పులులతోనే పోరాడగల ఎలుగుబంట్లతో కలిసి జీవించడం సాధ్యమేనా, ఆ గిరిజనులు ఏం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సోఫీ హార్డాక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో అంతరించిపోతున్న ఎలుగుబంట్లలో స్లాత్ బేర్లు కూడా ఉన్నాయి.
వాటి ఆవాసాలు తగ్గిపోతూ ఉండటంతో గుజరాత్‌లోని గిరిజనులు, స్లాత్ ఎలుగుబంట్లతో కలిసి జీవించేందుకు మార్గాలు కనుక్కుంటున్నారు.
ఇండియాలోని అడవుల్లో ఒక ఆడ ఎలుగుబంటి, దాని పిల్ల నీళ్లు తాగడాన్ని ఒక పులి చూస్తే, అది వాటిని తేలిగ్గా వేటాడుతుందని అనుకుంటాం. అయితే ఇక్కడే ఆశ్చర్యకరమైన పరిణామం కనిపిస్తుంది.
పులిని చూసి ఎలుగుబంటి పారిపోదు. ఆశ్చర్యకరంగా అది ఎదురుదాడి చేస్తుంది.
పులి కూడా ఒక అడుగు వెనక్కి వేసినా, తర్వాత పోరాడుతుంది. 45 నిముషాల పోరాటంలో రెండూ తీవ్రంగా ఘర్షణపడి అలసిపోతాయి.
భారత్, నేపాల్, శ్రీలంకలో విస్తృతంగా కనిపించే స్లాత్ ఎలుగుబంట్లు ఉపఖండంలో అత్యంత దూకుడుగా వ్యవహరించే జంతువులుగా గుర్తింపు పొందాయి.
పులులపైనే కాకుండా మనుషులతో సహా తమకు ముప్పు అని భావించిన ఎవరిపైనైనా ఇవి దాడి చేస్తాయి.
1950 నుంచి 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మీద దాడి చేసే క్రూర మృగాలపై అధ్యయనం జరిగింది.
ఇందులో పులులు, సింహాలు, నక్కలు, ఇతర ఎలుగుబంట్లు సహా మిగతా జంతువులన్నింటికన్నా, స్లాత్ ఎలుగుబంట్ల దాడులే దాడులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఈ 69 ఏళ్లలో స్లాత్ ఎలుగుబంట్లు మనుషుల మీద దాడి చేసిన ఘటనలు 1337 నమోదయ్యాయి. (పులులు 1,047, నక్కలు 414, ధ్రువపు ఎలుగుబంట్లు 23 సార్లు దాడులు చేశాయి)
పులులు, సింహాలు వంటి క్రూర మృగాల దాడుల్లో మనుషుల మరణాల రేటు (65శాతం) ఎక్కువగా ఉంటే, స్లాత్ ఎలుగుబంట్ల దాడుల్లో అది 8 శాతంగా ఉంది.
అడవులు అంతరించిపోతూ ఉండటం, వేట, అక్రమ రవాణా కారణంగా ఎలుగుబంట్ల అస్తిత్వానికి ముప్పు పెరిగింది. వాటి సంఖ్య తగ్గుతోంది.

ప్రపంచవ్యాప్తంగా స్లాత్ ఎలుగుబంట్ల జనాభా 20,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా.
ఇది ఎలుగుబంట్ల సమస్య మాత్రమే కాదు. ఎందుకంటే ఎలుగుబంట్లు పర్యావరణ ఇంజనీర్లు. పండ్లను తిన్నప్పుడు, అందులో ఉండే విత్తనాలు కింద పడి మొక్కలు మొలిచి, వృక్షాలుగా మారతాయి. అంతే కాకుండా చెద పురుగులను తినడం ద్వారా చెట్లను కాపాడతాయి.
ఎలుగుబంట్లు ఎలా వ్యవహరిస్తాయి, తమకు ముప్పు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయిలాంటి అంశాల విషయంలో వాటి ప్రవర్తనను అర్ధం చేసుకోవడం ద్వారా మనుషులు వాటితో కలిసి జీవించవచ్చని అధ్యయనం సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలుగుబంట్లను తప్పుగా అర్థం చేసుకున్నామా?
స్లాత్ ఎలుగుబంట్లు స్వభావసిద్ధంగా దూకుడుగా కానీ, చంపాలనే ఉద్దేశంతోకానీ ఉండవని గుజరాత్‌కు చెందిన గిరిజన నాయకుడు నిషిత్ ధారయా చెప్పారు.
మనుషుల విషయంలో వాటి దూకుడు ప్రవర్తన, క్రూర మృగాలు దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అవి ఎలా వ్యవహరిస్తాయో ఊహించడం కష్టమని, అవి ఆ సమయానికి ఉన్న పరిస్థితుల్నిబట్టి తమ వ్యవహార శైలిని మార్చుకుంటాయని ఆయన చెబుతారు.
