హైడ్రా: హైదరాబాద్ కు భయమా.. అభయమా..?

రంగనాథ్

ఫొటో సోర్స్, BBC/HYDRAA

ఫొటో క్యాప్షన్, హైడ్రా ఏర్పడి ఏడాది అయింది.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''నెగిటివ్ న్యూస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. పాజిటివ్ న్యూస్ అంత వేగంగా వెళ్లదు కదా! అందుకే హైడ్రాను ఓ బూచిలానో.. భూతంలానో చూపించారు'' అంటున్నారు హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్.

హైడ్రా అంటే.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. పూర్తి పేరు ఎంతో మందికి తెలియకపోవచ్చు గానీ, 'హైడ్రా' అనగానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే.

ఈ వ్యవస్థ ఏర్పడి ఏడాది అయింది. మరి ఈ కాలంలో ఏం చేసింది, దాని చుట్టూ విమర్శలేమిటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మొదట 'ఆరు చెరువుల' ప్రయోగం

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపలి ప్రాంతంలో హైడ్రా పనిచేస్తోంది.

మొదటి విడతలో ప్రయోగాత్మకంగా ఆరు చెరువులు బాగు చేస్తున్నట్లు హైడ్రా చెబుతోంది.

''వీటిని ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతున్నాం'' అని బీబీసీతో చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

ఆ తర్వాత మిగిలిన చెరువులను ప్రభుత్వం తరఫున, ఎన్జీవోల సహకారంతో బాగు చేయాలనేది ప్రణాళిక.

ఇందుకు లాభాపేక్ష లేని ఎన్జీవోల సహకారం తీసుకుంటామని రంగనాథ్ చెబుతున్నారు.

బతుకమ్మకుంట
ఫొటో క్యాప్షన్, బతుకమ్మకుంట

బతుకమ్మకుంట నిజంగా మారిపోయిందా?

హైడ్రా పునరుద్ధిరస్తున్నట్లుగా చెబుతున్న బతుకమ్మకుంట ప్రాంతాన్ని బీబీసీ సందర్శించింది.

ఇప్పుడు అక్కడ పనులు ఇంకా పూర్తి కాలేదు. చుట్టూ కట్ట నిర్మించి రాళ్లతో పటిష్టం చేస్తున్నారు.

''సెప్టెంబరు 21న బతుకమ్మ పండుగ నాటికి పనులు పూర్తి చేసి సీఎంతో ప్రారంభోత్సవం చేయిస్తాం'' అని బీబీసీతో చెప్పారు రంగానాథ్.

ఇటీవలి వర్షాలకు బతుకమ్మకుంటలోకి భారీగా వరద నీరు చేరడంతో.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బతుకమ్మకుంట మళ్లీ ఇంత చక్కగా మారుతుందని అనుకోలేదని బాగ్ అంబర్‌పేటకు చెందిన సురేష్ కుమార్ గాంధీ చెప్పారు.

50 ఏళ్లుగా గాంధీ కుటుంబం బతుకమ్మకుంట వద్ద కిరాణా దుకాణం నడిపిస్తోంది.

''ఒకప్పుడు చెత్తాచెదారం ఉండేది. ఇప్పుడు ఫ్లస్ట్ క్లాస్ అయిపోయింది'' అని చెప్పారు.

ఇక్కడ ఎవర్నీ కదిలించినా ఇదే చెబుతున్నారు.

చెత్తాచెదారంతో నిండిన ప్రదేశం కుంటగా మారిందని స్థానికుడు చంద్రశేఖర్ చెప్పారు.

''బతుకమ్మకుంటలోకి మురుగునీరు కలవకుండా చూడాలి'' అని కోరారు.

పునరుద్ధరణ పనుల కారణంగా భూగర్భ జలాల్లో స్వచ్ఛత మెరుగైందని బాగ్ అంబర్‌పేటకు చెందిన సీపీఎం హైదరాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.మహేందర్ చెప్పారు.

