అలాస్కాలో ట్రంప్-పుతిన్ చర్చలు ఇండియాకు కొత్త సమస్యలు సృష్టిస్తాయా?

భారత్, అమెరికా, పుతిన్, ట్రంప్, రష్యా, యుక్రెయిన్, అలస్కా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 15న అమెరికాలోని అలాస్కాలో చర్చలు జరపనున్నారు.

యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం ఈ చర్చల ప్రధాన ఉద్దేశం అని వైట్ హౌస్ తెలిపింది.

ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు అనిశ్చితితో ముగిస్తే, భారతదేశంపై సుంకాలు మరింత పెరుగుతాయని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బీసెంట్ చెప్పడం అలజడి సృష్టించింది.

భారతదేశంపై ఎంత ఎక్కువ సుంకాలు విధిస్తే, రష్యాపై అంత ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుందనేది ట్రంప్ వాదన.

చమురు కొనడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు భారత్ మద్దతు ఇస్తోందని, అందుకే ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రష్యా ఆర్థిక వ్యవస్థకు ఈ సహాయం అందుతుండడం వల్లే, యుక్రెయిన్‌పై పోరాటాన్ని పుతిన్ ఆపడం లేదని ట్రంప్ నమ్ముతున్నారు.

భారతదేశంపై సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్టు ఆగస్టు 7న ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి.

ప్రపంచం మొత్తం దృష్టి ట్రంప్, పుతిన్ మధ్య అలాస్కాలో జరిగే చర్చలపై ఉంటే... భారతదేశం మాత్రం ఆ చర్చల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు భారతదేశానికి ఎందుకు అంత ముఖ్యమైనవి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images

సుంకాలతో ఒత్తిడి

భారత్, అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉండడంతో, సుంకాల విషయంలో ట్రంప్ మెతక వైఖరితో ఉంటారని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆశించింది. కానీ భారతదేశం అమెరికా ఎగుమతులపై అత్యధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు.

ఆ తర్వాత భారత దిగుమతులపై 25 శాతం సుంకాన్ని మొదట ప్రకటించిన ట్రంప్ అదనంగా మరో 25 శాతం సుంకాన్ని ఆగస్టు 7న ప్రకటించారు.

దీంతో అమెరికా అత్యధిక సుంకాలను ఎదుర్కొంటున్న దేశాలలో భారత్‌ ఒకటిగా మారింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ట్రంప్ భారత్‌పై ఈ అదనపు సుంకాన్ని విధించారు.

అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోతే, ఆగస్టు 27నుంచి 25 శాతం అదనపు సుంకం అమల్లోకి వస్తే ఆసియాలో అమెరికాకు అత్యధిక సుంకాల వాణిజ్య భాగస్వామిగా భారత్ మారుతుంది.

భారత్‌పై అధిక సుంకాలు ప్రకటించిన తర్వాత, ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

చాలా మంది భారతీయ ఎగుమతిదారులు 10 నుంచి 15 శాతం సుంకాన్ని భరించడమే చాలా కష్టమని చెబుతున్నారు.

50 శాతం సుంకాన్ని వారు భరించలేరు.

''ఈ సుంకం అమలయితే, అది వాణిజ్య నిషేధంలా మారుతుంది. సుంకం ద్వారా ప్రభావితమైన ఉత్పత్తుల ఎగుమతి వెంటనే ఆగిపోవచ్చు’’ జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నోమురా అభిప్రాయపడింది.

భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికా. భారతదేశం 18 శాతం సరుకులను అమెరికన్ మార్కెట్‌కు ఎగుమతి చేస్తుంది. ఇది భారత జీడీపీలో 2.2 శాతం.

50 శాతం సుంకం భారత జీడీపీని 0.2 నుంచి 0.4 శాతం వరకు తగ్గించవచ్చు. దీని వల్ల ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధి ఆరు శాతం కంటే తక్కువగా ఉండొచ్చు.

భారత ఎగుమతిదారులపై అమెరికా సుంకాల ప్రభావం కనిపించడం మొదలైంది. తోలు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు వంటి భారత ప్రధాన ఎగుమతి ఆధారిత రంగాల్లో అమెరికా ఆర్డర్లు రద్దు కావడం మొదలయింది. సుంకాల కారణంగా, భారత వస్తువులు అమెరికా వ్యాపారవేత్తలకు ఖరీదైనవిగా మారాయి.

ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Image

‘ట్రంప్ వైఖరే అసలు సమస్య’

గత మూడు దశాబ్దాలుగా అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారతదేశం భారీగా పెట్టుబడులు పెట్టింది.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాను నియంత్రించడానికి అమెరికాకు కూడా భారత్ అవసరం.

