ట్రంప్‌ టారిఫ్స్ ప్రభావం: ఇలాగైతే రొయ్య సాగు ఎలా అంటున్న రైతులు, ఎగుమతిదారులు

రొయ్యలు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వివిధ రకాల ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సుంకాల ప్రభావం ప్రధానంగా ఆక్వా రంగంపైనే ఎక్కువగా పడుతోందని ఏపీలో రొయ్యలు సాగు చేసే రైతులు, అమెరికాకు ఎగుమతి చేసే వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఏప్రిల్‌ 2న డోనల్డ్‌ ట్రంప్ భారత్ నుంచి ఎగుమతులపై 25 శాతం టారిఫ్‌లు ప్రకటించడంతో ఏపీలోని ఆక్వా రైతులు, ఎగుమతిదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ఆ ప్రకటనతో రొయ్యల ఎగుమతుల్లో అప్పట్లో కొంత ప్రతిష్టంబన నెలకొంది. అయితే ఈ నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేసినట్టు ఏప్రిల్‌ 9న ప్రకటించడంతో ఒకింత ఉపశమనంగా భావించి తిరిగి వనామీ వంటి రొయ్యల రకాలను అమెరికాకు పంపడం మొదలుపెట్టారు.

ఆగస్ట్ 27 నుంచి ఆ 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు.

దీంతో టారిఫ్‌ 25 శాతం, దానికి అదనంగా కౌంటర్‌వెయిలింగ్‌ డ్యూటీ 5.77 శాతం, యాంటీ డంపింగ్‌ డ్యూటీ 4.46 శాతం... మొత్తం 35.23 శాతం సుంకాలు రొయ్యల ఎగుమతులపై విధిస్తున్నారని భీమవరం నుంచి అమెరికా సహా వివిధ దేశాలకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేసే జగదీష్‌ మెరైన్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ తోట జగదీశ్‌ బీబీసీకి తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు దీనికి అదనంగా ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం సుంకం విధించనున్నట్టు ట్రంప్‌ ప్రకటించారని, అంటే మొత్తంగా సుంకం 60.23 శాతానికి చేరుతుందని జగదీశ్‌ చెప్పారు.

ఈ నిర్ణయం ప్రస్తుతం ఏపీలోని ఆక్వా రంగాన్ని కకావికలం చేస్తోందని రొయ్యల ఎగుమతుదారులు చెబుతుండగా, ట్రంప్‌ ప్రకటన వెలువడగానే రొయ్యల ధరలు పడిపోయాయని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.

prawns, shrimp

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటికే కేజీకి రూ. 50 నుంచి రూ. 60 వరకు తగ్గింది

ట్రంప్‌ ప్రకటన రాగానే ఇక్కడ రొయ్యల రేటు కేజీకి 50 నుంచి 60 రూపాయలు తగ్గిందని జై భారత్‌ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నాయకుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్‌ రాజు బీబీసీకి తెలిపారు.

మిగతా 25 శాతం సుంకం అమల్లోకి వస్తే అప్పుడు కేజీకి రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గిపోయే పరిస్థితి వస్తుందని, ఎగుమతి చేసే వ్యాపారులు మా వద్ద నుంచి రేట్లు తగ్గించి కొంటే, ఇప్పుడు కల్చర్‌లో ఉన్న రైతులందరూ రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

"ఇప్పుడున్న యూఎస్‌ డ్యూటీల వల్లనే చాలా కష్టమైన పరిస్థితిని అందరూ ఎదుర్కొంటున్నారు. అందరికీ గడ్డుకాలం ఇది. ఈ 25 శాతం సుంకం విధింపు నిర్ణయాన్నే మేం ఊహించలేదు. దీనికి అదనంగా మరో 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తామని ప్రకటించడం దారుణం" అని గోదావరి జిల్లాల నుంచి విదేశాలకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేసే ఆనంద్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఉద్దరాజు కాశీవిశ్వనాథ రాజు బీబీసీకి తెలిపారు.

"కేజీ రొయ్య రేటు సగటున 300 రూపాయలు అనుకున్నా.. 60 శాతం టాక్స్‌ అంటే రైతుకి 180 రూపాయలు పోతుంది. ఇది చాలా కష్టమైన పరిస్థితి. దేశంలో ఆక్వా రైతు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం" అని ఆయన అన్నారు.

