ప్రతిభ సేతు: సివిల్ సర్వీసెస్ దక్కలేదనే లోటు తీరుస్తున్న ఈ ప్రోగ్రామ్ ఏమిటి?

ఫొటో సోర్స్, HimaBindhu
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
"సివిల్స్ లక్ష్యం అందుకోలేదనే లోటు లేదిప్పుడు. ఎందుకంటే నా కల నెరవేరింది" అంటూ ఎస్.హిమబిందు తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఆమె ప్రస్తుతం దిల్లీలోని స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఆధ్వర్యంలో నడిచే 'ఖేలో ఇండియా' విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
బీటెక్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిన హిమబిందు సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల సమీపంలోని, సింహాద్రిపురం మండలం గురజాల. చిన్నప్పటినుంచి తన పరిస్థితులు సివిల్స్ లక్ష్యం వైపు నడిపించాయని ఆమె చెబుతున్నారు. అయితే, ఆరుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.

"సివిల్స్ రానప్పుడు ప్రతిసారీ జీవితం ఆగిపోయిందనిపించేది. ఉద్యోగం వచ్చినప్పుడు మళ్లీ జీవితం స్టార్ట్ అయినట్లుగా అనిపించింది" అని చెప్పారు హిమబిందు.
మొదటిసారి 2011లో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారామె.
వరుసగా మూడుసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు.
ఏడాది విరామం తర్వాత 2015, 2016, 2017లో మళ్లీ ప్రయత్నించినా సఫలం కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
లక్షలాది మంది యువత కల సివిల్స్
భారత్‌లో లక్షలాది మంది యువతకు సివిల్స్ అనేది ఓ కల. దాన్ని సాధించేందుకు రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. ఏళ్ల తరబడి ప్రయత్నిస్తుంటారు.
- 2024లో సివిల్స్ మెయిన్స్ పరీక్షకు 14627 మంది హజరయ్యారు.
- వారిలో 2845 మంది మాత్రమే ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.
- వీరిలో 1009 మందికి సర్వీస్ దక్కింది.
- 1836 మంది ఇంటర్వ్యూ దశలో తిరస్కరణకు గురయ్యారు.
"సివిల్స్‌కు ఆరు ప్రయత్నాలయ్యాక 'అక్షర లైవ్లీహుడ్' సంస్థలో పనిచేయడం ప్రారంభించాను. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు బోధించడం, ట్రాన్స్‌లేషన్స్ చేయడం.. ఇలా నా దారిలో వచ్చిన ప్రతి ఉద్యోగం చేశాను" అని ఆమె అన్నారు.
- 2016, 2017, 2018 సంవత్సరాల్లో సివిల్స్ ఇంటర్వ్యూలకు హాజరై, ఎంపిక కాని అభ్యర్థులు యూపీఎస్సీ 'ప్రతిభ సేతు' పథకం కింద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2019లో నోటిఫికేషన్ ఇచ్చింది.
"మొత్తం 540 దరఖాస్తులు వచ్చాయి. 95 మందిని ఇంటర్వ్యూకు పిలిస్తే, 19 మంది ఎంపికయ్యారు. ఆ మెరిట్ లిస్టులో నాది రెండో స్థానం" అని హిమబిందు చెప్పారు.
2020లో శాయ్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మొదట్లో బెంగళూరులో పనిచేసి, ఇప్పుడు దిల్లీలో పనిచేస్తున్నారు.
ఇలా హిమబిందు ఒక్కరికే కాదు, దేశవ్యాప్తంగా సివిల్స్ పరీక్షల చివరి మెట్టులో ఆగిపోయిన అభ్యర్థులకు యూపీఎస్సీ 'ప్రతిభ సేతు' పథకం ఉద్యోగాలు సాధించేందుకు వారధిగా నిలుస్తోంది.
ఇలా ఇంటర్వ్యూల వరకూ వచ్చి సర్వీస్ దక్కని వారి కోసం తీసుకొచ్చిన ప్రతిభసేతు పథకం ఏమిటి?

అసలేమిటీ 'ప్రతిభ సేతు'?
గతంలోని పబ్లిక్ డిస్‌క్లోజర్ స్కీమ్ (పీడీఎస్)ను ప్రస్తుతం యూపీఎస్సీ 'ప్రతిభ సేతు'గా వ్యవహరిస్తున్నారు.
