బిహార్ ఓటర్ జాబితా వ్యవహారంపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్‌లో శాసనసభ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరుగుతాయనగా, ఎలక్షన్ కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (ఎస్‌ఐఆర్)ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి.
న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ చట్ట విరుద్ధమని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు.
ఎన్నికల విశ్లేషకుడు, ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ కూడా తన వాదనను సమర్పించారు.
ఓటర్ల జాబితాలపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలను, విశ్లేషణలను కోర్టు ముందు ఉంచారు.


ఫొటో సోర్స్, AFP via Getty Images
పౌరులను ఓటర్లుగా నమోదుచేసే బాధ్యత చాలా దేశాల్లో ప్రభుత్వంపై ఉంటుందని, కొన్ని దేశాల్లో ఈ బాధ్యత ఓటర్లపైనే ఉంటుందని యోగేంద్ర యాదవ్ చెప్పారు.
ఎస్‌ఐఆర్ చేపట్టిన బిహార్‌లో ఈ బాధ్యత ఓటర్లపైనే ఉందని యోగేంద్ర అన్నారు.
''ఓటరు నమోదు బాధ్యతను ప్రభుత్వం నుంచి తొలగించి పౌరులపై ఉంచిన వెంటనే, దాదాపు పావు వంతు ఓటర్లను కోల్పోతారు'' అని యోగేంద్ర యాదవ్ వాదించారు.
ఇద్దరు వ్యక్తులను కోర్టు ముందు యోగేంద్ర యాదవ్ ప్రవేశపెట్టారు. 'వీరిద్దర్నీ చనిపోయినవారిగా ప్రకటించేశారు' అని ఆయన కోర్టుకు చెప్పారు.
అయితే, ఈ నాటకీయ దృశ్యాలు టీవీకి బాగుంటాయని ఎలక్షన్ కమిషన్ తరఫున హాజరైన న్యాయవాది రాకేశ్ ద్వివేది అన్నారు.
ఎస్‌ఐఆర్‌ను అడ్డుకునే బదులు, ప్రజలు ఒకరికొకరు సహకరించుకొంటూ తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోవాలని ద్వివేది చెప్పారు.
అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే, దాన్ని సరిదిద్దవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ వ్యాజ్యాలపై విచారణ బుధవారం కూడా కొనసాగనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














