మీరు కొనేది పులసా, ఇలసా? తెలుసుకోవడం ఎలా?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
గోదావరిలో దొరికే ప్రతి పులసా ఇలసే, కానీ ప్రతి ఇలసా పులస కాదు.
జూన్ నుంచి ఆగష్టు వరకు గోదావరి జిల్లాల్లో ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇది బయటవారికి కాస్త గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే... పులస, ఇలస చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటిని రుచి, ధరల్లో తేడా ఉన్నట్లే...సరిగ్గా గుర్తిస్తే...పులస, ఇలస మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి.
గోదావరి పరిసరాల్లో పులస చేపకు చాలా క్రేజ్. దశాబ్దకాలంగా చూస్తే ఈ క్రేజ్ చాలా ప్రాంతాలకు, తెలుగువారు ఉండే విదేశాలకు కూడా విస్తరించింది. "పుస్తెలమ్మైనా పులస చేప తినాల్సిందే" అనే నానుడి కూడా ఉంది. అయితే కొన్ని సార్లు ఇలస చేపనే పులస చేపలనుకుని ఎక్కువ ధరకి కొంటుంటారు.
కొందరు ఒడిశా పులస అంటూ ఇలస చేపలనే అమ్ముతుంటే....మరికొందరు ఇలస చేపనే గోదావరి పులస పేరుతో అమ్మేస్తుంటారని యానాంలోని స్థానిక మత్స్యకారులు బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, Prasad
పులస, ఇలస తేడా ఎలా గుర్తించాలి?
ఒక చేప...రెండు పేర్లు...
గోదావరి నీటిలో గుడ్లు పెట్టేందుకు సముద్రపు నీటి నుంచి ప్రయాణం చేసి గోదావరి ప్రవాహానికి ఎదురీదుతూ...మత్స్యకారుల వలలకు చిక్కే పులస చేప అసలు పేరు ఇల్సా హిలిషా. ఇది సముద్రంలో ఉంటే విలస. గోదావరిలోకి వస్తే పులస. గోదావరి జిల్లాలతో పాటు దాదాపుగా తెలుగోళ్లంతా కూడా విలసని ఇలస అనే అంటుంటారు.
ఒడిశాలో సముద్రం నుంచి ప్రయాణం మొదలెట్టి...జూన్ నుంచి ఆగష్టు మధ్య గోదావరి వైపు వచ్చే చేపలనే పులస చేపలని అంటారు. ఆ కాలన్నీ పులస కాలమని కూడా అంటారు. సముద్రంలో ఉన్నప్పుడు ఇలస అనే ఈ చేప...గోదావరిలోకి వస్తుండంతోనే మంచి రంగుని, రుచిని పొందుతుందని స్థానికులు చెబుతుంటారు.
సముద్రపు ఉప్పు నీటి నుంచి నది నీటికి మారడంతో ఇలస చేప పేరు పులసగా మారిపోతుంది. పులస చేపలో ఉన్న కొవ్వే దానికున్న డిమాండ్‌కు కారణమని పులస సీజన్ లో ఆ చేపలను వేటాడే మత్స్యకారుడు ప్రసాద్ బీబీసీకి చెప్పారు.
సముద్రంలో పట్టే చేపలు ఇలస అయితే, గోదారిలో పట్టుకున్న చేపలను పులస అన్నమాట. వీటి రంగులో తేడా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. అంటే స్పష్టంగా చెప్పాలంటే గోదారి మంచినీటిలో దొరికేదానిని మాత్రమే పులస అంటారు. సముద్రపు ఉప్పునీటితో దొరికేదానిని ఇలస అంటారు.

