సుప్రీంకోర్టు ఆదేశంతో ఈవీఎం ఓట్ల రీ కౌంటింగ్, ఓడిన సర్పంచ్ అభ్యర్థే మూడున్నరేళ్ల తరువాత గెలిచారు

 మోహిత్ కుమార్

ఫొటో సోర్స్, mohit kumar

ఫొటో క్యాప్షన్, హరియాణాలో పానిపట్ జిల్లాలోని బువానా లఖు పంచాయతీకి 2022లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మోహిత్ కుమార్ పోటీ చేశారు.
    • రచయిత, అవతార్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"న్యాయవ్యవస్థపై ఇంకా ఆశలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో మేం పూర్తిగా సంతృప్తి చెందాం. ఈ నిర్ణయంతో న్యాయవ్యవస్థపై మా నమ్మకం మరింత బలపడింది".

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంలను తిరిగి లెక్కించి, తనను సర్పంచ్ పదవికి ఎన్నికైనట్టు ప్రకటించిన సందర్భంగా హరియాణాకు చెందిన మోహిత్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడేళ్ల కిందట వెల్లడైన ఎన్నికల ఫలితం పొరపాటున జరిగిందా? లేదా ఉద్దేశపూర్వకమా అనేది చెప్పడం కష్టమని, దీనిపై దర్యాప్తు జరగాలని మోహిత్ కుమార్ డిమాండ్ చేశారు.

దాదాపు మూడేళ్ల న్యాయ పోరాటం తర్వాత, ఆగస్టు 11న వెల్లడైన సుప్రీంకోర్టు తీర్పు మేరకు హరియాణాలోని పానిపట్ జిల్లాలో బువానా లఖు గ్రామానికి చెందిన మోహిత్ కుమార్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 51 ఓట్ల తేడాతో గెలిచారు.

ఈ పంచాయతీకి 2022 నవంబర్ 2న జరిగిన ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీచేయగా కుల్దీప్ సింగ్‌ అనే అభ్యర్థిని విజేతగా ప్రకటించారు.

ఈ ఫలితాన్ని మోహిత్ కుమార్ సవాలు చేశారు. అయితే తను గెలిచినట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని, అదే చెల్లుబాటు అవుతుందని కుల్దీప్ చెబుతూ వచ్చారు.

దీనిపై పానిపట్‌లోని అదనపు సివిల్ జడ్జి,ఎలక్షన్ ట్రిబ్యునల్ ఏప్రిల్ 2025న రీకౌంటింగ్‌కు ఆదేశించింది. దీన్ని కుల్దీప్ సింగ్ హైకోర్టులో సవాలు చేయగా, ట్రిబ్యునల్ ఆదేశాలను హైకోర్టు పక్కన పెట్టడంతో మోహిత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రీకౌంటింగ్ , సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

బువానా లఖుసర్పంచ్ ఎన్నికలలో ఉపయోగించిన ఈవీఎంలన్నింటినీ తిరిగి లెక్కించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బువానా లఖులో మొత్తం 3,767 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 1,051 ఓట్లు మోహిత్ కుమార్‌కు, 1,000 ఓట్లు కుల్దీప్ సింగ్‌కు వచ్చాయి.

సుప్రీంకోర్టు ఓఎస్డీ (రిజిస్ట్రార్) పర్యవేక్షణలో ఇరు పక్షాలు, వారి న్యాయవాదుల సమక్షంలో ఈ రీకౌంటింగ్ జరిగింది. మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు.

న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఎన్. కోటీశ్వర్ సింగ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో ''ఓఎస్డీ (రిజిస్ట్రార్) కోర్టుకు సమర్పించిన రిపోర్టు విశ్వసనీయతపై ఎటువంటి సందేహాం లేదు. మొత్తం రీ-కౌంటింగ్‌ను వీడియోలో చిత్రీకరించారు, ఫలితాలపై రెండు పార్టీల ప్రతినిధులు సంతకం చేశారు'' అని పేర్కొంది.

"రీకౌంటింగ్‌పై మేం సంతృప్తి చెందాం. అప్పీలుదారుడిని పానిపట్ జిల్లా బువానా లఖు పంచాయతీ సర్పంచ్‌గా ప్రకటించాలి" అని ఆ ఉత్తర్వులో ఆదేశించింది.

పానిపట్ ఎన్నికల అధికారి దీనిపై రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

హరియాణా గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఓటింగ్

ఫొటో సోర్స్, David Talukdar/Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అసలేం జరిగింది?

