ఒంటి మిట్ట: టీడీపీ గెలుచుకున్న ఈ జెడ్‌పీటీసీ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలేంటి? టీడీపీ, వైసీపీ నేతలు ఏమంటున్నారు...

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఒంటిమిట్ట జెడ్‌పీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అద్దాలూరు ముద్దుకృష్ణా రెడ్డి విజయం సాధించారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి రెండో స్థానంలో నిలిచారు.
కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్‌పీటీసీలు రెండింటినీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
అయితే, ఒంటిమిట్ట నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణ వివాదాస్పదంగా మారింది.
ఒంటిమిట్ట జెడ్‌పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఒక వైసీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అయ్యింది.
అందులో ఒక వ్యక్తిని కొంతమంది దాడి చేసి కొట్టడం, ఆయన టీషర్ట్ కూడా చినిగిపోవడం కనిపించింది. అక్కడ నిజానికి ఏం జరిగిందన్న విషయాన్ని బీబీసీ పరిశీలించింది.
ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్‌పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
పులివెందులలో వైసీపీ జెడ్‌పీటీసీగా ఉన్న మహేశ్వర్ రెడ్డి చనిపోవడంతో ఆయన తనయుడు హేమంత్ కుమార్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసారు. అయితే టీడీపీ కూడా అక్కడ అభ్యర్థిని నిలిపింది. లతా రెడ్డి ఇక్కడ పోటీ చేసి గెలిచారు.


సుబ్బయ్య ఏం చెబుతున్నారు?
ఒంటిమిట్టలో జెడ్‌పీటీసీ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఈ జెడ్‌పీటీసీ స్థానానికి కూడా ఆగస్టు 12న ఎన్నికలు జరిగాయి.
ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ దగ్గరున్న ఓ వ్యక్తిని కొంతమంది కొడుతున్న దృశ్యాలు పోలింగ్ రోజు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అందులో దాడికి గురైన వ్యక్తి పేరు సుబ్బయ్య. ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి ఆయన గ్రామం. జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తుంటారు. వైసీపీ కార్యకర్త.
12వ తేదీ ఒంటిమిట్టలో జరిగిన జెడ్‌పీటీసీ ఉప ఎన్నికల్లో చిన్న కొత్తపల్లిలో వైసీపీ తరుపున ఏజెంట్ గా కూర్చున్నారు.
టీడీపీ నేత, మంత్రి రాంప్రసాద్ రెడ్డి వందమంది అనుచరులతో వచ్చి చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్‌లో వైసీపీ ఏజంట్‌గా ఉన్న తనను బయటకు గెంటేసి రిగ్గింగ్ చేసారని, తనపై దాడి చేశారని సుబ్బయ్య బీబీసీతో చెప్పారు.
‘‘ఆ రోజు పోలింగ్ 12 గంటల వరకూ సాపీగా జరిగింది. 12 గంటలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన అండ చూసుకుని అక్కడున్న టీడీపీ నాయకులందరూ మా పైన దాడిచేసారు. మమ్మల్ని కొట్టారు. రిగ్గింగ్ చేసారు. ఉన్నతాధికారులు, పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు. ఎవరూ పట్టించుకోలేదు'' అని సుబ్బయ్య బీబీసీకి చెప్పారు.

రిగ్గింగ్ చేస్తుంటే ఆపడానికే...
మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాత్రం వైసీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తుంటే తాను అడ్డుకోవడానికి వెళ్లానని మీడియాతో అన్నారు.
''వైసీపీ నేతలు యథేచ్ఛగా డబ్బులు పంచారు. పొద్దున్నే బూతుల దగ్గర తెలుగుదేశం పార్టీ ఏజంట్లను వెళ్లిపొమ్మని బెదిరించారు. వాళ్ల ఇండ్ల దగ్గర పోయి బెదిరిస్తారు. మా ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రజలు ఓట్లు వేయడానికి వస్తుంటే వారిని అడ్డుకున్నారు. తలుపులు వేసుకుని రిగ్గింగ్ చేస్తుంటే వారిని ఎదుర్కున్నాం'' అని రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

‘ఎన్నికలు రద్దు చేయాలి...’
దీనిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్. జగన్ స్పందించారు. ఒక్క పులివెందులలోనే డీఐజీ స్థాయి అధికారిని పెట్టి 700 మంది పోలీసులతో ఇతర ప్రాంతాలనుంచీ 8000 మంది రప్పించి రిగ్గింగ్ చేసారని ఆరోపించారు.
‘‘పులివెందుల రూరల్‌లో జెడ్‌పీటీసీ స్థానానికి 15 బూతుల్లో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నికలో, బూత్‌లలో పార్టీ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరిగింది. ప్రజాస్వామ్యం మనదేశంలో ఎక్కడైనా ఉండదేమోగానీ మన రాష్ట్రంలో లేదు’’ అని జగన్ అన్నారు.
ఒంటిమిట్టలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి రౌడీయిజానికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు.
''ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి రౌడీయిజం చేశారు. అతనికి సంబంధం లేకపోయినా నేరుగా బూతుల్లోకి వెళ్లి ఏజెంట్లను బయటకు తోసేశారు. ఇదంతా మంత్రి సమక్షంలోనే జరిగింది’’ అని జగన్ విమర్శించారు.
మూడు కేసులు నమోదు...
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించి 3 కేసులు నమోదయ్యాయని కడప ఎస్పీ అశోక్ బీబీసీతో చెప్పారు.
ఒంటిమిట్టలో జరిగిన ఘర్షణల్లో దాడి చేసిన వారు అక్కడి వ్యక్తులా లేక బయటి వ్యక్తులా అనేది దర్యాప్తులో తేలుతుందని అన్నారు.
ఒంటిమిట్టలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ అధికారి, కడప ఆర్డీవో జాన్ ఎర్వీతో మాట్లాడడానికి కూడా బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.
మరోవైపు ఈ రెండు జెడ్‌పీటీసీల ఎన్నికల ఫలితాలు వెలువడగా, రెండింటిలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














