గాజా నగర ఆక్రమణను ప్రారంభించిన ఇజ్రాయెల్, ఎవరికి అప్పగించబోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్జీ, రూత్ కమర్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరాన్ని ఆక్రమిస్తోంది. దీంతో పాలస్తీనియన్లు నగరం వదిలి వెళుతున్నారు.
గాజా నగరం ఆక్రమణ తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులను ప్రారంభించడంతో నగరంలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు.
రోజుల తరబడి బాంబుల దాడుల తర్వాత పది లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు నివసిస్తున్న నగర శివార్లను ఇజ్రాయెల్ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.
గాజాలో కొన్నాళ్లుగా బాంబు దాడులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
నగర శివార్లు తమ ఆధీనంలోకి వచ్చాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
గాజా సిటీలో సైనిక చర్యకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆమోదముద్ర వేశారు. ఈ వారం చివర్లో సెక్యూరిటీ కేబినెట్‌కు సమర్పిస్తారు.
ఈ ఆపరేషన్ కోసం 60వేల మంది రిజర్వ్ సైనికులతో పాటు ఇప్పటికే సైన్యంలో ఉన్న వారిని ఉపయోగించనున్నారు.
ఇజ్రాయెల్ అమాయక పౌరులపై క్రూరమైన యుద్ధాన్ని కొనసాగించాలని భావిస్తోందని అందుకే కాల్పుల విరమణకు అడ్డంకులు సృష్టిస్తోందని హమాస్ ఆరోపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఉత్తర గాజా స్ట్రిప్‌లో ఉన్న గాజా నగరంలో లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. యుద్ధానికి ముందు ఇది ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న నగరం.
గాజాస్ట్రిప్ మొత్తం ఆక్రమించుకుని అరబ్ దేశాలకు అప్పగించాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు.
ఈ ప్రణాళికను అనేక దేశాలు ఖండించాయి. ఇది మరిన్ని" బలవంతపు వలసలకు, హత్యలకు" దారి తీస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు హమాస్ తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ ప్రణాళిక ఏంటి?
ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
యుద్ధాన్ని ముగించడానికి ఈ ప్రకటనలో ఐదు సూత్రాలను ప్రకటించారు.
- హమాస్ నిరాయుధీకరణ
- జీవించి ఉన్న లేదా చనిపోయినా సరే, బందీలందరి అప్పగింత
- గాజా స్ట్రిప్ నుంచి సైనికుల్ని తొలగించడం
- గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భద్రత నియంత్రణ కొనసాగింపు
- పరిపాలన కోసం హమాస్, పాలస్తీనా అథారిటీ ప్రమేయం లేని వ్యవస్థ ఏర్పాటు.
గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళిక అమలు జరిగేటప్పుడు "యుద్ధ ప్రాంతం వెలుపల నివసిస్తున్న పౌరులకు మానవీయ సాయం అందిచండానికి" తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
అయితే ఈ సాయం కొత్తగా అందిస్తారా లేకపోతే ఇజ్రాయెల్, అమెరికా మద్దతున్న వివాదాస్పద గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ ద్వారా అందిస్తారా అనే దానిపై స్పష్టత లేదు.
ఇవి రెండూ కాకుండా మరో ప్రత్యామ్నాయం ఉందా అనేది కూడా తెలియలేదు.

ఫొటో సోర్స్, Getty Images
గాజా నగరమే ఎందుకు?
మొత్తం గాజాస్ట్రిప్ మీద నియంత్రణ సాధించాలని కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రధాన మంత్రి నెతన్యాహు చెప్పారు.
అయితే తాజాగా విడుదల చేసిన ప్రణాళికలో గాజా నగరం గురించి మాత్రమే ప్రస్తావించారు.
ఈ అంశం మీద ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
గాజాస్ట్రిప్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకోవడాన్ని ఆర్మీ చీఫ్ వ్యతిరేకించారని ఈ కథనాలు వెల్లడించాయి.
ప్రస్తుతం గాజాలోని 75శాతం ప్రాంతం తమ నియంత్రణలో ఉందని ఇజ్రాయెల్ చెబుతోంది.
