ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం: ‘‘అణుబాంబు బెదిరింపులను సహించం’’

ఫొటో సోర్స్, PIB/YT
లక్ష కోట్ల రూపాయలతో "ప్రధానమంత్రి వికసిత్ రోజ్‌గార్ యోజన"ను ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.
ఈ పథకం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు.
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ప్రధానమంత్రి వికసిత్ రోజ్‌గార్ యోజన కింద ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం సాధించినవారికి కేంద్ర ప్రభుత్వం రూ.15వేలు ఇస్తుందని మోదీ చెప్పారు. ఈ పథకం వల్ల 3.5 కోట్ల మంది లబ్ధి పొందుతారని అన్నారు. ఈ పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ గత నెలలో ప్రకటించింది.
రానున్న రెండేళ్లలో మూడున్నర కోట్ల మంది ఉద్యోగాలు పొందిన వారికి ప్రోత్సాహకం ఇవ్వడమే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లక్ష్యమని మోదీ జులై 25న చెప్పారు. ఇందులో 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగం సాధించిన వాళ్లు లబ్ధి పొందనున్నారు.
దీంతో పాటు ప్రధాని అనేక అంశాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఇందులో ‘ఆపరేషన్ సిందూర్’, సింధు నదీ జలాల ఒప్పందం, పాకిస్తాన్ అణు బెదిరింపులు, అంతరిక్ష రంగంలో భారత యాత్ర, రక్షణ రంగంలో మేకిన్ ఇండియా సాధిస్తున్న విజయాలతో పాటు ఇంకా అనేక అంశాల గురించి మాట్లాడారు.


ఫొటో సోర్స్, PIB/YT
ప్రధానిగా నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి 12వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు ప్రజలపై పూల వర్షం కురిపించాయి. ఈ హెలికాప్టర్లలో ఒకటి భారత త్రివర్ణ పతాకంతో, మరొక హెలికాప్టర్ ఆపరేషన్ సిందూర్ జెండాతో ఎగిరింది.
స్వాతంత్య్రం వచ్చే సమయానికి దేశ ఆకాంక్షలు పెరుగుతున్నాయని, అయితే సవాళ్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయని, కానీ మన రాజ్యాంగం ఎల్లప్పుడూ మనకు మార్గాన్ని చూపించిందని ప్రధాని అన్నారు.
"రాజ్యాంగ నిర్మాతలతో పాటు, దేశ మహిళా శక్తి కూడా భారత రాజ్యాంగాన్ని సాధికారపరచడంలో తన పాత్రను పోషించింది" అని మోదీ చెప్పారు.
‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.
‘ఆపరేషన్ సిందూర్’ వీర సైనికులకు ఎర్రకోట నుండి సెల్యూట్ చేసే అవకాశం లభించడం పట్ల చాలా గర్విస్తున్నాను అని మోదీ చెప్పారు.
"ఏప్రిల్ 22న సరిహద్దు అవతల నుండి వచ్చిన టెర్రరిస్టుల మారణ హోమం, టూరిస్టులను వారి మతం గురించి అడిగి చంపడం, భర్తలను వారి భార్యల ముందే కాల్చి చంపడం, వారి తండ్రులను వారి పిల్లల ముందే చంపడం ఇదంతా చూసి దేశమంతా ఆగ్రహంతో రగిలి పోయింది"
‘ఆపరేషన్ సిందూర్’ ఆ కోపానికి వ్యక్తీకరణ. ఏప్రిల్ 22తర్వాత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మన సైన్యం దశాబ్ధాలుగా చేయని పని చేసింది అని మోదీ చెప్పారు.

ఫొటో సోర్స్, PIB/YT
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల అణ్వస్త్రాలతో దాడి చేస్తామన్న ప్రకటనపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పందించారు.
"చాలా ఏళ్లుగా న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్ జరుగుతోంది. ఇకపై దానిని సహించేది లేదు. భారతదేశపు నదీ జలాలు శత్రువుల పొలాల్లోకి ప్రవహిస్తున్నాయి. ఇకపై అలా జరగదు. రక్తం, నీరు కలిసి ప్రవహించవు" అని సింధు నది జలాల ఒప్పందంపై ఇటీవల తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు.
సముద్రంలో చమురు, గ్యాస్ నిల్వలను కనుక్కోవడానికి భారతదేశం నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌ను ప్రారంభించబోతోందని ఆయన అన్నారు.
"నేడు ప్రపంచం మొత్తం కీలకమైన ఖనిజాల గురించి అన్వేషిస్తోంది. అందుకే భారత్ కూడా నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించాము. 1,200 కంటే ఎక్కువ ప్రదేశాలలో అన్వేషణ కార్యకలాపాలు జరుగుతున్నాయి" అని మోదీ చెప్పారు.
మిషన్ గ్రీన్ హైడ్రోజన్ కోసం భారతదేశం వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతోందని ఆయన అన్నారు.
వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకునే నాటికి అణుశక్తిని 10రెట్లు పెంచాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
అంతరిక్షంలో భారత్ సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ త్వరలోనే భారత్ అంతరిక్ష కేంద్రం నిర్మిస్తుందని అన్నారు.
‘ప్రధాని ప్రసంగం ఓ ఆత్మస్తుతి’
ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఆత్మస్తుతి, ఎంపికచేసిన కథనాలతో సాగిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేశ్ ఎక్స్‌లో విమర్శించారు.
‘‘స్వాతంత్య్ర దినోత్సవం దార్శనికతకు, ధైర్యసాహసాలకు, స్ఫూర్తికి ప్రతీకగా నిలవాలి. కానీ దానికి భిన్నంగా ఆత్మస్తుతి, ఎంపిక చేసిన కథనాల మిశ్రమంతో ప్రధానిప్రసంగం సాగింది’’ అని పేర్కొన్నారు.
దేశంలో ఆర్థికసంక్షోభం, నిరుద్యోగం, సమాజంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిజాయితీగా అంగీకరించకుడా ప్రసంగం సాగిందని జైరాం రమేశ్ విమర్శించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














