లార్డ్ మౌంట్ బాటన్: భారతదేశపు చివరి వైస్రాయ్ హత్య ఎలా జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎప్పటికైనా తాను ముసలివాడిని అవుతానని లార్డ్ మౌంట్ బాటన్ ఎప్పుడూ అనుకునే వారు కాదు. జీవితకాలంలో కొద్దిపాటి జలుబు తప్ప ఆయన మరే ఆరోగ్య సమస్యతోనూ బాధపడలేదు.
బ్రాడ్‌ల్యాండ్‌లో ఉన్నప్పుడు ఉదయం రెండు గంటల పాటు గుర్రపు స్వారీ చేసేవారు. అప్పటికి ఆయన వయసు 70 ఏళ్లు.
జీవిత చరమాంకంలో, మునుపటిలా చురుగ్గా లేకపోవడంతో, ఆయన తనకు ఇష్టమైన పోలో ఆట కూడా ఆడటం మానేశారు.
అలసిపోయినప్పుడు, విసుగ్గా అనిపించినప్పుడు ఆయన తరచుగా నిద్రపోతూ కనిపించేవారు. కానీ అప్పటికి కూడా జీవితాన్ని బాగా గడపాలనే ఉత్సాహం ఆయనలో ఏమాత్రం తగ్గలేదు.
మౌంట్ బాటన్ కుటుంబానికి బాగా ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రతి క్రిస్మస్‌కు తన కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లను బ్రాడ్‌ల్యాండ్‌లో కలుసుకునేవారు.
ఈస్టర్‌కు వారంతా బ్రబౌర్న్, వేసవి వస్తే ఐర్లాండ్‌లోని క్లాసీబాన్‌లో గడిపారు.
''మౌంట్ బాటన్ తన మనవళ్ల స్నేహితులు, వారి ప్రేమలు, జీవితాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవారు'' అని బ్రియాన్ హోయ్ తన 'మౌంట్ బాటన్: ది ప్రైవేట్ స్టోరీ' అనే పుస్తకంలో రాశారు.
''ఆయన తన కుటుంబంలోని ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారని, కానీ ఆయనపై ప్రేమ, గౌరవం ఇప్పటికీ ఉన్నాయని...ఆయన మనవడి స్నేహితురాళ్లలో ఒకరు చెప్పారు’’ అని ఆ పుస్తకంలో ప్రస్తావించారు.
''ఆయనతో కూర్చోవడం సరదాగా ఉండేది. చాలా సరసాలాడేవారు. కానీ ఎవరికీ అది ఇబ్బందిగా ఉండేది కాదు'' అని ఆమె చెప్పారు.
పిల్లలతో ఆయనకు అనుబంధం ఉండటానికి ఒక కారణం ఆయన స్వభావమేనంటారామె. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం.
''అద్భుతమైన హాస్య ధోరణి ఉండేది. మాతో పాటు కూర్చొని చార్లీ చాప్లిన్ సినిమాలు చూసేవారు. ఆయన భూమి మీద ఉన్నంతవరకూ నవ్వుతూనే ఉన్నారు'' అని ఆయన మనవడు మైఖేల్ జాన్ చెప్పారు.
''ఆ సినిమాలు అంతకుముందు అనేకసార్లు చూశారు. లారెల్, హార్డీ సినిమాలు కూడా ఆయనకు చాలా ఇష్టం'' అని ఆయన వెల్లడించారు.


ఫొటో సోర్స్, Getty Images
ఐఆర్ఏ టార్గెట్‌గా మౌంట్ బాటన్....
పదవీ విరమణ తర్వాత మౌంట్ బాటన్ సాధారణ జీవితాన్నే గడుపుతున్నప్పటికీ, ఆయనకు ఏదో ఒక విధంగా ముప్పు ఉందని ప్రభుత్వానికి తెలుసు.
1971 సంవత్సరంలో ఆయన భద్రత కోసం 12 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది.
తన జీవిత చరిత్ర రచయిత ఫిలిప్ జీగ్లర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌంట్ బాటన్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.
