అలాస్కా: ట్రంప్, పుతిన్ భేటీ కానున్న ఈ రాష్ట్రాన్ని రష్యా, అమెరికాకు ఎందుకు అమ్మేసింది?

అమెరికా, రష్యా, డోనల్డ్ ట్రంప్, పుతిన్, అలాస్కా, యాంకరేజ్, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం అమెరికాలో భాగమైన అలాస్కా ఒకప్పుడు రష్యన్ భూభాగం.
    • రచయిత, మేడలిన్ హాల్పర్ట్ , క్రిస్టల్ హేయిస్, వలీద్ బర్డన్, మరియా జకారో
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అలాస్కా రాష్ట్రంలోని యాంకరేజ్ నగరంలో ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం కానున్నారు.

ఈ రాష్ట్రం ఒకనాడు రష్యాలో భాగం.

తరువాత దీనిని అమెరికాకు విక్రయించింది.

ఈ కొనుగోలును అమెరికా ప్రజలు అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు.

దీన్నొక మూర్ఖపు చర్యగానూ విమర్శించారు.

అసలీ రాష్ట్రాన్ని రష్యా అమెరికాకు ఎందుకు విక్రయించింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, రష్యా, డోనల్డ్ ట్రంప్, పుతిన్, అలాస్కా, యాంకరేజ్, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి అలాస్కాను కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా విదేశాంగమంత్రి సేవర్డ్

అలాస్కా అమెరికా చేతికెలా వచ్చింది?

రష్యాను పాలిస్తున్న జార్ చక్రవర్తి 1867లో అలాస్కాను అమెరికాకు 7.2 మిలియన్ డాలర్లకు అమ్మేశారు. ఇది దాదాపు 63 కోట్ల రూపాయలకు సమానం.

అమెరికా, యూరేషియా ఖండాలు కలిసినట్టు ఉండే ప్రాంతాన్నిబేరింగ్ జలసంధి వేరు చేస్తున్నచోట అలాస్కా ఉంది

అమెరికాలో అతి పెద్ద రాష్ట్రమైన అలాస్కాను సందర్శిస్తున్న తొలి రష్యన్ అధ్యక్షుడు పుతిన్. విలువైన ఖనిజాలకు కేంద్రమైన అలాస్కా సైనిక పరంగా వ్యూహాత్మక ప్రాంతం.

ఈ ప్రాంతాన్ని రష్యా నుంచి అమెరికా చాలా చౌకగా కొనుగోలు చేసిందని చరిత్రకారులు అభివర్ణించారు. ఈ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలను నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి హెచ్ .సెవార్డ్ పూర్తి చేశారు.

అలాస్కాను కొనుగోలు చేయడం మూర్ఖత్వమని అప్పట్లో అమెరికన్లు భావించారు. అందుకే ఈ ఒప్పందాన్ని "సెవార్డ్స్ ఫాలీ"( సెవార్డ్స్ మూర్ఖత్వం) అని అభివర్ణించారు.

అలాస్కాలో విస్తృత భూభాగం ఉన్నా, అదంతా ఎప్పుడూ మంచుతో ఘనీభవించి ఉంటుంది. ఇక్కడ అగ్ని పర్వతాలు, భూకంపాలు ఎక్కువ. జనాభా చాలా తక్కువ. ఇలాంటి ప్రాంతాన్ని 7.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం మూర్ఖత్వం అనేది అమెరికన్ల అభిప్రాయం

అలాస్కా నుంచి 1867లో రష్యన్ సేనలు వెళ్లిపోయిన తరువాత మళ్లీ ఇన్నాళ్లకు, రష్యా అధ్యక్షుడు ఇక్కడ అడుగు పెడుతున్నారు.

అమెరికా, రష్యా, డోనల్డ్ ట్రంప్, పుతిన్, అలాస్కా, యాంకరేజ్, యుక్రెయిన్
ఫొటో క్యాప్షన్, 1959లో అలాస్కా అమెరికాలో భాగమైంది.

అలాస్కాను కనిపెట్టిందెవరు?

