పాకిస్తాన్ జెడ్-10ఎంఈ హెలికాప్టర్, భారత అపాచీకి పోటీయా, సోషల్ మీడియాలో చర్చ ఏంటి?

ఫొటో సోర్స్, PAFFalcons
- రచయిత, మునాజ్జా అన్వర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లో చైనా తయారీ జెడ్-10ఎంఈ (Z10-ME) హెలికాప్టర్ ఫోటో గత నెలలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
చాలామంది ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసిన ఫోటో అని వాదించారు. మరికొందరు పాకిస్తాన్‌కు టెస్టింగ్ కోసం వచ్చిన జెడ్-10ఎంఈ హెలికాప్టర్ పాత వెర్షన్ అని భావించారు.
ఈ ఊహాగానాలు కొనసాగుతుండగానే పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ (ఐఎస్‌పీఆర్) దీనిపై అధికారిక ప్రకటన చేసింది. చైనా తయారీ జెడ్-10ఎంఈ ఎటాక్ హెలికాప్టర్‌లను పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్‌లో చేర్చుతున్నట్టు తెలిపింది.
భారత్ తొలిసారిగా అమెరికా తయారీ హెలికాప్టర్లను కొనుగోలు చేసిన సమయంలో ఈ వార్త వచ్చింది. కొన్నిరోజుల క్రితమే, అమెరికా నుంచి మూడు అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు దిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే జెడ్-10ఎంఈ అత్యాధునిక హెలికాప్టర్‌కు అన్ని వాతావరణ పరిస్థితులలోనూ, పగలూ రాత్రీ తేడాలేకుండా ఏ సమయంలోనైనా కచ్చితత్వంతో దాడి చేయగల సమర్ధత ఉంది.
ఆధునిక రాడార్ ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలతో కూడిన జెడ్-10ఎంఈ, గగనతలం నుంచి, భూమిపై నుంచి వచ్చే ముప్పుకు సమర్థవంతంగా బదులు చెప్పగలదు.
చైనా తయారీ జెడ్-10ఎంఈ హెలికాప్టర్, అమెరికన్ అపాచీ ఎటాక్ హెలికాప్టర్ మధ్య తేడాను ఈ కథనం వివరిస్తుంది.


