‘పుతిన్‌తో సమావేశం ట్రంప్ ప్రతిష్టను దెబ్బతీసిందా’?

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌లో కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాస్కా నుంచి వెనుదిరిగారు.
సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. కానీ మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వకుండానే వెళ్లిపోయారు.
ట్రంప్, పుతిన్ సమావేశం సందర్భంగా అక్కడ ఉన్న ముగ్గురు బీబీసీ ప్రతినిధులు.. ఈ చర్చలతో అమెరికా, రష్యా నేతలకు ఎలాంటి ప్రయోజనం కలిగింది.. యుక్రెయిన్ యుద్ధంలో తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటనేది విశ్లేషించారు.


ఫొటో సోర్స్, Reuters
‘ట్రంప్‌కు అవమానకరమా?’
'అనేక గంటల చర్చల తర్వాత కూడా ఒప్పందం లేదు, కాల్పుల విరమణ లేదు... అసలు చెప్పుకోదగ్గ ఫలితమేమీ లేదు' అని బీబీసీ నార్త్ అమెరికా కరస్పాండెంట్ ఆంథోని జర్చర్ అభిప్రాయపడ్డారు.
‘చర్చల్లో తాను, పుతిన్ గొప్ప పురోగతి సాధించామని ట్రంప్ చెప్పారు, కానీ ఆ పురోగతి ఏంటనే విషయంలో తగిన వివరాలు అందించకుండా ప్రపంచం ఊహకు వదిలేశారు.
మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోతూ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు అని మాత్రమే ట్రంప్ చెప్పారు.
ఎంతో దూరం ప్రయాణించి అలాస్కాలో చర్చల కోసం వచ్చిన ట్రంప్ ఇలాంటి అస్పష్ట ప్రకటనలకే పరిమితమయ్యారు. అయినప్పటికీ భవిష్యత్ చర్చలపై ప్రభావం చూపగల ఎలాంటి రాయితీలు, ఒప్పందాలను ట్రంప్ ప్రతిపాదించకపోవడం యుక్రెయిన్ అధికారులకు, యూరోపియన్ మిత్రదేశాలకు ఉపశమనం కలిగించింది.
శాంతి నెలకొల్పే, ఒప్పందాలు కుదిర్చేవ్యక్తిగా తనను తాను చెప్పుకునే ట్రంప్‌కు అలాస్కా సమావేశంలో ఆ రెండూ జరగనట్టు కనిపిస్తోంది.
తర్వాతి సమావేశం మాస్కోలో జరగాలన్న పుతిన్ సరదా వ్యాఖ్య తప్ప యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ పాల్గొనేలా భవిష్యత్తులో సమావేశం జరుగుతుందనేదానిపైనా ఎలాంటి సంకేతాలు లేవు.
యుక్రెయిన్, రష్యాతో పోలిస్తే ఈ చర్చల ఫలితం వల్ల ట్రంప్‌కు కలిగే నష్టం పెద్దగా లేకపోయినప్పటికీ, ఈ సమావేశం విఫలమవడానికి 25శాతం అవకాశం మాత్రమే ఉందని ఇచ్చిన హామీ దృష్ట్యా ఈ పరిణామం స్వదేశంలోనూ, అంతర్జాతీయంగానూ ట్రంప్ ప్రతిష్టను దెబ్బతీస్తుంది.
పత్రికా సమావేశం మొదలుకాగనే పుతిన్ మాట్లాడుతుంటే ట్రంప్ మౌనంగా నిలబడాల్సిరావడం ఆయనకు అవమానంలాంటిది.
వైట్ హౌస్‌లో సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ఆధిపత్యమే ఉంటుంది. అలాస్కా అమెరికా భూభాగం అయినప్పటికీ అక్కడ ట్రంప్‌తో పోలిస్తే పుతినే సౌకర్యవంతంగా ఉన్నట్టు కనిపించింది.
అన్నిటికన్నా పెద్ద ప్రశ్న, విలేకరులు అడగలేకపోయిన ప్రశ్న ఏంటంటే కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తామని చేసిన హెచ్చరికలపై ట్రంప్ నిర్ణయం తీసుకుంటారా? అని..
అలాస్కా నుంచి బయలుదేరేముందు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా రెండు, మూడు వారాల్లో నిర్ణయం తీసుకోవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా సిద్ధంగా లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని గతంలో చెప్పిన ట్రంప్ సమావేశం తర్వాత ఇలా అస్పష్టంగా వ్యాఖ్యలు చేయడం మరిన్ని సందేహాలు కలిగిస్తోంది'' అని సమావేశ ఫలితాలను విశ్లేషించారు ఆంథోని జర్చర్.

