జూనియర్‌ ఎన్టీఆర్‌: ఈ హీరో గురించి టీడీపీలో వివాదం ఏంటి?

జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ, వార్ 2 సినిమా, వివాదం

ఫొటో సోర్స్, Jr NTR/ facebook

ఫొటో క్యాప్షన్, జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యక్తిగత దూషణలకు దిగినట్టు సోషల్ మీడియాలో ఓ ఆడియో బయటికి రావడం చర్చనీయమైంది.
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నాయకుడు గుత్తా ధనుంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణల వాయిస్‌ రికార్డింగ్ అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఆడియో వైరల్‌ అవుతోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యక్తిగత దూషణలకు దిగినట్టు ఆ ఆడియోలో ఉందని జూనియర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఆ ఆడియో ఏముందంటే?

మూడు నిమిషాల 8 సెకన్లు ఉన్న ఆ ఆడియో రికార్డింగ్‌లోని వాయిస్‌లు ఎమ్మెల్యే దగ్గుబాటి, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యుడు ధనుంజయ నాయుడిదిగా చెబుతున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజా చిత్రం వార్‌–2 బెనిఫిట్‌ షోల విషయమై వారిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు ఆ ఆడియో క్లిప్‌లో ఉంది.

వార్ 2 సినిమా బెనిఫిట్‌ షోలకు అనంతపురంలో పర్మిషన్లు లేవని, ఆపించేస్తున్ననట్లు ఎమ్మెల్యే చెప్పినట్టు, పర్మిషన్లు ఉన్నాయని ధనుంజయనాయుడు అంటున్నట్టు, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆ ఆడియోలో వినిపిస్తోంది.

అయితే, ఈ ఆడియో క్లిప్‌లోని వాయిస్‌ తనది కాదని ఎమ్మెల్యే ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

ఈ ఆడియో క్లిప్‌ను బీబీసీ స్వయంగా ధ్రువీకరించడం లేదు.

జూనియర్‌ అభిమానుల ఆగ్రహం

సోషల్ మీడియాలో ఈ ఆడియో విన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్‌ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

విజయవాడ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, x.com/ncbn

ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్యేలు ఆచితూచి మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్లు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బీబీసీతో అన్నారు.

చంద్రబాబు అసహనం

ఇదిలా ఉండగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసాద్‌ మాట్లాడినట్టు వైరల్‌ అవుతోన్న ఆడియోపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేసినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు.

''ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రసాద్‌తో పాటు ఇటీవల పలువురు టీడీపీ ఎమ్మెల్యేల కేంద్రంగా తలెత్తిన వివాదాలు, ఘటనలపై చంద్రబాబు చర్చించారు. ఆ సందర్భంగా దగ్గుబాటి ప్రసాద్‌ ఆడియో వైరల్‌పై కూడా ప్రస్తావనకు వచ్చింది. లేనిపోని వివాదాలు ఎందుకు క్రియేట్‌ చేసుకుంటున్నారు అని చంద్రబాబు అన్నారు'' అని ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బీబీసీతో అన్నారు.

ఎమ్మెల్యే దగ్గుబాటి, వార్ 2 సినిమా, వివాదం

ఫొటో సోర్స్, Daggupati Venkateswara Prasad/facebook

ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ (ఫైల్)

ఎమ్మెల్యే దగ్గుబాటి ఏమంటున్నారు?

ఆ ఆడియో వైరల్ అయి, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌ ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదనీ, రాజకీయ కుట్రలో భాగంగానే ఎవరో తనపై ఇలాంటివి చేస్తున్నారని వివరణ ఇచ్చారు.

ఈ ఆడియో క్లిప్‌పై అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాననీ, కచ్చితంగా పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారని చెప్పారు.

కాగా, ఈ ఆడియో కాల్స్‌ వల్ల జూనియర్‌ అభిమానుల మనసు నొచ్చుకొని ఉంటే, తన వైపు నుంచి క్షమాపణ చెబుతున్నానన్నారు. తన ప్రమేయం లేకున్నప్పటికీ తన పేరు ప్రస్తావించారు కాబట్టి, ఈ క్షమాపణలు చెబుతున్నానని ఆ వీడియోలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌ పేర్కొన్నారు.