ఫొటో సోర్స్, Singapore Air Show
హెలికాప్టర్ ప్రత్యేక లక్షణాలు ఏమిటి?
రిటైర్డ్ ఎయిర్ కమొడోర్ ముజమ్మిల్ జిబ్రాన్ పాకిస్తాన్ వైమానిక దళం జీడీ(పీ) శాఖకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన ముల్తాన్‌లోని ఎయిర్ యూనివర్సిటీలో బోధిస్తున్నారు.
ఆయన చెప్పినదాని ప్రకారం...జెడ్-10ఎంఈ హెలీకాప్టర్‌ను డబ్ల్యూ-10 అని కూడా పిలుస్తారు. దీని తయారీ 1994 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆధునిక ఎటాక్ హెలికాప్టర్ అవసరం అని భావించిన చైనా వాటి తయారీ మొదలుపెట్టింది.
ఇది చైనా మొట్టమొదటి స్వదేశీ తయారీ ఎటాక్ హెలికాప్టర్.
ఈ హెలికాప్టర్‌కు స్పల్పస్థాయిలో గగనతల దాడులు, పరిమిత స్థాయిలో గగనతలం నుంచి గగనతల దాడులు చేయగల సామర్థ్యం ఉంది. ఈ లక్షణాల వల్ల, దీనిని భారత ఏహెచ్-అపాచీ గార్డియన్‌తో పోలుస్తారు.
ఏళ్లు గడిచే కొద్దీ, దీనిలో అనేక మార్పులొచ్చాయని ముజమ్మిల్ చెప్పారు.
సాధారణంగా చాలా రాడార్లు పొగమంచు వాతావరణంలో సమర్థవంతంగా పనిచేయవని, కానీ జెడ్-10ఎంఈలో అమర్చిన రాడార్ పొగమంచులో కూడా అద్భుతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.
"ఈ హెలికాప్టర్ ఫిరంగులు ఒక మొబైల్ గన్ వ్యవస్థతో అనుసంధానించి ఉంటాయి. దీనివల్ల పైలట్ చూసిన వైపు తుపాకులు వాటంతటవే కాల్పులు జరుపుతాయి’’ అని ముజమ్మిల్ గిబ్రాన్ చెప్పారు.
దాని ఆధునిక మోడల్‌లో కొత్త శక్తివంతమైన ఇంజిన్‌ను అమర్చారు, ఇది ఎగిరే సామర్థ్యాన్ని, పరిధినీ పెంచుతుంది.
‘‘ జెడ్-10ఎంఈ గరిష్ఠంగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. అయితే దాని బరువు, అదనపు ఇంధనాన్ని బట్టి 800 నుంచి 1,120 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపగలదని అంచనా వేశారు'' అని డిఫెన్స్ సెక్యూరిటీ ఏషియా తెలిపింది.
ఖాళీ హెలికాప్టర్ బరువు దాదాపు 5,100 కిలోలు, గరిష్ఠ టేకాఫ్ బరువు 7,200 కిలోలకు చేరుకుంటుంది. ఇది నియంత్రణ రేఖ వెంట ఎక్కువ దూరం ప్రయాణించగలదు. శత్రుస్థావరాల్లోకి చొచ్చుకుపోయి దాడులు చేయగలదు.
ఈ హెలికాప్టర్‌లో అనేక రకాల ఆయుధాలను అమర్చవచ్చని రక్షణ రంగ విశ్లేషకులు చౌధరి ఫరూఖ్ చెప్పారు.
జెడ్-10ఎంఈలో 16 వరకు యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, 32-ట్యూబ్ రాకెట్ పాడ్‌లు, టీవై-90 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను అమర్చవచ్చు. భూమిపై లక్ష్యాలను టార్గెట్ చేయడానికి, వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి వాటిని ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, ISPR
చైనా జెడ్-10ఎంఈకి, అమెరికన్ అపాచీ మధ్య తేడా ఏంటి?
అపాచీతో పోలిస్తే జెడ్-10 ఎంఈ ని చైనా అనేక విధాలుగా మెరుగుపరిచిందని ముజమ్మిల్ చెప్పారు.
క్షిపణులలో మొదటి ప్రాధాన్యత సాధారణంగా ఇన్‌ఫ్రారెడ్ అంటే వేడిని గ్రహించే క్షిపణులకు ఇస్తారు. అలా చూస్తే ఈ చైనీస్ హెలికాప్టర్‌తో చాలా ప్రయోజనం ఉంది. ఎందుకంటే 45 డిగ్రీల కోణంలో వెనుకకు వంగి ఉండే దాని ఇంజిన్లు వేడిని తగ్గిస్తాయి.
ఈ డిజైన్ వల్ల, శత్రువుల రాడార్లు, హీట్ సెన్సర్‌లు హెలికాప్టర్‌ను గుర్తించడంలో ఇబ్బందిని ఎదుర్కొంటాయని ఆయన చెప్పారు.
అమెరికన్ అపాచీ హెలికాప్టర్లును అనేక యుద్ధాల్లో ఉపయోగించారు. వాటిపై అనేక వివాదాలున్నాయి. జెడ్-10ఎంఈ పాకిస్తాన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన హెలికాప్టరని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఎటాక్ హెలికాప్టర్లను ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం ఉపయోగిస్తోంది.
అయితే, ఈ హెలికాప్టర్లను ఇప్పటివరకు ఏ యుద్ధంలోనూ ఉపయోగించలేదు.
అలెక్స్ ప్లాట్సాస్ అట్లాంటిక్ కౌన్సిల్‌లో సీనియర్ ఫెలో, పెంటగాన్ మాజీ అధికారి. ఆయన రక్షణ, అంతరిక్షం, హైటెక్ రంగాలలో ఉగ్రవాద నిరోధకత, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో నిపుణులు.
జెడ్-10ఎంఈ బరువు తక్కువగా ఉంటుందని, సైజులో కొంచెం చిన్నదిగా ఉంటుందని, ఎక్కువ దూరం ప్రయాణించగలదని, అందువల్ల ఇది మరింత చురుగ్గా ఉంటుందని అలెక్స్ ప్లాట్సాస్ వివరించారు. అయితే, ఏహెచ్-64 వేగం అధికం.
"ఇది విస్తృత పరిధి ఆయుధాలను ఉపయోగించగలదు. ఆధునిక రాడార్, టార్గెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి" అని ప్లాట్సాస్ వివరించారు.

