ప్రతిపక్షాల ‘ఓట్ల చోరీ’ ఆరోపణలపై ప్రెస్‌మీట్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Election Commission of India
బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాల ఆరోపణలు 'గందరగోళాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం' అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు.
ప్రతిపక్షాల నుంచి 'ఓట్ల చోరీ' ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించింది.
ఈ విలేఖరుల సమావేశంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ మాట్లాడారు.
"చట్టం ప్రకారం, ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ ద్వారా ప్రారంభమవుతుంది. అలాంటిది ఎన్నికల సంఘం ఆ రాజకీయ పార్టీల మధ్య ఎలా వివక్ష చూపుతుంది" అని జ్ఞానేష్ కుమార్ అన్నారు.
ఎన్నికల సంఘం భుజంపై తుపాకీ పెట్టి, రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
"ఎన్నికల సంఘానికి ప్రతిపక్షం, పాలక పార్టీ అనే తేడా లేదు, అందరూ సమానమే" అని జ్ఞానేష్ కుమార్ అన్నారు.
" క్షేత్రస్థాయిలో ఓటర్లు, రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి అధికారులు కలిసి పారదర్శకంగా పనిచేస్తున్నారు" అని చెప్పారాయన.


ఫొటో సోర్స్, Getty Images
ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల సంఘం ఏం చెప్పింది?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను రాజకీయ పార్టీల డిమాండ్ మేరకే మొదలుపెట్టామని ఎన్నికల సంఘం తెలిపింది.
ఎస్ఐఆర్‌కి సంబంధించిన డాక్యుమెంట్లను రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన బూత్ స్థాయి ఏజెంట్లు ధ్రువీకరిస్తారని జ్ఞానేష్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Electioncommission Of India/BBC
రాజకీయ పార్టీల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
"ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఎన్నికల సంఘం బిహార్ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)ను ప్రారంభించింది" అని జ్ఞానేష్ కుమార్ అన్నారు.
బిహార్ గురించి వివరాలను తెలియజేస్తూ, "ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు, బూత్ లెవల్ అధికారులు, అన్ని రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన 1.6 లక్షల బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) కలిసి ముసాయిదా జాబితాను తయారు చేశారు" అన్నారు.
"ప్రతి బూత్‌లో ఈ ముసాయిదా జాబితాను తయారు చేస్తున్నప్పుడు, అన్ని పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు సంతకాలతో దానిని ధ్రువీకరించారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘బీజేపీ నేత మాట్లాడినట్టు ఉంది’’
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియా సమావేశంపై కాంగ్రెస్ స్పందించింది. ఈ విలేకరుల సమావేశంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images/BBC
మెషీన్ రీడబుల్ ఓటర్ల జాబితాపై జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ ఇది ఓటరు గోప్యతకు భంగం కలిగిస్తుందని 2019లోనే సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు.
‘‘ అనురాగ్ ఠాకూర్‌కు ఆరు లోక్ సభ నియోజకవర్గాల డిజిటల్ ఓటరు జాబితా వచ్చింది, కానీ ఈ జాబితాను ఎన్నికల సంఘం మాకు ఇవ్వలేదు. ఇప్పుడేమో డిజిటల్ ఓటర్ల జాబితా ఇవ్వడం కూడా ప్రజల గోప్యతను ఉల్లంఘించడమేనని ఎన్నికల సంఘం చెబుతోంది’’అని పవన్ ఖేరా విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ప్రతిపక్షాలకు దీటైన సమాధానం’’
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియా సమావేశం ప్రతిపక్షాలకు 'దీటైన సమాధానం' గా బీజేపీ వర్ణించింది.
‘‘ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థపై దాడి చేస్తున్న వారికి ఎన్నికల సంఘం దీటైన సమాధానం ఇచ్చింది. అధికార పార్టీ, ప్రతిపక్షం తేడా లేదని ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. ఎన్నికల సంఘం అందరినీ ఒకే దృష్టితో చూస్తుంది’’ అని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు.
ప్రతిపక్షాల దుష్ప్రచారంపై ఎన్నికల సంఘం స్పందించిందన్నారు.
బిహార్ ఓటర్లు పేర్లు నమోదు చేసుకోని వారు తమ పేర్లను చేర్చుకునేందుకు సమయం ఉందని షానవాజ్ హుస్సేన్ తెలిపారు.
వాస్తవానికి బిహార్ లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్ ) కింద రూపొందించిన ముసాయిదా జాబితాలో ఏవైనా తప్పులుంటే వాటిని తొలగించడానికి సెప్టెంబర్ 1 వరకు సమయం ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారని తెలిపారు.

ఫొటో సోర్స్, Indian National Congress
రాహుల్ గాంధీ ఆరోపణలు ఏంటి?
ఆగస్టు 7న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు.
బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి 'ఓట్లను దొంగిలించడానికి' పనిచేస్తున్నాయని, 'బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓట్లను దొంగిలించే ప్రయత్నం' అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
అలాగే ఓట్ల చోరీకి బీజేపీ,ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
"ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ తప్పు అని తేలుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ బీజేపీ తరచుగా గెలుపుతో ముగిస్తోంది. దీని వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాలకు సందేహాలున్నాయి. కానీ కచ్చితమైన ఆధారాలు లేవు'' అని విలేఖరుల సమావేశం ప్రారంభంలో రాహుల్ గాంధీ అన్నారు.
హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సందేహాలు మరింత బలపడ్డాయని ఆయన చెప్పారు.
ఇది 'ప్రజాస్వామ్య వ్యతిరేక కుట్ర'గా విమర్శిస్తూ, ఆధారాలంటూ కొన్ని వివరాలు కూడా చూపించారు రాహుల్. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలిచ్చారాయన.
"మహారాష్ట్రలో ఎన్నికల 'చోరీ'కి ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందనడానికి, మెషీన్ రీడబుల్ ఓటరు జాబితాను అందించకపోవడమే నిదర్శనం" అని రాహుల్ ఆరోపించారు.
కొత్త ఓటర్లను ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చేయడానికి 'ఫారం 6' ఉపయోగిస్తారు. ఈ ఫారం 6 పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోందని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ఫిర్యాదులను కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది.
రాహుల్ గాంధీ తాను చెబుతున్నది నిజమని నమ్మితే అఫిడవిట్‌పై సంతకం చేసి ఫిర్యాదు చేయాలని తెలిపింది. అంతేకాకుండా, రాహుల్ గాంధీ తన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలంటూ కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈ నెల 10న ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు.
మరోవైపు, బిహార్‌లో ఎస్ఐఆర్‌ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముసాయిదా జాబితాలో చేర్చని 65 లక్షల మంది ఓటర్ల లిస్టును విడుదల చేయాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














