‘నన్నే అఫిడవిట్ ఎందుకు అడుగుతున్నారు’.. రాహుల్ గాంధీ ప్రశ్నకు ఈసీ ఇచ్చిన సమాధానమేంటి?

రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలు, జ్ఞానేష్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్షన్ కమిషన్, బీజేపీ కలిసి ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఆదివారం బిహార్‌లోని సాసారామ్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేతలు ఎలక్షన్ కమిషన్‌(ఈసీ)పై ఆరోపణలు గుప్పించారు.

వారి ఆరోపణలపై సాసారామ్‌కు 900 కిలోమీటర్ల దూరంలో దిల్లీలో ఎలక్షన్ కమిషన్ స్పందించింది.

బీజేపీ, ఎలక్షన్ కమిషన్ కలిసి ఓట్లను తొలగిస్తున్నాయని "బిహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్"(ఎస్ఐఆర్’ అనేది ఓట్లను తొలగించే ప్రయత్నమని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ప్రతిపక్షాల ఆరోపణలకు ఈసీ సమాధానమిచ్చింది.

ECI

"చట్టం ప్రకారం ఎన్నికల కమిషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ప్రతి పార్టీ ఏర్పడుతుంది. అలాంటప్పుడు పార్టీల పట్ల ఈసీ వివక్ష ఎలా చూపిస్తుంది" అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించారు.

ఈసీ స్పందన తర్వాత కాంగ్రెస్ ప్రతిస్పందిస్తూ.. తాము అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదని ఆరోపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
SIR, ECI, CEC

1) బిహార్ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ ఎందుకు?

"బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించి కొత్తగా ఓటర్లను చేర్చడం, ఉన్న ఓటర్లను తొలగించి వారు (బీజేపీ-ఆర్ఎస్ఎస్) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కుట్ర చేస్తున్నారు. ఇదే వారి చివరి కుట్ర. ఈ కుట్రలను సాగనివ్వం" అని రాహుల్ గాంధీ సాసారామ్‌లో అన్నారు.

అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓట్లను తొలగించారని, ఈ ప్రక్రియ త్వరగా జరిగిందని చెప్పడం వల్ల గందరగోళం ఏర్పడుతుందని ఈసీ చెబుతోంది.

"ఓటరు జాబితా ఎన్నికలకు ముందు సరి చేయాలా లేక తర్వాతనా అంటే ఎన్నికలకు ముందు అని ప్రజా ప్రాతినిధ్య చట్టం స్పష్టంగా చెబుతోంది" అని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు.

CEC, ECI, SIR, Bihar

2. నకిలీ ఓటర్లు ఎలా వచ్చారు?

ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డ్‌ నెంబర్లకు సంబంధించి కమిషన్ రెండు రకాల 'సమస్యలను' ప్రస్తావించింది.

దేశంలో దాదాపు మూడు లక్షల మంది ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డుల సంఖ్యలు ఒకేలా ఉన్నాయని, దీన్ని గుర్తించిన తర్వాత వారి ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డుల నంబర్లు మార్చినట్లు ఈసీ తెలిపింది.

"ఒక వ్యక్తి పేరు దేశంలోని అనేక ఓటరు జాబితాల్లో ఉండి ఆయా జాబితాల్లో అదే వ్యక్తి పేరుకు వేర్వేరు ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డు నెంబర్లు ఉండటం రెండో రకం" అని సీఈసీ చెప్పారు.

ఆ వ్యక్తి తను ఉన్న చోట నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిన తర్వాత పాత జాబితాలో పేరు తొలగించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఈసీ అంటోంది.

ఇలాంటి ఓటర్లను జాబితాలను ఎందుకు తొలగించలేదని రాహుల్ గాంధీ గతంలో ప్రశ్నించారు.

"ఒకే పేరుతో చాలా మంది ఓటర్లు ఉన్నప్పుడు ఒకరి అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఎవరి పేరును తొలగించదు. ఆ వ్యక్తి కోరుకుంటే అతను స్వయంగా పేరును తొలగించవచ్చు లేదా దానిని స్పెషల్ ఇంటెన్సివి రివిజన్ ద్వారా సరిదిద్దవచ్చు" అని కమిషన్ సమాధానమిచ్చింది.

రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలు, జ్ఞానేష్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

3. ఓటర్ల ఇంటి నంబర్ సున్నాపై కమిషన్ ఏమంది?

2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ఓటర్ల జాబితాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, దీని వల్ల బీజేపీ లబ్ధి పొందిందని రాహుల్ ఆరోపించారు.

బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా నకిలీ ఓటర్లు, అనేక ఇన్‌వేలిడ్ అడ్రస్‌లు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

రాహుల్ ఆరోపణలను నిరాధారం, బాధ్యతా రాహిత్యమైనవని ఎన్నికల సంఘం పేర్కొంది.