''మా బతుకమ్మకుంట పరిసరాల్లో భూగర్భ జలాలు మంచిగా అయ్యాయి'' అన్నారు.

ఎన్ కన్వెన్షన్ ప్రాంతం

'ఎన్ కన్వెన్షన్' కూల్చిన ప్రాంతం ఎలా ఉందంటే..

ఇక హైడ్రా వచ్చాక అత్యంత వివాదాస్పదమైనది తమ్మిడికుంట.

సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను ఈ తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ట్యాంక్ లెవెల్) పరిధిలో నిర్మించారనే ఆరోపణలపై నిరుడు ఆగస్టులో హైడ్రా కూల్చివేసింది. ఇది జరిగి దాదాపు ఏడాదవుతోంది. చెరువును పునరుద్ధరిస్తామని హైడ్రా చెప్పినా, పనులు ఇంకా పూర్తి కాలేదు.

ప్రస్తుతం చుట్టూ కట్ట నిర్మాణం జరుగుతోంది. ఎన్ కన్వెన్షన్ శిథిలాలను అక్కడి నుంచి తీసివేశారు.

అయితే, చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధరణపై హైడ్రా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

''తమ్మిడికుంటకు గతంలో ఉన్న ఎఫ్‌టీఎల్ హద్దు రాళ్లు పీకేసి దౌర్జన్యంగా మా భూములు హైడ్రా గుంజుకుంది. కనీసం మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు'' అని ఆరోపించారు శ్రీనివాసరెడ్డి.

ఈయనకు తమ్మిడికుంట పక్కనే ఉన్న భూమిలోని 1200 గజాల స్థలాన్ని కుంట విస్తరణ కోసం ఏకపక్షంగా హైడ్రా తీసుకుందని విమర్శిస్తున్నారు.

దీనివల్ల తన గోశాల స్థలం కోల్పోయానని చెబుతున్నారు.

ఎన్ కన్వెన్షన్ ప్రాంతం

ఈ ఆరోపణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు.

''ఆ చెరువు(తమ్మిడికుంట) 29-30 ఎకరాల ఎఫ్‌టీఎల్వి స్తీర్ణంలో ఉండేది. తర్వాత అది‍ 13-14 ఎకరాలకు తగ్గిపోయింది. ఇప్పుడు చెరువును డెవలప్ చేస్తూ 29 ఎకరాలకు తీసుకువస్తున్నాం'' అని బీబీసీతో చెప్పారు.

''చెరువు డెవలప్‌మెంట్ ఉండాలి. ఉండొద్దని మేం అనడం లేదు. కాకపోతే చెరువు వాస్తవంగా ఎంత ఉందో చూసుకోవాలి. అందుకు తగ్గట్టుగా మార్కింగ్ జరగాలి'' అని శ్రీనివాసరెడ్డి అన్నారు.

తమ్మిడికుంట వివాదంపై పట్టాదారులు హైకోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిపివేయాలని కోర్టు స్టే జారీ చేసింది.

హైడ్రా చెరువులు
హైడ్రా
ఫొటో క్యాప్షన్, ఏడాది కాలంలో హైడ్రా పేరు ఎత్తితే కూల్చివేతలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

హైడ్రా అంటేనే కూల్చివేతలా?

ఏడాది కాలంలో హైడ్రా పేరు ఎత్తితే కూల్చివేతలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

ఎక్కడ ఏ కూల్చివేత జరిగినా, హైడ్రా కూల్చివేస్తోందనే ప్రచారం విపరీతంగా సోషల్ మీడియాలో జరుగుతోంది.

''అసలు మాకు సంబంధం లేని విషయాలను మాకు ఆపాదిస్తూ తప్పుడు సమాచారం పెద్దఎత్తున వ్యాప్తి చేశారు. రాజకీయంగానో, భూకబ్జాదారుల నుంచో ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తి జరిగి ఉండొచ్చు'' అని రంగనాథ్ చెప్పారు.