కాగా, ఆ విషయమై ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

మరోవైపు ఈ వివాదం బయటి పడినప్పటి నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నాయకుడు ధనుంజయనాయుడు మీడియాకి అందుబాటులోకి రాకుండా సెల్‌ స్విచాఫ్‌ చేసుకున్నారు.

ఆయన స్పందిస్తే వారి వివరణ ఇక్కడ ఇస్తాం.

ఎన్టీఆర్, టీడీపీ

ఫొటో సోర్స్, Jr NTR/ facebook

ఫొటో క్యాప్షన్, అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల్లో తాత ఎన్టీఆర్‌, బాబాయి బాలకృష్ణలపేర్లను ప్రస్తావించేవారు.

అసలు జూనియర్‌కి టీడీపీతో దూరం ఎప్పటి నుంచి?

అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే ప్రసాద్‌ పేరిట బయటకు వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యల ఆడియో నేపథ్యంలో అసలు జూనియర్‌ ఎన్టీఆర్‌కి, టీడీపీకి మధ్య దూరం ఎప్పటి నుంచి పెరిగింది? అనే విషయంపై చర్చకు తెరలేచింది.

ఎన్టీఆర్‌ కుమారుడు హరికృష్ణ రెండో భార్య తనయుడే ఈ జూనియర్‌ ఎన్టీఆర్‌.

ఎంఎస్‌రెడ్డి నిర్మించిన ‘బాలా రామాయణం’లో రాముడి పాత్ర పోషించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, రామోజీరావు నిర్మించిన ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా మారారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ మలి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన స్టూడెంట్‌ నెంబర్‌ 1. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ తొలి హిట్‌ కొట్టారు.

ఆ తర్వాత వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టి అనతికాలంలోనే స్టార్‌డం సంపాదించారు.

అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల్లో తాత ఎన్టీఆర్‌, బాబాయి బాలకృష్ణలపేర్లను ప్రస్తావించేవారు.

అప్పట్లోనే ఓ సినిమా ఫంక్షన్‌లో బాలకృష్ణను కలిసిన జూనియర్‌, భావోద్వేగానికి గురైన దృశ్యాల వీడియో ఇప్పటికీ వైరల్‌ అవుతుంటుంది. ఎన్టీఆర్‌ కుటుంబంతో పాటు చంద్రబాబు నాయుడుతో కూడా జూనియర్‌ సన్నిహితంగా మెలిగేవారు. తన సినిమాల ప్రారంభోత్సవాలకు ఆయన్ని అతిథిగా పిలిచేవారు.

2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం

2004లో అధికారం కోల్పోయిన చంద్రబాబు 2009 ఎన్నికల్లో తిరిగి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పార్టీకి గ్లామర్‌ సొబగులు దిద్దారు.

అందులోనూ ఆ ఎన్నికల్లోనే ప్రజారాజ్యం పార్టీ పెట్టి సినీనటుడు చిరంజీవి పోటీకి దిగడంతో నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లను రంగంలోకి దించారు చంద్రబాబు.

బాలకృష్ణ రాజకీయ రంగప్రవేశాన్ని అట్టహాసంగా యువగర్జన పేరిట గుంటూరులోని నాగార్జున వర్శిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్‌లో భారీ సభ ద్వారా చేయించారు. ఆ సభకు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా వస్తారని భావించినా రాలేదు. అయితే ఆ ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఎన్టీఆర్, టీడీపీ

ఫొటో సోర్స్, Jr NTR/ facebook

ఫొటో క్యాప్షన్, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం నిర్వహించారు.

టూర్‌లో భాగంగా ఉత్తరాంధ్రలో కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడుకి ప్రచారం మొదలు.. కోస్తా మీదుగా తెలంగాణ గడప ఖమ్మంలోకి ప్రవేశించారు. అయితే ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయాలపాలై కొన్నాళ్లపాటు బెడ్‌కి పరిమితమయ్యారు. బెడ్‌పై నుంచి కూడా ఆయన టీడీపీకి మద్దతుగా వీడియోలతో ప్రచారం చేశారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైంది. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేసిన ఏ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదంటూ ఓ వాదన బయలుదేరింది.

