హౌసా బాయి: స్వతంత్ర పోరాటంలో పోలీసుస్టేషన్‌లో ఆయుధాలు ఎలా మాయంచేశారు, పోలీసుల కళ్లు ఎలా కప్పారు?

ఫొటో సోర్స్, HOUSABAI FAMILY
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1943. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా భవానీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఒక వింత సంఘటన జరిగింది. ఓ వ్యక్తి మద్యం సేవించి తన భార్య హౌసా బాయిని చితకబాదుతున్నారు.
ఆమెను కొట్టిన తర్వాత, ఒక పెద్ద రాయిపట్టుకుని, '' ఈ రాయితో ఇప్పుడే నిన్ను చంపేస్తా'' అంటూ గట్టిగట్టిగా అరుస్తున్నారు.
అప్పటి వరకు వారి గొడవ చూస్తూ బయట ఉన్న ఇద్దరు పోలీసులు అది విన్న వెంటనే స్టేషన్‌లోకి వచ్చేశారు. బహుశా ఆ హత్యకు వారు సాక్షులు కావాలనుకోలేదేమో.
'' పోలీసు అధికారులు మా మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. మా సోదరుల్లో ఒకరు అక్కడున్నారు. నా భర్త దగ్గరకు మళ్లీ పంపించవద్దని అక్కడున్న నా సోదరుడిని వేడుకున్నాను. ఆయనతో ఎట్టిపరిస్థితుల్లో వెళ్లేది లేదని తేల్చిచెప్పాను. నేను ఇక్కడే ఉంటాను. ఇంట్లో కాస్త చోటు ఇవ్వాలని అడిగాను. కానీ, నా సోదరుడు వినలేదు'' అని హౌసా బాయి చెప్పారు.
హౌసా బాయి, ఆమె భర్త మధ్యఉన్న సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు వారిద్దర్ని బాగా తిట్టి చివరికి ఎలాగో వారి మధ్య సయోధ్య కుదిర్చి తీసుకువెళ్లి రైల్వేస్టేషన్ వద్ద వదిలేశారు.

పోలీసు స్టేషన్‌లో ఆయుధాల దొంగతనం
'' ది లాస్ట్ హీరోస్, ఫుట్-సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం'' పేరుతో ప్రముఖ జర్నలిస్ట్ పీ. సాయినాథ్ రాసిన పుస్తకంలో.. '' పోలీసులు లేనప్పుడు, హౌసా బాయి సహచరులు పోలీసు స్టేషన్‌లోకి దూరి నాలుగు తుపాకీలు, కాట్రిడ్జ్‌లు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు'' అని రాశారు.
'' హౌసా బాయి, ఆమె నకిలీ తాగుబోతు భర్త, సోదరుడు కేవలం పోలీసులను మోసం చేయడానికే గొడవ పడ్డారు. ఆ సమయంలో హౌసా బాయికి 17 ఏళ్లు. అప్పటికే ఆమెకు పెళ్లయి మూడేళ్లు అయింది, ఒక బిడ్డ కూడా ఉన్నారు'' అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PENGUIN
'తూఫాన్ సేన'
ఈ ఘటన జరిగిన సుమారు 74 ఏళ్లకు సాంగ్లి జిల్లాలోని తన గ్రామం వీతాలో హౌసా బాయి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె నవ్వుతూ ఆరోజు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకున్నారు.
'' ఆ గొడవ నిజమని నమ్మేలా చేసేందుకు నన్ను కొట్టిన నకిలీ భర్తపై నేను ఇప్పటికీ కోపంగా ఉన్నాను. ఆ తర్వాత నేను ఆయన్ను గట్టిగా కొట్టాను. కానీ, గొడవ నిజంలా కనిపించాలంటే తప్పక కొట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. పోలీసు స్టేషన్ నుంచి పోలీసులను బయటకి రప్పించేందుకు అదొక్కటే మార్గం కనిపించింది'' అని హౌసా బాయి చెప్పారు.
గొడవ పడ్డ హౌసా బాయి, ఆమె నకిలీ భర్త, సోదరుడు వీరందరూ ‘తూఫాన్ సేనా''కు చెందినవారు. ''తూఫాన్ సేనా'' అనేది ఓ సాయుధ దళం. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రాన్ని ప్రకటించుని సమాంతర ప్రభుత్వాన్ని నడిపే సంస్థ.

