కెమిస్ట్రీ లెక్చరర్: భర్తను హత్య చేసిన కేసు నుంచి బయటపడేందుకు రసాయన శాస్త్రాన్ని ఎలా వాడుకోవడానికి ప్రయత్నించారంటే..

మమతా పాఠక్
ఫొటో క్యాప్షన్, భర్త నీరజ్ పాఠక్‌తో మమతా పాఠక్ (కుడి) (ఫైల్ ఫోటో)
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''మీరు కెమిస్ట్రీ ప్రొఫెసరా?'' అని న్యాయమూర్తి అడిగారు. చేతులు రెండు జోడించి నమస్కారం పెడుతూ 'అవును' అని చెప్పారు మమతాపాఠక్.

తెల్లచీరలో, ముక్కుపైకి జారిన కళ్లద్దాలతో కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్ మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ముందు, రసాయనశాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నిలబడ్డారు.

'శవపరీక్షలో' అంటూ ఆమె వాదన మొదలుపెట్టారు. ''సరైన రసాయన విశ్లేషణ లేకుండా కాలిన గాయాలు, కరెంట్ షాక్ వల్ల కలిగిన గాయాల మధ్య తేడాను గుర్తించడం సాధ్యం కాదు'' అంటూ గొంతు జీరబోతున్నా స్థిరంగా చెప్పారు.

అయితే ''శవంపై కరెంట్ షాక్ గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం చేసిన డాక్టర్ చెప్పారు'' అని బెంచ్ మీదున్న న్యాయమూర్తి వివేక్ అగార్వాల్ అన్నారు.

కరెంట్ షాక్‌తో తన భర్తను హత్యచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 63 సంవత్సరాల ఆ రిటైర్డ్ లెక్చరర్, కాలిన గాయాల లక్షణాలను, ఆమ్లాలు, కణజాలాల ప్రతిచర్యలు ఎలా బహిర్గతం చేస్తాయో కోర్టుకు వివరించిన అరుదైన కేసు ఇది.

ఏప్రిల్‌లో కోర్టులో జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియో భారత్‌లోని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ, అనుమానం, దాంపత్య విభేదాల కారణంగా భర్తను హత్య చేశారనే ప్రాసిక్యూషన్‌ అభియోగాన్ని ఆమె వృత్తి నైపుణ్యానికి సంబంధించిన ఆత్మ విశ్వాసం మార్చలేకపోయింది.

రిటైర్డ్ ఫిజీషియన్‌ అయిన భర్త నీరజ్ పాఠక్‌ను హత్య చేశారనే అభియోగాన్ని సమర్థిస్తూ కిందటి నెలలో హైకోర్టు మమతా పాఠక్ అప్పీల్‌ను కొట్టివేసింది.

2021లో హత్యకు గురైన ఆమె భర్త నీరజ్ పాఠక్ కేసులో కింది కోర్టు ఆమెకు విధించిన జీవిత ఖైదు శిక్షను హైకోర్టు సమర్థించింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మమతా పాఠక్ కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మృతదేహం (ప్రతీకాత్మక చిత్రం)

మమతా పాఠక్ కోర్టులో తన వాదనలను స్వయంగా వినిపించారు. తన వాదనల్లో భాగంగా శవపరీక్ష నివేదికలోని లోపాలు, ఇంట్లోని విద్యుత్ రక్షణ వ్యవస్థ, ఎలక్ట్రో కెమికల్ సిద్ధాంతం గురించి కోర్టుకు వినిపించారు.

అయితే, కోర్టు మాత్రం పరిస్థితులు చూపుతున్న సాక్ష్యాలను (circumstantial evidence) పరిశీలించి, ఆమె భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై విద్యుత్ షాక్‌తో హత్యచేసినట్టు తేల్చింది.

ఇద్దరు పిల్లల తల్లి అయిన మమతా పాఠక్, కోర్టులో తన ముందున్న ఫైల్స్‌ను ఒకదాని తర్వాత ఒకటి పట్టుకుని తిరగేస్తూ, ఒక్కసారిగా ఉత్సాహంగా మాట్లాడడం మొదలుపెట్టారు.

