‘ద్వారక’ను కనుగొనేందుకు డైవర్లు సముద్ర గర్భంలోకి ఎలా వెళ్లారు? అప్పుడేం జరిగింది?

ఫొటో సోర్స్, Prof. Alok Tripathi/FB
- రచయిత, ఆర్జవ్ పరేఖ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'శ్రీకృష్ణుడి ద్వారక' ఎలా ఉండేది? మహాభారత సమయంలో ద్వారక ప్రాంతం ఎలా ఉండేది? వంటి రహస్యాలను కనుగొనేందుకు ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.
ఇన్నేళ్లలో ఎన్నోసార్లు ద్వారక ఆలయం చుట్టూ, ఆఖరికి సముద్ర గర్భంలో కూడా తవ్వకాలు జరిపారు.
ఈ తవ్వకాల ద్వారా ద్వారకాకు సంబంధించి ఎన్నో రహస్యాలు బయటపడ్డాయి.
కానీ, ఈ తవ్వకాలు అంత తేలికేమీ కాదు. ఎన్నో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
సముద్ర గర్భంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. వెలుతురు సరిగ్గా ఉండదు. సముద్ర ప్రవాహాలు, వాతావరణం మారుతూ ఉంటుంది.
సముద్ర గర్భంలోకి వెళ్లే డైవర్స్‌కు కూడా ఈ పని సవాలైందే.
ఎందుకంటే, లోతైన సముద్ర గర్భంలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి.
ద్వారక రహస్యాలను వెలికితీయడం కోసం సముద్ర గర్భంలోకి వెళ్లి తవ్వకాలు జరిపినప్పుడు ఏం జరిగింది?

సముద్ర గర్భంలో తవ్వకాలు ఎలా చేశారు?
సముద్ర గర్భంలో తవ్వకాలు జరిపేటప్పుడల్లా, శాస్త్రవేత్తలు ముందుగానే అనేక రకాలుగా సిద్ధమయ్యారు.
సముద్ర గర్భ వాతావరణం ఎలా ఉందో సర్వే చేయడం, తీరప్రాంత భూగర్భశాస్త్రంపై పూర్తిగా పట్టు సాధించడం, సముద్ర గర్భం లోతు ఎంతుందో అంచనావేయడం వంటి వాటిపై శాస్త్రవేత్తలు పూర్తిగా అధ్యయనం చేశారు.
అప్పుడే, సముద్ర గర్భంలో తవ్వకాలు జరిపారు.
అండర్‌వాటర్ సర్వే ప్లాన్స్, సైడ్ స్కాన్ సోనార్, సబ్-బోటమ్ ప్రొఫైలర్ సర్వేలు, హైడ్రోస్కాన్, మెటల్ డిటెక్టర్ సర్వేలు వంటి పలు సంప్రదాయ, ఆధునిక పద్ధతులను వాడుతూ తవ్వకాలను ప్లాన్ చేశారు.
తవ్వకాలకు సంబంధించి సర్వే, డాక్యుమెంటేషన్ ఎంత ముఖ్యమో.. దానిలో వాడే పరికరాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఇవి చాలా ఖరీదైనవి.
సముద్ర గర్భంలో తవ్వకాల్లో ఫోటోగ్రఫీ, వీడియో ఫిల్మింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి.
డైవర్లు నీటిలోకి వెళ్లినప్పుడు, వారు లోతుకు వెళ్తున్నా కొద్ది వారి శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది.
లోతైన నీటిలో ఫోటోగ్రఫీని, వీడియోను తీయడం అతిపెద్ద సవాలు.

ఫొటో సోర్స్, Getty Images
తవ్వకాల్లో ప్రధాన సవాళ్లేంటి?
2007లో సముద్ర గర్భంలో విస్తృతంగా జరిపిన తవ్వకాలకు ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి డైరెక్టర్‌గా వ్యవహరించారు.
భారత్‌లో సముద్ర గర్భంలో తవ్వకాలు జరపడంలో ఆయన నిపుణులు.
'' తవ్వకాలు జరిపే ప్రతి ప్రాంతం విభిన్నమైన సవాళ్లతో ఉంటుంది. ద్వారకాలో జరిపిన తవ్వకాల్లో కూడా మేం భిన్నమైన సవాళ్లను ఎదుర్కొన్నాం. ఈ ప్రాంతంలోని మట్టి, ఆ మట్టి రకం, ఈ ప్రాంతంలో కనుగొన్న వస్తువులు, వాతావరణం అన్నీ కూడా తవ్వకాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాయి'' అని అలోక్ త్రిపాఠి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
'' అండర్‌వాటర్ ఆర్కియాలజీ గురించి తీసుకుంటే, ఈ విధంగా తవ్వకాలు జరిపిన నగరాలు ప్రపంచంలో కొన్నే ఉన్నాయి. ప్రతి ప్రదేశంలో పరిస్థితులు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, MIB/Marine Archeology in India
'' హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం గురించి మాట్లాడుకుంటే, వాటి నేచర్ భిన్నంగా ఉంటుంది. అక్కడ అలల ఆటుపోటుల్లో చాలా మార్పు ఉంటుంది. కొన్ని మీటర్ల మార్పులోనే అలలు రావడం, వెనక్కి వెళ్లడం జరుగుతుంటుంది.
నీరు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు నీటి ప్రవాహాలు చాలా బలంగా ఉంటాయి. ఇదే అతిపెద్ద సవాలు. ఇలాంటి పరిస్థితులను కూడా తట్టుకుని, తవ్వకాలు జరిపి, వస్తువులను కనుగొనాలి. ఇదే చాలా కష్టమైన పని'' అని అలోక్ త్రిపాఠి చెప్పారు.
'' నిపుణుడైన డైవర్ ఏ సమయంలోనైనా డైవ్ చేయగలుగుతారు. కానీ, సమయం అనుకూలంగా ఉన్నప్పుడు, సముద్రం శాంతంగా ఉన్నప్పుడే మనం లోపలికి వెళ్లాలి. సముద్ర గర్భంలో వెలుతురు మంచిగా ఉన్న సమయాన్ని ఎంచుకోవాలి.
ఎందుకంటే, విజిబిలిటీ లేకపోతే మీకు సముద్ర గర్భంలో వస్తువులను కనుగొనడం కష్టమవుతుంది. మీరు ఫోటోలను తీయలేరు. డాక్యుమెంటేషన్ సరిగ్గా రాదు. సముద్ర గర్భంలో తవ్వకాలకు సాధారణంగా శీతాకాలాన్ని ఎంచుకుంటుంటారు. వేసవి కాలంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే, అప్పుడు ఎక్కువ అలలు వస్తుంటాయి, పోతుంటాయి'' అని అలోక్ త్రిపాఠి తెలిపారు.

