రష్యా వర్సెస్ అమెరికా: భారత్‌కు ఏ దేశంతో ఒప్పందాలు ఎక్కువ ప్రయోజనకరం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దశాబ్దాలుగా రష్యా, అమెరికా రెండు దేశాలు భారత్‌కు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు భారత్ ఎవరివైపు ఉంటే ప్రయోజనం కలుగుతుందనే ప్రశ్నను తీవ్రతరం చేసింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించారు. దీంతో ఇది ఇప్పటికే వర్తించే 25 శాతం సుంకంతో కలిపి 50 శాతానికి చేరింది.
రష్యాతో భారత్‌కు చాలా ఏళ్లుగా సత్సంబంధాలున్నాయి. రక్షణ ఒప్పందాల నుంచి ఇంధన సరఫరాల వరకు, రష్యా భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా ఉంది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) ప్రకారం, 2019, 2023 మధ్య రష్యా నుంచి భారత ఆయుధ దిగుమతులు 36 శాతంగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, రష్యా నుంచి వస్తున్న చౌకైన ముడి చమురు భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఉపశమనం కలిగించింది.
మరోవైపు, భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో రెండు దేశాల మధ్య వాణిజ్యం రూ.12 లక్షల కోట్లకు పైగా ఉంది. అదే సమయంలో, హైటెక్ రక్షణ పరికరాల నుంచి క్లీన్ ఎనర్జీ వరకు అమెరికాపై భారత్ ఆధారపడటం పెరిగింది.
కానీ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, అమెరికా, రష్యాలలో ఎవరి మద్దతు భారత్‌కు ఎక్కువ ప్రయోజనకరం?


ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక కోణంలో లాభనష్టాలు
భారత్ తన మొత్తం చమురు అవసరాలలో దాదాపు 88 శాతం దిగుమతి ద్వారానే భర్తీ చేసుకుంటోంది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 35 శాతం రష్యా నుంచి వచ్చాయి. అయితే 2018లో ఇది 1.3 శాతం మాత్రమే.
యుక్రెయిన్ యుద్ధం తర్వాత, పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో, రష్యా చౌక ధరలకే చమురును అమ్ముతోంది, ఇది భారత్‌కు ప్రయోజనకరంగా మారింది.
రష్యా నుంచి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేసి, ఏటా దాదాపు రూ. 87 వేల కోట్ల రూపాయల వరకు ఆదా చేస్తోందని సెర్చ్ గ్రూప్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అంచనా వేశారు.
"మరోవైపు, అమెరికాతో భారత్‌కు దాదాపు రూ. 3.5 లక్షల కోట్ల రూపాయల వాణిజ్య మిగులు ఉంది(ఎక్కువ ఎగుమతులు, తక్కువ దిగుమతులు). భారత్ అమెరికాకు దాదాపు రూ. 7.6 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తున్నాం" అని ఆయన అన్నారు.
"ట్రంప్ 50 శాతం సుంకం కొనసాగితే, భారత్ నుంచి దాదాపు 4.37 లక్షల కోట్ల రూపాయలు విలువజేసే ఎగుమతులు తగ్గవచ్చు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకపోతే, ఈ సుంకం 25 శాతమే ఉంటుంది. అప్పుడు, 2.62 లక్షల కోట్ల రూపాయలు విలువజేసే ఎగుమతులు మాత్రమే తగ్గుతాయి" అని అజయ్ శ్రీవాస్తవ అంటున్నారు.
'ది ఇమేజ్ ఇండియా ఇనిస్టిట్యూట్' ప్రెసిడెంట్ రవీంద్ర సచ్‌దేవ్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
"అమెరికన్ సుంకంలో ఒక శాతం అంటే దాదాపు రూ.8,700 కోట్లు. ట్రంప్ 50 శాతం సుంకం విధిస్తే, భారత్ దాదాపు రూ. 4.37 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తుంది" అని రవీంద్ర సచ్‌దేవ్ అంచనా వేశారు.
"భారత్‌లో డబ్బు మాత్రమే కాదు, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా పోతాయి. సుంకాలు పెరిగితే, తక్కువ వస్తువులు అమెరికాకు వెళతాయి. దేశంలో వాణిజ్యం ప్రభావితమవుతుంది, ఉద్యోగాలు పోతాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా 50 శాతం సుంకాన్ని కొనసాగిస్తే, భారత్‌లో 50 లక్షల ఉద్యోగాల వరకు కోల్పోవచ్చని రవీంద్ర సచ్‌దేవ్ అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌తో స్నేహం
రెండు దేశాల మధ్య నిర్ణయాలు ఆర్థిక దృక్పథం నుంచి మాత్రమే తీసుకోరని, భౌగోళిక రాజకీయాలు, దౌత్యం, జాతీయ ప్రయోజనాలకు కూడా ప్రాధాన్యమిస్తారని విదేశాంగ విధాన నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ ఒత్తిడితో భారత్ నిర్ణయం తీసుకోకూడదని నికోర్ అసోసియేట్స్‌లో ఆర్థికవేత్త మితాలి నికోర్ అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో, ట్రంప్ ఒత్తిడితో భారతదేశం రష్యాతో తన సంబంధాలను చెడగొట్టుకోకపోవచ్చని అజయ్ శ్రీవాస్తవ నమ్ముతున్నారు.
అజయ్ శ్రీవాస్తవ చెబుతున్నదాని ప్రకారం.. "సంక్షోభ సమయాల్లో, భారత్‌కు అమెరికా కంటే రష్యానే ఎక్కువ సహాయం చేసిందని చరిత్ర చెబుతోంది".
