పుతిన్‌తో భేటీ కంటే జెలియెన్‌స్కీతో ట్రంప్ సమావేశం కీలకం కానుందా?

ఫొటో సోర్స్, Ludovic Marin/Pool via REUTERS
- రచయిత, ఫ్రాంక్ గార్డనర్
- హోదా, బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్
గత వారం అలాస్కాలో జరిగిన డోనల్డ్ ట్రంప్, పుతిన్ సమావేశం కంటే సోమవారం(18.08.2025) వైట్‌హౌస్‌లో జరగబోయే ట్రంప్, జెలియెన్‌స్కీ సమావేశం యుక్రెయిన్ భవిష్యత్తుకు.. మొత్తం యూరప్ భద్రతకు మరింత కీలకమన్న అంచనాలున్నాయి.
స్థూలంగా చూసినప్పుడు ట్రంప్, పుతిన్ భేటీ చాలామంది అంచనాలకు అనుగుణంగానే సాగినట్లు అనిపించింది.
ఆ సమావేశంలో కాల్పుల విరమణ కుదరలేదు, కొత్తగా ఆంక్షలేమీ లేవు, కీలక ప్రకటనలూ లేవు.
మరి.. ప్రపంచంలోని రెండు అణ్వస్త్ర శక్తులు రహస్యంగా కుదుర్చుకున్న ఒప్పందం నుంచి యుక్రెయిన్, యూరప్ బయటకు రాబోతున్నాయా?
యుక్రెయిన్, దాని పార్టనర్స్ దీనిని నిరోధించగలిగితే అది సాధ్యం కాదు.


ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీతో పాటు వాషింగ్టన్ భేటీలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్, ఇతర నాయకులు ఉండనున్నారు. ఫిబ్రవరి 28న ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ సమయంలో జెలియెన్‌స్కీ ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో వీరంతా ఇప్పుడు వాషింగ్టన్‌కు వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యూరప్‌కు చెందిన ఈ నాయకులంతా డోనల్డ్ ట్రంప్‌కు రెండు విషయాలను బలంగా చెప్పాలని నిశ్చయించుకున్నారు.
యుక్రెయిన్ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా శాంతి ఒప్పందం సాధ్యం కాదని చెప్పడం మొదటి విషయమైతే... రెండోది, అలాంటి ఒప్పందం కుదరడానికి ముందు యుక్రెయిన్‌కు క్యాస్ట్ ఐరన్ సెక్యూరిటీ గ్యారంటీల విషయంలోనూ స్పష్టమైన హామీ ఉండాలన్న విషయం.
అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు యుక్రెయిన్, యూరప్ ఐక్య కూటమిని చూడగలగాలని యూరోపియన్ నేతలు కోరుకుంటున్నారు.
అంతేకాదు... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉన్న వ్యక్తిగత పరిచయాలు ట్రంప్‌ను రష్యా నాయకుల డిమాండ్లకు తలొగ్గేలా చేయకుండా చూడాలని వారు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడే కీర్ స్టార్మర్ దౌత్య నైపుణ్యాలకు పరీక్ష ఉంటుంది.
ట్రంప్ స్టార్మర్‌ను ఇష్టపడతారు, ఆయన మాట కూడా వింటారు. నెల రోజుల్లో ట్రంప్ యూకే పర్యటనకు రానున్నారు.
ఆయనకు నేటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే అంటే కూడా ఇష్టం, ఆయన కూడా ఆ సమావేశంలో పాల్గొంటారు, ఆయనను 'ట్రంప్ విస్పరర్' అని పిలుస్తారు.
అమెరికా అధ్యక్షుడికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌పై అంతగా అభిమానం లేనట్లు కనిపిస్తోంది. తదుపరి యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యాన్ని బేషరతుగా గుర్తించాలనే ఆయన ఉద్దేశాన్ని వైట్ హౌస్ ఇటీవల తీవ్రంగా విమర్శించింది.
యుక్రెయిన్‌లో శాంతి ఒప్పందం పనిచేయాలంటే, ఏదో ఒకటి ఇవ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ సరిహద్దులను బలవంతంగా మార్చలేమని యూరోపియన్ నాయకులు తరచుగా చెబుతూనే ఉన్నారు. జెలియెన్‌స్కీ కూడా తాము భూమిని వదులుకునే ప్రసక్తే లేదని పదేపదే స్పష్టం చేస్తున్నారు.
కానీ పుతిన్ తన దళాలు ఇప్పటికే 85 శాతం నియంత్రణలో ఉన్న డాన్‌బాస్‌ను కోరుకుంటున్నాయి, అంతేకాదు క్రిమియాను తిరిగి అప్పగించే ఉద్దేశం కూడా ఆయనకు లేదు.
అయినప్పటికీ, మాజీ ఎస్టోనియన్ ప్రధానమంత్రి, ప్రస్తుతం యూరప్‌లోని కీలక దౌత్యవేత్త కాజా కల్లాస్ ఒకసారి నాతో చెప్పినట్లుగా.. ఈ యుద్ధంలో యుక్రెయిన్ విజయం అంటే ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం గురించి మాత్రమే కాదు.
యుక్రెయిన్ ఇప్పుడు మాట్లాడుతున్న ఆర్టికల్ 5-రకం భద్రతా హామీలను పొందగలిగితే.. భవిష్యత్తులో రష్యా దురాక్రమణను నిరోధించడానికి, స్వేచ్ఛాయుత, సార్వభౌమ రాజ్యంగా దాని స్వాతంత్ర్యాన్ని కాపాడుకోగలిగితే అది విజయం అవుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