‘‘ఉదాహరణకు పిల్లలను తీసుకెళుతున్న ఆడ ఎలుగుబంటికి ప్రమాదం ఎదురైనప్పుడు అది పులి, సింహం, చిరుతపులి లేదా మనిషైనా సరే, మొదట తన ఎదురుగా ఉన్న జంతువు కంటే పెద్దదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. వెనుక కాళ్లపై నిలబడి ముందు కాళ్లతో దాడి చేస్తుంది" అని నిషిత్ చెప్పారు.
ఎలుగుబంటి ఆహారపు అలవాట్లలో భాగంగా చీమల పుట్టలను తవ్వుతుంది. ఇందుకు దాని కాళ్లకున్న పొడవాటి పంజాలు సాయపడతాయి.
పులులు ఇతర క్రూర మృగాలతో పోరాడేటప్పుడు ఎలుగుబంటి నిలబడి పోరాడుతుంది. దీని వల్ల ఎలుగుబంటికి ప్రత్యర్థిపైన ఆధిపత్యం లభించే అవకాశం వస్తుంది. ఎలుగుబంటి- పులి పోరాటం వీడియోలను పరిశీలించినప్పుడు పులులు దగ్గరగా వచ్చినప్పుడు ఎలుగుబంటి నిలబడుతుంది.
అలా నిలబడకపోతే ఆ ఎలుగుబంటి చనిపోవడమే. వీటితో పోరాటంలో పులులు గాయపడవు లేదా చనిపోవు. దాడి చేయడంలో, పరుగెత్తడంలో పులికుండే వేగం ఇందుకు కారణం కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మనిషిపై దాడి చేస్తే..
ఎలుగుబంటి మనిషి మీద దాడి చేస్తే, దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టమని వాటి దాడికి గురైన వారి అనుభవాలనుబట్టి తెలుస్తోంది.
ఎలుగుబంటి మనిషిని చూసినప్పుడు, మనిషి దానిని చూడటానికి ముందే దాడి చేస్తుందని వారి అనుభవాలు చెబుతున్నాయి.
నిలబడి ఉన్న ఎలుగుబంటి మనిషిపై దాడి చేసినప్పుడు, ముందుగా దాని పాదాలు మనిషి మొహాన్ని పట్టుకుంటాయి.
"అందుకే స్లాత్ ఎలుగు బంట్లు చాలా ప్రమాదకరమైనవి. అవి వాటి కుటుబంతో ఉన్నప్పుడు మరింత ప్రమాదకరంగా, దూకుడుగా వ్యవహరిస్తాయి" అని ధారయా చెప్పారు.
వాస్తవంగా చూస్తే స్లాత్ ఎలుగుబంట్లు మిగతా రకాల కంటే కొంత సాధుజీవులుగా భావించాలి. అయితే అవి దాడి చేసే విధానం మాత్రం క్రూరంగా ఉంటుందని ఆయన వివరించారు.
ఎలుగుబంటి దాడి చేస్తే తీవ్రమైన, ప్రాణాంతకమైన గాయాలవుతాయి.
2020లో శ్రీలంక అడవిలో పసుపు దుంపల కోసం వెతుకుతున్న 50 ఏళ్ల వ్యక్తి మీద దాడి చేసిన ఎలుగుబంటి, గోళ్లతో ఆయన ముఖాన్ని చీల్చి వేసింది.
2023లో ఒక పశువుల కాపరిపై ఎలుగుబంటి చేసిన దాడి కారణంగా, ఆయన మొహం వికృతంగా మారింది.
ఒడిశాలో ఒక వ్యక్తిపై ఎలుగుబంటి తీవ్రంగా దాడి చేయడంతో ఆయన తలలో నుంచి మెదడు బయటకు వచ్చింది. శస్త్ర చికిత్సతో ఆయన్ను కాపాడినట్లు 2017లో ప్రచురించిన ఒక నివేదిక వెల్లడించింది.
ఎలుగుబంటి దాడులు చాలా శక్తివంతంగా, తీవ్రంగా ఉన్నాయని, స్పందించడానికి సమయం కూడా ఉండదని వాటి దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు.
‘‘అది చాలా వేగంగా జరిగింది. ఎలుగుబంటి వస్తున్నట్లు నేను చూడలేదు. అది వస్తున్నప్పుడు నేల మీద అలికిడి, దాని అరుపు మాత్రమే విన్నా’’ అని ఓ బాధితుడు చెప్పారు.

ఫొటో సోర్స్, Nishith Dharaiya
ఒకరికొకరు ఎదురు పడకుండా..