1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో రష్యా భారతదేశానికి సైనిక ఆయుధాలు, దౌత్యపరమైన మద్దతును అందించింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వైపు నిలిచింది. మరోవైపు, అమెరికా బహిరంగంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది, హిందూ మహాసముద్రంలో ఇండియాపైకి తన 7వ నౌకాదళాన్ని పంపింది.
1998లో అణు పరీక్ష తర్వాత కూడా, భారత్‌కు రష్యా ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంది. పాశ్చాత్య దేశాలు భారతదేశంపై ఆంక్షలు విధించిన సమయమది.
"2024లో రష్యా నుంచి చైనా రూ. 5.47 లక్షల కోట్ల విలువైన చమురు కొనుగోలు చేసింది. భారత్ రూ.4.6 లక్షల కోట్ల విలువైన చమురు కొనుగోలు చేసింది. అయినప్పటికీ, చైనాపై సుంకం లేదు, ఎందుకంటే ఈ సమస్య చమురు గురించి మాత్రమే కాదు" అని శ్రీవాస్తవ అన్నారు.
"ప్రస్తుతం చమురు సమస్య ఉంది, రేపు బ్రిక్స్ విషయంలో భారత్‌పై అమెరికా ఒత్తిడి తీసుకురావచ్చు, వాణిజ్య ఒప్పందాన్ని ఒక షరతుగా చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, అమెరికా ఏకపక్ష పరిస్థితులను భారత్ అంగీకరించదు" అని మితాలి నికోర్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
'బ్యాలెన్స్ సాధించాలి'
భారత విదేశాంగ విధానం మొదటి నుంచి అలీనంగా ఉంది. స్వతంత్ర, నిష్పాక్షిక వైఖరిని కొనసాగించింది.
"రష్యా నుంచి భారత్ ఎంతకాలం చౌకగా చమురు పొందుతుందనేదే ఇపుడు ప్రశ్న. ఇక్కడ చమురు తాత్కాలిక విషయం. రక్షణ రంగంలో రష్యా, భారత్ ఏళ్లుగా స్నేహితులు. చమురు కొనకపోవడం వల్ల భారత సంబంధాలేం చెడిపోవు. రష్యా, అమెరికాల మధ్య భారత్ సమతుల్యతను కొనసాగించాలి" అని అజయ్ శ్రీవాస్తవ సూచించారు.
రవీంద్ర సచ్‌దేవ్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ సుంకాల యుద్ధం ఎక్కువ కాలం ఉండదని ఆయన నమ్ముతున్నారు.
"భారతదేశానికి అమెరికా మాత్రమే ముఖ్యం కాదు, అమెరికాకూ భారత్ ముఖ్యమే. చైనా దానికి అతిపెద్ద సవాలు, దీనికి భారత మద్దతు అవసరం" అని రవీంద్ర సచ్‌దేవ్ అన్నారు.
"భారత మార్కెట్ అమెరికాకు చాలా పెద్దది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ.43.7 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అమెరికా కార్పొరేట్ లాబీ కూడా సుంకానికి వ్యతిరేకంగా ట్రంప్‌పై ఒత్తిడి తెస్తోంది" అని ఆయన అన్నారు.
"ఇవి కష్ట సమయాలు, భారత్ ఈ విషయంలో బలంగా ఉండాలి. అమెరికాలోని చాలామంది రిపబ్లికన్లు ట్రంప్ చర్యలను ప్రశ్నిస్తున్నారు. అంతర్గతంగా అక్కడ జరుగుతున్నది ఇండియాకు మంచిదే" అని మితాలీ నికోర్ అన్నారు.
"ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి, భారత్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న అమెరికన్లతో మనం బ్యాక్ చానల్ చర్చలు జరపాలి" అని ఆమె సూచించారు.
ఒకే దేశంపై ఆధారపడకూడదు
భారత్ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 18 శాతం అమెరికాకు వెళ్తాయి.
"మనం ఒకే దేశంపై అంతగా ఆధారపడకూడదు. ఎగుమతి కోసం యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి పెద్ద దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలి" అని మితాలీ నికోర్ సూచించారు.
"భారత్ ప్రతి సంవత్సరం దాని రూ. 25 వేల కోట్ల విలువైన రొయ్యలలో 40 శాతం అమెరికాకు పంపుతుంది. ప్రస్తుతం భారతదేశం యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో భారత్ తన రొయ్యలను యూకేకూ పంపగలదు. అక్కడ కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ విధంగా, భారత్ తన వస్తువులకు ఇతర మార్కెట్లను కనుగొనగలదు" అని ఆమె అన్నారు.
"భారత్ తన వ్యాపారులను బలోపేతం చేసుకోవాలి, తద్వారా కొత్త మార్కెట్లను కనుగొనవచ్చు. ప్రభుత్వం చిన్న వ్యాపారులకు కూడా మద్దతివ్వాలి, దీంతో మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేయవచ్చు, ఇది విదేశాలపై మనం ఆధారపడటాన్ని తగ్గిస్తుంది" అని మితాలీ నికోర్ సూచించారు.
అయితే, ఎగుమతి మార్కెట్‌ను మార్చడం అంత సులభం కాదని రవీంద్ర సచ్‌దేవ్ అంటున్నారు.
"భారత్ తన ఎగుమతులను కొంతవరకు వివిధ ప్రాంతాలకు తరలించగలదు కానీ, అదంత సులభం కాదు. అమెరికా చాలా పెద్ద మార్కెట్, ప్రపంచంలో అలాంటి మార్కెట్‌ను కనుగొనడం కష్టం" అని ఆయన అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