సరిగ్గా అదే సమయంలో తండ్రి హరికృష్ణకి టీడీపీలో ప్రాధాన్యం తగ్గడం, రాజ్యసభకి మరోసారి పంపించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌కి టీడీపీకి అప్పటి నుంచి గ్యాప్‌ పెరగడం మొదలైందని రాజకీయ పరిశీలకులు సీనియర్‌ జర్నలిస్టు గాలి నాగరాజు అభిప్రాయపడ్డారు.

హరికృష్ణ, ఎన్టీఆర్, టీడీపీ

ఫొటో సోర్స్, Jr NTR/ facebook

ఫొటో క్యాప్షన్, 2014 ఎన్నికల్లో హరికృష్ణకు టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు.

హరికృష్ణకి దక్కని టికెట్‌

నందమూరి హరికృష్ణ 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ, హరికృష్ణకు చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వలేదు.

దీంతో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ ఆ ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉండిపోయారు. పైగా హరికృష్ణకి, జూనియర్‌ ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ కొడాలి నాని సరిగ్గా ఆ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈ పరిణామాల నుంచి జూనియర్‌కి, టీడీపీకి గ్యాప్‌ పెరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించిన దరిమిలా సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ సభకు జూనియర్‌ ఎన్టీఆర్‌ హాజరయ్యారు.

''ఆ సమయంలోనే కొన్నాళ్లుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలని టీడీపీలోని ఓ వర్గమే తొక్కేస్తోందని, కావాలని నెగెటివ్‌గా ప్రచారం చేస్తోందని హరికృష్ణ అప్పట్లో సన్నిహితులతో బాధపడే వారనే వాదనలున్నాయి'' అని గాలినాగరాజు బీబీసీతో అన్నారు.

ఇక 2018లో హరికృష్ణ మృతి తర్వాత 2019, 2024 ఎన్నికల్లోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ కార్యకలాపాలకు, ప్రచారాలకు దూరంగా ఉన్నారు.

అయితే ఎన్టీఆర్‌ మనవడిగా తాను ఎప్పటికీ టీడీపీ వాడినేనని వివిధ సందర్భాల్లో చెప్పుకున్నారు జూనియర్.

కాగా, 2019 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్‌ మామ, భార్య తండ్రి నార్నె శ్రీనినాసరావు వైసీపీలో చేరడం టీడీపీ వర్గాల్లో చర్చకు తెరలేపింది.

ఎన్టీఆర్, టీడీపీ

ఫొటో సోర్స్, Jr NTR/ facebook

జూనియర్‌ స్పందనలపై వివాదాలు

2019–24 మధ్య వైసీపీ హయాంలో విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును వైఎస్సార్‌ హెల్త్‌ వర్శిటీగా మార్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ విడుదల చేసిన వీడియో టీడీపీ శ్రేణులకు కోపం తెప్పింది.

అందులో 'ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ ఇద్దరూ మహానుభావులే' అని వ్యాఖ్యానించడం, పేరు మార్పు ఘటనను సీరియస్‌గా ఖండించకపోవడంతో టీడీపీ క్యాడర్‌ నుంచి విమర్శలు వచ్చాయి.

అదే విధంగా వైసీపీ నేతలు చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారన్న సందర్భంతో పాటు చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలోనూ జూనియర్‌ స్పందన మొక్కుబడిగా ఉందని అప్పట్లో టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శించారు.

జూనియర్ ఎన్టీఆర్, వార్ 2

ఫొటో సోర్స్, @vamsi84/X

నన్నెవరూ ఆపలేరు అంటూ వార్‌2 విడుదల ఫంక్షన్‌లో

కాగా,ఇటీవల వార్‌ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఆపలేరంటూ ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు తెరలేపాయి.

''జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో గానీ, ఎన్టీఆర్‌ చనిపోయి చాలా ఏళ్లు అవుతోంది. ఇప్పుడు అంతా కొత్తతరం వచ్చేసింది. ఇంకా ఎన్టీఆర్‌ జపం చేస్తే ప్రయోజనం ఏముంది'' అని సీనియర్‌ జర్నలిస్టు నాగరాజు అన్నారు.

వాస్తవానికి చంద్రబాబు అరెస్టు సందర్భంలో జూనియర్‌ స్పందనతోనే టీడీపీకి, ఆయనకు సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని, అయితే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేమని నాగరాజు అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)