''ఐఆర్ఏ నన్ను కిడ్నాప్ చేసి, నార్తర్న్ ఐర్లాండ్‌లో జైలులోనున్న తమ సహచరులను విడిపించడానికి ఉపయోగించుకుంటుందని ప్రభుత్వం భయపడుతోంది'' అని మౌంట్ బాటన్ చెప్పారు.
''ఐఆర్ఏ శిబిరంపై దాడి చేసినప్పుడు, హతమార్చడానికి ఐఆర్ఏ లక్ష్యంగా చేసుకున్న 50 మంది జాబితా అక్కడ లభించింది'' అని ఆండ్రూ లూనీ తన పుస్తకం 'ది మౌంట్ బాటన్స్: దేర్ లైవ్స్ అండ్ లవ్స్'లో రాశారు.
ఐఆర్ఏ అంటే ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ.
''1976 ఆగస్టులో మౌంట్ బాటన్‌ను హతమార్చడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. సముద్రంపైనున్న ప్రతికూల పరిస్థితుల వల్ల ఐఆర్ఏ షార్ప్ షూటర్ ఆయనను సరిగా షూట్ చేయలేకపోయారు'' అని రచయిత ఆండ్రూ లూనీతో రాయల్ మిలిటరీ పోలీసు అధికారి గ్రాహం జోయెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, BLINK
మౌంట్ బాటన్‌పై కన్ను
1979 మార్చిలో నెదర్లాండ్స్‌లో బ్రిటిష్ రాయబారి సర్ రిచర్డ్ సైక్స్‌ను, ఎంపీ ఎరిక్ నీవ్‌లను ఐఆర్ఏ కాల్చి చంపింది.
అదే సంవత్సరం జూన్ నెలలో బెల్జియంలో నాటో చీఫ్ జనరల్ అలెగ్జాండర్ హేగ్‌ను కూడా హతమార్చడానికి ప్రయత్నించింది ఐఆర్ఏ. కానీ ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఈ సంఘటనల నేపథ్యంలో ఐర్లాండ్‌కు వెళ్లవద్దని మౌంట్ బాటన్‌కు పోలీసు చీఫ్ సూపరింటెండెంట్ డేవిడ్ బిక్నెల్ సలహా ఇచ్చారు.
అందుకు మౌంట్ బాటన్ స్పందిస్తూ, ''ఐర్లాండ్ ప్రజలు నా స్నేహితులు'' అన్నారు.
''ఐరిష్ ప్రజలందరూ మీ స్నేహితులు కాదు'' అని బిక్నెల్ ఆయనకు చెప్పారు.
బిక్నెల్ సలహాతో మౌంట్ బాటన్ లోడ్ చేసిన పిస్టల్ తన పక్కనపెట్టుకొని నిద్రపోవడం ప్రారంభించారు.
‘‘మౌంట్ బాటన్‌కు పొంచి ఉన్న ప్రమాదాన్ని 1979, జులైలో గ్రాహం జోయెల్ ఊహించారు. మౌంట్ బాటన్ పడవ 'షాడ్ ఫైవ్' ఆయనకు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే రాత్రిపూట ఎవరైనా సైలెంట్‌గా దానిలోకి ఎక్కవచ్చు'' అని ఆండ్రూ లూనీ తన పుస్తకంలో రాశారు.
''బెల్‌ఫాస్ట్‌లో రిజిస్టర్ అయిన కారు సముద్రతీరం వైపు అనేకసార్లు వస్తున్నట్లు కనిపించిందని వారు ఆందోళన చెందారు. ఒక సందర్భంలో ఆ కారులోని వ్యక్తులను చూడటానికి జోయెల్ బైనాక్యులర్ ఉపయోగించారు. మౌంట్ బాటన్ పడవను ఓ వ్యక్తి టెలిస్కోప్ ద్వారా చూడటాన్ని గమనించారు. ఆ సమయంలో పడవకు అతను 200 గజాల దూరంలో ఉండాలి'' అని ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
మౌంట్ బాటన్ బోటు దగ్గరకు రాని సెక్యూరిటీ గార్డు
జోయెల్ రిపోర్టును అధికారులు విస్మరించారు. మౌంట్ బాటన్ భద్రతను ఐరిష్ పోలీసులకు అప్పగించారు.
