హైదరాబాద్: బంగ్లాదేశ్ నుంచి 15 ఏళ్ల బాలికను తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి ఎలా దింపారంటే?

బాలిక

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘భారత్‌లో పర్యటక స్థలాలు చూపిస్తామని తీసుకువచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక బెదిరించి వ్యభిచారం చేయిస్తున్నారు’’ అంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలిక హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు.. కేసుతో సంబంధం ఉన్న హైదరాబాద్‌కు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు.

"ఆ బాలికను బంగ్లాదేశ్‌కు పంపించే ప్రయత్నాల్లో ఉన్నాం. దీనిపై విదేశాంగ శాఖతో మాట్లాడుతున్నాం" అని హైదరాబాద్ బండ్లగూడ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని మిర్పూర్ థానా పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఆగస్టు 8న హైదరాబాద్ బండ్లగూడ పోలీసు స్టేషన్‌కు వచ్చింది.

"నేనొక ముఠా చేతిలో చిక్కుకున్నాను, కాపాడండి" అంటూ పోలీసులను వేడుకొంది.

ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన షహనాజ్ ఫాతిమా, హజెరాబేగం, మహ్మద్ సమీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

కేసు వివరాలను చాంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్ వివరించారు.

"భారత్‌లోని పర్యటక ప్రదేశాలు చూపిస్తామని రూప అనే మహిళ ఆ బాలికను తీసుకువచ్చింది. ఈ రూప అనే మహిళ తమ ఇంటి సమీపంలోనే ఉంటున్నట్లు బాలిక చెప్పింది" అని ఏసీపీ చెప్పారు.

ఇంట్లో చెప్పకుండా తనతోపాటు రావాలని బాలికకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చారని పోలీసులు చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికతో కలిసి రూప, భారత్ – బంగ్లా సరిహద్దులోని సొనాయ్ నదిని పడవలో దాటినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అక్కడి నుంచి కోల్‌కతాకు తీసుకువచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు రైలు మార్గంలో చేరుకున్నారు. ఇక్కడ బాలికను రూ.20 వేలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

‘‘మొదట షహనాజ్ ఫాతిమా అనే డ్యాన్సర్‌కు బాలికను అప్పగించింది రూప.

ఆమె బాలికను బెదిరించి వ్యభిచారంలోకి దించారు. భారత్‌లోకి అక్రమంగా చొరబడినందుకు పోలీసులకు చెప్పి జైలుకు పంపిస్తానని బెదిరించి వ్యభిచారంలోకి లాగారని బాలిక చెప్పింది" అని ఏసీపీ సుధాకర్ తెలిపారు.

హైదరాబాద్ పోలీసులు

ఫొటో సోర్స్, Hyderabad Police

కొన్నాళ్ల తర్వాత హజేరాబేగంకు బాలికను అప్పగించింది షహనాజ్ ఫాతిమా.

ఆమె మహ్మద్ సమీర్ అనే వ్యక్తి సహకారంతో బాలికను నగరంలోని వివిధ

హోటళ్లకు తిప్పుతూ వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సర్వర్ అనే వ్యక్తి కూడా వీరికి సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

"బాలికను రోజూ హోటల్‌కు తీసుకెళ్తుంటారు. బండ్లగూడ వైపు నుంచి వెళ్తున్న సందర్భంలో పోలీస్ స్టేషన్ కనిపించడంతో సమీర్ నుంచి తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేసింది" అని బండ్లగూడ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

దాదాపు ఆరు నెలలుగా బెదిరిస్తూ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు బాలిక చెప్పారని వివరించారాయన.

ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు.

అరెస్టైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినా వారెవరూ అందుబాటులోకి రాలేదు.

పెరుగుతున్న మానవ అక్రమ రవాణా బాధితులు

ఈ ఏడాది ఏప్రిల్ లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి డాటాను రాజ్యసభకు సమర్పించింది.

రాజ్యసభలో వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానంగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డాటాను సభకు ఇచ్చింది.

ఇందులో 2018 నుంచి 2022 వరకు లెక్కల ప్రకారం తెలంగాణలో 1301 కేసులు నమోదైనట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

'నేరానికి తగిన శిక్ష ఉంటేనే కట్టడి'

తెలంగాణలో మానవ అక్రమ రవాణా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కావడానికి కారణం ఇక్కడ పోలీసింగ్ వ్యవస్థ గట్టిగా ఉండడమే అన్నారు ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతాకృష్ణన్.