ఫొటో సోర్స్, RAM CHANDRA SRIPATI LAD FAMILY
సమాంతర ప్రభుత్వం
'ప్రతి సర్కార్ (తిరుగుబాటు ప్రభుత్వం)' ప్రధాన కార్యాలయం కుందల్‌లో ఉండేది. రైతులు, కార్మికులకు చెందిన సంస్థ ఇది.
దీనిలో 600 మంది గ్రామస్థులు ఉన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం కింద ఉండటానికి వీరు సమ్మతించేవారు కాదు.
'' స్వతంత్ర ఉద్యమానికి చెందిన సంప్రదాయ పోరాటంపై నిరాశ చెందిన కొందరు వ్యక్తుల నుంచి 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ప్రతి సర్కార్, తూఫాన్ సేనలు ఉద్భవించాయి.
వారు ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు దాన్ని చట్టబద్ధమైన ప్రభుత్వంగా పరిగణించేవారు. ఆ సమయంలో సతారా అనేది అతిపెద్ద ప్రాంతం. సాంగ్లి జిల్లా కూడా దానిలో భాగమే'' అని సాయినాథ్ రాశారు.
1943 నుంచి 1946 మధ్య కాలంలో బ్రిటీష్ రైళ్లపై దాడి చేసిన, పోలీసు స్టేషన్ల నుంచి ఆయుధాలను దొంగలించిన, బ్రిటీష్ అధికారులు నివాసం ఉంటున్న డాక్ బంగ్లాలకు నిప్పు అంటించిన విప్లవకారుల బృందంలో హౌసా బాయి కూడా సభ్యురాలు. ఆమెను హౌసా తాయి అని కూడా పిలిచేవారు.

ఫొటో సోర్స్, HOUSABAI FAMILY
రైళ్ల నుంచి దొంగతనం
'' రైల్వే ట్రాకులపై పెద్ద రాళ్లను పెట్టి, తూఫాన్ సేనా రైళ్లను ఆపేది. రైలు ఆగిన తర్వాత, చివరి కోచ్ వెనుకాల కూడా రాళ్లు పెట్టేవారు. దీంతో, ఆ రైలు వెనక్కి వెళ్లేందుకు కూడా వీలుండేది కాదు. వారివద్ద కొడవళ్లు, కర్రలు, చేతితో తయారు చేసిన బాంబులు ఉండేవి'' అని తూఫాన్ సేనాలో సభ్యుడైన బౌ లాడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
'' ఆ సమయంలో ట్రైన్ చీఫ్ గార్డు వద్ద తుపాకీ ఉండేది. కానీ, విప్లవకారులు ఆ తుపాకీని కూడా లెక్కచేయకుండా రైళ్లను కంట్రోల్ చేసేవారు. రైలు ద్వారా పంపే డబ్బులను దొంగలించడమే తూఫాన్ సేనా పని. ఒకసారి అదే తరహాలో రైలును ఆపి, ఐదు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు దోచుకున్నారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. దొంగలించిన డబ్బును సమాంతర ప్రభుత్వానికి, పేద ప్రజలకు, అవసరమైన వారికి పంపారు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, RAM CHANDRA SRIPATI LAD FAMILY
తండ్రి కూడా స్వాతంత్య్ర సమర యోధుడు
హౌసా బాయి 1926 ఫిబ్రవరి 12న జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆమెకు పెళ్లయింది. 1944లో గోవాలో పోర్చుగీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అండర్‌గ్రౌండ్ ఉద్యమంలో కూడా ఆమె పాల్గొన్నారు.
హౌసా బాయికి మూడేళ్లు ఉన్నప్పుడే, ఆమె తల్లి చనిపోయారు. ఆ సమయంలో జ్యోతిబా ఫూలే, మహాత్మా గాంధీ ప్రసంగాలతో ఆమె తండ్రి బాగా ప్రభావితులై, ఆయన కూడా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.
ఆమె తండ్రి పంచాయతీ గుమస్తా ఉద్యోగాన్ని వదిలేసి, తన పూర్తి సమయాన్ని స్వాతంత్య్ర పోరాటానికే అంకితం చేశారు.
ఆయనకు వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వం పలుసార్లు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అయితే ఆయన తన పనంతా అండర్‌గ్రౌండ్‌లోనే చేశారు.