"అక్కడ బయ్యర్లకు కూడా రొయ్యల కొనుగోళ్లకు ఇది పీక్‌ టైం. వాళ్లందరూ కిస్మస్‌ సేల్స్‌కి న్యూఇయర్‌ సేల్స్‌కి రెడీ అయి ఉన్నారు. ఇటు కొత్తగా సాగు చేసే టైమ్‌లో రైతులు ఉన్నారు. ఈ దశలో ట్రంప్‌ సుంకాలతో అందరూ అయోమయంలో పడిపోయారు. ఎటూ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం" అని జగదీశ్‌ మెరైన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఎండీ తోట జగదీశ్‌ చెప్పారు.

తోట జగదీష్‌
ఫొటో క్యాప్షన్, తోట జగదీష్‌

నిల్వలు పెరిగిపోతున్నాయ్‌

ఇప్పటికే ఎగుమతులు తగ్గి నిల్వలు పెరిగిపోయాయని ఎగుమతిదారులు అంటున్నారు.

''మా వద్ద పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నాయి. మరోవైపు గత సీజన్‌లో రైతులు వేసిన రొయ్యల పెంపకం నీళ్లల్లో ఉంది. నా అంచనా మేరకు మా ఏరియాలోనే రూ. 2వేల కోట్ల విలువైన ఉత్పత్తి ఉంది. ఇప్పుడు దీని వాల్యూ 60 శాతం పడిపోవడం అనేది మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి'' అని తోట జగదీష్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

"ఆ పన్నుల ప్రభావంతో వ్యాపారులు మా వద్ద నుంచి తగ్గించి కొంటారు. ప్రస్తుత సాగుకయ్యే ఖర్చు గతంలో కంటే పెరిగింది. రొయ్యరేటు ఇలా తగ్గిపోతే ఇక సాగు చేసే పరిస్థితి ఉండదు" అని రైతులు చెబుతున్నారు.

‘ఇక రొయ్య సాగు చేయదల్చుకోలేదు’ అని పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకి చెందిన వర్మ బీబీసీతో చెప్పారు.
ఫొటో క్యాప్షన్, ‘ఇక రొయ్య సాగు చేయదల్చుకోలేదు’ అని పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకి చెందిన వర్మ బీబీసీతో చెప్పారు.

''నేను పది ఎకరాల చెరువు లీజుకు తీసుకుని రొయ్య సాగు చేస్తున్నాను. ఫస్ట్‌ క్రాప్‌లో వైరస్‌ రావడంతో నష్టపోయా. ఇప్పుడు రెండో పంట వేద్దామనుకున్నా. కానీ అమెరికా పన్నులు చూసి ఇక రొయ్య సాగు చేయదల్చుకోలేదు. రొయ్య మానేసి చేప పిల్ల వేద్దామనుకుంటున్నాను" అని పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకి చెందిన వర్మ బీబీసీకి తెలిపారు.

"ఇదివరకు ఏడాదికి రొయ్య.. మూడు పంటలు వేసే వాళ్లం. అంటే సరిగ్గా నాలుగు నెలలకోసారి పంట తీసే వాళ్లం. కొన్నాళ్లుగా ఏడాదికి రెండుసార్లే సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఆ సాగుకి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేశాయి" అని పశ్చిమ గోదావరి ప్రాన్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ సుబ్బరాజు అన్నారు.

రొయ్యల సాగు
ఫొటో క్యాప్షన్, చెరువు నుంచి రొయ్యలు బయటకు తీసుకువస్తున్న దృశ్యం

'రొయ్య పిల్లల ఉత్పత్తి తగ్గించేశాం'

కొన్నాళ్లుగా ఆక్వా రంగంలో నెలకొన్న పరిస్థితులతో ఇప్పటికే రొయ్య పిల్లల ఉత్పత్తి బాగా తగ్గించేశామని హేచరీస్‌ల నిర్వాహకులు చెబుతున్నారు.

"పెరిగిన సాగు ఖర్చులతో కొన్నాళ్లుగా ఆక్వారంగం చాలావరకు పడిపోయింది. దానివల్ల హేచరీస్‌ కూడా ఉత్పత్తిని తగ్గించాయి. ఇప్పుడు ట్రంప్‌ పన్నులతో ఇంకా తగ్గించే పరిస్థితే ఉంది. గతంలో మేం ఏడాదికి సగటున 10 కోట్ల రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తే ఇప్పుడు 7 నుంచి 6 కోట్లు కూడా అవ్వట్లేదు" అని వీరవాసరంలోని శ్రీమన్నారాయణ హేచరీస్‌ నిర్వాహకులు ఎంఎస్‌ వర్మ బీబీసీకి తెలిపారు.

మార్కెట్‌లో కూడా రొయ్యల రేట్లు తగ్గిపోయాయని చిరు వ్యాపారులు చెబుతున్నారు. తమకు కారణం సరిగ్గా తెలియనప్పటికీ కానీ రొయ్యల ధరలు బాగా తగ్గిపోయాయన్నది మాత్రం వారు చెప్తున్నారు.

