ఏపీ మత్స్యశాఖ: ‘ఆక్వా ఎగుమతులు ఎన్నో మాకు తెలియదు’ అంటున్న అధికారులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ట్రంప్ సుంకాల ప్రభావం భారత్‌లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల రైతులపై పడుతోంది.
సుంకాలను ప్రకటించిన గంట వ్యవధిలోనే ఏపీలో రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత పది పదిహేను రోజులుగా 100 కౌంట్ రొయ్యకు 40 రూపాయల ధర తగ్గింది. అయితే, సుంకాలను కొన్నాళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఈ రేట్లు ప్రస్తుతం కొంత మెరుగయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ఎన్ని టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి? వాటిలో అమెరికాకు వెళ్లే వాటా ఎంత? అసలు రాష్ట్రంలో సాగయ్యే చేపలు, రొయ్యలు ఎన్ని? ఇక్కడ ఎన్ని టన్నులు వినియోగిస్తున్నారు అనే సమాచారాన్ని తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
అయితే, దీనిపై తమ వద్ద పక్కా సమాచారం ఏదీ లేదని రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు చెప్పారు.


ఫొటో సోర్స్, AQUACONNET
''మా వద్ద వివరాల్లేవు''
ఈ వివరాల గురించి తెలుసుకోవడానికి రాష్ట్రంలో, ప్రధానంగా తీరం వెంబడి ఉన్న జిల్లాల్లోని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకులకు ఎంతమందికి బీబీసీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తమ వద్ద వివరాలు ఏమీ లేవని చెప్పారు.
ఇక మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఏ విషయం కోసమైనా మీరు రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుని సంప్రదించాలని ఆయన బీబీసీకి మెసేజ్ ద్వారా తెలిపారు.
అచ్చెన్నాయుడు కోసం బీబీసీ పలుమార్లు ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన అందుటులోకి వస్తే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

ఫొటో సోర్స్, Getty Images
''ఎగుమతుల వ్యవహారమంతా వాళ్లదే''
ఆక్వా జేడీ లాలా మధుని సంప్రదించిన బీబీసీ, ఏపీ నుంచి విదేశాలకు ఎంత మత్స్యసంపద ఎగుమతి అవుతుందనే పక్కా సమాచారం మీ వద్ద ఉండదా? అని ప్రశ్నించింది.
ఎగుమతుల వ్యవహారమంతా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని మెరీన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపీఈడీఏ) చూస్తుందని, కాబట్టి దీనికి సంబంధించి తమ వద్ద సమగ్ర సమాచారం ఏదీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీఈడీఏ వివరాల ప్రకారం, గతేడాది రూ. 19,548 కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కాగా, ఇందులో 33 శాతం అమెరికాకి ఎగుమతి అయ్యాయని మధు లాలా చెప్పారు.
ఏపీలో ఆక్వా సాగు, రాష్ట్రంలో కనీసం రొయ్యల సాగు వివరాల గురించి చెప్పాలని మధు లాలాను బీబీసీ అడిగింది. కానీ ఒకసారి సమాచారం చూసుకుని చెబుతానని ఆయన బదులిచ్చారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖకు చెందిన e మత్స్యకార్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో కూడా పూర్తి వివరాలు పొందుపరచలేదు.
రొయ్యల సేకరణ ధర వివరాల పట్టిక కింద ఇవాళ్టి డేట్‌లో కొన్ని రకాల రొయ్యల ధరల వివరాలు మాత్రం పొందుపరిచారు. ఈ నెల పదో తేదీన కొన్ని రకాల రొయ్యల 100 కౌంట్ ధర రూ. 215 నుంచి రూ. 220 మధ్య ఉంది. 16 వ తేదీన వనామీ రొయ్య రకం ధర మాత్రం రూ. 225గా పేర్కొంటోంది వెబ్‌సైట్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