"సర్, విద్యుత్ గాయాల్ని మరణానికి ముందు వచ్చాయా, చనిపోయిన తరువాత వచ్చాయా అనే విషయం తేల్చడం సాధ్యపడదు" అని ఆమె ఒక ఫోరెన్సిక్ పుస్తకంలో ఉన్న విషయం చెబుతూ తన వాదన వినిపించారు.

"ఆ డాక్టర్లు శవపరీక్షలో విద్యుత్ గాయమేనని ఎలా రాశారు?" అని ప్రశ్నించారు.

సూక్ష్మంగా చూస్తే విద్యుదాఘాతం వల్ల ఏర్పడిన గాయాలు చనిపోక ముందు, చనిపోయిన తర్వాత ఒకేలా కనిపిస్తాయి. దీని వల్ల ప్రామాణికంగా జరిపే పరీక్షల్లో ఫలితం తేలదని నిపుణులు చెప్పారు.

చర్మం మీద మార్పుల్ని నిశితంగా అధ్యయనం చేస్తేనే కాలిన గాయం మరణానికి ముందు జరిగిందా లేక తర్వాత జరిగిందా అనేది ‌తెలుస్తుందని ఒక పరిశోధనా పత్రం చెబుతోంది.

రసాయన చర్యలు, ఆకస్మిక మార్పుల గురించి ఆమె మాట్లాడుతున్న సమయంలో ప్రయోగశాలల్లో ప్రక్రియల గురించి న్యాయమూర్తి ఆమెను ప్రశ్నించారు.

మమత వివిధ ఆమ్లాల గురించి మాట్లాడుతూ, పోస్ట్‌ మార్టంలో సాధ్యం కానివి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ ఉపయోగించి నిర్థరించవచ్చని వివరించారు.

అలా వివరిస్తూనే ఆమె న్యాయమూర్తి వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆమె వెనుకున్న ముగ్గురు మహిళా న్యాయవాదులు నవ్వుతున్నారు.

కోర్టు హాలులో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, తాను జైలులో ఉన్న ఏడాది కాలంలో లా చదివానని చెప్పారు.

తన వద్ద ఉన్న ఫోరెన్సిక్ పుస్తకాల్లో స్టిక్కర్లు అంటించి ఉన్న పేజీల్ని తిరగేస్తూ అందులో అంశాలను వివరిస్తూ క్రైమ్ సీన్ పరిశీలించకపోవడం, అర్హత ఉన్న ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి రాకపోవడం గురించి ప్రస్తావించారు.

"2017 నుంచి 2022 వరకు మా ఇంటికి ఇన్సూరెన్స్ చేయించాం. ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన ఇన్‌స్పెక్షన్‌లో మా ఇంటికి విద్యుదాఘాతం వల్ల కాలిపోయే అవకాశం లేదని తేలింది" అని ఆమె చెప్పారు.

తన భర్తకు అధిక రక్తపోటు, గుండె జబ్బు ఉందని మమత కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

మమతా పాఠక్
ఫొటో క్యాప్షన్, కోర్టులో వాదన వినిపిస్తున్న మమతా పాఠక్

భర్త మరణానికి అసలు కారణం "వృద్ధాప్యం కారణంగా ధమనులలో కాల్షియం పెరగడం" అని వివరించిన ఆమె, ఆయన జారి పడటం వల్ల హెమటోమా వచ్చి ఉండవచ్చని, అయితే అది నిర్థరించేందుకు సీటీ స్కాన్ చేయలేదని కోర్టుకు చెప్పారు.

2021 ఏప్రిల్ 29న నీరజ్ పాఠక్ (65 ) తన ఇంట్లో చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.

కరెంట్ షాక్ వల్ల ఆయన చనిపోయి ఉండవచ్చని శవపరీక్షలో తేలింది. కొన్ని రోజుల తర్వాత, భర్తను హత్య చేశారనే అభియోగం కింద మమతను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్లగ్ అమర్చి ఉన్న 11 మీటర్ల వైరును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అలాగే ఆ ఇంట్లో నుంచి సీసీ ఫుటేజ్ కూడా తీసుకున్నారు.