డెన్మార్క్ అన్వేషకుడు విటస్ బేరింగ్ బేరింగ్ జలసంధి వైపు ప్రయాణించినప్పుడు అలాస్కా ప్రాంతాన్ని గుర్తించారు. అలా అలాస్కా గురించి పశ్చిమ దేశాలకు తెలిసింది. విటస్ ఆ ప్రాంతాన్ని గుర్తించే నాటికే అక్కడ ఆదివాసీతెగల ప్రజలు కొన్నేళ్లుగా జీవిస్తున్నారు.

రష్యన్ జార్ చక్రవర్తి పాల్1 సముద్రపు ఒటర్‌ల( సముద్రాల్లో జీవించే క్షీరదం) చర్మంతో వ్యాపారం చేసేందుకు 1799లో రష్యన్ అమెరికన్ కంపెనీని స్థాపించారు.

ఈ కంపెనీ తమ ఉత్పత్తుల్ని అలాస్కా దక్షిణ తీరంలోని కోడియాక్ వద్ద పడవల్లో ఎగుమతి చేయడం మొదలు పెట్టింది. వాణిజ్యంగా వ్యూహాత్మకం కావడంతో తర్వాతి కాలంలో రష్యా అలాస్కాను వలస రాజ్యంగా మార్చుకుంది.

అయితే ఎక్కువగా వేటాడంతో సీల్, ఒటర్ జనాభా తగ్గిపోయింది. దీంతో రష్యన్ల కాలనీ ఆర్థికంగా దివాలా తీసింది. 1853-56 మధ్య జరిగిన క్రైమియన్ యుద్ధంలో ఓటమితో రష్యా ఆర్థికంగా నష్టాల్లో చిక్కుకోవడంతో అలాస్కాను కాపాడుకోవడం కష్టమైంది.

దీంతో అలాస్కాను అమ్మేయాలని రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ 2 నిర్ణయించారు. అలాస్కాను విక్రయించేందుకు 1859లోనే అమెరికా రష్యా మధ్య సంప్రదింపులు మొదలైనా అమెరికాలో పౌర విప్లవం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది.

1867లో ఎకరాకు 2 సెంట్ల చొప్పున మొత్తం 586,412 చదరపు మైళ్ల భూభాగాన్ని 7.2మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రతినిధి సేవర్డ్ రష్యా దౌత్యవేత్త ఎడ్వర్డ్ డి స్టియోక్ మధ్య ఒప్పందం కుదిరింది. 1867 ఏప్రిల్ 9న ఈ ఒప్పందాన్ని అమెరికన్ సెనేట్ ఆమోదించింది. అదే ఏడాది అక్టోబర్ 18న అలాస్కా అమెరికా పరమైంది.

దీంతో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న అనేక మంది రష్యన్లు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

అలాస్కా అమెరికా స్వాధీనమైనప్పటికీ, ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ పెద్దగా పెట్టుబడులు పెట్టలేదు.

అయితే 1896లో పశ్చిమ అలాస్కాలో బంగారాన్ని అన్వేషించడానికి వేల మంది ఈ ప్రాంతానికి వలస వచ్చారు. దీంతో అలాస్కాలో ఖనిజ వనరుల గురించి ప్రపంచానికి తెలిసింది. 1959లో అలాస్కా అధికారికంగా అమెరికా 49వ రాష్ట్రంగా మారింది.

అలాస్కాలో 12వేలకు పైగా నదులు, సరస్సులు ఉన్నాయి. అలాస్కా రాజధాని జునేయిని చేరుకోవాలంటే బోట్ లేదా విమాన మార్గంలో ప్రయాణించాలి .రోడ్డు మార్గం లేదు.

అలాస్కాలోని యాంకరేజ్ నగరంలోని లేక్‌హుడ్ ప్రపంచంలోనే రద్దీగా ఉండే సీప్లేన్ కేంద్రం. ప్రతీ రోజూ 200 విమానాలు ఇక్కడ దిగుతాయి.

ఈ నగరంలోనే పుతిన్ ట్రంప్ భేటీ కానున్నారు.