- 2017లో నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ జాబితాను అనుసరించి 2018 ఆగస్ట్ 20న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ప్రతిభ (PRATIBHA) అంటే ప్రొఫెషనల్ రిసోర్స్ అండ్ టాలెంట్ ఇంటిగ్రేషన్- బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ ఆస్పిరెంట్స్ .
- సివిల్స్ ఇంటర్వ్యూ తర్వాత ర్యాంకు రానివారికి ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు లేదా సంస్థల్లో 'ప్రత్యామ్నాయ ఉద్యోగాలు' కల్పించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 'ప్రతిభ సేతు' పథకం ద్వారా సాయపడుతోంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ), యూపీఎస్సీ ప్రచురించే సివిల్స్‌కు ఎంపిక కాని అభ్యర్థుల జాబితాను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
ప్రతిభ సేతు కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు నేరుగా ప్రభుత్వ సంస్థలు లేదా యూపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి.
అయితే, ఈ ఉద్యోగాలు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలనుకునే అభ్యర్థులకు దీన్ని రెండో అవకాశంగా చెబుతారు.
- మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు (అటానమస్), కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (సీఐఎన్) ఉన్న ప్రైవేటు సంస్థలు యూపీఎస్సీ 'ప్రతిభ సేతు' పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. వీరికి సివిల్స్ ఇంటర్వ్వూ వరకు వెళ్లి ఎంపిక కాని వారి వివరాలతో కూడిన జాబితా చూసే వీలుంటుంది.
వారిని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ సంస్థల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేసుకుంటున్నాయి.
ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపిక కానివారికే 'ప్రతిభ సేతు' పథకం కింద ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఎం.బాలలత బీబీసీతో చెప్పారు.
- "సివిల్స్ ఫైనల్ మార్కుల వెయిటేజీ ఎంతో కీలకం. ఆ మార్కుల ఆధారంగా సంస్థలు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, ఇంటర్వ్యూలు చేస్తాయి. రెండింటి ఆధారంగా ప్రతిభ సేతు కింద ఉద్యోగాలు కల్పిస్తారు" అని బాలలత వివరించారు.
113 సంస్థల రిజిస్ట్రేషన్
ఇప్పటివరకు 113 సంస్థలు యూపీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్నాయని జూలై 22న పీఐబీ ఒక ప్రకటనలో తెలిపింది.
- ఇప్పటివరకు దాదాపు 10 వేల మంది అభ్యర్థుల జాబితాను 'ప్రతిభ సేతు' కింద ఉంచామని యూపీఎస్సీ చెబుతోంది.
- ఈ పథకం తీసుకువచ్చి ఏడేళ్లైంది. అయితే, ఎంతమందికి పీడీఎస్ లేదా ప్రతిభ సేతు కింద అవకాశం కల్పించారనే దానిపై యూపీఎస్సీ నుంచి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే పరీక్షలకు అవకాశం ఉంది?
యూపీఎస్సీ నిర్వహించే కొన్ని రకాల పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి తుది ఎంపిక కాలేకపోయిన అభ్యర్థులు 'ప్రతిభ సేతు' పథకాన్ని వినియోగించుకునే వీలుందని బాలలత చెప్పారు.
ఆ పరీక్షలు ఇవే..
- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
- ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
- సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్
- ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్
- సీడీఎస్ ఎగ్జామినేషన్
- ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ లేదా ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్
- కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
'ప్రతిభ సేతు' పథకం కిందకు రాని పరీక్షలు ఇవే..
- ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షలు
- సీబీఐ (డీఎస్పీ) ఎల్డీసీఈ
- సీఐఎస్ఎఫ్ ఏసీ (ఈఎక్స్ఈ) ఎల్డీసీఈ
- ఎస్ఓ/స్టెనో (జీఈ-బి/జీడీ-1) ఎల్డీసీఈ
2022, 2023లో కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ఎంపిక కాలేకపోయిన 451 మందికి ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్లుగా ఈఎస్ఐ అవకాశం కల్పించిందని 'ఎకనామిక్ టైమ్స్' జూలైలో రాసిన కథనంలో ప్రస్తావించింది.

ఫొటో సోర్స్, Getty Images
"అన్ని అటెంప్ట్స్ పూర్తైన వారే కాదు..."