హైడ్రా దూకుడుగా వెళ్లడం, సెలబ్రిటీలపైనా చర్యలు తీసుకోవడంతోనే ప్రజల్లోకి ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంకు లెవల్), బఫర్ జోన్ అనే విషయాలు బలంగా వెళ్లాయని ఆయన చెబుతున్నారు.

హైడ్రా

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కూల్చివేతలను అడ్డుకోవడానికి నిరసనలకు దిగడం సాధారణంగా మారింది.

ఇదే విషయంపై సీపీఎం హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.మహేందర్ బీబీసీతో మాట్లాడారు.

''చెరువుల ఆక్రమణలను వ్యతిరేకిస్తున్నాం. అదే సమయంలో బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి నివసిస్తున్న పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టడం సమంజసం కాదు. వాళ్లకు ప్రత్యమ్నాయం చూపించాలి'' అని డిమాండ్ చేశారు.

చెరువుల వద్ద స్థలాలు అమ్మిన వారిపైనా కేసులు పెడుతున్నామని రంగనాథ్ చెప్పారు.

''అవును, హైడ్రా విషయంలో మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. కాదనడం లేదు. ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకుని ముందుకు వెళుతున్నాం'' అని రంగనాథ్ చెప్పారు.

అలాగే అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు.

హైడ్రా అనగానే కూల్చివేతలనే ఆపవాదు పొగొట్టుకునేందుకే మొదట చెరువుల పునరుద్ధరణ చేసి చూపించాలని భావిస్తోంది హైడ్రా.

హైడ్రా రంగనాథ్

''ఇదొక యజ్జం.. ఇప్పటికిప్పుడు కాదు''

బతుకమ్మకుంట, తమ్మిడికుంటతోపాటు సున్నంచెరువు, ఉప్పల్ నల్లచెరువు సహా ఆరు చెరువులలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లుగా హైడ్రా చెబుతోంది.

ఈ చెరువులను క్షేత్రస్థాయిలో బీబీసీ పరిశీలించినప్పుడు ఇంకా ఎక్కడా పూర్తి స్థాయిలో పనులు కాలేదు. చెరువులో మట్టి తీసి కట్ట పటిష్టం చేసే పనులే నడుస్తున్నాయి.

హైడ్రా మీద పెద్ద బాధ్యత ఉందని, దాన్ని ఆరు చెరువులకే పరిమితం చేసుకుంటోందని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కో కన్వీనర్ లుబ్నా సార్వత్ బీబీసీతో చెప్పారు.

అయితే, నగరంలో చెరువుల పునరుద్ధరణ దశల వారీగా జరగనున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ బీబీసీతో చెప్పారు.

''ఇదొక యజ్జంలా చేయాల్సి ఉంది. ఇదేదో ఇప్పుడు ఒకేసారి అంతా అయిపోతుందని నేను అనను'' అన్నారు.

కనీసం తొమ్మిది నెలల సమయం పడుతుందని చెప్పారు.

హైడ్రా గణాంకాలు

హైడ్రా స్వాధీనంలోకి 499 ఎకరాలు

హైడ్రాను 2024 జూలై 19న ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణ, పునరుద్ధరణకు తోడు విపత్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత కూడా హైడ్రాపై ఉంది.

ప్రత్యేకంగా హైడ్రా పోలీసుస్టేషన్ ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించింది ప్రభుత్వం.

2025-26 బడ్జెట్‌లో రూ.100 కోట్లను హైడ్రాకు కేటాయించగా, ఇప్పటివరకు రూ.50 కోట్లు మంజూరు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.

గత ఏడాదికాలంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న 581 ఆక్రమణలను తొలగించినట్లుగా హైడ్రా ప్రకటించింది.

మొత్తం 499 ఎకరాలను కబ్జాల చెర నుంచి విడిపించామని చెబుతోంది.

