితిలో కచ్చితంగా ఉందని తమ్మారెడ్డి భరద్వాజ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని అనుభవాలు..
2009 ఫిబ్రవరి 10:
ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి గుంటూరు నుంచి నారాకోడూరు మీదుగా రోడ్ షోగా తెనాలి వెళ్తున్నారు. జనం భారీయెత్తున తరలివచ్చారు.
ఈ క్రమంలో ఆయనకు ఎదురేగి స్వాగతం పలికేందుకు తెనాలి సమీపంలోని చక్రాయపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్ మీద వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి తన పర్యటన నిలిపివేసి సంఘటన స్థలానికి వెళ్లారు.
ఆ యువకుల తల్లిదండ్రులను చిరంజీవి పరామర్శిస్తున్న క్రమంలో ఓ యువకుడి తల్లి విలపిస్తూ.. 'మా బిడ్డల ప్రాణాలే కాదయ్యా.. నీకు రెండు ఓట్లు పోయాయయ్యా' అని అనడంతో చిరంజీవి కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
2012 మే:
కాంగ్రెస్ నాయకుడిగా చిరంజీవి అనంతపురం పర్యటనకు వెళ్లారు. అసలే మే నెల ఎండలు. మండువేసవిలో చిరంజీవి ఎడతెరిపి లేకుండా ఆరోజు పొద్దెక్కేవరకు పర్యటించారు. అనంతపురం జిల్లా నేతలు ఆయనకు నగరంలోని ఒక కార్పొరేటర్ ఇంట్లో తేనీటి విందు ఏర్పాటు చేశారు.
అప్పటికే అలసిపోయిన చిరంజీవి తేనీటి కోసం ఎదురుచూస్తుండగా.. సదరు కాంగ్రెస్ కార్పొరేటర్ వచ్చి.. టీ తెమ్మంటారా? అని అడిగారు. దానికి చిర్రొత్తుకొచ్చిన చిరంజీవి.. అందుకోసమే కదా వచ్చింది, మళ్లీ తెమ్మంటారా అని అడుగుతారేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఊహించని పరిణామంతో సదరు కార్పొరేటర్ కూడా 'మా ఇంటికి వచ్చి నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తారేంటి' అని చిరంజీవికి ఎదురుతిరిగారు. చివరికి కాంగ్రెస్ నేతలు సర్దిచెప్పడంతో చిరంజీవి ముభావంగానే ఆ టీ తాగి బయటకు వచ్చారు.
ఈ ఘటనలు చిరంజీవి రాజకీయ జీవితంలో ఉత్థాన పతనాలను ప్రతిబింబిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
రీఎంట్రీ..
'ఆ లోటు ఉంది'
ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి సుమారుగా పదేళ్ల తర్వాత, అంటే 2017లో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.
మధ్యలో మగధీర, బ్రూస్‌లీ చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించిన చిరంజీవి.. మళ్లీ ఖైదీ నంబర్ 150 చిత్రంలో హీరోగా నటించారు.
వయస్సు రీత్యా 70 ఏళ్లకి చేరుకుంటున్నప్పటికీ ఆయన ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. విశ్వంభర 2026లో రిలీజ్‌కి సిద్ధం చేస్తుండగా, మరో రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.
''చిరంజీవి స్పూర్తిగానే తాము సినిమాల్లోకి వచ్చామని చెప్పే యువ హీరోలు ఆయన మాదిరిగానే ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలి. అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది'' అని ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బీబీసీతో అన్నారు.
చిరంజీవికి సినిమా రంగంలో విజయం సులువుగా దక్కలేదు. తొలినాళ్లలో ఎన్నో అపజయాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఒకే మూసలో పడి కొన్నాళ్లు ప్లాఫ్‌లు ఎదుర్కొన్నారు.
చిరంజీవికి ప్రధాన బలం డ్యాన్స్. తనదైన స్టెప్‌లే అభిమానులకు కిక్.
చిరంజీవి కేవలం డ్యాన్సులు, ఫైట్లకే పరిమితం కాకూడదని తన సొంత నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రుద్రవీణ సినిమా తీశారు. కానీ, ఆ సినిమా ఫ్లాప్ అయింది.
తాను మెగా హీరోగా పేరుపొందానని, కానీ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేయలేకపోయానని.. తనకంటే ముందుతరం హీరోలకు చెప్పుకోదగ్గ పాత్రలు ఉన్నాయని.. కానీ, తనకు అలాంటి సినిమా లేదని స్వయంగా చిరంజీవి సైరా సినిమా విడుదల సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, @KChiruTweets
బ్లడ్ బ్యాంక్‌తో సేవారంగంలోకి..
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ప్రారంభిస్తున్నట్టు 1998 అక్టోబర్ 2న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ సభలో చిరంజీవి ప్రకటించారు.
ఇప్పటివరకు 9,30,000 యూనిట్లకు పైగా రక్తాన్నిసేకరించి 79% పేదలకు ఉచితంగా అందించినట్టు ట్రస్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మిగిలిన యూనిట్లను నామమాత్రపు రుసుముతో కార్పొరేట్ ఆసుపత్రులకు అందిస్తున్నట్టు పేర్కొంది.
4,580 జతల కళ్లను సేకరించి 9,060 మంది దివ్యాంగులకు కార్నియా మార్పిడి ద్వారా చూపు అందించినట్టు ఆ వెబ్‌సైట్‌లో తెలిపింది.
కోవిడ్ 19 మహమ్మారితో అత్యంత ప్రభావితమైన జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించారు.
