అలాస్కా సమావేశం పుతిన్‌కు భారీ విజయాన్ని ఇచ్చిందా, రష్యన్ మీడియా ఏం రాసింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టీవ్ రోజెన్‌బర్గ్
- హోదా, బీబీసీ రష్యా ఎడిటర్
అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. కానీ రష్యా మీడియా దీన్ని అధ్యక్షుడు పుతిన్ విజయంగా చూపిస్తోంది.
రష్యా వార్తాపత్రికలు, వెబ్‌సైట్లలో ప్రచురితమైన వార్తల్లో ఇది రష్యా అధ్యక్షుడి విజయంగా అభివర్ణిస్తున్నారు.
యుక్రెయిన్ యుద్ధం విషయంలో పుతిన్ లక్ష్యానికి దగ్గరగా ఒక అడుగు ముందుకు వచ్చారని ఈ మీడియా సంస్థలు అభిప్రాయపడ్డాయి.
రష్యా టాబ్లాయిడ్ మోస్కోవ్‌స్కీ కోమోసోమోల్ట్స్ తన వెబ్‌సైట్‌లో ''పుతిన్‌తో చర్చలు ముగిసిన కొన్ని గంటల తరువాత, రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్దం శాంతి చర్చల ద్వారా మాత్రమే ముగుస్తుందని ప్రతి ఒక్కరూ నిర్ణయించారని ట్రంప్ రాసుకొచ్చారని'' పేర్కొంది.
పుతిన్‌ను కలిసిన అనంతరం ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్‌లో "రష్యా, యుక్రెయిన్ మధ్య భయంకరమైన యుద్ధాన్ని ముగించడానికి ఎక్కువ కాలం కొనసాగని కాల్పుల విరమణ ఒప్పందం సరిపోదు, దీనికి ఉత్తమ మార్గం ప్రత్యక్ష శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే అని అందరూ నిర్ణయించారు " అని రాశారు.
రష్యా అధ్యక్షుడితో చర్చల అనంతరం ట్రంప్ స్వయంగా ఈ నిర్ణయానికి వచ్చారని, ఇది రష్యా దౌత్య విజయాన్ని స్పష్టంగా సూచిస్తోందని రష్యన్ మీడియా పేర్కొంది.
డాన్బాస్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి యుక్రెయిన్ తన సేనలను ఉపసంహరించుకోవాలని రష్యా డిమాండ్ చేసినట్టు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మరోవైపు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్ స్కీ సోమవారం మధ్యాహ్నం వాషింగ్టన్ వస్తున్నారని ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తెలిపారు.
''అంతా సవ్యంగా సాగితే అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని'' ఆయన తెలిపారు.
తాను ట్రంప్‌ను కలవబోతున్నట్టు జెలియన్‌స్కీ కూడా ధ్రువీకరించారు. అయితే, శాంతి ఒప్పందం కుదరకపోతే ఏమవుతుంది?.
శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యా విషయంలో ఎటువంటి తేడా ఉండదు. ఎందుకంటే పుతిన్ తన సేనల విషయంలో ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే ఉన్నారు. యుక్రెయిన్ సైన్యాన్ని వెనక్కు నెట్టేందుకు పుతిన్ తన సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పుతిన్ ఒక విధంగా యుక్రెయిన్ బలవంతంగా రాజీకి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అలాస్కాలో పుతిన్ సాధించిందేంటి?
రష్యన్ వార్తాపత్రిక కొమ్సోమోల్స్‌కయా ప్రావ్దా తన కథనంలో ''అలాస్కా సమావేశం రష్యా అధ్యక్షుడికి దౌత్య విజయం. రష్యా దౌత్యపరమైన ఉచ్చులో చిక్కుకోకూడదంటే ట్రంప్‌తో పుతిన్ ముఖాముఖి సమావేశం అవసరమని స్పష్టమైంది.
కాల్పుల విరమణతో రష్యా ప్రయోజనం పొందబోదని యుక్రెయిన్, యూరప్ అనుకుంటున్నాయి. అందుకే పాశ్చాత్య దేశాలు కాల్పుల విరమణ గురించి పదేపదే మాట్లాడుతున్నాయి. ఒకవేళ పుతిన్ నిరాకరిస్తే, ఆయన యుద్ధాన్ని ఆపాలని కోరుకోవడం లేదని యుక్రెయిన్, యూరప్ ఆరోపిస్తాయి.
కానీ, బ్రిటన్, యుక్రెయిన్, యూరోపియన్ యూనియన్ ఆలోచనకు ట్రంప్‌తో పుతిన్ ముఖాముఖి సమావేశంలో చెక్ పెట్టారు.