పది నిద్ర మాత్రలున్న స్ట్రిప్‌లో ఆరింటిని పోలీసులు రికవర్ చేశారు.

పాఠక్ మృతదేహానికి మే1న శవ పరీక్ష నిర్వహించారు. శవపరీక్ష నిర్వహించడానికి 36 నుంచి 72 గంటల ముందు, కరెంట్ షాకివ్వడంతో గుండె ఆగిపోయి చనిపోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్‌ పేర్కొంది.

"నిద్ర మాత్రల స్ట్రిప్ మీద పోలీసులకు ఎలాంటి వేలి ముద్రలు లభించలేదు" అని మమత న్యాయమూర్తులకు చెప్పారు.

మమతా పాఠక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేరస్తురాలు ( ప్రతీకాత్మక చిత్రం)

కోర్టులో ఆమె వాదనలు పేలవంగా ఉండటంతో న్యాయమూర్తులు జస్టిస్ అగర్వాల్, జస్టిస్ దేవనారాయణ్ సిన్హా వాటితో ఏకీభవించలేదు.

మధ్యప్రదేశ్‌లో వ్యవసాయం, గ్రానైట్ క్వారీలు, చిన్న వ్యాపారాలకు గుర్తింపు పొందిన ఛతర్‌పూర్ అనే కరవు ప్రభావిత జిల్లాలో మమత, నీరజ్ పాఠక్ దాదాపు 40 ఏళ్లు మధ్య తరగతి జీవితాన్ని గడిపారు.

స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఆమె కెమిస్ట్రీ బోధించేవారు. జిల్లా ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేశారు నీరజ్ పాఠక్.

వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఒకరు విదేశాల్లో స్థిరపడితే మరొకరు ఆమెతో కలిసి ఉంటున్నారు. 39 ఏళ్లు ప్రభుత్వ వైద్యుడిగా పని చేసిన తర్వాత నీరజ్ పాఠక్ 2019లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఇంటి దగ్గరే క్లినిక్ పెట్టుకున్నారు.

ఈ సంఘటన కరోనా మహమ్మారి సమయంలో జరిగింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో నీరజ్‌ మొదటి అంతస్తుకు మారి విడిగా ఉండటం మొదలుపెట్టారు.

మమత, ఆమె కుమారుడు నితీశ్ కింది అంతస్తులో ఉండేవారు. రెండు అంతస్తులు కూడా గ్రౌండ్ ఫ్లోర్‌నుంచి నీరజ్ గది, ఓపెన్ గ్యాలరీకి, తన ప్రైవేటు క్లినిక్‌లో వెయిటింగ్‌హాల్ రెండు మెట్లమార్గాలు ఉండేవి. ఆ క్లినిక్‌లో మెడికల్ షాపు, ల్యాబ్‌లో ఆరుగురు సిబ్బంది పని చేస్తుండేవారు.

ఏప్రిల్ 29న తన భర్త నీరజ్ మంచంలో చలనం లేకుండా పడి ఉండటాన్ని మమత గుర్తించారని, అయితే మే 1 వరకు డాక్టర్‌కు కానీ పోలీసులకు కానీ సమాచారం అందించలేదని 97 పేజీల తీర్పులో కోర్టు పేర్కొంది.

అలా చేయకపోగా, తన పెద్ద కొడుకుని తీసుకుని, ఎలాంటి కారణం లేకుండా తమ ఊరికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాన్సీ తీసుకెళ్లారని, ఆదే రోజు సాయంత్రానికి తిరిగి వచ్చారని డ్రైవర్ చెప్పారు.

పాఠక్ మరణం గురించి పోలీసులకు సమాచారం అందించినప్పుడు ఆయన ఎలా చనిపోయారో తనకు తెలియని ఆమె అన్నారు.

మమతా పాఠక్
ఫొటో క్యాప్షన్, మమతా పాఠక్ ( ఫైల్ ఫోటో)

ఆమె నిశబ్ధం వెనుక ఒక సమస్యాత్మక వివాహం దాగి ఉంది. వారి మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వైవాహిక విభేదాలను న్యాయమూర్తులు ప్రధానంగా ప్రస్తావించారు.

