బంగాళాఖాతంలో అల్పపీడనం.. వారం రోజుల పాటు వర్షాలే

సముద్రతీరం కోత
ఫొటో క్యాప్షన్, కోతకు గురైన సముద్ర తీరం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని... ఇది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా మారనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

ఈ పరిస్థితుల్లో కోస్తాలోని పోర్టులలో 3వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో... రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాధ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తుపాను వర్షాలు

వారం రోజుల పాటు వర్షాలే...

సోమవారం నుంచి వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రంతో పాటు రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ కూడా సూచించింది.

ఆగస్ట్ 19, 20వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జగన్నాధ్ కుమార్ చెప్పారు. అలాగే రాబోయే ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

రానున్న 5 రోజుల వరకు గంటలకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఈ వాతావరణానికి అనుబంధంగా 9.8 కిలోమీటర్ల ఎత్తున్న ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని చెప్పారు.

వర్షాల ప్రభావిత ప్రాంతాలలో నివసించే వారికి అలెర్టులను జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి రాష్ట్రంలో పలు చోట్ల రెడ్ అలెర్ట్, అరెంజ్, ఎల్లో అలెర్టులను జారీ చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలకు రెడ్ అలెర్ట్ (ప్రమాదకర వాతావరణం) జారీ చేయగా... తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ (వాతావరణం ప్రమాదకర స్థాయికి వచ్చే అవకాశం), కర్నూలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (వాతావరణం తీవ్రంగా మారే అవకాశం) జారీ చేశారు.

రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.

తుపానుతో వర్షాలు, రోడ్లు జలమయం
ఫొటో క్యాప్షన్, విశాఖ నగరంలో జలమయమైన రహదారి

పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ

సముద్రంలో ఉండే మత్స్యకారులు, తీరం వెంబడి ఉండే గ్రామాల వారికి పోర్టులలో జెండాలు ఎగరవేయడం ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తారు. ఇప్పుడు కోస్తాలో ఉన్న అన్నీ పోర్టులలో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. అంటే వేటకు వెళ్లిన మత్స్యకారులు, తీరంలో ఉన్న గ్రామాలు, సముద్రంలో ఉన్న నౌకలన్నీ అప్రమత్తంగా ఉండాలని, తీరానికి చేరుకోవాలని దీని అర్థం. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం ఉదయం మొదలైన వర్షాలు ఇప్పటికీ పడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లా కాపులుప్పాడలో ఆదివారం రాత్రి 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.... మరో 20కి పైగా ప్రాంతాలత్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని చెప్పారు.

ఏఎస్ఆర్ జిల్లాలో పలుచోట్ల పంటలు నీటమునిగాయి. దేవీపట్నం మండలం పోశమ్మగండి వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పార్వతీపురం-మన్యం జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

సింహాచలం కొండపై నుంచి బురదనీరు రోడ్లపైకి ప్రవహించింది. దీంతో ఒక వైపే వాహనాలన్నీ రాకపోకలు సాగించాయి. గాజువాకలో కాలువల్లోని చెత్త, వ్యర్థాలతో కూడిన నీరు రోడ్లపైకి చేరుకుంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఆ నీరంతా నల్లగా ఉండటంతో... ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

పడవలు
ఫొటో క్యాప్షన్, తీరానికి చేరిన పడవలు

సముద్రపు కోతకి... పడవలు కొట్టుకుపోయాయి...

శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీలో నాలుగు పడవలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. గెడ్డూరు మీదుగా భారీగా వరద నీరు సముద్రంలోకి చేరడంతో తీరం కొంతమేర కోతకు గురై ఈ ఘటన జరిగింది. మత్స్యకారులు అప్రమత్తమై వాటికి తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు.

జలుమూరు, ఎల్.ఎన్.పేట, వజ్రపుకొత్తూరు, ఆమదాలవలస, సరుబుజ్జిలి, కొత్తూరు, లావేరు, కవిటి, కంచిలి మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వర్షం నేపథ్యంలో ఇవాళ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా అధికారులు సెలవు ప్రకటించారు.

భారీ వర్షాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు.

విశాఖ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో కిరండోల్ మార్గంలో ముందుజాగ్రత్తగా రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పీఆర్వో కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఉభయగోదావరి జిల్లాల్లోనూ వర్షం విస్తారంగా కురుస్తోంది. గొల్లప్రోలు మండలంలో దాదాపు వెయ్యి ఎకరాలలో పంటలు ముంపునకు గురయ్యాయని రైతులు తెలిపారు.

విశాఖలో వర్షం

‘ఘాట్ రోడ్ ప్రయాణాలు వద్దు’

పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం...వాయుగుండగా మారి మంగళవారం మధ్యాహ్నం తర్వాత దక్షిణ ఒడిశా, ఏపీలోని కోస్తాంధ్ర తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం కొనసాగుతుందని... మోస్తరు నుంచి భారీ వర్షాలు మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగుతాయని తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాధ్ కుమార్ చెప్పారు.

పార్వతీపురం-మన్యం, అల్లూరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్పితే ఘాట్ రోడ్డులలో ప్రయాణాలు చేయవద్దని తెలిపారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడే, చెట్లు కూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాయలసీమ జిల్లాలల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు.

సముద్రం ఒడ్డున నిలిచిన పడవలు
ఫొటో క్యాప్షన్, విశాఖ తీరంలో పడవల పరిస్థితి

ఐదు రోజుల పాటు వేట వద్దు: మంత్రులు అనిత, అనగాని

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో మత్స్యకారులు ఐదు రోజుల వరకు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.

ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా నదిలో ప్రయాణించడం, చేపలు పట్టడం, ఈతకు వెళ్లడం లాంటివి చేయవద్దని సూచించారు. వరద పరిస్థితులు ఉన్నందులు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ నదులు, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని చెప్పారు. రోడ్డు మీద చెట్లు పడితే, వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి అనిత చెప్పారు.

ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని గమనిస్తూ, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని హోం మంత్రి అనిత చెప్పారు.

కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని... వర్షాలు, వరద విపత్తును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)