ఫొటో సోర్స్, Reuters
‘పుతిన్ పైచేయి సాధించారా’
‘ప్రశ్నలేమీ లేనప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడూ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. పుతిన్, ట్రంప్ తమ ప్రకటనలు చేసిన వెంటనే మీడియా అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలివ్వకుండా వెళ్లిపోవడం అక్కడ అమితాశ్చర్యం కలిగించింది' అని బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజెన్‌బర్గ్ విశ్లేషించారు.
''రష్యా ప్రతినిధుల బృందం కూడా ఎలాంటి సమాధానాలివ్వకుండానే వెళ్లిపోయింది.
యుక్రెయిన్‌లో యుద్ధంపై పుతిన్, ట్రంప్ మధ్య ఇప్పటికీ తీవ్ర భేదాభిప్రాయం ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
కాల్పుల విరమణ కోసం రష్యాపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ట్రంప్‌కు కావాల్సింది పుతిన్ చేయడం లేదు.
చర్చలకు ముందు వాతావరణం భిన్నంగా ఉంది. పుతిన్‌ను ట్రంప్ రెడ్ కార్పెట్‌తో స్వాగతించారు. ఆయన్ను తమ గౌరవనీయ అతిథిగా చూశారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి చెందిన నేతతో స్టేజ్ పంచుకున్న పుతిన్‌ను గమనిస్తే, సమావేశంలో పైచేయి సాధించినట్టు కనిపించింది.
మరి జరిగినదానిపై ట్రంప్ ఎలా స్పందిస్తారు? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌ను ట్రంప్ ఒప్పించలేకపోయారు.
కాల్పుల విరమణను మాస్కో నిర్లక్ష్యం చేస్తే అల్టిమేటమ్‌లు, డెడ్‌లైన్లు, మరిన్ని ఆంక్షల హెచ్చరికలతో కొన్నిరోజుల క్రితం వరకు రష్యాను బెదిరించారు ట్రంప్.
కానీ ఆయన దాన్ని పాటించలేదు. మరి పాటిస్తారా?'' అని పుతిన్, ట్రంప్ సమావేశాన్ని విశ్లేషించారు బీబీసీ రష్యా ఎడిటర్.

ఫొటో సోర్స్, Getty Images
‘యుక్రెయిన్‌కు ఉపశమనం.. అంతే స్థాయిలో భయం’
యుక్రెయిన్ భూభాగాన్ని కోల్పోయేలా ఎలాంటి ఒప్పందం కుదరకపోవడం కీయెవ్‌కు ఉపశమనం కలిగించిందని బీబీసీ మోనిటరింగ్ రష్యా ఎడిటర్ విటలియ్ షెవ్‌చెంకో అన్నారు.
‘‘రష్యాతో తమ కీలక ఒప్పందాలన్నింటికీ బ్రేక్ పడిందని కూడా యుక్రెయిన్ ప్రజలకు తెలుసు. అయినప్పటికీ ట్రంప్, పుతిన్ సమావేశం తరువాత ఏమన్నా ప్రకటన చేస్తేనే వారు సందేహాలతో ఉండేవారు.
అయితే సంఘర్షణ మూల కారణాల గురించే పుతిన్ ప్రస్తావించడం యుక్రెయినియన్లకు ఆందోళన కలిగించింది. యుక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఉండకూడదన్నదే ప్రత్యేక సైనిక చర్య లక్ష్యం. పుతిన్ దృష్టి దానిపైనే ఉండడం కీయెవ్‌ను కలవరపెడుతోంది.
పుతిన్ మనసు మార్చేందుకు పాశ్చాత్య దేశాలు మూడున్నరేళ్లగా చేస్తున్న ప్రయత్నాలతో పాటు చివరకు అలాస్కా సమావేశం కూడా విఫలమైంది.
తర్వాత ఏం జరుగుతుంది? రష్యా దాడులు అలాగే కొనసాగిస్తుందా? అన్నదానిపై నెలకొన్న అనిశ్చితి ఆందోళన కలిగిస్తోంది.
గత కొన్ని నెలలుగా పాశ్చాత్యదేశాలు వరుసగా ఎన్ని గడువులు పెట్టినా, బెదిరింపులు చేసినా ఫలితం కనిపించలేదు. పుతిన్ తన దాడులు కొనసాగించడానికి అందిన ఆహ్వానంగా యుక్రెయిన్ ప్రజలు దీన్ని భావిస్తున్నారు. యాంకరేజ్ సమావేశంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడాన్ని కూడా వారు అదే కోణంలో చూడొచ్చు'' అని విటలియ్ విశ్లేషించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