1979 ఆగస్టు 27న బ్రిటన్ అంతటా సెలవుదినం.
కొద్దిరోజులుగా వర్షాలు పడిన తర్వాత సూర్యుడు అప్పుడే బయటకొచ్చాడు.
అల్పాహారం తీసుకుంటూ మౌంట్ బాటన్, తనతో పాటు షాడో ఫైవ్ బోటులో ఎవరెవరూ రావాలనుకుంటున్నారని తన కుటుంబసభ్యులను అడిగారు.
ఆయన జెట్టీకి వెళ్లడానికి ముందు తన భద్రత కోసం నియమించినవారితో మాట్లాడారు. తన ప్రణాళిక ఏమిటో వారికి వివరించారు.
రివాల్వర్లు, బైనాక్యులర్లతో సిద్ధమైన భద్రతా సిబ్బంది తమ ఎస్కార్ట్ కారును జెట్టీపై నిలిపారు.
సముద్రపు అలల కారణంగా ఆ గార్డుల్లో ఒకరికి వాంతులు మొదలయ్యాయి. దీంతో ఆయన తన పడవలో రావాల్సిన అవసరం లేదని మౌంట్ బాటన్ సలహా ఇచ్చారు.
''మౌంట్ బాటన్ తన పాత ఓడ హెచ్‌ఎంఎస్ కెల్లీ నుంచి 'ది ఫైటింగ్ ఫిఫ్త్' అని రాసిన జెర్సీని తీసుకొని ధరించారు'' అని బ్రియాన్ హోయ్ తన పుస్తకం 'మౌంట్ బాటన్: ది ప్రైవేట్ స్టోరీ'లో రాశారు.
ఈ జెర్సీని అంతకుముందెప్పుడూ మౌంట్ బాటన్ ధరించడం ఆయన కుటుంబసభ్యులు చూడలేదు. అయితే ఆ పడవ డెక్ కింద ఒక బాంబును అమర్చింది ఐఆర్‌ఏ.
అందులో దాదాపు 20 కిలోల ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఐఆర్ఏ తర్వాత వెల్లడించింది.

ఫొటో సోర్స్, SIDJWICK & JACKSON
బైనాక్యులర్లతో మౌంట్ బాటన్ పడవపై నిఘా
ఉదయం 11:30 గంటల సమయంలో 'షాడో ఫైవ్' ముందుకు కదిలింది.
ఆ పడవను భద్రతా సిబ్బంది బైనాక్యులర్లతో పరిశీలిస్తూ తీరం వెంబడి రోడ్డుపై కారులో అనుసరిస్తున్నారు.
ఇంకొంచెం దూరం ముందుకెళ్లాక, రెండు జతల కళ్లు ఆ పడవపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ కళ్లు ఐఆర్ఏ సభ్యులవి.
''ఆ పడవలో ఒక వృద్ధ మహిళ కూర్చొని ఉన్నారు. ముగ్గురు యువకులు పడవ మధ్యలో కూర్చొన్నారు. మౌంట్ బాటన్ ఆ పడవను నడుపుతున్నారు. వారందర్నీ ఐఆర్ఏ సభ్యులు స్పష్టంగా చూడగలుగుతున్నారు. వారిలో ఒకరి వద్ద రిమోట్ కంట్రోల్ పరికరం ఉంది. దాంతో పడవలో పెట్టిన బాంబును పేల్చబోతున్నారు'' అని బ్రియాన్ హోయ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
మౌంట్ బాటన్ పడవలో బాంబు పేలుడు...
సరిగ్గా ఉదయం 11:45 గంటలు...షాడో ఫైవ్ బోటు జెట్టీకి కేవలం 15 నిమిషాలలో చేరుకోగల దూరంలో ఉంది. హంతకుల్లో ఒకరు రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కారు.