ఫొటో సోర్స్, Indian Media
అమెరికా ఆంక్షలతో..
1965 పాకిస్తాన్-భారత్ యుద్ధం తర్వాత పాకిస్తాన్-చైనా మధ్య రక్షణ సహకారం ప్రారంభమైంది.
అమెరికా ఆయుధ ఆంక్షలు పాకిస్తాన్‌ను చైనావైపు మొగ్గు చూపేలా చేశాయి.
పాకిస్తాన్‌కు చైనా ఫైటర్ జెట్‌లు, ట్యాంకులు, ఫిరంగులను అందించింది. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత ఇది మరింత పెరిగింది.
సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే ఒప్పందంపై చైనా పాకిస్తాన్ 1963లో సంతకం చేశాయి. చైనా 1966లో పాకిస్తాన్‌కు సైనిక సహాయం అందించడం ప్రారంభించింది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) డేటా ప్రకారం, గత ఐదు సంవత్సరాలలో (2020 నుంచి 2024 వరకు) పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాలలో 81 శాతం చైనా నుంచే వచ్చాయి.
పాకిస్తాన్ 2015 నుంచి 2019, 2020 నుంచి 2024 మధ్య ఆయుధ దిగుమతులను 61 శాతం పెంచింది.
ఆ నివేదిక ప్రకారం, చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఆయుధాలలో ఆధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, రాడార్లు గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.
పాకిస్తాన్‌లో స్థానికంగా తయారయ్యే కొన్ని ఆయుధాలలో చైనా పాత్ర కూడా ఉంటుంది.

ఫొటో సోర్స్, Singapore Air Show

ఫొటో సోర్స్, Singapore Air Show
జెడ్-10 ఎంఈ ఎలా ఎంపిక చేశారు?
పాకిస్తాన్ సైన్యం మొదట్లో ఏహెచ్-1జెడ్ వైపర్ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని ప్రణాళిక వేసింది. 2015లో అమెరికా ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. కానీ భారతదేశంతో పెరుగుతున్న రక్షణ సంబంధాల కారణంగా అమెరికా వెనక్కి తగ్గింది.
పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్‌లోని ఒక సీనియర్ పైలట్ (పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) బీబీసీతో చెప్పినదాని ప్రకారం, ఎటాక్ హెలికాప్టర్ల విషయంలో అతి కీలకమైనది వాటి మెయింటెనెన్స్.
ఆయన చెప్పిన దాని ప్రకారం...
‘‘అమెరికన్ అపాచీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనికి పూర్తిగా కొత్త మౌలిక సదుపాయాలు అవసరం. దీని తరువాత, పాకిస్తాన్ తుర్కియే నుండి టీ129ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఇంజిన్ సమస్యల కారణంగా అది కూడా ఆగిపోయింది. ఆ తర్వాత అది చైనా వైపు మొగ్గు చూపింది’’
2015లో వచ్చిన చైనా హెలికాప్టర్లను సాంకేతిక కారణాల వల్ల పాకిస్తాన్ తిరస్కరించిందని, ఆ తర్వాత 2019లో తుది నిర్ణయం తీసుకుందని ఆయన చెబుతున్నారు.
పాకిస్తానీ నిపుణులు జెడ్-10ఎంఈ హెలికాప్టర్‌ను అపాచీ తరహా రాడార్, ఎయిర్-టు-సర్ఫేస్ క్షిపణులు ఇతర ఆధునిక ఆయుధ వ్యవస్థలతో అమర్చారు. తద్వారా దానిని పాకిస్తాన్ అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారు.

ఫొటో సోర్స్, social media
భారీగా హెలికాప్టర్లు కొనుగోలు
జెడ్-10ఎంఈ నిజానికి పాకిస్తాన్ మొదటి ప్రాధాన్యం కాదని అలెక్స్ ప్లాట్సాస్ చెప్పారు.
"పాకిస్తాన్ తుర్కియే తయారీ తచానీ హెలికాప్టర్లను కొనాలనుకుంది. కానీ ఇంజిన్ భాగాల దిగుమతిని అమెరికా నిషేధించింది. దీని తరువాత, చైనాతో రక్షణ సహకారం సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి పాకిస్తాన్‌కు మరో అవకాశం లభించింది" అని ఆయన చెప్పారు.
ఈ నివేదిక రాసే సమయానికి, ఐఎస్‌పీఆర్ ఈ ఒప్పందం వివరాలను బీబీసీకి ఇవ్వలేదు. అయితే, పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్‌లోని సీనియర్ పైలట్ చెప్పినదాని ప్రకారం, పాకిస్తాన్ చైనా నుంచి 30 హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. ఇవి పలు దఫాలుగా పాకిస్తాన్‌కు చేరుకుంటాయి.
ఎయిర్ కమొడోర్ (రిటైర్డ్) ముజమ్మిల్ జిబ్రాన్ కూడా దీనితో ఏకీభవించినట్లు అనిపించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