రష్యా నుంచి చమురు కొంటోందన్న కారణంతో భారత్‌ నుంచి దూరం కావడానికి అమెరికా ప్రయత్నిస్తే, అది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని భావిస్తున్నారు.

''ప్రస్తుతం భారత్‌తో అమెరికా వైఖరి చాలా వ్యక్తిగత విషయంగా కనిపిస్తోంది'' అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, భారత్-అమెరికా సంబంధాలను నిశితంగా పరిశీలించే ప్రేమానంద్ మిశ్రా అంటున్నారు.

''భారత్‌ను అవమానించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇది చమురు కొనుగోలు సమస్య కాదు. భారతదేశం కంటే రష్యా నుంచి ఎక్కువ చమురును చైనా కొంటోంది. కానీ ట్రంప్ చైనాపై అదనపు సుంకాలు విధించడం లేదు. దీనికి ఆయన 90 రోజుల గడువిచ్చారు'' అని ప్రేమానంద్ మిశ్రా విశ్లేషించారు.

"భారతదేశంతో తన వ్యూహాత్మక సమీకరణాలను సమీక్షించుకోవాలని అమెరికా అనుకుంటోంది. దీనికి సుంకాలు ఒక సాకు. భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నందున, పాకిస్తాన్‌కు అమెరికా మద్దతిస్తోంది" అని ప్రేమానంద్ అభిప్రాయపడ్డారు.

''కాబట్టి ట్రంప్, పుతిన్ చర్చల ఫలితం ఏదైనప్పటికీ, ట్రంప్ పరిపాలనపై భారత్ ఒత్తిడి తెస్తూనే ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

ట్రంప్, పుతిన్ మధ్య జరిగే చర్చల ఫలితాలు భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలను నిర్ణయించబోవని ప్రేమానంద్ అంటున్నారు.

తానే గొప్పని భావించే ట్రంప్ వైఖరే రాబోయే రోజుల్లో భారత్, అమెరికా మధ్య సంబంధాలను నిర్ణయిస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు.

భారత్, అమెరికా, పుతిన్, ట్రంప్, రష్యా, యుక్రెయిన్, అలస్కా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రక్షణ రంగంలో రష్యా సహకారం భారత్‌కు తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.

భారత్, రష్యా రక్షణ సంబంధాలు

సాంప్రదాయకంగా, భారత్ రష్యా ఆయుధాలను ఎక్కువ కొంటుంటుంది, కానీ ఇటీవలి సంవత్సరాలలో అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం ప్రారంభించింది.

అయినప్పటికీ ఇప్పుడు కూడా భారత్ తన ఆయుధాలలో ఎక్కువ భాగం రష్యా నుంచే కొంటోంది. 2018 నుంచి 2023 మధ్య, భారతదేశం రష్యా నుంచి 13 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేసింది.

మరో పది బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల కోసం ఆర్డర్ ఇచ్చింది. రష్యా ఆయుధాలలో 20 శాతం భారతే కొంటోంది.

"రక్షణ రంగ సహకారంలో భారత్‌కు రష్యా కాకుండా వేరే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రస్తుతం భారత సైనిక పరికరాల్లో 60 నుంచి 70 శాతం సోవియట్ యూనియన్ లేదా రష్యా నుంచి వచ్చినవే" అని రక్షణరంగ విశ్లేషకులు రాహుల్ బేదీ బీబీసీతో అన్నారు .

''ఈ ఆయుధాలు, యంత్రాల నిర్వహణ, సర్వీసింగ్, వాటి విడిభాగాలను అప్‌గ్రేడ్ చేయడం కోసం భారత్ పూర్తిగా రష్యాపై ఆధారపడి ఉంది'' అని ఆయన చెప్పారు.

''రష్యా నుంచి భారత్ కొత్త పరికరాలను కొనకుండా ఉండడం సాధ్యమవుతుందిగానీ రష్యా సహాయం లేకుండా రాబోయే పదేళ్లపాటు పాత పరికరాల నిర్వహణ చాలా కష్టం అవుతుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

రష్యా నుంచి ఆయుధాలు కొన్నందుకు భవిష్యత్తులో భారత్‌పై అమెరికా చర్యలు తీసుకుంటే, అది సమస్యలకు కారణమవుతుందని భారత్, అమెరికా మధ్య సంబంధాలను గమనిస్తున్న నిపుణులు అంటున్నారు.