ఫొటో సోర్స్, HOUSABAI FAMILY
ఆస్తులన్నీ స్వాధీనం
హౌసా బాయి తండ్రితో 500 మంది వరకు పనిచేసేవారు. వారందరికి వ్యతిరేకంగా ప్రభుత్వం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వారిపై చర్యలు తీసుకోవడానికి బ్రిటీష్ అధికారులు రాత్రివేళల్లో వచ్చేవారు.
హౌసా బాయి తండ్రి వద్ద పనిచేసేవారు రైల్వే లైన్లను నాశనం చేయడమే పనిగా పెట్టుకునేవారు. ప్రయాణికుల వాహనాలను వారు పట్టాలు తప్పించేవారు కాదు. బ్రిటీష్ ప్రభుత్వానికి వస్తువులను తీసుకెళ్లే గూడ్స్ ట్రైన్లే వారికి లక్ష్యంగా ఉండేవి.
హౌసా బాయి తండ్రి నానా పాటిల్‌ను బ్రిటీష్ ప్రభుత్వం పట్టుకోలేకపోతుండటంతో, ఆయన ఆస్తులన్నింటిన్నీ జప్తు చేసింది.
'' 1929లో మా ఇంటిని జప్తు చేసింది ప్రభుత్వం. మేం ఉండేందుకు చిన్న గదిని ఇచ్చింది. మా పంట పొలాలన్నీ కూడా బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో, మాకొచ్చే ఆదాయమంతా ఆగిపోయింది'' అని హౌసా బాయి గుర్తు చేసుకున్నారు. పోలీసుల భయంతో గ్రామస్థులు తమతో మాట్లాడేవారు కాదని తెలిపారు హౌసా బాయి. ఊరిలో కిరాణా సరుకులు అమ్మే వ్యక్తి కూడా తమకు ఉప్పు అమ్మేందుకు వెనకాడినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, PSAINATH.COM
పేదరికంతోనే బ్రిటీష్ ప్రభుత్వంతో పోరాటం
గ్రామస్తులు ఎవరూ హౌసా బాయికు సాయం చేయలేదు. కానీ, వారు బ్రిటీష్ ప్రభుత్వానికి కూడా సహకరించలేదు. నానా పాటిల్ ఆస్తిని వేలం వేస్తున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటిస్తే, కనీసం ఎవరూ ముందుకు వచ్చి కొనుగోలు చేయలేదు.
హౌసా బాయి మేనమామ ఆమె బతకడం కోసం ఒక ఎడ్ల బండితో పాటు జత ఎద్దులను ఇచ్చారు. బెల్లం, పల్లీలు, పప్పులను ఆ ఎడ్ల బండిపై మార్కెట్‌కు తరలించడం ప్రారంభించింది ఆమె కుటుంబం.
1947లో స్వాతంత్య్రం వచ్చేంత వరకు హౌసా బాయి కుటుంబం ఆ ఒక్క గదిలోనే నివసించింది.
'' మా నాన్నమ్మ జాకెట్ చినిగిపోయింది. కొత్తది కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు. మా నాన్న లుంగీని రెండు ముక్కలుగా చింపుకుని, దాన్నుంచి రెండు తెల్ల జాకెట్‌లు తయారు చేసుకుంది. ఆ తర్వాత మాకు కొంత డబ్బులు వచ్చాయి. ఆమెకోసం కొత్త జాకెట్ కొన్నాం. కానీ, దాన్ని ఆమె ముట్టుకోలేదు'' అని హౌసా బాయి గుర్తు చేసుకున్నారు.
''స్వాతంత్య్రం వచ్చి, మా ఆస్తులన్నీ మాకు తిరిగి వచ్చేంత వరకు, ఆమె తన కొడుకు లుంగీతో చేసుకున్న ఆ రెండు జాకెట్‌లనే వేసుకుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆమె రంగు రంగుల జాకెట్‌లు వేసుకోలేదు. కేవలం తెల్ల జాకెట్‌లే వేసుకుంది. 1963లో ఆమె చనిపోయేంత వరకు కూడా తెల్ల జాకెట్‌లనే ధరించింది'' అని హౌసా బాయి చెప్పారు.

