ఆంధ్రప్రదేశ్: తీరంలో మత్స్యకార కుటుంబాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
"ఏటా రెండు నెలల పాటు వేట ఆపేస్తారు. ఎలా బతకాలో తెలీదు. ఏ పూట వేటకెళ్తే ఆ పూట కడుపునింపుకునే వాళ్లే ఎక్కువ. వేట ఆపేసినందుకు పరిహారం కింద ఏడాదికి 10 వేల రూపాయలు ఇచ్చేవారు. ఈ రెండు నెలలు ఏదోలా నెట్టుకొచ్చేవాళ్లం. ఈసారి వేటా లేదు, పరిహారం రాలేదు".
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడికి చెందిన ఓ మత్స్యకారుడి ఆవేదన ఇది. చేపల వేట మీద ఆధారపడి సముద్రాన్ని నమ్ముకున్న తమకు ప్రస్తుతం చిక్కులు తప్పడం లేదని ఆయన వాపోయారు.
బంగాళాఖాతంలో మత్స్యసంపద వృద్ధి చెందడం కోసం ఏటా రెండు నెలలపాటు చేపల వేట నిషేధం అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు, 60 రోజుల పాటు ఈ వేట నిషేధం అమల్లో ఉంటుంది.
వేట నిలిపివేసినందుకుగానూ మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తూ వస్తోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఈ విధానం ఉంది.
ఏపీలో 2019కి ముందు ఏటా రూ. 4 వేలు చొప్పున చెల్లించేవారు. గడచిన ఐదేళ్లుగా రూ.10 వేలు చొప్పున అందించారు. కానీ, ఈసారి ఇంకా పరిహారం అందలేదు. ఇప్పటికే వేట నిషేధం అమలులోకి వచ్చి నెలన్నర కావొస్తోంది. మరో 20 రోజుల్లో నిషేధం ముగిసి, మళ్లీ వేట మొదలుపెట్టబోతున్నారు.

రాష్ట్రమంతా ఎదురుచూపులే..
ఆంధ్రప్రదేశ్‌లో 974 కిలోమీటర్ల పొడవైన తీరం వెంబడి 1.50 లక్షల కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నాయి. సుమారుగా 6 లక్షల మంది మత్స్యకారులు సముద్ర తీరం వెంబడి జీవిస్తున్నారు.
మెకనైజ్డ్ బోట్లు సముద్రంలో తిరిగితే చేపలు గుడ్లు పెట్టే సమయంలో నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఏటా వేట నిషేధం అమలు చేస్తున్నారు. ఆ సమయంలో మత్స్యకారులకు మరో జీవనాధారం ఉండదు కాబట్టి పరిహారం చెల్లించడం ద్వారా ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చాయి.
‘‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’’ అనే పేరుతో కుటుంబానికి రూ.10 వేలు చొప్పున 2023 వరకూ అందించారు. గత ఏడాది మే 17న బాపట్ల జిల్లా నిజాంపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులను మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.23 లక్షల మంది మత్స్యకారులకు ఈ పథకాన్ని అందించారు. అందుకోసం రూ.123 కోట్లు కేటాయించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం మొత్తం రూ. 523 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కానీ, ఈసారి మాత్రం వేట నిషేధ పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నిధులు ఇంకా విడుదల చేయకపోవడంతో మత్స్యకారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికే నిలిచిపోయిన కొన్ని పథకాలకు సంబంధించిన నగదును, పోలింగ్ ముగిసిన తర్వాత లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తున్నారు. వాటిలో వైఎస్సార్ ఆసరా, పంటల బీమా, షాదీ తోఫా వంటి పథకాలున్నాయి.
కానీ, మత్స్యకార భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదల విషయంలో మాత్రం ఇప్పటికీ ముందడుగు పడలేదు.

‘ఇబ్బందుల్లో ఉన్నాం...’
"ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని ఆపేశారు. వేటకు వెళ్లకపోవడంతో ఆదాయం లేదు. అందుకే అప్పులు చేసి గడుపుతున్నాం. అప్పులు కూడా పుట్టని వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాకు అందించే సాయం వేట నిషేధం ఉండగా ఇస్తే బాగుంటుంది. కోడ్ కారణంగా లక్షల మంది మత్స్యకారులను ఇక్కట్లలో పెట్టడం సరికాదు. ఆలోచించాలని కోరుతున్నాం" అంటూ కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన గోసల సికిందర్ అన్నారు.
ఏటా మే నెలలోనే పరిహారం అందించేవారు కానీ, ఈసారి అది ఆలస్యం కావడం వల్ల సమస్యగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చేపల వేట మినహా మరో పని తెలియకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వంకా కొర్లమ్మ అనే మహిళ తెలిపారు.
"మాకు వేట నిషేధం మొదలైన తర్వాత పది, పదిహేను రోజుల్లో పరిహారం రిలీజ్ అయ్యేది. ఓ నెల రోజుల ఖర్చుకు సరిపోయేది. ఈసారి కారణాలు మాకు తెలియడం లేదు. మత్స్యకారుల విషయంలోనే నిర్లక్ష్యం అనుకుంటున్నాం. మాకు మరోదారి లేదు. అప్పులు కూడా పుట్టడం లేదు. తెచ్చిన అప్పుల వడ్డీలు కూడా పెరుగుతున్నాయి" అని ఆమె బీబీసీతో అన్నారు.
ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులుందరినీ తమ పరిహారం విషయం గురించి అడిగినా ఫలితం లేదని ఆమె అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాతనైనా తమకు పరిహారం ఇస్తారనుకుంటే అది కూడా జరగలేదని కొర్లమ్మ వాపోయారు.

‘కొంత జాప్యం జరిగింది..’
రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు వేట నిషేధ పరిహారం కింద ‘‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’’ పథకం వర్తింపజేయాల్సి ఉందని ఏపీ ప్రభుత్వ మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
త్వరలోనే పరిహారం పంపిణీకి చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ కమిషనర్ సూర్యకుమారి తెలిపారు.
" ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మత్స్యకార భరోసా నిధుల విడుదలకు కొంత జాప్యం జరిగింది. త్వరలోనే వాటిని జమ చేస్తాం. డీబీటీ పద్ధతిలో అందిస్తాం. లబ్దిదారుల గుర్తింపు సహా ప్రక్రియ మొత్తం పూర్తయ్యింది. అనుమతి వచ్చి, నిధులు కేటాయించగానే లబ్దిదారులకు అందించే ప్రయత్నం జరుగుతుంది" అని ఆమె బీబీసీకి తెలిపారు.
త్వరలోనే వాళ్లకు పరిహారం అందుతుందని సూర్యకుమారి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: రాజకీయాల్లో ఇన్నాళ్లూ చక్రం తిప్పినా, తొలిసారి ప్రజాతీర్పు కోరుతున్న ప్రముఖులు వీళ్లు
- నంద్యాలలో పీవీ నరసింహారావు భారీ విజయం వెనుక ఏం జరిగింది?
- ఎన్నికలలో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతులు వీరేనా? వీళ్ల ఆర్థిక మూలాలేమిటి? వ్యాపారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














