కేంద్ర బడ్జెట్: స్వాతంత్య్రం తరువాత తొలి బడ్జెట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్పులు వచ్చాయి?

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ 2025ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్నారు.

దీంతో, పదిసార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె చేరువయ్యారు.

ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 1964 మధ్యలో ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1967 నుంచి 1969 మధ్యలో నాలుగు బడ్జెట్లు తీసుకొచ్చారు.

పలువురు ప్రధానమంత్రుల నాయకత్వంలో, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తొమ్మిది బడ్జెట్లను.. ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

అయితే, వరుసగా ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డు నిర్మలా సీతారామన్ పేరుపైనే ఉండనుంది.

2019లో మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయి ఆర్థికమంత్రి అయ్యారు నిర్మలా సీతారామన్.

2024లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌నే కొనసాగించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్థికమంత్రిగా ప్రస్తుత భారత ఆర్థిక స్వరూపాన్ని మార్చిన ఘనత దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్‌కే దక్కుతుంది.

పీవీ నరసింహరావు పదవీకాలంలో 1991 నుంచి 1995 మధ్యలో ఐదు బడ్జెట్లను ఆయన ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌లో పెట్టిన ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. పార్లమెంట్‌ నుంచి ఆమోదం పొందిన తర్వాత, ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. తర్వాత ఏడాది మార్చి 31 వరకు అవి కొనసాగుతాయి.

ఈ సందర్భంగా భారత బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం..

Union Budget

భారత తొలి బడ్జెట్

స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో కేవలం ఆర్థిక వ్యవస్థను సమీక్షించారు తప్ప, ఎలాంటి పన్ను విధింపులు చేపట్టలేదు.

షణ్ముఖం చెట్టి తర్వాత, ఆర్థికమంత్రి జాన్ మథాయ్ ప్రవేశపెట్టిన తొలి ఉమ్మడి భారత బడ్జెట్‌లో ప్రిన్స్‌లీ స్టేట్స్‌ పరిధిలోని పలు రాష్ట్రాల ఆర్థిక వివరాలను కూడా వెల్లడించారు.

Union Budget

బడ్జెట్ ప్రింటింగ్‌కు ముందు హల్వా వేడుక

నార్త్‌ బ్లాక్‌లో జరిగే హల్వా వేడుకతో ప్రతి ఏడాది బడ్జెట్ ప్రింటింగ్ మొదలవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పెద్ద కడాయిలో హల్వాను తయారు చేయిస్తుంది.

ఆర్థికమంత్రి, మంత్రిత్వ శాఖలోని అధికారులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడున్న వాళ్లందరికీ హల్వాను పంచుతారు. అయితే, కరోనా సమయంలో హల్వా కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఈసారి జనవరి 24న జరిగిన హల్వా వేడుకలో ఆర్థికమంత్రి పాల్గొన్నారు.

Union Budget

బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలో మార్పు

2016 వరకు కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజును ప్రవేశపెట్టేవారు.

కానీ, 2017లో ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు.

Union Budget

కేంద్ర బడ్జెట్‌లో కలిసిపోయిన రైల్వే బడ్జెట్

2017 ముందు వరకు రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టేవారు.

కానీ, 2017లో రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో కలిపేశారు.

Union Budget

తొలి మహిళా ఆర్థికమంత్రి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు?

బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి ఇందిరా గాంధీ. 1970లో ఆర్థికమంత్రిగా ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆసమయంలో ప్రధానమంత్రి పదవితో పాటు, ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహించేవారు.

1955 వరకు బడ్జెట్ కేవలం ఇంగ్లీష్‌లోనే ప్రింట్ అయ్యేది. కానీ, ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్ రెండు భాషలలో బడ్జెట్‌ను ప్రింట్ చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.

Union Budget

సుదీర్ఘ, చిన్న బడ్జెట్ ప్రసంగం

ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020లో బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు చేసిన ప్రసంగమే సుదీర్ఘమైన బడ్జెట్‌ ప్రసంగం. ఆ సమయంలో 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగాన్ని చేపట్టారు.

1977లో హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాల్లో ముగిసింది.

Union Budget

బడ్జెట్ ప్రతిపాదనలు లీకైనప్పుడు ఆర్థికమంత్రిగా రాజీనామా

1950లో ఆర్థికమంత్రిగా జాన్ మథాయ్ ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందే ప్రింటింగ్ సమయంలో లీకైంది.

ఆ తర్వాత బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియను రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌కు తరలించారు.

ఆ తర్వాత, దీన్ని నార్త్ బ్లాక్‌ బేస్‌మెంట్‌కు మార్చారు. బడ్జెట్ పత్రాలు లీక్ కావడంతో, జాన్ మథాయ్ అప్పుడు రాజీనామా చేశారు.

Union Budget

బడ్జెట్ ప్రసంగం చేపట్టే సమయాల్లోనూ మార్పు

1999 ముందు వరకు, కేంద్ర బడ్జెట్‌ ప్రసంగాన్ని ఫిబ్రవరిలో చివరి వర్కింగ్ డేన సాయంత్రం 5 గంటలకు చేపట్టేవారు. కానీ, 1999లో జస్వంత్ సింగ్ ఈ సంప్రదాయాన్ని మార్చారు. బడ్జెట్ ప్రసంగించే సమయాన్ని ఉదయం 11 గంటలకే మొదలుపెట్టారు.

2017లో ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ, బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అమల్లోకి తీసుకు వచ్చేందుకు బడ్జెట్ తేదీలను మార్చుతున్నట్లు చెప్పారు.

ఎందుకంటే, ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశపెడితే, వాటి ఆమోదానికి మరో నెల లేదా రెండు నెలలు పడుతుంది. ఆ తర్వాత అమల్లోకి తీసుకొచ్చేందుకు మే-జూన్ అవుతుందని చెప్పారు.

Union Budget

బ్రీఫ్‌కేసు నుంచి లెడ్జర్‌లోకి..

అంతకుముందు, బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చేందుకు ఆర్థిక మంత్రి బ్రీఫ్‌కేసును వాడేవారు. కానీ, 2019లో నిర్మలా సీతారామన్ బ్రీఫ్‌కేస్ బదులు భారత సంప్రదాయం ప్రకారం ఎర్ర రంగు గుడ్డలో పెట్టి దారంతో కట్టిన ఫైలును తీసుకొచ్చారు. దీనిని బహీ-ఖాతా (పుస్తక ఖాతా) అంటారు.

ఆ ఫైల్‌పై జాతీయ చిహ్నాన్ని ముద్రించారు. బడ్జెట్ అనేది ఫ్రెంచ్ పదం bougette నుంచి వచ్చింది. అంటే బ్రీఫ్‌కేసు అని అర్థం.

భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి కూడా తన బడ్జెట్ ప్రసంగాన్ని ఒక తోలు సంచిలో తీసుకొచ్చారు. కానీ అది కూడా దాదాపు బ్రీఫ్‌కేసులాగే కనిపించేది.

Union Budget

పేపర్‌లెస్ బడ్జెట్

2021లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతులు తెచ్చి చదవడం కాకుండా టాబ్లెట్‌‌‌లో చదివారు.

ఈ సంప్రదాయం 2018లో ఆంధ్రప్రదేశ్, అస్సాంలు ప్రారంభించినప్పటికీ.. కేంద్రం టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ 2021లో పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)