ఫొటో సోర్స్, HOUSABAI FAMILY
గోవాలో జైలు నుంచి సహచరుడిని విడిపించడానికి సాహసం...
హౌసా బాయి తూఫాన్ సేనకు చెందిన తన సహచరులతో కలిసి గోవాలో జరిగిన ఒక ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
అక్కడి నుంచి సతారాకు ఆయుధాలను తరలిస్తుండగా వారి సహచరుల్లో ఒకరైన బాల్ జోషి పోర్చుగీస్ పోలీసులకు దొరికిపోయారు. ఆయన్ని విడిపించే బాధ్యత కూడా హౌసా బాయి బృందంపైనే పడింది.
అప్పట్లో, భారతీయ విప్లవకారులు, ముఖ్యంగా మహారాష్ట్రలో చురుగ్గా ఉద్యమంలో పాల్గొంటున్నవారు గోవా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం సర్వసాధారణమైన విషయం.
ఆయుధాల కొనుగోలు భారతదేశంలోని ఇతర ప్రాంతాల కన్నా గోవాలో సులభంగా ఉండేది. బాల్ జోషిని విడిపించే ఆపరేషన్‌లో స్వయంగా పాల్గొనాలని తూఫాన్ సేన వ్యవస్థాపకుడు, నాయకుడైన జీడీ బాబు లాడ్ నిర్ణయించుకున్నారు. హౌసా బాయి కూడా ఆయన్ను అనుసరించారు.
ఆమె సాహసం గురించి పీ.సాయినాథ్ ఏమని రాశారంటే... ''హౌసా బాయి పనాజీ జైలులో ఉన్న బాల్ జోషిని కలిశారు. ఆయన సోదరినని చెప్పి కలవగలిగారు. అక్కడి నుంచి ఆయన్ను తప్పించడానికి ఏవిధమైన వ్యూహం రచించిందీ ఒక కాగితంపై రాసి రహస్యంగా దాన్ని తన హెయిర్ బన్‌లో పెట్టి అందించారు. దీంతోపాటు గోవా పోలీసులకు దొరకని తూఫాన్ సేన ఆయుధాలను ఆమె తీసుకు రావాల్సి వచ్చింది'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, INDIA WATER PORTAL
చెక్కపెట్టెపై నదిని దాటేశారు...
దోపిడీకి ముందు హౌసా బాయిని పోలీసుస్టేషన్‌లో పోలీసులు చూశారు. కాబట్టి రైలులో వెళ్లడం శ్రేయస్కరం కాదని నడిచి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలో దట్టమైన అడవుల గుండా మైళ్ల దూరం నడవాల్సి వచ్చింది.
''అలా నడిచి వెళ్తూ మాంద్వి నది ఒడ్డుకు చేరుకున్నాం. నదిని దాటడానికి పడవ లేదు. ఈదుకుంటూ వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. నేను చెరువులో ఈత కొట్టేదాన్ని. కానీ అంత పెద్ద నదిలో ఈదుకుంటూ వెళ్లడం నా శక్తికి మించినది'' అని హౌసా బాయి నాటి తన సాహసాన్ని గుర్తుచేసుకున్నారు.
''అప్పుడు మేం ఒక చేపల వలలో చుట్టి ఉన్న చెక్క పెట్టెను చూశాం. అర్ధరాత్రి వేళ ఆ పెట్టెపై బోర్లా పడుకొని నది దాటాను. అదే సమయంలో నా సహచరులు ఈదుతూ అనుసరించారు. అవసరమైనప్పుడు పెట్టెను ముందుకు నెట్టేవారు. అలా నదిని దాటాక మళ్లీ అడవిలో ముందుకు సాగాం. 13 రోజుల పాటు నడిచిన తర్వాత ఇంటికి చేరుకున్నాం'' అని ఆమె వెల్లడించారు.
కొన్ని రోజుల తర్వాత బాల్ జోషి కూడా తన సహచరుల సాయంతో జైలు నుంచి తప్పించుకోగలిగారు. ఈ ప్రయత్నంలో హౌసా బాయి రహస్యంగా ఆయనకు అందించిన కాగితం చాలా కీలకం అయ్యింది.

ఫొటో సోర్స్, HOUSABAI FAMILY
95 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు
భవానీనగర్ పోలీసుస్టేషన్ కేసు, గోవా ఆపరేషన్ ముందువరకూ హౌసా బాయి పోషించిన పాత్ర ఏమిటంటే... తూఫాన్ ఆర్మీ కోసం నిఘా సమాచారాన్ని సేకరించడం.
డాక్ బంగ్లాలో ఎంతమంది పోలీసులు ఉన్నారు, వారు రాకపోకలు ఎప్పుడెప్పుడు సాగిస్తారు, వారిపై సులభంగా దాడి చేయడానికి ఏ సమయంలో అనుకూలం? అనేదీ సమాచారం ఇస్తే, డాక్ బంగ్లాకు నిప్పు అంటించే పని మరో బృందం చేసేది.
''బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో ఈ డాక్ బంగ్లాలు చాలా కీలక పాత్ర పోషించేవి. వాటిని ధ్వంసం చేస్తే ఆ ప్రాంతంలో పరిపాలనకు తీవ్ర అంతరాయం కలిగేది'' అని సాయినాథ్ రాశారు.
హౌసా బాయి తన 95 ఏళ్ల వయసులో 2021, సెప్టెంబర్ 23న ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో హౌసా బాయికి దక్కాల్సిన సముచిత స్థానం మాత్రం ఎన్నడూ లభించలేదు. చరిత్ర పుస్తకాల్లోనూ ఆమెను విస్మరించారు.
మహారాష్ట్ర చరిత్రలో అక్కడక్కడా తిరుగుబాటు ప్రభుత్వం (ప్రతి సర్కార్) గురించి ప్రస్తావిస్తున్నారు.
కానీ తూఫాన్ సేన వీరోచిత దోపిడీలు త్వరగానే మదిలో నుంచి తొలగిపోయాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