వాళ్లిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారని, తన భర్త తనకు ద్రోహం చేశారని మమత అనుమానించారని న్యాయమూర్తులు అన్నారు.

ఆయన చనిపోయిన రోజు ఉదయం నీరజ్ తన సహాయకుడిని పిలిచారు. మమత తనను ‘వేధిస్తోంద’ని, బాత్‌రూమ్‌లో పెట్టి తాళం వేసిందని, రోజులపాటు అన్నం కూడా పెట్టలేదని, తీవ్రంగా కొట్టిందని తన సహాయకుడికి చెప్పారు నీరజ్ పాఠక్.

ఆమె తన వద్ద నుంచి ఏటీఎం కార్డులు, కారు తాళం, బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు, డబ్బు తీసుకుందని ఆయన ఆరోపించారు.

సాయం కోసం వేడుకోవడంతో నీరజ్ కుమారుడు తన స్నేహితుడిని సంప్రదించి పోలీసులకు సమాచారం అందించారు. నీరజ్ కుమారుడి స్నేహితుడు తాను నీరజ్ పాఠక్‌ను "మమత కస్టడీ" నుంచి విడిపించానని చెప్పారు.

కొంతకాలం నుంచి వాళ్లిద్దరు వేర్వేరుగా జీవించడం కోర్టు సందేహాలకు బలం చేకూర్చింది.

తాను ఓ 'మంచి తల్లిని' అని చెప్పడానికి మమత తన పిల్లలు బహూకరించిన బర్త్‌డే కార్డును చూపారు. అలాగే భర్తకు అన్నం తినిపిస్తున్న ఫోటోలు, కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫోటోలను చూపారు.

కానీ దీనికి న్యాయమూర్తులు చలించలేదు. ఇలాంటి ఆప్యాయతలు ఉద్దేశాలను చెరిపివేయలేవని, 'ప్రేమమూర్తి అయిన తల్లి కూడా అనుమానపు భార్య' కావచ్చని న్యాయమూర్తులు అన్నారు.

మమతా పాఠక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేరం-శిక్ష ( ప్రతీకాత్మక చిత్రం)

కోర్టులో యాభై నిమిషాలపాటు వాదనలు వినిపించారు మమత. కోర్టు అనుమానాలను తప్పుబడుతూ, తనను తాను సమర్థించున్న ఆమె, ఒక దశలో సంయమనం కోల్పోయారు.

‘‘నాకో విషయం తెలుసు. నేను ఆయన్ని చంపలేదు. నేనిక దీన్ని భరించలేను’’ అని వణుకుతున్న గొంతుతో అన్నారు.

అయితే, న్యాయమూర్తి అగర్వాల్ కోర్టులోని ఉద్విగ్న వాతావరణాన్ని తేలికపరుస్తూ ‘‘ మీకు ఇలా యాభై నిమిషాలపాటు కాలేజీలో క్లాసులు తీసుకోవడం అలవాటే కదా. దీనికి కూడా మీరు అలవాటుపడాలి’’ అన్నారు.

''లేదుసార్...కేవలం నలభై నిమిషాలే, ఎందుకంటే వాళ్లు చిన్న పిల్లలు'' అని మమత చెప్పారు.

''కాలేజీలో చిన్నపిల్లలా ? మీ హోదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకుంటా'' అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

''కానీ వాళ్లు పిల్లలే సార్'' అని ఆమె సమాధానం చెప్పారు.

''ఇలాంటి కథలు మాకు చెప్పకండి'' అంటూ న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు.

మమత కేవలం ఓ ప్రతివాదిగానే కాకుండా, సైన్స్ ద్వారా తాను నిర్దోషినని నిరూపించేందుకు కోర్టు గదిని ఓ కెమిస్ట్రీ ప్రయోగశాలగా మార్చారు.

కానీ..చివరకు నివురుగప్పిన నిజాలు ఆమె పాఠాలకన్నా బలమైనవిగా తేలాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)