అంతే, దాదాపు 20 కిలోల పేలుడు పదార్థాలతో బాంబు పెద్ద శబ్దంతో పేలిపోయింది. బోటు ముక్కలైంది.
నాటి దుర్ఘటనను మౌంట్ బాటన్ కుమార్తె పాట్రిసియా గుర్తుచేసుకున్నారు.
''నేను నా అత్త గారు లేడీ బ్రబౌర్న్ వైపు తిరిగాను. న్యూ స్టేట్స్‌మన్ తాజా సంచిక చదువుతూ ఆమెతో మాట్లాడుతున్నాను. ఆ సమయంలోనే పేలుడు సంభవించింది. పత్రిక చదవడానికి నా కళ్లు కిందకు ఉండటంతో స్వల్పంగానే దెబ్బతిన్నాయి'' అని పాట్రిసియా చెప్పారు.
''నాకు బాగా గుర్తుంది. టెన్నిస్ బంతి పరిమాణంలో ఏదో ఒక వస్తువు నా తండ్రి పాదాల వద్ద ఉంది. అది చాలా ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లడం కనిపించింది. మరుక్షణమే నేను నీటిలో పడిపోయాను. ఇంకా ఇంకా లోపలికి మునిగిపోతున్నాను'' అని ఆమె చెప్పారు.
మౌంట్ బాటన్ అల్లుడు లార్డ్ బ్రబౌర్న్, బాంబు పేలే సమయానికి పడవ మధ్యలో నిలబడి ఉన్నారు. బాంబు పేలుడు ధాటికి ఆయన శరీరంలో కొంత భాగం దెబ్బతింది. కానీ ఆయన ముఖానికి గాయాలేవీ కాలేదు.
ఆ పేలుడుకు కొన్ని సెకన్లకు ముందు ఆయన తన మామ మౌంట్ బాటన్‌తో మాట్లాడుతున్నారు. ''మీరు సరదాగా గడుపుతున్నారా?'' అని అడిగారు.
బహుశా, మౌంట్ బాటన్ విన్న చివరి మాటలు అవే కావచ్చు.
''ఆ మరుక్షణమే నేను నీటిలో మునిగిపోయాను. నన్ను ఎలా రక్షించారో కూడా నాకు గుర్తులేదు'' అని లార్డ్ బ్రబౌర్న్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మౌంట్ బాటన్ విగతజీవిగా కనిపించారు....
పడవ శిథిలాలకు కొన్ని గజాల దూరంలోనే మౌంట్ బాటన్ మృతదేహం కనిపించింది.
''ఆయన కాళ్లు దాదాపుగా శరీరం నుంచి తెగిపోయాయి. ఫుల్ స్లీవ్డ్ జెర్సీ తప్ప మిగతా దుస్తులన్నీ చిరిగిపోయాయి. ప్రజల దృష్టిని మళ్లించడానికి, అంబులెన్స్ వచ్చేవరకూ మృతదేహాన్ని బోటులోనే ఉంచారు'' అని ఆండ్రూ లూనీ రాశారు.
ఆ సమయంలో అక్కడ ఉన్న డాక్టర్ రిచర్డ్ వాలెస్, ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘పేలుడు శబ్దం వినిపించినప్పుడు అది బాంబు అని అనుకోలేదు. సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికి, చాలామంది నీటిలో పడిపోయి కనిపించారు. మా మొదటిపని, చనిపోయినవారి నుంచి బతికి ఉన్న వారిని వేరు చేయడం. మౌంట్ బాటన్ మృతదేహంతో మేము జెట్టీకి చేరుకున్నప్పుడు, చాలామంది మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు" అని వాలెస్ అన్నారు.
"ఒక తలుపును పగలగొట్టి తాత్కాలిక స్ట్రెచర్‌ను తయారు చేశారు. గాయపడిన వారి కోసం బ్యాండేజీలు తయారు చేయడానికి మహిళలు అక్కడున్న షీట్లను చించేశారు" అని డాక్టర్ వాలెస్ చెప్పారు.
