‘అందంగా ఉండటమే ఆ జీవులకు శాపం’- రక్షించేందుకు సైంటిస్టులు ఏం చేస్తున్నారు?

పాలీమిటా నత్త

ఫొటో సోర్స్, Bernardo Reyes-Tur

ఫొటో క్యాప్షన్, తూర్పు క్యూబాలోని అటవీ ఆవాస ప్రాంతంలో అందమైన పాలీమిటా నత్త
    • రచయిత, విక్టోరియా గిల్
    • నుంచి, సైన్స్ కరస్పాండెంట్, బీబీసీ న్యూస్

ప్రపంచంలోనే అత్యంత అందమైన నత్తలను కాపాడేందుకు, వాటి జీవ రహస్యాలను శోధించేందుకు పరిశోధకులు ఒక మిషన్‌ను ప్రారంభించారు.

ఆకర్షణీయమైన, రంగురంగుల, చూడచక్కని డిజైన్ గల గవ్వలతో చూపరులను ఆకట్టుకొనే అందంతో ఉండే పాలీమిటా నత్తలు అంతరించిపోతున్నాయి.

తమ ఆవాస ప్రాంతమైన తూర్పు క్యూబాలోని అటవీ ప్రాంతాల నుంచి అవి కనుమరుగవుతున్నాయి.

ఆ గవ్వలను హాబీగా సేకరించేవారు, అమ్మకం కోసం సేకరించే వారి కారణంగా ఆ నత్తలు అంతరించిపోయే స్థాయికి చేరుకున్నాయని జీవ పరిరక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆరు రకాల పాలీమిటా జాతులను పరిరక్షించడమే లక్ష్యంగా క్యూబాలోని జీవశాస్త్రవేత్తలు, యూకేలోని నాటింగ్‌హామ్ యూనివర్సిటీ నిపుణులు ఇప్పుడు బృందంగా ఏర్పడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గవ్వలతో ఆభరణాలు

ఫొటో సోర్స్, Angus Davison

ఫొటో క్యాప్షన్, అందమైన ఆభరణాల తయారీ కోసం నత్తల గవ్వలను ఉపయోగిస్తున్నారు

పాలీమిటా జాతులలో అత్యంత ప్రమాదంలో ఉన్నది పాలీమిటా సల్ఫురోసా. ఇది నిమ్మ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని షెల్ చుట్టూ నీలిరంగు జ్వాల నమూనాలు, ప్రకాశవంతమైన నారింజ రంగు, పసుపు రంగు పట్టీలు ఉంటాయి.

పాలీమిటా జాతులన్నీ అద్భుతమైన ప్రకాశంతో, రంగురంగులలో ఉంటాయి. ఇదొక జీవ పరిణామా రహస్యం.

''ఈ నత్తలపై నాకు ఆసక్తి కలగడానికి ఒక కారణం అవి చాలా అందంగా ఉండటమే'' అని నాటింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన జీవపరిణామ జన్యు శాస్త్రవేత్త, మేలకాలజిస్ట్ ప్రొఫెసర్ అంగస్ డేవిసన్ అన్నారు.

ఆ నత్తలు ఇంతగా ముప్పు ఎదుర్కొనడానికీ అదే కారణమని ఆయన చెప్పారు.

''వాటి అందం గవ్వలను సేకరించి విక్రయించేవారినీ ఆకర్షిస్తుంది. ఒక శాస్త్రవేత్తగా నేను చూపించే ఆసక్తికి అది భిన్నమైంది. దురదృష్టవశాత్తూ, వాటిని కూడా ప్రమాదంలో పడేస్తోంది'' అని అంగస్ డేవిసన్ అభిప్రాయపడ్డారు.

నత్తలు

ఫొటో సోర్స్, Bernardo Reyes-Tur

గవ్వల వ్యాపార వేదికలు ఎన్నెన్నో...

ప్రొఫెసర్ డేవిసన్‌తో కలిసి ఆన్‌లైన్‌లో శోధిస్తే... గవ్వలను అమ్మే ప్లాట్‌ఫామ్‌లు అనేకం వెలుగులోకి వచ్చాయి. యూకే వేదికగా పాలీమిటా గవ్వలను అమ్మకానికి పెడుతున్నారు.

ఏడు గవ్వల కలెక్షన్ 160 పౌండ్లు (సుమారు రూ.18,640) కు విక్రయిస్తామని ఒక వెబ్‌సైట్‌లో అడ్వర్టయిజ్‌మెంట్ ఉంది.

''వాస్తవంగా, ఈ నత్తలలో కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని మాకు తెలుసు. క్యూబాలో ఎవరైనా వాటిని సేకరించి, వాటితో వ్యాపారం చేస్తే... అవి అంతరించిపోవడానికి ఎంతో సమయం పట్టదు'' అని డేవిసన్ అన్నారు.

గవ్వలను అలంకార వస్తువులుగా కొంటున్నారు, అమ్ముతున్నారు. కానీ ప్రతి ఖాళీగవ్వ ఒకప్పుడు సజీవ ప్రాణి.

నత్తలు, గవ్వలు

ఫొటో సోర్స్, Bernardo Reyes-Tur

ఫొటో క్యాప్షన్, సంతానోత్పత్తి, పరిశోధన కోసం కొన్ని నత్తలను పరిశోధన బృందం సేకరించింది

అంతర్జాతీయ నియమాలున్నా రక్షణ కష్టమేనా...