''మేం ఇప్పటివరకు కాపాడిన భూముల విలువ మార్కెట్ విలువ ప్రకారం రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా'' అని రంగనాథ్ చెప్పారు.

హైడ్రా

'నోటీసులు ఇవ్వకుండా కూలగొడితే ఎలా?'

ఆక్రమణల పేరుతో కనీసం నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు తొలగిస్తున్నారనేది హైడ్రాపై ఉన్న విమర్శ.

''కనీసం నోటీసులు ఇస్తే మాకు విషయం ఏంటో తెలుస్తుంది. తెల్లవారుజామున వచ్చి కూల్చివేస్తామంటే ఎక్కడికి వెళ్లాలి'' అని రాజేంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ ప్రశ్నించారు.

ఇటీవల రాజేంద్రనగర్‌లో కూల్చివేతల సందర్భంగా ఆమె జేసీబీకి అడ్డుగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు.

గతంలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ సహా వివిధ ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలైనప్పుడు కూడా ఇదే విమర్శలు వినిపించాయి.

''మేం వెకేషన్ నోటీసులు (ఖాళీ చేయాలని చెప్పేది) ఇస్తున్నాం. యజమానులు వేరు, పొజిషన్లో వేరొకరు ఉండటంతో వారికి చేరడం లేదు'' అని రంగనాథ్ చెప్పారు.

ఖాళీ చేయాలని టైం ఇస్తాం.. తర్వాతనే కూలగొడుతున్నామని వివరించారు.

హైడ్రా కూల్చివేత

ఫొటో సోర్స్, X/HYDRAA

హైడ్రా.. ఏయే నిర్మాణాలు కూల్చుతుందంటే..

హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ లెక్కల ప్రకారం ఔటర్ రింగు రోడ్డు లోపల హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 600, జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు కలుపుకొని మొత్తం 785 చెరువులున్నాయి.

ఈ చెరువుల లెక్క 900 వరకు ఉంటుందని హైడ్రా అంచనా వేస్తోంది.

చెరువుల పునరుద్ధరణకు తోడు వాటి మధ్య ఉన్న నాలాలు, వరద కాల్వలను పునరుద్ధరించాలని లుబ్నా సార్వత్ డిమాండ్ చేస్తున్నారు.

''వర్షపు నీరు పడగానే పారేలా గ్రావిటీ ఛానెల్స్ తిరిగి ఏర్పాటు చేయాలి'' అని సూచించారు.

ఆక్రమణల తొలగింపు విషయంలో కటాఫ్ డేట్ పెట్టుకోవాలని చెబుతున్నారు.

హైడ్రా ఇళ్లను కూలుస్తుందా.. ఏయే నిర్మాణాలు కూల్చుతుందనే విషయంపై కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.

''హైడ్రా ఏర్పడే నాటికి నివాస గృహాలు ఏవైతే ఉన్నాయో.. వాటి జోలికి వెళ్లడం లేదు. అవి ఎప్పుడో కట్టి ఉంటారు. కమర్షియల్ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది'' అని స్పష్టం చేశారు.

నివాసాల విషయంలోనూ హైడ్రా ఏర్పడిన తర్వాత అనుమతులు తెచ్చుకుని మొదలుపెట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు.

అయితే హైడ్రా ఏర్పడేనాటికే అనుమతులు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు.

హైడ్రా వచ్చాక ఈ ఏడాదిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చెరువుల ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ విషయంలో ఎంతో అవగాహన వచ్చింది.

''ఈ విషయంలో మేం విజయం సాధించాం'' అని రంగనాథ్ చెప్పారు.

రియల్ ఎస్టేట్

హైడ్రా వచ్చాక రియల్ఎస్టేట్ పడిపోయిందా?

హైడ్రా వచ్చినప్పట్నుంచి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందనేది ప్రధానంగా ఎదురవుతున్న విమర్శ.