స్లాత్ ఎలుగుబంట్ల దాడులపై మధ్య గుజరాత్‌లో ధారయా బృందం అధ్యయనం చేస్తోంది. అక్కడ ఉంటున్న గిరిజనులపై ఇలాంటి దాడులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది.
"ఇక్కడ ఉండేవారిలో ఎక్కువ మంది గిరిజనులు. కట్టెలు, కలప, పండ్లు, తేనే, ఔషధ మొక్కల సేకరణ కోసం వాళ్లు అడవిలోకి వెళుతుంటారు’’ అని ధారయా చెప్పారు.
ఈ సమయంలో వారికి ఎలుగుబంట్లు తారసపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.
సంప్రదాయ మద్యం తయారీ కోసం గ్రామస్తులు ఒక రకం పువ్వుల్ని సేకరిస్తారు.
"ఈ పూలను సేకరించడానికి వాళ్ళు ఉదయాన్నే వెళ్ళాలి. అప్పుడే ఎలుగుబంట్లు కూడా ఆహారం కోసం వెతుకుతాయి. ఆ పూలే ఎలుగుబంట్లకు కూడా ఆహారం. అందుకే అవి కూడా ఈ ప్రదేశానికి వస్తాయి. తెల్లవారు జామున సరిగ్గా కనపడదు. అందువల్ల అవి మనుషుల మీద దాడి చేసే అవకాశం ఉంది" అని ధారయా చెప్పారు.
మధ్య గుజరాత్‌లోని గిరిజనులను ఎలుగుబంట్ల గురించి అడిగినప్పుడు వాటిని తాము ముప్పుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎలుగుబంట్ల సంరక్షణకు మద్దతు చాలా తక్కువమంది నుంచి లభించింది.

ఫొటో సోర్స్, Nishith Dharaiya
ఈ ఆలోచనా ధోరణిని మార్చేందుకు డబ్ల్యూసీబీ రీసర్చ్ ఫౌండేషన్‌కు చెందిన ధారయా, ఆయన సహచరులు ప్రయత్నిస్తున్నారు. ఎలుగుబంట్ల దాడులు, ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారి అనుభవాలను రికార్డు చేస్తున్నారు.
ఆ అనుభవాల ఆధారంగా స్థానికులు ఎలుగు బంట్ల దాడుల బారిన పడకుండా చూసేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఇందులో భాగంగా స్థానికుల్లో అవగాహన కలిపిస్తున్నారు. ఎలుగుబంటి ఎదురైనప్పుడు వాటి బారిన పడకుండా ఎలా తప్పించుకోవచ్చనే దాని గురించి వివరిస్తున్నారు.
దీని వల్ల ఎలుగుబంట్ల నుంచి మనుషులకు ముప్పు తగ్గే అవకాశం ఉంది
ప్రజలు ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి నివాసాలకు సమీపంలో టాయిలెట్లు నిర్మించాలని కూడా వారు సిఫార్సు చేస్తున్నారు.
దీనికి తోడు పూసలు, పదునైన ఊచలతో ప్రత్యేక కర్రను రూపొందించారు.
దీనిని హిందీలో ‘కాంతి కాటి’ (చేతికర్ర) అని పిలుస్తున్నారు.
‘‘ఈ కర్ర ప్రధాన ఉద్దేశం ఎలుగుబంట్లను భయపెట్టడం, వాటితో ఘర్షణను నివారించడం’’ అని ధారయా చెప్పారు.
ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్న అడవుల్లో గస్తీ తిరిగే అధికారులు, గిరిజన ప్రజలకు ధారయా బృందం 500 కర్రలను పంపిణీ చేసింది.
"ఈ కర్రను వాడుతున్నప్పుడు గంటలు మోగుతాయి. ఆ శబ్దం ఎలుగుబంట్లను హెచ్చరిస్తుంది. అవి మనుషుల దగ్గరకు వస్తే ఈ ఇనుప సీలలున్న కర్రలతో ఆపవచ్చు. దీనివల్ల ఇద్దరూ సేఫ్‌గా ఉంటారు" అని ధారయా చెప్పారు.
"స్లాత్ ఎలుగుబంట్లు భారత ఉపఖండంలో మాత్రమే నివసిస్తాయి. కాబట్టి, వాటిని రక్షించడం మన కర్తవ్యం" అని ఆయన అన్నారు.
"అవి చీమలు, చెద పురుగుల జనాభాను అదుపులో ఉంచుతాయి. విత్తనాలను విసర్జించడం ద్వారా ప్రకృతిని కాపాడతాయి. పర్యావరణ వ్యవస్థలో ఎలుగుబంటి చాలా ముఖ్యమైన జంతువు" అని నిషిత్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