‘పులస చేప క్రేజ్‌కి కారణం దాని కొవ్వే...’
"సముద్రం నుంచి నదికి ఎదురీది గుడ్లు పెట్టడానికి వచ్చే హిల్సా ఇలీషా చేపకి... ఎదురీతకు శక్తి అవసరం. అలాగే గుడ్లు పెట్టేందుకు కూడా. దీంతో హిల్సా ఇలీషా చేప గోదావరి నదిలోకి వచ్చే ముందే తన శరీరంలో ఎక్కువ కొవ్వుని నిల్వ చేసుకుంటుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన ఆ సమయంలో దానిని తింటే అది చాలా రుచిగా ఉంటుంది. ఆ కొవ్వే పులస చేపకి క్రేజ్ కి కారణం." అని ఆంధ్రాయూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ సి. మంజులత బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Prasad
పులస, ఇలస మధ్య తేడా ఇదే....
ఇటీవల తన వలకు చిక్కిన పులస చేప రూ. 26 వేలకి అమ్ముడయ్యిందని మత్స్యకారుడు ప్రసాద్ చెప్పారు. పులస వలకి చిక్కితే బంగారం చిక్కినట్లేనని అన్నారు. అయితే పులస పేరుతో ఇలస చేపలని కూడా అమ్మే ప్రమాదం ఉందని చెప్పారు.
'పులస తిన్నాం' అని చెప్పుకునే చాలా మందికి పులసకి, ఇలసకి తేడా తెలియదని ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల వారు కాకుండా బయట వారికి ఈ సమస్య తప్పదని అన్నారు. అసలు పులస, ఇలసలను ఎలా గుర్తించాలో మత్స్యకారులు ప్రసాద్, రత్నం వివరించారు.
"ఇలసను, పులసను గుర్తించాలంటే ముందుగా మనం దృష్టి పెట్టాల్సింది ఆ చేప రంగు మీద. ఇలస వెనుక భాగం నీలిరంగు, నెమలి పింఛం రంగులో ఉంటుంది. పులస మాత్రం గోదావరి నీటి రంగులో ఉంటుంది. అంటే కాస్త ముదురు వెండిరంగులో ఉంటుంది." అని ప్రసాద్ చెప్పారు.
"అలాగే ఇలస చేపను ఒడిశా, బెంగాల్ నుంచి బాక్సుల్లో పెట్టి తీసుకు వస్తుంటారు. ఐసులో ఉంచడంతో...వాటి కళ్లు నల్లగా మారిపోతాయి. అదే పులసైతే తాజాగా గోదావరి నుంచి తీసుకుని రావడంతో దాని కన్ను కొంచెం తెల్లగా, కాస్త ఎర్రగా కనిపిస్తుంది.
ఇక గోదావరిలో గుడ్డుపెట్టేందుకు దాచుకున్న కొవ్వు పులస పొట్టలో ఉండటంతో... పొట్టభాగం బాగా మెత్తగా ఉంటుంది. అదే ఇలసైతే అంత మెత్తగా ఉండదు. పులస చేప మెత్తగా ఉంటూ చేతి నుంచి జారిపోతూ, పట్టుకుంటే చేప ఒంగినట్లు అయిపోతుంది. అదే ఐస్ బాక్సుల్లో పెట్టి తెచ్చే ఇలసైతే...గడ్డకట్టి గట్టిపడిపోయి...నిటారుగా నిలబడుతుంది." అని యానాం మార్కెట్ లో చేపలమ్మే రత్నం బీబీసీతో చెప్పారు.

అక్షరం మారితే..ధర వేలల్లోనే
పులసకి, ఇలస చేపకి పలికేటప్పుడు ఒక్క అక్షరమే తేడా. స్పష్టంగా వినకపోతే... రెండు ఒకేలా వినిపించేలా ఉంటాయి ఆ పేర్లు. అలాగే స్పష్టంగా చూడకపోతే ఇలసనే పులసని కొనే ప్రమాదం ఉందని యానాం మార్కెట్ లో ఇలస, పులస చేపలను అమ్మే మత్స్యకార మహిళ రత్నం బీబీసీతో అన్నారు.
"నా దగ్గరు ఒకే సైజు ఉన్న పులస, ఇలస ఉన్నాయి. ఇలసేమో రూ. 15 వందలు, పులసేమో రూ. 25 వేలు. అంటే ఒక్క అక్షరం మారితే చాలు రూ. 23 వేలకు పైగా పెరుగుతుంది. అంతకే కొంటారని కాదు, కానీ మేం మార్కెట్ లో మేం పాట పాడుకుని తెచ్చుకుంటాం కాబట్టి...దాని మీద కొంత డబ్బేసుకుని చెప్తాం. కస్టమర్ ఎలాగూ బేరమాడతారు. అయితే కొందరు ఇలసని పులసని అమ్మేస్తుంటారు. జాగ్రత్తగా చూసుకోవాలి. నిజానికి ఇటీవల కాలంలో పులస చేపలు వారానికి రెండుమూడే వలకి చిక్కుతున్నాయి. ఈ సీజన్ లో నేను రూ. 12 వేల నుచిం రూ. 26 వేల వరకు అమ్మిన పులస చేపలను చూశాను." రత్నం ఈ సీజన్ లో పలికిన ధరలను వివరించారు.
పులస సీజన్ లోనే దొరికే చేప, ఇలస ఎప్పుడైనా దొరికే చేప. అందువలన కూడా పులసకి ధర ఎక్కువ ఉండొచ్చునని రత్నం చెప్పారు.