ఫొటో సోర్స్, MIB/Marine Archeology in India
ద్వారకాలో తవ్వకాలు జరిపేటప్పుడు పడవలు బోల్తా పడ్డాయి
ప్రముఖ మెరైన్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ ఎస్.ఆర్. రావు, తన టీమ్ ద్వారకాలో అనేక పరిశోధనలు, తవ్వకాలు జరిపింది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో తను పనిచేస్తున్నప్పుడు సింధు లోయ నాగరికతకు చెందిన పలు ఆర్కియాలజికల్ సైట్లలో కూడా తవ్వకాలు జరిపారు.
వీటన్నింటి గురించి వివరిస్తూ.. ఆయన 'మెరైన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా' అనే పుస్తకాన్ని రాశారు.
1984లో జరిపిన తవ్వకాల గురించి ఆయన ఈ పుస్తకంలో వివరించారు.
'' బెట్ ద్వారక ప్రాంత సమీపంలోని సముద్రంలో అలలు, బలమైన ప్రవాహాలు, బురదతో అండర్‌వాటర్ ఫోటోగ్రఫీ చాలా కష్టమైంది. ద్వారక సముద్ర సమీపంలోని ఫోటోగ్రఫీకి చెందిన డాక్యుమెంటేషన్ కాస్త సంతృప్తికరంగా అనిపించింది'' అని రాశారు.
''ద్వారకాలో తవ్వకాలు 1983 డిసెంబర్ 23న ప్రారంభమయ్యాయి. వాతావరణం అనుకూలించడంతో 1990 వరకు ఈ తవ్వకాలు కొనసాగాయి. బడ్జెట్, మానవ వనరులు, పరికరాలు కేవలం ఏడాదికి 30 రోజులే అందుబాటులో ఉండేవి. దీంతో, ఈ పరిమిత వనరులు, పరిస్థితులతోనే తవ్వకాలు చేపట్టాం’’ అని తెలిపారు.
‘‘తవ్వకాలు జరిపే ప్రతి సీజన్‌ను ముందు, అంతకుముందు సీజన్‌లో తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో పెరిగిన మొక్కలను, నాచును క్లియర్ చేయాల్సి వచ్చేది. అంతకుముందు తీసుకున్న ఫోటోగ్రాఫ్‌లు, డ్రాయింగ్స్‌తో పనంతా పూర్తి చేశాం'' అని ప్రొఫెసర్ ఎస్.ఆర్ రావు రాశారు.
1985లో చేపట్టిన తవ్వకాల గురించి కూడా పుస్తకంలో వివరించారు.
ఈ మిషన్‌లో ప్రవాహాలు చాలా బలంగా ఉంటుండటంతో సముద్ర గర్భంలో కనుగొన్న అవశేషాలను, నిర్మాణాలను శుభ్రపరచడంలో తరచూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతో డాక్యుమెంటేషన్ కూడా జాప్యమైంది.
సముద్రం హెచ్చుతగ్గులకు గురైనప్పుడు భూప్రాంతాలను కనుగొనడం చాలా కష్టమయ్యేది. నేవిగేట్ చేసేందుకు పడవలకు కూడా ఇబ్బందయ్యేది'' అని తెలిపారు.
తవ్వకాలు ఉదయం ప్రారంభించే వారు. ఒకవేళ సముద్ర ప్రవాహాలు పెరిగినా లేదా మరేదైనా పరిస్థితుల్లో మార్పు వచ్చినా మధ్యాహ్నం కల్లా పని ఆపేవారు.
బంకలాగా అతుక్కపోయే మట్టి ఉన్న కొన్ని ప్రాంతాల్లో నీటిలోకి వెళ్లడం కష్టమయ్యేది.
''సముద్రం తరచూ మనం ఊహించని విధంగా మారిపోయేది. 1986 డిసెంబర్ 12న మధ్యాహ్నం పూట ఒక చిన్న పడవ మునిగిపోయింది. పడవ అంతా పాడైపోయింది. నావికుడిని మాత్రం రక్షించాం'' అని ప్రొఫెసర్ ఎస్.ఆర్ రావు తన పుస్తకంలో రాశారు.
''1989 జనవరి 7న ద్వారకాలో తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. మధ్యధర సముద్రంలోకి వెళ్లిన తర్వాత, మళ్లీ పడవ బోల్తా పడింది. ఆ సమయంలో నావికుడిని డైవర్లు రక్షించారు'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














