పావ్ భాజీ పట్టించింది, కోట్ల రూపాయల బంగారం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

కర్ణాటక, కలబురగి, గుల్బర్గా, దోపిడీ, దొంగతనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

ఫరూఖ్ అహ్మద్ మాలిక్ ఓ బంగారు వ్యాపారి. ఆయనకు రూ.40 లక్షల అప్పులు ఉన్నాయి, అవి తీర్చాల్సి వచ్చింది.

అందుకోసం ఆయనో పథకం రచించి, దానిని పక్కాగా అమలు చేశారు.

అయితే, పావ్ భాజీ ఆయనతో పాటు దోపిడీకి సహకరించిన దొంగలను కూడా పట్టించింది.

అప్పులు తీర్చడం కోసం, మరో బంగారం వ్యాపారిని దోచుకోవడానికి ఫరూఖ్ అహ్మద్ ప్లాన్ చేశారని పోలీసులు చెప్పారు.

అసలు ఆ పావ్ భాజీకీ, ఈ దోపిడీకీ సంబంధమేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కర్ణాటక, కలబురగి, గుల్బర్గా, దోపిడీ, దొంగతనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దోపిడీ ఎలా చేశారంటే..

ప్లాన్‌లో భాగంగా, ఫరూఖ్ అహ్మద్ మాలిక్, తనతో కలిపి ఐదుగురు సభ్యుల ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సహచరులు కర్ణాటకలోని కలబురగి(గతంలో గుల్బర్గా) నగరంలోని ముత్తుల్లా మాలిక్ నగల దుకాణాన్ని దోచుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ ముఠాలోని నలుగురు ముఖాలను పూర్తిగా కప్పుకుని దుకాణంలోకి ప్రవేశించారు. ముత్తుల్లా మాలిక్‌ను భయపెట్టడానికి వారు పిస్టల్ మాదిరిగా కనిపించే లైటర్‌ను ఉపయోగించారు. ముత్తుల్లాను కట్టేసి, దుకాణంలోని సీసీటీవీ కెమెరాలను ఆపేసి, సుమారు రూ. 2 కోట్ల 15 లక్షల విలువైన బంగారం, ఆభరణాలను దోచుకెళ్లారు.

జూలై 11న మధ్యాహ్నం 12.15 గంటలకు నలుగురు వ్యక్తులు తన దుకాణంలోకి చొరబడ్డారని, వారిలో ఒకరు తన తలపై తుపాకీ గురిపెట్టారని, మరొకరు మెడపై కత్తిపెట్టి బెదిరించారని, మూడో వ్యక్తి సీసీటీవీ వైర్లను కత్తిరించారని ముత్తుల్లా మాలిక్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. లాకర్ తాళాలు ఇవ్వాలని బెదిరించారని, చేతులు, కాళ్లు కట్టేసి, నోటిలో గుడ్డను పెట్టి, టేప్ వేశారని ముత్తుల్తా తెలిపారు.

ముత్తుల్లా ఫిర్యాదు ఆధారంగా, దోపిడీ దొంగల కోసం కలబురగి పోలీసులు ఐదు బృందాలతో గాలించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. దుకాణంలోకి నలుగురే ప్రవేశించినా, దుకాణం వెలుపల మొత్తం ఐదుగురు వ్యక్తులున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు.

కర్ణాటక, కలబురగి, గుల్బర్గా, దోపిడీ, దొంగతనం

ఫొటో సోర్స్, police in kalburagi

ఫొటో క్యాప్షన్, నిందితుల నుంచి 2.8 కిలోల బంగారం, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎలా పట్టుకున్నారు?

ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించినప్పుడు, ఐదో వ్యక్తి పావ్ భాజీ దుకాణం వద్దకు వెళ్లడం కనిపించింది.

ఈ ఐదో వ్యక్తే మొత్తం కేసుకు ప్రధాన సూత్రధారి ఫరూఖ్ అహ్మద్ మాలిక్. దుకాణంలోకి ప్రవేశించిన మిగతా నలుగురి మొబైల్ నంబర్లపై ఆరా తీయడంతో వారి వివరాలూ లభ్యమయ్యాయి.

నలుగురిలో ఒకరైన అయోధ్య ప్రసాద్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ నివాసి అని, ముంబయిలో ఫుట్‌పాత్‌పై బట్టలు అమ్ముతుంటారని దర్యాప్తులో తేలింది. రెండో వ్యక్తి సుహైల్ మొబైల్ దొంగతనం వంటి చిన్నచిన్న నేరాలకు పాల్పడుతూ ముంబయిలో ఉంటున్నారు. మూడో వ్యక్తి అయిన అర్బాజ్, నాలుగో వ్యక్తి సాజిద్ స్థానికులు. ఇక ఫరూఖ్ మాలిక్ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు, కలబురగిలో వ్యాపారం చేస్తుంటారు.

కర్ణాటక, కలబురగి, గుల్బర్గా, దోపిడీ, దొంగతనం

ఫొటో సోర్స్, police in kalburagi

ఫొటో క్యాప్షన్, ఫరూఖ్ మాలిక్ ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో ఫరూఖ్ మాలిక్ ఆభరణాల దుకాణంలోకి ప్రవేశించలేదని పోలీసులు తెలిపారు. దోపిడీ సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఐదో వ్యక్తి ఆయనే. మిగిలిన ముఠా సభ్యులను పట్టుకోవడంలో పోలీసులకు కీలక ఆధారాలు అందించిందీ కూడా ఆయనే.

"సంఘటన జరిగిన సమయంలో రెగ్యులర్ ఫోన్ కాకుండా వేరొక మొబైల్ ఫోన్ వాడిన ఫరూఖ్ మాలిక్, పావ్ భాజీకి డబ్బులు చెల్లించడానికి మాత్రం మరో నంబర్ వినియోగించారు. ఇదే మాకు కీలకమైన క్లూగా మారింది" అని కలబురగి పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎస్. శరణప్ప బీబీసీతో చెప్పారు.

"ఈ దోపిడీ నలుగురు చేసినట్లు తేలింది. ఆ నలుగురు దుకాణంలోకి ప్రవేశించడం, బయటకు వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఐదో వ్యక్తి ఆభరణాల దుకాణంలోకి ప్రవేశించలేదు, అతనే ఫరూఖ్ మాలిక్ " అని కమిషనర్ తెలిపారు.

చివర్లో మరో ట్విస్ట్

నిందితుల నుంచి మొత్తం 2.8 కిలోల బంగారం, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, ముత్తుల్లా ఫిర్యాదు ప్రకారం, చోరీ అయినది 850 గ్రాముల బంగారమే. దీంతో, ముత్తుల్లా మాలిక్ నుంచి మరో కథ బయటకు వచ్చింది.

పోలీసులు ముత్తుల్లా అకౌంట్ బుక్స్ తనిఖీ చేసినప్పుడు, లెక్కలు సరిపోలలేదు. తన వ్యాపార పత్రాలలో రెండు కిలోల బంగారానికి ఎలాంటి లెక్కలూ చూపలేదనే ఆరోపణలతో పోలీసులు ముత్తుల్లాపై కూడా కేసు నమోదు చేశారు.

కాగా, నలుగురి ముఠా అంతర్రాష్ట్ర సంబంధాలను కలిగి ఉందని, వారిపై 10 నుంచి 15 దోపిడీ కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)