చేపల మార్కెట్‌లో రొయ్యల విక్రయదారు నూకాలమ్మ
ఫొటో క్యాప్షన్, చేపల మార్కెట్‌లో రొయ్యల విక్రయదారు నూకాలమ్మ

"60 కౌంట్‌ రొయ్యధర పదిహేను రోజుల కితం రూ. 350 నుంచి రూ. 400 వరకూ ఉండేది. ఇప్పుడు రూ. 280 నుంచి రూ. 300కే రైతుల నుంచి మేం కొనుగోలు చేస్తున్నాం. 80 కౌంట్‌ ధర రూ. 300 నుంచి రూ. 220కి తగ్గింది" అని భీమవరంలోని చేపల మార్కెట్‌లో పాతికేళ్లుగా చేపలు, రొయ్యలు విక్రయించే ప్రసాద్, నూకాలమ్మ బీబీసీకి తెలిపారు.

కొంతకాలంగా రొయ్యల ధరలు గతం కంటే చాలా తగ్గాయని అక్కడి మార్కెట్‌కి వచ్చిన వినియోగదారుడు ప్రకాష్‌ చెప్పారు.

నరసాపురం ఆక్వా రైతు పూర్ణచంద్రరావు
ఫొటో క్యాప్షన్, నరసాపురం ఆక్వా రైతు పూర్ణచంద్రరావు

'అంత ధర తగ్గితే ఎలా బతకాలి'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని రొయ్యల రైతులను ఆదుకోవాలని సాగు చేస్తున్న రైతులతో పాటు రైతు సంఘం నేతలు కోరుతున్నారు.

"నేను చిన్నపాటి రైతును 12 ఎకరాలు సాగు చేస్తున్నా. టన్ను మూడు లక్షల ధర ఉన్న దశలో నేను సాగు మొదలుపెట్టాను. ఇప్పుడు చేతికొచ్చే సమయంలో దానికి 60 శాతం తగ్గి లక్షా 20వేలు వస్తే అసలు నేను ఎలా బతికి బట్టకట్టాలి. అయినకాడికి అప్పులు చేసి సాగు చేశాను. ఇప్పుడు ఈ పన్నులు మా కడుపు కొడుతున్నాయి" అని నరసాపురం ప్రాంతానికి చెందిన ఆక్వా రైతు బంధన పూర్ణచంద్రరావు బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రంప్‌ పన్నులపై అత్యవసరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వెస్ట్‌ గోదావరి ప్రాన్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ సుబ్బరాజు కోరారు.

''కేంద్ర ప్రభుత్వం ఈ అదనపు సుంకాలు రైతుపై పడకుండా కేంద్రమే భరించేలా చూడాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాలతోను, జోన్లతోను సంబంధం లేకుండా ఆక్వా రైతుకు యూనిట్‌కి రూపాయిన్నర చొప్పున కరెంటు సబ్సిడీ ఇవ్వాలి'' అని ఆయన కోరారు.

ఆనంద్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఉద్దరాజు కాశీవిశ్వనాథ రాజు
ఫొటో క్యాప్షన్, ఉద్దరాజు కాశీవిశ్వనాథ రాజు

'ఆక్వారంగం మొత్తానికీ ఇబ్బందే'

భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం.

"ఆంధ్ర ప్రదేశ్‌లో చేపలు, రొయ్యల చెరువుల విస్తీర్ణం దాదాపు 5 లక్షల 76 వేల ఎకరాలు కాగా... కేవలం రొయ్య సాగు 2 లక్షల 70 వేల ఎకరాల్లో ఉంది. ఏడాదికి చేపల, రొయ్యల ఉత్పత్తి 51.58 లక్షల టన్నులు కాగా సముద్ర, మంచి నీటి రొయ్యల ఉత్పత్తి సుమారు 18 లక్షల టన్నుల వరకు ఉందని అంచనా" అని ఏపీ మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ బీబీసీకి వివరించారు.

ఇప్పుడు అమెరికా పన్నులతో ఆక్వా రంగం మొత్తం తీవ్రంగా దెబ్బతింటుందని ఈ రంగంలో నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఎగుమతిదారు కాశీవిశ్వనాథ రాజు చెబుతున్నారు.

''దాదాపు 5 లక్షల మంది రొయ్యలు సాగు చేసే రైతులు దెబ్బతింటారు. సాగు ఆపేస్తే హేచరీస్, ప్రాసెసింగ్‌ యూనిట్లు దెబ్బతింటాయి. దాంతో ప్రత్యక్షంగా 5 లక్షల మంది, పరోక్షంగా మరో 25 లక్షల మంది ఉపాధి కోల్పోతారు'' అని కాశీ విశ్వనాథరాజు వివరించారు.