అయితే ఇందులో 86శాతం ప్రాంతం మిలటరీ జోన్ లేదా ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిన ప్రాంతం కావచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది.
గాజా స్ట్రిప్‌పై పూర్తి స్థాయి నియంత్రణ సాధించే క్రమమంలో గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడం మొదటి అడుగు కావచ్చని బీబీసీ మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్ హ్యూగో బచేగా భావిస్తున్నారు.
గాజా మొత్తం మీద నియంత్రణ సాధించడం వల్ల కాల్పుల విరమణ చర్చలు మొదలైతే హమాస్ మీద ఒత్తిడి పెంచే వ్యూహం కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.
గాజాను ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంచుకోకుండా, అరబ్ దేశాలకు అప్పగిస్తామని నెతన్యాహు ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు.
"మాకు భద్రత కావాలి. అంతే కానీ మేము గాజాపై ఆధిపత్యం చెలాయించాలని అనుకోవడం లేదు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
నెతన్యాహు ‘గాజా’ ను ఎవరికి అప్పగించాలని అనుకుంటున్నారు?
గాజాను అరబ్ దేశాలకు అప్పగించాలని భావిస్తున్నట్లు నెతన్యాహు చెబుతున్నా, ఎవరికి అప్పగిస్తారనే దాని గురించి స్పష్టంగా చెప్పడం లేదు.
ఆయన కావాలనే చెప్పడం లేదని బీబీసీ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ లీస్ డూసెట్ చెప్పారు.
ఆయన జోర్డాన్, ఈజిప్ట్ గురించి ప్రస్తావిస్తూ ఉండవచ్చు. ఈ రెండు దేశాలు గాజాపై ఆసక్తి చూపించాయి.
అయితే ఇజ్రాయెల్ గాజాను ఆక్రమిస్తే తాము ఆ ప్రాంతంలోకి ప్రవేశించేది లేదని ఈ రెండు దేశాలు స్పష్టం చేశాయి.
గాజా నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ పాలన నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనే దాని గురించి ఇజ్రాయెల్ ఎలాంటి వివరాలు బహిర్గతం చేయలేదు.

ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి?
నెతన్యాహు నిర్ణయంపై హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారి కుటుంబాలు, ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
ఇజ్రాయెల్ చర్య పెద్ద తప్పుగా అని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అభివర్ణించారు. ఇది మరింత రక్తపాతానికి దారి తీస్తుందని చెప్పారు.
గాజాలో ఉపయోగించే ఆయుధాలను ఇకపై ఇజ్రాయెల్‌కు ఇచ్చేది లేదని జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్ట్జ్ చెప్పారు.
ఇజ్రాయెల్‌కు అతి పెద్ద ఆయుధ సరఫరాదారుల్లో జర్మనీ ఒకటి.
గాజా నగరాన్ని ఆక్రమించుకోవాలన్న ఇజ్రాయెల్ నిర్ణయం "పూర్తిగా నేరపూరితమైనదని" పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ చెప్పారు.
"ఇది పాలస్తీనియన్లను వారి సొంత భూముల నుంచి బలవంతంగా వెళ్లగొట్టడమే" అని తుర్కియే విదేశాంగ శాఖ అన్నది.
"గాజాలో యుద్ధాన్ని తక్షణమే ముగించాలి" అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టక్కర్ చెప్పారు.
ఇజ్రాయెల్ చర్య మరిన్ని వలసలు, హత్యలు, భరించలేని బాధలు, విధ్వంసానికి, దారుణాలకు దారి తీస్తుందని ఆయన అన్నారు.
ఈ ఆపరేషన్ "బందీలతో పాటు ఇజ్రాయెల్ సైనికులని కూడా భారీ విపత్తు వైపు నడిపిస్తోంది" అని హోస్టేజ్ ఫ్యామిలీస్ ఫోరం తెలిపింది.
అయితే అమెరికా స్పందనపై విమర్శలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనిక చర్యల తమకు ఆందోళన కలిగించలేదని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారి మైక్ హుకబీ అన్నారు.
"వాళ్లేం చేయాలో, చేయకూడదో చెప్పడం మా పని కాదు" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