రష్యా శాంతికి సహకరిస్తుంది కానీ, కాల్పుల విరమణ తమకు అనుకూలంగా లేదని పుతిన్ ట్రంప్‌కు వివరించారు, ఎందుకంటే అలా జరిగితే యుద్ధభూమిలో పొందిన ప్రయోజనాన్ని రష్యా వదులుకోవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, కాల్పుల విరమణను దాటి శాంతి ఒప్పందంపై ఎందుకు చర్చించకూడదు.
ఈలోగా, రష్యా తనకు లభించే సమయాన్ని యుద్ధభూమిలో సైన్యాన్ని మోహరించడంలో తలెత్తే ఇబ్బందులతో సహా కొన్నింటిని పరిష్కరించడానికి ఉపయోగించుకుంటుంది" అని రాసింది.
"ఇది వ్లాదిమిర్ పుతిన్‌కు మరో పెద్ద దౌత్య విజయం. యూరప్, యుక్రెయిన్ శాంతిని వ్యతిరేకిస్తున్నప్పుడు, మన సైనికులు ప్రతిరోజూ ఒకటి లేదా అనేక నివాస ప్రాంతాలను శాంతియుతంగా విముక్తి చేసే అవకాశం పొందుతున్నారు" అని కొమ్సోమోల్స్‌కయా ప్రావ్దా తెలిపింది.
రచయిత ఇక్కడ 'విముక్తి' అనే పదాన్ని ఉపయోగించారు కానీ, వాస్తవానికి ఇది యుక్రెయిన్‌లోని మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం.
కొమ్సోమోల్స్‌కయా ప్రావ్దా కథనం ప్రకారం "రష్యా తన లక్ష్యాలను వదులుకోవడం లేదు. శాంతి కోసం కొన్ని సహేతుకమైన రాయితీలు ఇవ్వవచ్చు, ఇవి ట్రంప్‌కు ముఖ్యమైనవి. అయితే, రష్యా అత్యంత కీలకమైనవి ఎప్పటికీ వదులుకోదు. సరళంగా చెప్పాలంటే, అలాస్కాలో జరిగిన సమావేశం శాంతిని కోరుకునే రష్యాకు, అదేవిధంగా శాంతి, నోబెల్ బహుమతిపై కలలు కనే ట్రంప్‌కు పెద్ద విజయం"
"ఘర్షణలో పాల్గొనే పాత్ర నుంచి శాంతిని సృష్టించే నమ్మకమైన పాత్రకు మారుతున్న అమెరికాకు కూడా ఇదొక విజయం" అని ఆ పత్రిక అమెరికాను ప్రస్తావిస్తూ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
'ఇంకా చాలా దూరం'
రష్యా వార్తాపత్రిక నెజావిసిమయ గెజెటా తన కథనంలో రష్యా పట్ల అమెరికా అవగాహనను ప్రస్తావించింది.
"యాంకరేజ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పుతిన్ 'సమావేశంలో కీలకమైన విషయం ఏమిటంటే రష్యా జాతీయ ప్రయోజనాలను అమెరికా అధ్యక్షుడు అర్థం చేసుకున్నారు' అని అన్నారు. ఇది మరింత అంతర్జాతీయ పరిస్థితికి, ఘర్షణ పరిష్కారానికి, భవిష్యత్తు సంబంధాలకు కీలకం. కనీసం రాబోయే మూడున్నర సంవత్సరాలు రష్యాకు మంచి సమయం అవుతుంది. అలాస్కాలో జరిగినదేమిటంటే, రష్యాకు వ్యతిరేకంగా ఉన్న పాశ్చాత్య దేశాల ఉమ్మడి ఫ్రంట్ విచ్ఛిన్నం. పుతిన్ మాట ట్రంప్ విన్నారని, రష్యన్ ప్రయోజనాలను చట్టబద్ధంగా భావించారని తెలుస్తోంది. ముఖ్యంగా, కొత్త ప్రపంచ రాజకీయాలను సృష్టించడానికి వాటిని ముఖ్యమైనవిగా ఆయన భావించారు" అని తెలిపింది.
అయితే, నెజావిసిమయ గెజిటా 'పత్రికా సమావేశం' అని చెబుతున్నది వాస్తవానికి పత్రికా సమావేశంలా జరగలేదు. అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు.
"యుక్రెయిన్ వివాదానికి ముగింపు పలికేందుకు రష్యా, అమెరికా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి యాంకరేజ్ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన సంకేతం. అయితే ఆచరణాత్మక పరిష్కారం చాలా దూరంలో ఉంది" అని మరొక రష్యన్ వార్తాపత్రిక ఇజ్వెస్టియా రాసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