చేపల మార్కెట్‌లో రొయ్యల విక్రయదారు ప్రకాష్‌
ఫొటో క్యాప్షన్, రొయ్యల విక్రయదారు ప్రకాష్‌

అమెరికాకే 60 శాతం ఎగుమతులు

భారత్‌లో రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉందని, దేశంలో ఏడాదికి 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే అందులో 60 శాతం ఏపీ నుంచే ఉంటోందని ఏపీ మత్స్యశాఖ జేడీ షేక్‌ మహమ్మద్‌ బీబీసీకి తెలిపారు.

మొత్తం ఉత్పత్తిలో ఏపీ నుంచి అమెరికాకు సుమారు 60 నుంచి 65 శాతం ఎగుమతి అవుతుండగా.. మిగిలింది చైనా, జపాన్, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతుందని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయని ఆయన తెలిపారు.

''2023–24 లెక్కల ప్రకారం మన దేశం నుంచి రూ.60,524 కోట్ల విలువైన 17.81 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు 130 దేశాలకు ఎగుమతి కాగా అందులో రొయ్యల వాటా రూ.40వేల కోట్లు.

ఇందులో ప్రధానంగా అమెరికా, చైనా, యూరోపియన్‌ దేశాలకు , జపాన్‌కు ఎగుమతి అవుతుంటాయి. 2024లో అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అయిన సముద్ర ఉత్పత్తుల మొత్తం విలువలో రొయ్యల విలువే రూ.18,725 కోట్లు'' అని ఏపీ మత్స్యశాఖ అధికారితో పాటు విశాఖలోని ది మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంపెడా)కి చెందిన ఓ అధికారి బీబీసీకి తెలిపారు.

పండుగప్ప రకం చేప
ఫొటో క్యాప్షన్, పండుగప్ప రకం చేప

రొయ్యకు బదులు పండుగప్ప

టారిఫ్‌ల ప్రభావంతో రొయ్యల రైతులు చేపల సాగు వైపు మారుతున్నారని.. రైతులు రొయ్యల సాగును తగ్గించి పండుగప్ప పై దృష్టి సారించాలని మత్స్య శాఖ తరఫున తాము కోరుతున్నామని ఏపీ మత్స్యశాఖ జేడీ షేక్‌ మహమ్మద్‌ ‘బీబీసీ’తో చెప్పారు.

రొయ్యలకు డిమాండ్ తగ్గడంతో చేపల్లో కొన్ని రకాల ధరలు పెరుగుతున్నాయని.. పండుగప్ప ధర మొన్నటి వరకు కేజీ 300 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ. 380 నుంచి రూ. 400 వరకు పలుకుతోందని చెప్పారు.

ఇప్పటికీ 25 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు పండుగప్ప సాగు చెరువులుగా మారినట్టు ఆయన తెలిపారు

చెరువు నుంచి రొయ్యలు పట్టుబడి చేసి బయటకు తీసుకువస్తున్న దృశ్యం

సాగు ఇక్కడ ధర నిర్ణయం విదేశాల్లో..

రొయ్యల ధర స్థానికంగానో, రాష్ట్రంలోనో, మన దేశంలోనే నిర్ణయించే పరిస్థితి లేదని ట్రేడర్, ఏపీ సీఫుడ్‌ సప్లయిర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరామమూర్తి బీబీసీతో అన్నారు.

''కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరను నిర్ణయించలేవనే చెప్పాలి. కేవలం రొయ్యలు దిగుమతి చేసుకుంటున్న విదేశాల్లో నిర్ణయించే రేటుపైనే ఇక్కడి ఆక్వా పరిశ్రమ ఆధారపడి ఉంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది?

ట్రంప్‌ పన్నుల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని, ఎగుమతి సవాళ్లపై దృష్టి పెట్టామని ఏపీలో ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ ఆనం వెంకట రమణా రెడ్డి భరోసానిచ్చారు.

ఈ విషయమై ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ముందుగా విద్యుత్‌ టారిఫ్‌ రూపాయిన్నర రేటు రైతులందరికీ వర్తించే విధంగా సీఎం చంద్రబాబుతో మాట్లాడతామని చెప్పారు.

అమెరికాకే కాకుండా దక్షిణ కొరియా, యూకే, యూరోప్, మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలలో కొత్త ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా కృషి చేస్తామని తెలిపారు.

యూకేతో ఇటీవల కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ను ఎగుమతిదారులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

సముద్ర ఉత్పత్తుల దేశీయ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ఆనం బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)