ట్రంప్, పుతిన్ మధ్య కుదరని ఒప్పందం.. భారత్ ఎలా అర్థం చేసుకోవాలి?

ఫొటో సోర్స్, Reuters
అలాస్కాలో ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి.
యుక్రెయిన్‌తో యుద్ధ విరమణకు ఒప్పందం కుదరలేదని, కానీ పుతిన్‌తో జరిగిన చర్చల్లో పురోగతి ఉందని డోనల్డ్ ట్రంప్ ఈ సమావేశం అనంతరం చెప్పారు.
యుక్రెయిన్‌పై జరిగిన చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో ట్రంప్, పుతిన్ అలాస్కా నుంచి తిరిగి వెళ్లిపోయారు.
‘ఒప్పందం కుదరలేదు‘ అని ట్రంప్ మీడియాతో స్పష్టం చేశారు.
అలాస్కాలో ట్రంప్, పుతిన్ మధ్య సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది.
ఆ తర్వాత 10 నిమిషాల పాటు ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు మీడియాతో మాట్లాడారు.


ఫొటో సోర్స్, Reuters
‘అవును.. ట్రంప్ అధికారంలో ఉంటే యుద్ధం మొదలయ్యేది కాదు’
సంక్షోభానికి ముగింపు పలకడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన పుతిన్.. ఆ సంక్షోభాన్ని ఒక విషాదంగా అభివర్ణించారు.
అయితే సంక్షోభానికి దారితీసిన ప్రధాన కారణాలను తొలగించాలని, అది రష్యాకు అవసరమని.. యుక్రెయిన్, యూరప్‌లు ఈ చర్చలను దెబ్బతీసేలా వ్యవహరించరాదని పుతిన్ అన్నారు.
సంక్షోభం పరిష్కారానికి ఈ సమావేశాన్ని ప్రారంభ పాయింట్‌గా పుతిన్ అభివర్ణించారు.
కాగా.. 2020 ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే యుద్ధం మొదలై ఉండేది కాదని ట్రంప్ పదే పదే చెప్తున్న మాటలతో పుతిన్ ఏకీభవించారు.
అంతా మంచే జరగాలనే ఉద్దేశంతో మాట్లాడినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని పుతిన్ అన్నారు.
ఫలితాలు సాధించాలనే ఉద్దేశమే రెండు వైపులా ఉందన్నారు.
'ట్రంప్ తన దేశం గురించి స్పష్టంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో రష్యాకు తన సొంత ప్రయోజానలున్నాయని అర్ధం చేసుకుంటున్నారు'' అని పుతిన్ వ్యాఖ్యానించారు.
రష్యా, అమెరికాను సముద్రాలు వేరు చేసినా, రెండూ సమీప ఇరుగుపొరుగుదేశాలని పుతిన్ అన్నారు.
''నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అదే నిజం'' అని చెప్పిన పుతిన్ హలో నైబర్ అంటూ ట్రంప్‌ను పలకరించారు.

ఫొటో సోర్స్, Reuters
‘పుతిన్‌తో సమావేశానికి పదికి పది మార్కులు వేస్తా’
చాలా విషయాలపై అంగీకారం కుదిరిందని, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని, వాటిలో ఒకటి చాలా ముఖ్యమైనదుందని ట్రంప్ చెప్పారు. అయితే ఆ ముఖ్యమైనదేదో అమెరికా అధ్యక్షుడు వెల్లడించలేదు.
త్వరలో జెలియెన్‌స్కీ, యూరోపియన్ నాయకులతో మాట్లాడతానని వారికే నిర్ణయం వదిలేస్తానని తెలిపారు.
వీలయినంత తొందరలో రష్యా అధ్యక్షుణ్ని మరోసారి కలుస్తానని ట్రంప్ వ్యాఖ్యానించగా.. వచ్చే సమావేశం మాస్కోలో అని పుతిన్ దానికి బదులిచ్చారు.
సమావేశం చాలా బాగా జరిగిందని, మంచి ఫలితాలనిచ్చిందని చెప్పిన ట్రంప్ నిర్ణయించాల్సింది ఇంకా ఉందని అన్నారు.
చర్చల్లో మరింత పురోగతి సాధించడానికి ఇకపై చాలా మంచి అవకాశం ఉందన్నారు.

