సుప్రీంకోర్టు: ‘‘ఆ 65 లక్షలమంది ఓటర్లను జాబితాలో ఎందుకు చేర్చలేదో కూడా చెప్పాలి’’ అంటూ ఈసీకి మధ్యంతర ఆదేశాలు...

బిహార్ ఎస్‌ఐఆర్, సుప్రీంకోర్టు ఆదేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు

బిహార్‌లో ఓటర్ల జాబితా ముసాయిదా తయారీకి భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై సుప్రీంకోర్టు ఆగస్టు 14వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ముసాయిదాలో చేర్చని 65 లక్షల మంది పేర్లతో జాబితా సిద్ధం చేయాలని ఈసీని ఆదేశించింది. ఆ జాబితాను ప్రచురించడానికి ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇచ్చింది.

ఓటర్ల అర్హతను నిర్ణయించడానికి సంబంధించి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అవసరమైన తప్పనిసరి గుర్తింపుపత్రాల్లో ఆధార్ కార్డును కూడా చేర్చాలని సూచించింది.

ఎస్ఐఆర్ చట్టవిరుద్ధమని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్లతో పాటు ఈసీ తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఓపెన్ కోర్టులోనే కొన్ని ఆదేశాలు ఇచ్చింది.

తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎలక్షన్ కమిషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈసీ ఏంచేయాలంటే....

  • ఇప్పటివరకూ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నా, ముసాయిదా జాబితాలో చేర్చని దాదాపు 65 లక్షల మంది పేర్లతో జాబితా తయారుచేయాలి. జిల్లావారీగా ప్రతి జిల్లా ఎన్నికల అధికారి (డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్) తమ వెబ్‌సైట్‌ల్లో ఆ జాబితాను కచ్చితంగా ప్రచురించాలి.
  • ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా ఆ సమాచారం బూత్ వారీగా ప్రతి ఓటరు ఎపిక్ నంబరు సహా ఇవ్వాలి. ముసాయిదా జాబితాలో వారి పేర్లను ఎందుకు చేర్చలేదో ఆ కారణాన్నీ ఆ జాబితాలో పేర్కొనాలి.
  • ఆ జాబితాలను తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తున్న విషయమై ప్రజలందరికీ తెలిసేలా జిల్లా ఎన్నికల అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలి. ఈ విషయమై బిహార్‌లో స్థానిక (ప్రజల మాతృభాష), అలాగే ఇంగ్లిష్ దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి.
  • టీవీలు, రేడియోలో ప్రసారం చేయాలి. వారికి ఏవైనా అధికారిక సోషల్ మీడియా సైట్ ఉంటే అందులోనూ ప్రదర్శించాలి.
  • ముసాయిదాలో చేర్చకపోవడానికి కారణమేమిటో ప్రజలు వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి వీలుగా 65 లక్షల మంది ఓటర్ల జాబితాలను ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్ తమ పంచాయతీ భవనం వద్ద, అలాగే బ్లాక్ డెవలప్‌మెంట్ పంచాయతీ ఆఫీసర్ తమ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.
  • అర్హత విషయంలో నష్టపోయిన ఓటర్లు తమ ఆధార్ కార్డు కాపీతో తమ దరఖాస్తు (క్లెయిమ్)ను అవకాశం కల్పించాలి. ఇది ఎలా చేయాలనేదానిపై ప్రచారం కల్పిస్తూ పబ్లిక్ నోటీసు ఇవ్వాలి.
  • ముసాయిదా జాబితాలో చేర్చని ఓటర్ల పేర్లతో రూపొందించే జాబితాల సాఫ్ట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల అధికారి (ఎస్ఈవో) కూడా తీసుకొని, బిహార్ ఎన్నికల సంఘం/సీఈవో వెబ్‌సైట్‌లో ఉంచాలి.
  • ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అందరు బూత్ లెవల్ ఆఫీసర్లు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి సమ్మతి నివేదికలను తీసుకొని, కొల్లేటెడ్ స్టేటస్ రిపోర్టుగా నమోదు చేయాలి.
బిహార్ ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్ ఓటర్లు

'ఇదొక పెద్ద తొలి అడుగు...'

సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయి.

ఇదొక పెద్ద తొలి అడుగు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ పేర్కొన్నారు.

''సుప్రీంకోర్టు నేడు భారత రాజ్యాంగాన్ని స్పష్టంగా, దృఢంగా, ధైర్యంగా సమర్థించింది. ప్రధాన మంత్రి, ఆయన మద్దతుదారుల కుతంత్రాల నుంచి మన గణతంత్ర దేశాన్ని కాపాడుకోవడానికి దీర్ఘకాల పోరాటం సాగుతోంది. బిహార్ ఎస్‌ఐఆర్‌ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆశాకిరణం. ఇదొక పెద్ద తొలి అడుగు'' అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)