హరియాణాలోని పానిపట్ జిల్లాలో బువానా లఖు గ్రామానికి 2022 నవంబర్ 2న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కుల్దీప్ సింగ్‌ 313 ఓట్ల తేడాతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అతనికి సర్టిఫికేట్ కూడా జారీ చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని మోహిత్ కుమార్ సవాల్ చేశారు.

కేసు రికార్డుల ప్రకారం, అప్పీలుదారుడైన మోహిత్ కుమార్‌ వాదనలను పరిగణనలోకి తీసుకున్న పానిపట్‌లోని అదనపు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) నేతృత్వంలోని ఎన్నికల ట్రిబ్యునల్ బూత్ నంబర్ 69 ఓట్లను తిరిగి లెక్కించాలని 2025 ఏప్రిల్ 22న ఆదేశించింది.

2025 మే 7 నాటికి బూత్ నంబర్ 69లో ఓట్లను తిరిగి లెక్కించాలని ఎన్నికల అధికారిని ఆదేశించారు. కానీ, పంజాబ్, హరియాణా హైకోర్టు ఈ ఆదేశాలను 2025 జూలై 1న రద్దు చేసింది.

"మొత్తం వివాదం బూత్ నంబర్ 69 గురించి మాత్రమే. నా ఓట్లు వేరే అభ్యర్థికి జమ అయ్యాయి. వారు సీరియల్ నంబర్ మార్చారు. నేను ఐదో స్థానంలో ఉన్నాను, 254 ఓట్లు వచ్చాయి. కానీ, కుల్దీప్ సింగ్‌ను ఐదో స్థానంలో చూపిస్తూ, నన్ను ఆరో స్థానంలో ప్రకటించారు" అని మోహిత్ కుమార్ తెలిపారు.

"నా పేరు మీద 7 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇదంతా లెక్కింపు సమయంలో పేపర్ వర్క్‌లో చోటుచేసుకుంది. ఇది కుట్రా లేక పొరపాటున జరిగిందా అని తెలుసుకోవడం కష్టం. దీనిపై దర్యాప్తు జరగాలి" అని మోహిత్ డిమాండ్ చేశారు.

"ఆ సాయంత్రం జరిగిన రీకౌంటింగ్ వీడియో రికార్డింగ్ మా దగ్గర ఉంది. మేమందరం కలిసి పానిపట్ డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులను కలిశాం" అని తెలిపారు.

మరోవైపు, "కుల్దీప్ సింగ్ అప్పటికే గెలిచినట్లు సర్టిఫికెట్ అందుకున్నారు, దీన్ని ఆధారంగా చూపుతూ కుల్దీప్ సింగ్ హైకోర్టుకు వెళ్లారు. సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత, ఫలితం చెల్లుబాటు అవుతుందనేది ఆయన వాదన" అని మోహిత్ కుమార్ అన్నారు.

సుప్రీంకోర్టులో 2025 జూలై 31న ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు, సర్పంచ్ ఎన్నికలలో ఉపయోగించిన అన్నిఈవీఎం యంత్రాలు, ఓటింగ్ రికార్డులను ఎన్నికల అధికారి కోర్టు రిజిస్ట్రార్ ముందు పెట్టాలని ఆదేశించింది.

ఒక బూత్ మాత్రమే కాకుండా, మొత్తం ఐదు బూత్‌ల ఓట్లను తిరిగి లెక్కించాలని రిజిస్ట్రార్‌కు సూచించింది.

"జూలై 31, 2025 నాటి మా ఉత్తర్వు ప్రకారం రీకౌంటింగ్ పూర్తవడంతో, హైకోర్టు నిర్ణయాన్ని కొనసాగించలేం, దానిని పక్కన పెడుతున్నాం" అని సుప్రీంకోర్టు ప్రకటించింది.

మోహిత్ కుమార్ ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, mohit kumar

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మోహిత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన మోహిత్

ఈ సుదీర్ఘ న్యాయ పోరాటం వెనుక ఉన్న ప్రేరణ గురించి మోహిత్ కుమార్ మాట్లాడుతూ ఇందులో ఎలాంటి రాజకీయ పక్షపాతం లేదా పార్టీ స్ఫూర్తి లేదని వ్యాఖ్యానించారు.

కేవలం "సత్యాన్ని బయటికి తీసుకురావాలని మాత్రమే కోరుకున్నాను" అని చెప్పారు.

"ప్రజలు నన్ను సమర్థించారు, నన్ను విశ్వసించారు. నా మనసులో ఒకటే ఉంది - సత్యాన్ని బయటకు తీసుకురావడం. అందుకే కష్టపడి పనిచేశాను"అన్నారు.

"ఆగస్టు 14న నేను ప్రమాణం చేశాను. గ్రామస్థులు సంతోషంగా ఉన్నారు. వారు మాపై చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తాను" అని మోహిత్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)