అమెరికా, రష్యా, డోనల్డ్ ట్రంప్, పుతిన్, అలాస్కా, యాంకరేజ్, యుక్రెయిన్

ఫొటో సోర్స్, MIKHAIL KLIMENTYEV/SPUTNIK/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2019లో అమెరికా, రష్యా అధ్యక్షుడు భేటీ అయ్యారు.

ట్రంప్,పుతిన్ భేటీ అలస్కాలోనే ఎందుకు?

అమెరికా, రష్యా ఇరుగు పొరుగు దేశాలని బేరింగ్ జలసంధి రెండు దేశాలను వేరు చేసిందని రష్యా అధ్యక్షుడి సలహాదారు యూరీ ఉషకోవ్ చెప్పారు.

"బేరింగ్ జలసంధిని దాటి విమానంలో ప్రయాణించడం, చాలా కాలం తర్వాత రెండు దేశాల అధ్యక్షులు శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం కీలకమైనది" అని ఉషకోవ్ అన్నారు.

ట్రంప్, పుతిన్ భేటీకి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం ప్రతీకాత్మకంగా కూడా ముఖ్యమైనది.

అలాస్కా రష్యాకు దగ్గరగా ఉండటమే కాకుండా, ట్రంప్ పుతిన్ భేటీలో సానుకూల ఒప్పందం కుదిరితే యూరప్ దేశాలకు రష్యాను దగ్గర చేసే మార్గంగా మారవచ్చు.

"మా దౌత్య బృందం 55 కిలోమీటర్లున్న బేరింగ్ జలసంధి దాటి అమెరికా చేరుకోవచ్చు" అని రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూరీ ఉషకోవ్ ఆగస్టు 9న విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

"అలాస్కా ప్రపంచంలో వ్యూహాత్మక ప్రాంతం. ఓ వైపు నార్త్ అమెరికా మరోవైపు ఆసియా దక్షిణాన ఆర్కిటిక్, ఉత్తరాన పసిఫిక్ మహా సముద్రం మధ్య క్రాస్‌రోడ్స్‌లో ఉంది. అమెరికా, రష్యా అధ్యక్షులను ఇక్కడకు స్వాగతిస్తున్నాను" అని అలాస్కా గవర్నర్ మైక్ డున్‌లెవీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

అమెరికా, రష్యా, డోనల్డ్ ట్రంప్, పుతిన్, అలాస్కా, యాంకరేజ్, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలో రోడ్డు మార్గం లేని ఏకైక రాష్ట్ర రాజధాని నగరం జెనుయి అలాస్కా రాష్ట్ర రాజధాని

యాంకరేజ్‌లో సమావేశం

అలాస్కాలోని అతిపెద్ద నగరమైన యాంకరేజ్‌లో ఈ సమావేశం జరుగుతుందని వైట్ హౌస్ మంగళవారం ధృవీకరించింది.

"అనేక అంశాల వల్ల ఈ ప్రాంతం గుర్తింపు పొందింది" ద్వైపాక్షిక సమావేశాన్ని ప్రకటిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశం అలాస్కాలోని అతిపెద్ద నగరంలో జరుగుతుందని ఆయన చెప్పలేదు.

అలాస్కాలోని అతి పెద్ద సైనిక స్థావరం "ఎల్మెండోర్ఫ్-రిచర్డ్సన్‌" రెండు దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇస్తోంది. 64,000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ సైనిక స్థావరం ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికా సైనిక సంసిద్ధతకు ముఖ్యమైన కేంద్రం.

ఇక అలాస్కా చివరిసారిగా 2021 మార్చిలో అమెరికా చైనా దౌత్య కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఆ సమయంలో ఇదే యాంకరేజ్‌లలో జో బైడెన్ దౌత్య, జాతీయ భద్రత బృందం తమ చైనీస్ సహచరులతో సమావేశమైంది.

ఈ సమావేశంలో అమెరికా గురించి చైనా "అహంకారం, కపటత్వం" అని ఆరోపించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)