‘‘ మేము మౌంట్ బాటన్ మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చినప్పుడు, ఆయన ముఖం ఏ మాత్రం చెడిపోలేదు. శరీరం మీద మాత్రం అనేక కోతలు, గాయాలు ఉన్నాయి" అని వాలెస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో సంతాపదినాలు...
మౌంట్ బాటన్ మరణవార్త అందిన వెంటనే, ఆయన గౌరవార్థం భారతదేశంలో ఏడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. దిల్లీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూతపడ్డాయి.
మౌంట్ బాటన్ జీవిత చరిత్ర రచయిత రిచర్డ్ హా తన 'మౌంట్ బాటన్ హీరో ఆఫ్ అవర్ టైమ్' పుస్తకంలో ఇలా రాశారు...
‘‘ తన మిత్రుడు మహాత్మాగాంధీలాగే ఆయన కూడా సంఘర్షణతో నిండిన దేశంలో హత్యకు గురికావడం యాదృచ్ఛికం. మరణించే సమయానికి వారిద్దరి వయసు 79 సంవత్సరాలు'' అని పేర్కొన్నారు.
1979, సెప్టెంబర్ 5న వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో 1400 మంది ప్రజల సమక్షంలో మౌంట్ బాటన్ అంత్యక్రియలు జరిగాయి. బ్రిటన్ రాణి, ప్రిన్స్ చార్లెస్, అనేక మంది యూరోపియన్ రాజులు, ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్, మరో నలుగురు మాజీ ప్రధాన మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బాధ్యులమని ప్రకటించిన ఐఆర్ఏ
మౌంట్ బాటన్ హత్యకు తామే బాధ్యత వహిస్తున్నట్లుగా కొంతకాల తర్వాత ఐఆర్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ హత్యాకాండను ఎలా సమర్థించుకుంటుందో ఐఆర్ఏ ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు.
''మన దేశంపై కొనసాగుతున్న ఆక్రమణపై బ్రిటిష్ ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యం'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, లార్డ్ మౌంట్ బాటన్
ఐఆర్ఏపై బ్రిటన్ కఠిన చర్యలు...
ఐఆర్ఏ అనేది ఐర్లాండ్‌ను బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేసిన ఐరిష్ సాయుధ గ్రూపు.
మౌంట్ బాటన్ హత్య తర్వాత ఐఆర్ఏ ఉద్యమానికి ప్రజల మద్దతు తగ్గిపోయింది.
అదే సమయంలో ఐఆర్ఏ ఒక రాజకీయ సంస్థగా కాకుండా నేర సంస్థగా అప్పటి ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్ ప్రకటించారు.
ఐఆర్ఏ పోరాటయోధులకు ఇచ్చిన యుద్ధ ఖైదీ హోదాను ఉపసంహరించుకున్నారు.
బాంబు దాడి జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే, హంతకులను పట్టుకోవడానికి ఐరిష్ పోలీసులు తమ చరిత్రలోనే అత్యంత విస్తృతమైన దర్యాప్తును ప్రారంభించారు.
చివరకు, ఐఆర్ఏకు చెందిన ఫ్రాన్సిస్ మెక్‌గ్రిల్ (24), థామస్ మెక్‌మోహన్ (31)లను అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 1979 నవంబర్ 23న తీర్పు ఇచ్చింది.
తగిన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో 'బెనిఫిట్ ఆఫ్ ది డౌట్' కింద మెక్‌గ్రిల్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.
మౌంట్ బాటన్‌ను హత్యచేశారనడానికి రెండు ఆధారాలు లభించడంతో మెక్‌మోహన్‌ను దోషిగా తేల్చింది. జీవిత ఖైదు విధించింది.
మొత్తం 19 సంవత్సరాల పాటు బ్రిటిష్ జైలులో గడిపిన మెక్‌మోహన్ 1998లో 'గుడ్ ఫ్రైడే' ఒప్పందం ప్రకారం విడుదలయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