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా ఎన్నికలకు ముందే అందుబాటులో ఉందని, అప్పుడు అభ్యంతరం ఎందుకు చెప్పలేదు? ఫలితాలు వచ్చిన తర్వాత అక్రమాలు అంటూ ఎందుకు మాట్లాడుతున్నారని ఈసీ ప్రశ్నించింది.

ఇంటి నంబర్ సున్నా ఉండటంపైనా రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ సమాధానమిచ్చింది.

"ఓటరు జాబితాలో పేరుండి ఇంటి అడ్రస్ లేని వారు ఎక్కడ నిద్రిస్తారు. కొన్నిసార్లు రోడ్లపక్కన ఫుట్‌పాత్ మీద, కొన్నిసార్లు వంతెనల కింద ఉంటారు. వాళ్లను నకిలీ ఓటర్లని పిలవడం అంటే ముసలి వాళ్లు, పేదలను అవమానించడం లాంటిదే" అని ఈసీ తెలిపింది

"కోట్ల మంది ప్రజల ఇళ్లకు సున్నా నంబర్ ఉంది. ఎందుకంటే పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఇంటి నంబర్ కేటాయించలేదు. నగరాల్లో అనధికార కాలనీలు ఉన్నాయి. అక్కడ వారికి నంబర్ రాలేదు. వాళ్లు ఓటు నమోదు చేసుకునేందుకు ఫామ్‌లో ఏ నంబర్ రాయాలి. అలాంటి వారికి ఎన్నికల సంఘం నోషనల్ నంబర్ ఇస్తుంది. దానిని కంప్యూటర్‌లో ఎక్కించినప్పుడు అది సున్నాగా కనిపిస్తుంది" అని ఈసీ రాహుల్ ప్రశ్నకు సమాధానమిచ్చింది.

ECI

4. ఈసీ నన్నే అఫిడవిట్ ఎందుకు అడిగింది: రాహుల్ గాంధీ

ఎలక్షన్ కమిషన్ తన నుంచి మాత్రమే అఫిడవిట్ అడుగుతోందనే విషయాన్ని రాహుల్ గాంధీ సాసారామ్‌లో లేవనెత్తారు.

"ఎన్నికల సంఘం నన్ను మాత్రమే అఫిడవిట్ అడిగింది. ఇంకెవర్నీ అడగలేదు. ఇటీవల బీజేపీ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వారిని ఈసీ ఏమీ అడగలేదు. నేను ప్రస్తావించిన డేటా సరైనదేనని అఫిడవిట్ ఇవ్వాలని వారు అడుగుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అది వారు ఇచ్చిందే" అని రాహుల్ అన్నారు.

దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఒక ప్రాంతానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో అక్రమాలు ఉన్నాయని ఆరోపించినప్పుడు, ఆరోపణ చేసిన వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన వారు కాకపోతే అఫిడవిట్ ఇవ్వాలని ఈసీ వివరించింది.

"మీరు ఓటర్ల జాబితాలో అక్రమాల గురించి ప్రస్తావించినప్పుడు మీరు ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు కాకపోతే, చట్టం ప్రకారం మీరు అఫిడవిట్ ఇవ్వాలి. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి ప్రమాణం చేయాలి. మీరు ఎవరిపై ఫిర్యాదు చేశారో వారి ముందు ఆ ప్రమాణాన్ని నమోదు చేయాలి" అని జ్ఞానేష్ కుమార్ అన్నారు.

ఈ చట్టం చాలా ఏళ్ల నాటిదని అది అందరికీ సమానంగా వర్తిస్తుందని ఆయన చెప్పారు.

రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇవ్వకపోతే దేశానికి క్షమాపణ చెప్పాలని జ్ఞానేష్ కుమార్ సూచించారు.

pawan khera

ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయనే ప్రశ్నకు సమాధామేంటి?

ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎన్నికల సంఘం నేరుగా సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు.

"మహదేవ్ పురలో మేం బహిర్గతం చేసిన లక్ష మంది ఓటర్లకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏదైనా సమాధానం ఇచ్చారా?" అని పవన్ ఖేరా ప్రశ్నించారు.

"ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మా ప్రశ్నలకు సమాధానం ఇస్తారని అనుకున్నాం. అయితే ఆయన తీరంతా బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నట్లు అనిపించింది" అని చెప్పారు.

రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన దాదాపు రెండు వారాల తర్వాత ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించింది.

"ఎన్నికల కమిషన్ ఇంతకు ముందెన్నడూ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముందుకు రాలేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆగస్టు 14న, సుప్రీంకోర్టు ఒక విధంగా ఎన్నికల సంఘాన్ని మందలించి, జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను బహిరంగపరచాలని చెప్పింది. ప్రజలు కంప్యూటర్లలో సెర్చ్ చేసి తెలుసుకునేలా దాన్ని ఇవ్వాలి" అని సీనియర్ జర్నలిస్టు పరంజోయ్ గుహ కోరారు.

కాగా తొలగించిన 65 లక్షల మంది పేర్ల జాబితాను ఈసీ ఆదివారం రాత్రి తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)