ఫొటో సోర్స్, Prasad
ఈ సీజన్‌లో అది పులసే...
"పులసైనా, ఇలసైనా హిల్సా ఇలీషా అనే ఒకే జాతి చేప కావడంతో..ముందుగా వాడుకలో ఇలస అయ్యింది. వండిన చేప కూరకి ఒక రోజు పులిసిన తర్వాతే మంచి రుచి వస్తుంది. పులసిన చేపకి రుచి రావడంతో గోదావరిలో దొరికే చేపని పులస అని పిలుచుకునేవారని మా పెద్దలు మాకు చెప్పారు అని మత్స్యకారుడు ప్రసాద్ చెప్పారు. పులస అంటే పులిసిన చేప అనే అర్థంలో కూడా వాడుతామన్నారు." మత్స్యకారుడు ప్రసాద్.
"పులసైనా, ఇలసైనా… గోదావరి జిల్లాలో కొంటే అది పులసేనని కొందరు కస్టమర్లు నమ్ముతున్నారు. నిజానికి ఇది పులస సీజన్ కావడంతో...ఇలసని కూడా పులసే అనుకుంటున్నారు. పులస చేపలు వలకి చిక్కడం లేదు. వారానికి రెండు లేదా మూడు మాత్రమే. ఈ సీజన్ లో పులస చేప కోసం ప్రతి రోజూ వేట సాగిస్తున్నాను. ఒకే ఒక్క చేప నాకు చిక్కింది. అది రికార్డు స్థాయిలో రూ. 26 వేలు పలికింది" అని ప్రసాద్ చెప్పారు.

ఆన్‌లైన్‌లో అమ్ముతున్నది పులసేనా?
ఒక వైపు ఇలా వేలల్లో పులస చేప ధర పలుకుతుంటే...మరో వైపు వండిన పులస చేప కూర అంటూ కొరియర్ సర్వీసులలో కేవలం రూ. 1000 లకే పంపతున్నారు. అప్పుడు దీనిని పులస అని ఎలా నమ్ముతారని స్థానికులను బీబీసీ అడిగితే...ఈ సీజన్ పులసో, ఇలసో...కస్టమర్ పులసనే కొనుక్కోవడం, తాను తింటున్నది పులసని నమ్మడం అలవాటు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది అని స్థానికుడు గిరిబాబు బీబీసీతో చెప్పారు.
ఈ సీజన్‌లో పులస కూరను తయారు చేసి వెయ్యి రూపాయలకు కొరియర్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్ వరకూ పంపిస్తున్నారు. అయితే ఇది నిజంగా పులసా, లేక ఇలసా అనేది చేప కొన్నవారే తెలుసుకోగలగాలి. ఇప్పటీకే చేపలు తక్కువగా పడుతుండటంతో...పులసని అంత తక్కువ ధరకి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చునని గిరిబాబు అన్నారు.
"పులస క్రేజ్ లో కొందరు డబ్బులు పొగొట్టుకుంటుంటే...కొందరు ఈ క్రేజ్ ని వ్యాపారం మార్చుకుని డబ్బు చేసుకుంటున్నారు. అది అమ్మేవారు, కొనేవారి డీల్స్ పై ఆధారపడతాయి. మనమేంచేయలేం." అని వేలం పాటకి చేపలు తీసుకుని వచ్చిన ఒడిశాకు చెందిన వ్యాపారి బీబీసీతో చెప్పారు.

‘వీడియోలు తీయద్దంటున్నారు’
పులస, ఇలస పేర్లు, వాటి మధ్య తేడాలు...వాటి ధరల మధ్య వ్యత్యాసం...ఇలస టేస్ట్...పులస బెస్ట్ అంటూ ఇలా అనేక విషయాలను చాలా మంది యూట్యూబర్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వాటికి మంచి వ్యూస్ కూడా వచ్చాయి.
"నేను పులసపై, ఇలసపై చాలా వీడియోలు చేశాను. నా ఇన్ స్టా పేజ్ వ్యూస్ పులస సీజన్ లోనే 30 వేల మంది వచ్చారు. అయితే నన్ను ఇక వీడియోలు చేయవద్దని...పులస, ఇలస అంటూ ఎటువంటి సమాచారం చెప్పవద్దని మత్స్యకార సంఘం పెద్దలు పంచాయితీ పెట్టారు. దాంతో నేను పులస, ఇలస వీడియోలు తీయడం మానేశాను." అని యానాంలోని ఒక యూట్యూబర్ చెప్పగా...కాకినాడకు చెందిన యూట్యూబర్ కూడా తనను కూడా పులస వీడియోలు పోస్టు చేయవద్దని చెప్పారన్నారు.
యానాంలో చేపలను వేలం వేస్తున్న ప్రదేశంలో బీబీసీ షూట్ చేస్తుంటే...చిత్రీకరించవద్దని మత్స్యకారులు నిలువరించారు. దీని వలన తమ వ్యాపారం దెబ్బతింటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