అయితే, గతేడాది మే నెలతో పోల్చితే, ఈ ఏడాది మే నెలలో 14 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్లు పెరిగినట్లుగా నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక చెబుతోంది.

అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు హైడ్రా పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.జైదీప్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''ఏదైనా వ్యవస్థ కొత్తగా వచ్చినప్పుడు ఇబ్బందులుంటాయి. హైడ్రా పరంగా మొదట్లో కొంత ఉంది. ఇప్పుడంతా కుదురుకుంది'' అని వివరించారు.

రియల్ ఎస్టేట్ దెబ్బతిందనే వాదనను హైడ్రా ఖండించింది.

''దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టింది. అలా హైదరాబాద్‌లో కూడా తగ్గింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది'' అని రంగనాథ్ చెప్పారు.

హైదరాబాద్‌లో అయితే హైడ్రా ఉంది సరే, మరి వరంగల్, విజయవాడ, గుంటూరు, వైజాగ్‌లో ఎందుకు తగ్గిందనే విషయం కూడా ఆలోచించాలని చెప్పారు.

రంగనాథ్

ఫొటో సోర్స్, X/HYDRAA

'ప్రజాప్రతినిధుల జోలికి వెళ్లడం లేదా?’

పేదల ఇళ్లను కూల్చివేసి ప్రజాప్రతినిధుల జోలికి వెళ్లడం లేదనేది హైడ్రాపై ఈ ఏడాదికాలంలో వినిపించిన మాట.

మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీ భవనాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలోని హాస్టల్ భవనాలు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయనే ఆరోపణలున్నాయి.

అయితే, తమ యూనివర్సిటీకి చెందిన భవనాలు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో లేవని మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు.

ఈ ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బీబీసీతో మాట్లాడారు.

''మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ వద్ద ఉన్న చెరువులకు ఎఫ్‌టీఎల్ ప్రిలిమినరీ నోటిఫికేషనే ఇచ్చాం. వాటి ఫైనల్ నోటిఫికేషన్ వస్తేనే, దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోగలం'' అని చెప్పారు.

ఎన్ కన్వెన్షన్ ఉన్న తమ్మిడికుంట చెరువు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడంతో చెరువులో ఉందనే కూల్చివేశామని చెప్పారు.

''సల్కం చెరువు వద్ద ఫాతిమా కాలేజీ 2015లో నిర్మిస్తే, ఆ చెరువుకు 2016 డిసెంబరు 16వ తేదీన ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికే అక్కడ ఎంఎం కాలనీ వచ్చి వందలాది ఇళ్లు కూడా ఉన్నాయి'' అని చెప్పారు.

ఫైనల్ నోటిఫికేషన్ రాకపోవడంతోపాటు పేదలకు ఉచిత విద్య అందిస్తున్న విషయాలను పరిగణనలోకి ఫాతిమా కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.

ఈ వివాదంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు.

''ఫాతిమా కాలేజీ చెరువులో లేదు. ఎంతో మంది పేదలకు ఉచితంగా విద్య అందిస్తున్న కాలేజీపై చర్యలు తీసుకోవద్దని కోరుతున్నా'' అని చెప్పారు.

మజ్లిస్ పార్టీ అని మెతక వైఖరి లేదని చెబుతున్నారు రంగనాథ్.

చాంద్రాయణగుట్టలో మజ్లిస్ కార్పొరేటర్‌కు చెందిన నిర్మాణాలు కూల్చివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

''హైడ్రా ఇక్కడ లాలూచీ పడింది. అక్కడ భయపడుతోందంటున్నారు. మాకు ఒక విధానం, ఓ వ్యూహం ఉన్నాయి. దాని ప్రకారమే వెళతాం. ఎవరినో ఏదో చేయడానికి హైడ్రా పనిచేయడం లేదు'' అని రంగనాథ్ స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)