‘ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ ఎక్కువ కేసులు పట్టుకుంటున్నారని చెప్పొచ్చు. కానీ, దోషులను ఎన్ని కేసుల్లో నిరూపించారనేది ఇక్కడ ఆలోచన చేయాలి'' అని అన్నారు.

తెలంగాణలో కేసులు పెడుతున్నా సరే, నేరనిర్ధరణ రేటు చాలా తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

ఉదాహరణకు 2020లో 184 కేసులు పెడితే, అందులో నేర నిరూపణ రెండు కేసులలోనే జరిగింది.

2021లో 347 కేసులకు గాను ఒక్కటి కూడా నిర్ధరణ కాలేదు. 2022లో 391 కేసులకుగాను కేవలం ఒక్క కేసులోనే నేర నిర్ధరణ జరిగింది.

కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు లేకపోవడమే నేర నిరూపణ చాలా తక్కువగా ఉండటానికి కారణమని సునీతా కృష్ణన్ బీబీసీతో చెప్పారు.

''హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఉన్నాయి. కానీ, అందులో పనిచేసే పోలీసులు రోజూ వేర్వేరు విధుల్లో నిమగ్నమవుతుండటంతో కేసుల పరిష్కారానికి వీలు పడటం లేదు'' అని ఆమె వివరించారు.

మానవ అక్రమ రవాణా కేసుల పరిష్కారంలో చైన్ లింకు గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

''మానవ అక్రమ రవాణా కేసుల్లో అరెస్టు అయినప్పుడు వేరే దేశాలు, వేరే రాష్ట్రాలకు చెందినవారు ఉంటున్నారు. వీరిని తీసుకువచ్చి కేసు నిరూపించే విషయం కష్టమవుతోంది'' అని ఆయన వివరించారు.

బంగ్లాదేశ్ బాలిక

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాది ప్రాంతాలను అందుకే ఎంచుకుంటున్నారా?

హైదరాబాద్‌లో బంగ్లాదేశీ యువతులను తీసుకురావడం ఇదే తొలిసారి కాదు, గతంలోనూ కొన్ని సంఘటనలు జరిగాయి.

2019లో పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడుల్లో ఐదుగురు బంగ్లాదేశీ యువతులను కాపాడినట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు.

గతేడాది హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు చేసిన సెర్చ్ ఆపరేషన్‌లో 60 మంది విదేశీయులు పాతబస్తీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.

వారిలో 30 మంది బంగ్లాదేశీయులు.. వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు.

యువతుల అక్రమ రవాణా అనేది హైదరాబాద్‌కే పరిమితం కాలేదని, చెన్నై, ముంబయి, బెంగళూరుకు బంగ్లాదేశ్ యువతులు, బాలికలను తరలిస్తున్నారని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ బీబీసీతో చెప్పారు.

"పశ్చిమ బెంగాల్‌లో వారు మాట్లాడే భాష, యాసను గుర్తిస్తారు. అదే దక్షిణ భారత నగరాలకు తీసుకువస్తే గుర్తించలేరనేది ఒక కారణంగా కనిపిస్తోంది" అన్నారు.

బాలికల తరలింపు

ఫొటో సోర్స్, Getty Images

మానవ అక్రమ రవాణాకు బంగ్లాదేశ్‌ను ఎంచుకోవడానికి కారణాలను కూడా చైతన్య కుమార్ విశ్లేషించారు.

"బంగ్లాదేశీయులు భారతీయులను పోలి ఉండటంతో విదేశీయులుగా గుర్తు పట్టే వీలుండదు. అదే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారినైతే సులువుగా గుర్తుపట్టే వీలుంటుంది. అందుకే మానవ అక్రమ రవాణా చేసి వ్యభిచారంలోకి వారిని లాగుతున్నారు" అని డీసీపీ చైతన్య బీబీసీతో చెప్పారు.

బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల పేరుతో బాలికలు, యువతులకు ఏజెంట్లు వల విసురుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

ఇందుకు ఏజెంటుకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నారని గుర్తించారు.

"బ్యూటీ పార్లర్, మసాజ్ పార్లర్ ఉద్యోగాల పేరుతో తీసుకు వస్తున్నారు. ఆ తర్వాత బెదిరించి, భయపెట్టి వారిని వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు" అని శ్రీనివాసరావు వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)