''నేను చిరంజీవి తొలినాళ్ల నుంచి అభిమానిని. ఇంటిగుట్టు సినిమా ఫంక్షన్ గుంటూరులో జరిగినప్పటి నుంచి వీరాభిమానిగా మారిపోయాను. ఆయన చేస్తున్న రక్తదాన, నేత్రదాన కార్యక్రమాలను.. ఎవ్వరినీ నొప్పించని ఆయన మంచి మనస్సు చూసి మేం ఆయన అభిమానులుగా గర్విస్తాం'' అని గుంటూరు జిల్లాకు చెందిన చిరంజీవి యువత వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు సుంకర సతీష్ బీబీసీతో అన్నారు.
''చిరంజీవి చేసే సేవా కార్యక్రమాలు బయటకి తెలిసినవి తక్కువ. ఎవరికీ తెలియకుండా చేసేవి ఎన్నో. ముఖ్యంగా ఎవరైనా అనారోగ్య సమస్య ఉందని వస్తే వెంటనే తెలిసిన హాస్పిటల్‌కి పంపించడం, లేదా డబ్బు సాయం చేసి పంపించడం నేను ప్రత్యక్షంగా చూశా'' అని ఫిల్మ్ క్రిటిక్, జర్నలిస్ట్ రాజీవ్ ఎర్రం బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, @KChiruTweets
'అభిమాని పిలిచె'.. చిరంజీవిపై నవల
చిరంజీవి నవలా చిత్ర కథానాయకుడు అనేది చాలామందికి తెలుసు.
యండమూరి వీరేంద్రనాథ్ నవలలు చిరంజీవి హీరోగా వెండితెరకు ఎక్కాయి.
కానీ, చిరంజీవిపైనే 1995లో ఓ నవల వచ్చింది. అప్పట్లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో 28 వారాలపాటు 'అభిమాని పిలిచె' శీర్షికతో ప్రచురితమైందని రచయిత హరిగోపాలకృష్ణమూర్తి బీబీసీతో చెప్పారు. చిరంజీవి అభిమానుల ఆలోచనలే ప్రధాన ఇతివృత్తంగా ఈ నవల రచించానన్నారు.
చిరంజీవిపై అభిమానంతో నవల రాసిన తాను ఆయన స్ఫూర్తితోనే ఉత్తమాభిరుచి కల సినిమాలు కూడా నిర్మిస్తున్నానని గోపాలకృష్ణమూర్తి చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
''నేను చిరంజీవి నరసాపురం కాలేజీలో డిగ్రీ చేశాం. మూడేళ్లు కలిసి చదువుకున్నాం. అప్పటి నుంచే ఆయనకు నటనపై ఆసక్తి ఉండేది. నాటికల్లో బాగా యాక్ట్ చేసేవారు. అప్పట్లో మా బ్యాచ్‌లో ఉన్న ఎవరినీ చిరంజీవి మర్చిపోలేదు. మా స్నేహితుల్లో ఇద్దరికి ఇటీవల గుండె జబ్బు వస్తే దగ్గరుండి ఆపరేషన్ చేయించారు. మరొకరికి కాలేయ వ్యాధి వస్తే ఆర్థికంగా ఆదుకున్నారు. నిజంగా చిరంజీవి గ్రేట్'' అని ఏపీ వ్యవసాయ శాఖలో రిటైర్డ్ అధికారి హరినారాయణ బీబీసీతో అన్నారు.
తమ మధ్య ఇప్పటికీ అరేయ్ ఒరేయ్ అనే స్నేహమేనని సీనియర్ నటుడు భానుచందర్ గుర్తు చేసుకున్నారు.
''మేమంతా కలిసి చెన్నైలో తిరిగేవాళ్లం. వాడు నా బెస్ట్ ఫ్రెండ్'' అని భానుచందర్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, @KChiruTweets
చిరు స్పూర్తితో ఎంతోమంది హీరోలు..
చిరంజీవి స్పూర్తితో తెలుగునాట ఎంతో మంది హీరోలుగా వచ్చారు.
శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, రవితేజ, తరుణ్, కార్తికేయ, సత్యదేవ్ నుంచి వర్ధమాన హీరో సజ్జా తేజ వరకూ తాము చిరంజీవి స్పూర్తితోనే వచ్చామని చెబుతుంటారు.
దర్శకులైన రాజమౌళి, వినాయక్, బాబీ, మెహర్‌రమేష్. శ్రీను వైట్ల, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా తదితరులందరికీ చిరంజీవే ఫేవరేట్ హీరో.
మరోపక్క చిరంజీవి ఇంటి నుంచే బోలెడు మంది హీరోలు వచ్చారు. తన సోదరుడు నాగేంద్రబాబుని రాక్షసుడు సినిమాతో చిరంజీవి ఇంట్రడ్యూస్ చేశారు.
1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో మరో సోదరుడు పవన్ కల్యాణ్‌ని తెరపైకి తెచ్చారు.
2002లో గంగోత్రి సినిమాతో అల్లుడు అల్లు అర్జున్‌ను, 2007లో చిరుతతో తన కుమారుడు చరణ్‌ని చిరంజీవి తెలుగు తెరకి పరిచయం చేశారు.
ఆ తర్వాత నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక, మేనళ్లుల్లు సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇలా పలువురు మెగా ఫ్యామిలీ నుంచి నటులుగా, నిర్మాతలుగా కొనసాగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు
సినీరంగంతో పాటు సామాజిక రంగంలో చిరంజీవి సేవలకు గానూ భారత ప్రభుత్వం 2006లో పద్మ భూషణ్, 2013లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
తెలుగు సినీరంగంలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మవిభూషణ్ అందుకున్న రెండో నటుడు చిరంజీవే.
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సహా నాలుగు నంది అవార్డులు, ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