'ప్రతిభ సేతు' పథకంలో సివిల్స్ ఉద్యోగాలకు ప్రయత్నాలు పూర్తైనవారే దరఖాస్తు చేయాలని లేదు. ఇంటర్వ్యూ వరకు వెళ్లిన వారంతా ఈ స్కీమ్ ఎంచుకునే వీలుంది. మెరిట్ ప్రతిపాదికన ఆయా సంస్థలు అభ్యర్థులను ఎంచుకుంటాయి.
- "ఎంతో కష్టపడి సివిల్స్ సర్వీసెస్ రాస్తుంటారు. ఆ ప్రయత్నంలో వారు విజయం సాధించలేకపోవచ్చు. అలాంటి వారికి మళ్లీ అవకాశం ఇవ్వడమంటే వారి ప్రతిభను గుర్తించడమే" అంటున్నారు హిమబిందు.
"ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడు పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించడంలో భాగమయ్యాను. మధ్యప్రదేశ్, అసోం, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పర్యటించాను" అని చెప్పారు హిమబిందు.
'ఖేలో ఇండియా'కు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించిన సమయంలో 55 జిల్లాల్లో తిరిగి క్రీడల అభివృద్ధికి కృషి చేశానని ఆమె చెబుతున్నారు.
"సివిల్స్ పరీక్షకు వచ్చేవారంతా సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఉంటారు. అలాంటివారు మిగిలిన రంగాల్లోకి వస్తే.. ఆ రంగాల్లోనూ వారి తపన, పట్టుదల చూపించి పనిచేస్తారు" అని హిమబిందు అభిప్రాయపడ్డారు.
"పరిమితులూ ఉన్నాయి"
'ప్రతిభ సేతు' పథకానికి సానుకూలతలతో పాటు పరిమితులు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
ఈ నియామకాల ప్రక్రియను గమనిస్తే, సివిల్స్ ఇంటర్వ్యూలయ్యాక, 'ప్రతిభ సేతు' కింద ఉద్యోగ నియామకాలకు ఎక్కువ సమయం పడుతోందంటున్నారు బాలలత.
వివిధ శాఖల పరిధిలో పరిమిత సంఖ్యలో ఖాళీలు ఉండటం మరో ఇబ్బందిగా చెప్పవచ్చని ఆమె అంటున్నారు.
"ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైనప్పుడు మంచి ఉద్యోగమే లభిస్తుంది. కానీ, సహజంగా ప్రైవేటు సంస్థల్లో ఉండే ఉద్యోగ భద్రత భయాలు వెంటాడుతుంటాయి" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, HimaBindhu
ఏటా లక్షల మంది దరఖాస్తు
యూపీఎస్సీ వార్షిక రిపోర్టులను పరిశీలిస్తే, ప్రతియేటా సివిల్స్ సాధించే వారిలో రిజర్వేషన్లు ఆధారంగా 8సార్లు, అంతకంటే ఎక్కువసార్లు పరీక్ష రాసినవారు కూడా ఉంటారు.
73వ వార్షిక నివేదికను 2022-23లో విడుదల చేసింది యూపీఎస్సీ. దీని ప్రకారం... 2021లో 748 మంది సివిల్స్‌లో విజయం సాధించారు. అందులో తొలి 4 ప్రయత్నాల్లో ఉద్యోగాలు సాధించినవారు 66.5 శాతం కాగా, చివరి 5 ప్రయత్నాల్లో విజయం సాధించినవారు 33.5 శాతం మంది ఉన్నారు.
- "సివిల్స్ ఎగ్జామ్ కోసమే యువత ఏడెనిమిదేళ్లు కేటాయిస్తున్నారు. ఈ సర్వీసులో భాగమయ్యేందుకు కొంతమంది మంచి ఉద్యోగాలు, భారీ జీతాలను కూడా వదులుకుంటున్నారు" అని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై. ఖురేషీ గతంలో వ్యాఖ్యానించారు.
ప్రతి ఏటా లక్షల మందికి పైగా అభ్యర్థులు సివిల్స్ పరీక్షకు దరఖాస్తు చేస్తున్నారు. కానీ, వీరిలో ప్రిలిమ్స్ దాటి, మెయిన్స్‌కు అర్హత సాధించేవారు 1 శాతం మాత్రమే.
- 2024లో 5.83 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే 14,627 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇక ప్రిలిమ్స్ నుంచి ఫైనల్ రిజల్ట్ వరకు చూసుకుంటే సక్సెస్ రేట్ 0.17 శాతంగా ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