దీని వల్ల భారత్-అమెరికా సంబంధాలు మరింత దిగజారిపోతాయి. అందకే, ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు విజయవంతం కావాలని, అలాంటి పరిస్థితి తలెత్తకూడదని భారతదేశం కోరుకుంటోంది.

రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై సుంకాలను పెంచుతున్నట్టే, ఆయుధాల కొనుగోలుపై కూడా అమెరికా అసంతృప్తి వ్యక్తం చేయగలదని జామియా మిలియా ఇస్లామియా రాజకీయ శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ రేష్మి కాజీ అన్నారు.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Bloomberg via Getty Image

‘అమెరికాతో సంబంధాలు నిలుపుకోవడం ముఖ్యం’

భారతదేశ భౌగోళిక రాజకీయ అవసరాలకు పుతిన్, ట్రంప్ మధ్య చర్చలు విజయవంతం కావడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

ఈ సమయంలో, భారత్‌ అమెరికాతోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రధాన శక్తులతో కూడా మెరుగైన సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం.

భారత్ ఇప్పుడు రష్యా వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడం భారత్‌కు చాలా ముఖ్యమని, అప్పుడే వ్యూహాత్మకంగా కూడా బలంగా మారగలదని నిపుణులు అంటున్నారు.

దీని కోసం రష్యా, అమెరికా రెండింటినీ తనతో పాటు తీసుకెళ్లడం భారత్‌కు గట్టి అవసరం.

ప్రస్తుతం అమెరికా, భారతదేశం సంబంధాలు సుంకాల విషయంలో కొంచెం కష్టంగా కనిపిస్తున్నాయని, అయితే ఇది పెద్ద విషయం కాదని రేష్మి కాజీ అభిప్రాయపడ్డారు.

"వాణిజ్య ఒప్పందం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. కానీ అమెరికాతో తన సంబంధాలను భారతదేశం చెడగొట్టుకోకుండా ఉండటం ముఖ్యం. భారతదేశ ఆర్థిక బలోపేతానికి ఇది చాలా ముఖ్యమైన వ్యూహం అవుతుంది" అని ఆమె అంటున్నారు.

"ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు విజయవంతం కావడం భారత ఆర్థిక బలోపేతానికి మాత్రమే కాకుండా భౌగోళిక రాజకీయాల పరంగా కూడా ముఖ్యమైనది" అని ఆమె అంటున్నారు.

ఈ చర్చలు విజయవంతమైతే, అమెరికా, రష్యా రెండింటితో తన సంబంధాలలో భారత్ సమతుల్యతను కొనసాగించగలదని, దాని వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

భారత్, అమెరికా, పుతిన్, ట్రంప్, రష్యా, యుక్రెయిన్, అలస్కా

ఫొటో సోర్స్, YouTube/@ISPR

ఫొటో క్యాప్షన్, భారత్‌ను ఇరుకున పెట్టడానికి పాకిస్తాన్‌ను అమెరికా, చైనా వాడుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు.

‘భారత్‌ను ఇరుకున పెట్టడానికి పాకిస్తాన్‌ను వాడుకుంటోంది’

‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత, పాకిస్తాన్‌పై అమెరికాకు మక్కువ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.భారత్‌ను ఇబ్బందుల్లో పెట్టడానికి పాకిస్తాన్‌ను ఉపయోగించుకోవాలని అమెరికా, చైనా రెండూ అనుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈసారి కూడా అమెరికా అదే చేసింది.

"భారతదేశ విదేశాంగ విధానంలో పాకిస్తాన్ ఒక బలహీనమైన లింక్. భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి దాన్ని ఉపయోగిస్తారు" అని ప్రేమానంద్ మిశ్రా అంటున్నారు.

"పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం బలహీనంగా ఉన్నందున, ఆ దేశ నాయకులను ప్రభావితం చేయడం అమెరికా లేదా చైనాకు తేలికైన విషయం. అందుకే భారత్‌ను ఇబ్బందుల్లో ఉంచడానికి ఆ దేశాలు పాకిస్తాన్‌ను ఉపయోగిస్తుంటాయి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత విదేశాంగ విధానం స్వయంప్రతిపత్తిని సవాలు చేయడానికి కూడా పాకిస్తాన్ అంశాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన విశ్లేషించారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంలో అతి ముఖ్యమైన అంశం భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అని ప్రేమానంద్ మిశ్రా అన్నారు.

అమెరికా, చైనా వంటి దేశాలు పాకిస్తాన్‌ను ఉపయోగించి భారత విధానాన్ని సవాలు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాయని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)