పాలీమిటా నత్తలను రక్షించడానికి అంతర్జాతీయ నియమాలు ఉన్నప్పటికీ, వాటిని అమలుచేయడం కష్టం. 'కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్‌డేంజర్డ్ స్పీషీస్' ప్రకారం... నత్తలను, లేదా వాటి గవ్వలను అనుమతి లేకుండా క్యూబా నుంచి బయటకు తీసుకెళ్లడం చట్టవిరుద్ధం. కానీ గవ్వలను వేరొకచోట విక్రయించడం చట్టబద్ధం.

''వాతావరణ మార్పు, అడవుల నాశనం తదితర ఒత్తిళ్లు క్యూబాలోని నత్తల సహజ ఆవాసాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రజలు గవ్వలను సేకరించడం వల్ల స్థానికంగా నత్తల సంఖ్య క్షీణిస్తుందనే విషయాన్ని సులభంగా ఊహించవచ్చు'' అని ప్రొఫెసర్ డేవిసన్ అన్నారు.

నత్తలు, గవ్వలు

ఫొటో సోర్స్, Angus Davison

ఫొటో క్యాప్షన్, తన వేలిపై పాలీమిటా నత్తతో ప్రొఫెసర్ అంగస్ డేవిసన్

నత్తల క్షీణత నివారణకు ప్రొఫెసర్ డేవిసన్ శాంటియాగో డి క్యూబాలోని యూనివర్సిడాడ్ డి ఓరియంట్‌లో జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్ బెర్నార్డో రేయస్-టర్‌తో కలిసి పనిచేస్తున్నారు.

నత్తలు ఎలా పరిణామం చెందాయో బాగా అవగాహన చేసుకోవడానికి, వాటి పరిరక్షణకు సహాయపడే సమాచారాన్ని అందించడం ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ ప్రయత్నంలో ప్రొఫెసర్ రేయస్-టర్ పాత్ర అత్యంత సవాలుతో కూడినది. దుర్భరమైన వాతావరణ పరిస్థితుల్లో ఆయన నత్తలను సేకరించి, పెంచడం కోసం తన ఇంటికి తీసుకొచ్చారు.

''అవి ఇంకా సంతానోత్పత్తి చేయలేదు. కానీ బాగానే ఉన్నాయి'' అని ప్రొఫెసర్ రేయస్-టర్ వీడియో కాల్‌లో బీబీసీకి చెప్పారు.

''ఇది సవాలుతో కూడుకున్నది. అనూహ్యమైన నష్టాలు (బ్లాక్ అవుట్స్) ఉంటాయి'' అని అన్నారు.

నత్తలు, గవ్వలు, జంతు పరిరక్షణ

ఫొటో సోర్స్, Bernardo Reyes-Tur

ఫొటో క్యాప్షన్, తూర్పు క్యూబాలోని తన నివాసం వద్ద కొన్ని నత్తలను సంరక్షిస్తున్న కన్జర్వేషన్ సైంటిస్టు ప్రొఫెసర్ బెర్నార్డో రేయస్-టర్

నాటింగ్‌హామ్ యూనివర్సిటీలో జన్యు పరిశోధనలు...

నాటింగ్‌హామ్ యూనివర్సిటీలోనున్న అధునాతన ల్యాబుల్లో జన్యు పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రొఫెసర్ డేవిసన్, ఆయన బృందం నత్తల కణజాలం నమూనాలను ఇక్కడి క్రయోజనిక్ ఫ్రీజర్‌లలో భద్రపరచుకోవచ్చు. నత్తల జన్యువును రీడ్ చేయడానికి, ప్రతి నత్త తాలూకు జీవసంబంధిత కోడ్‌ను సెట్ చేయడానికి ఆ నమూనాలు ఉపయోగపడతాయి.

అక్కడ నత్తలలో ఎన్ని జాతులు ఉన్నాయో, అవి ఒకదానికొకటి ఏవిధమైన సంబంధం కలిగి ఉన్నాయో, వాటి జెనెటిక్ కోడ్‌లోని ఏ భాగం వాటికి అసాధారణమైన, ప్రత్యేకమైన వర్ణం ఎలా ఇస్తుందో నిర్ధరించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించాలనేది ప్రొఫెసర్ డేవిసన్ బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

నత్తలు, గవ్వలు

ఫొటో సోర్స్, Angus Davison

ఫొటో క్యాప్షన్, అత్యంత వేగంగా అంతరించిపోతున్న పాలీమిటా సల్ఫురోసా

నత్తల జీవరహస్యం ఏమిటో....

సేకరణ హాబీలు, అమ్మకాలతో అంతరించిపోకముందే ఈ రంగురంగుల నత్తల జీవ రహస్యాలను బహిర్గతం చేయాలని ప్రొఫెసర్ డేవిసన్ బృందం ఆశిస్తోంది.

ప్రపంచంలో ఈ నత్తలు కనిపించే ఏకైక ప్రదేశం తూర్పు క్యూబా అని ప్రొఫెసర్ డేవిసన్ బీబీసీకి చెప్పారు.

''మేము రూపొందించే జన్యు సమాచారం నత్తల పరిరక్షణకు దోహదపడేలా ఉపయోగించుకోగలమని అనుకుంటున్నాం'' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)