ఫొటో సోర్స్, Reuters
మీడియాతో మాట్లాడిన తర్వాత ట్రంప్, పుతిన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
అయితే, రిపోర్టర్ల నుంచి వచ్చిన ప్రశ్నలకు బదులివ్వకుండా ఇద్దరు నేతలు స్టేజ్ దిగి వెళ్లిపోయారు.
ఇద్దరు అధ్యక్షుల మధ్య సమావేశం చాలా బాగా జరిగిందని చర్చలు ముగిసిన తర్వాత ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.
పుతిన్‌తో జరిగిన సమావేశానికి పదికి పది మార్కులు వేస్తానని ట్రంప్ అన్నారు.
తర్వాత రష్యా, యుక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతాయని, పుతిన్, జెలియెన్‌స్కీ హాజరవుతారని ట్రంప్ తెలిపారు.
కాగా రష్యా అధ్యక్షునితో జరిగిన చర్చల్లో ట్రంప్ సాధించింది సున్నా అని నాటోకు గతంలో అమెరికా రాయబారిగా పనిచేసిన డౌగ్లస్ లూట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images
ట్రంప్, పుతిన్ సమావేశం భారత్‌కు ఇచ్చిన సంకేతమేంటి?
అలస్కాలో సమావేశానికి వెళ్తూ ఫాక్స్ న్యూస్‌కు ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మరోసారి భారత్ గురించి ప్రస్తావించారు.
''వాళ్లు ఒక చమురు కొనుగోలుదారును కోల్పోతారు. భారత్ 40 శాతం చమురు కొంటోంది. చైనా చాలా చమురు కొంటోంది. నేను ద్వితీయస్థాయి ఆంక్షలు విధిస్తే వారికి చాలా నష్టం. నేను చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ నేను చేయాల్సిన అవసరం రాదనుకుంటా'' అని పుతిన్‌తో సమావేశానికి ముందు ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇది ఒత్తిడిని పెంచే ప్రయత్నమని రష్యా వ్యవహారాల నిపుణులు జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్ అయిన రాజన్ కుమార్ బీబీసీతో చెప్పారు.
"భారత్, ఇతర మార్గాల ద్వారా రష్యాపై ఒత్తిడి తీసుకురావచ్చు. చైనాపై ఒత్తిడి తేలేమని ట్రంప్‌కు తెలుసు, కాబట్టి భారత్‌ను టార్గెట్ చేయడం చాలా సులువని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే తరచూ భారత్ పేరు తెస్తున్నారు. రష్యాకు సందేశం పంపడానికి ఇదో మార్గం'' అని ఆయన విశ్లేషించారు.
"ఇలా ఒత్తిడి తీసుకురావడం ద్వారా భారత్ సుంకాలను తగ్గించాలని లేదా సున్నా సుంకాలు అమలుచేయాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో సన్నిహిత దేశాలను రష్యా నుంచి ఎలా దూరం చేయవచ్చనే సందేశం పంపాలనుకుంటున్నారు. వారు చైనాను దూరం చేయలేరు, కానీ భారత్‌ను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘భారత్‌పై మరిన్ని సుంకాలు విధించే అవకాశం లేదు’
"రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేయవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది, అమెరికాతో తన సంబంధాలు క్షీణించకూడదని భారత్ కోరుకుంటుంది. రెండోది రష్యా నుంచి చౌకగా దొరికే చమురు వల్ల కలిగే ప్రయోజనం ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గింది'' అని ప్రొఫెసర్ రాజన్ కుమార్ అంటున్నారు.
అమెరికా ఒత్తిడి తెచ్చి ఉంటే, భారత్ తన దిగుమతులను తగ్గించుకునేందుకు ప్రయత్నించడానికి అవకాశముందన్నది ట్రంప్ అభిప్రాయం. అందుకే భారత్ ఇప్పుడు మారుతోందని, ఒత్తిడిలో మరింత మారుతుందని ట్రంప్ అన్నారు. కానీ రష్యా నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయడంపై భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్కెట్‌కు లాభం ఇచ్చే ఎక్కడి నుంచయినా చమురు కొంటామని చెప్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది" అని ఆయన విశ్లేషించారు.
''ట్రంప్ దృష్టిలో ఈ సమావేశం విఫలం కాలేదు. ఆయన ఉద్దేశం ప్రకారం ఇది సానుకూల ముందడుగు. ఇద్దరు నేతలు ఒకరికొకరు సానుకూల సందేశాలిచ్చుకోడానికి ప్రయత్నించారు'' అని ట్రంప్, పుతిన్ చర్చల ఫలితాలను ప్రొఫెసర్ రాజన్ కుమార్ విశ్లేషించారు.
అయితే, విలేకరుల సమావేశంలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం అంటే ఎలాంటి ఒప్పందం కుదరలేదని లేదా అది ఇంకా అందరికీ చెప్పే స్థాయిలో లేదని అర్ధమని రాజన్ కుమార్ అంటున్నారు.
''ఇతర శక్తులు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్‌పై సుంకాలను పెంచే ముప్పు ప్రస్తుతం తక్కువగా ఉందని రాజన్ కుమార్ అంచనావేశారు.
''ట్రంప్ ఉద్దేశం ప్రకారం చర్చలు సఫలమయ్యాయి. కాబట్టి భారత్ మరింత ఒత్తిడి వచ్చే అవకాశం తక్కువగా ఉంది. కానీ యుక్రెయిన్ లేదా యూరోపియన్ యూనియన్ కోణం నుంచి చూస్తే కాల్పుల విరమణ లేదా వైమానిక దాడుల నిషేధం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనందున ఈ చర్చలు విఫలమయ్యాయి'' అని ప్రొఫెసర్ రాజన్ కుమార్ విశ్లేషించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














