ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో అమెరికాలో ధరలు పెరగడం మొదలైందా?

అమెరికా, సుంకాల ప్రభావం, ఆర్థిక వ్యవస్థ, ట్రంప్

ఫొటో సోర్స్, Bloomberg/Getty

    • రచయిత, నటాలీ షెర్మాన్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రమాదంలో పడేస్తున్నారని దాదాపుగా ఏ ఆర్థికవేత్తను అడిగినా చెబుతారు.

ట్రంప్ సుంకాలు, వలసదారులపై కఠిన చర్యలు 1970లనాటి ''స్టాగ్‌ఫ్లేషన్''(అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి మందగమనం, అధిక నిరుద్యోగిత)వంటి పరిస్థితులను మళ్లీ సృష్టించే ప్రమాదముందని ఆర్థిక వేత్తలంటున్నారు. 1970ల్లో చమురు ధరలు హఠాత్తుగా భారీ ఎత్తున పెరగడంతో, ఆర్థిక వృద్ధి స్తంభించి, ధరలు పెరిగిపోయాయి. కానీ ఈ సారి సంక్షోభం చేతులారా తెచ్చుకున్నది.

అయితే ఈ ఆందోళనలను వైట్ హౌస్ తోసిపుచ్చింది. నిపుణులపై విమర్శలు గుప్పించింది. యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ కమిషనర్‌ను పదవి నుంచి తప్పించింది.

ఈ పరిస్థితులు ఎలా మారతాయోననే అనిశ్చితి మధ్య అమెరికా సెంట్రల్ బ్యాంక్ అచేతనంగా ఉంది. వడ్డీరేట్లపై ఓ నిర్ణయం తీసుకునేముందు పరిస్థితిపై స్పష్టత ఇవ్వగల సమాచారం కోసం ఎదురుచూస్తోంది.

కంపెనీల ఫలితాలు, ఉద్యోగాల డేటా, ద్రవ్యోల్బణంపై సమాచారం అందినప్పటికీ నిజంగా అసలు పరిస్థితి ఏంటనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కార్మిక రంగం నుంచి వస్తున్న సంకేతాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, సుంకాల ప్రభావం, ఆర్థిక వ్యవస్థ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.

‘మాంద్యం అంచున ఆర్థిక వ్యవస్థ’

మే, జూన్ నెలల్లో ఉద్యోగాలు లేవు. జూలైలో అంతంతమాత్రంగా ఉన్నాయి. ఉపాధి లభించక నిరుత్సాహానికి గురవుతున్న కార్మికుల సంఖ్య పెరుగుతోంది.

ఆగస్టు ఒకటోతేదీన వచ్చిన ఉద్యోగాల నివేదిక స్టాక్‌మార్కెట్‌ను కుదిపేసింది. దీంతో ట్రంప్ తీవ్రంగా కలతచెందారు. ఫలితంగా ఆయన బీఎల్ఎస్ కమిషనర్‌ను తొలగించారు.

కొన్ని రోజులకే ''ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉంది'' అంటూ మూడీస్ ఎనలిటిక్స్ ఆర్థికవేత్త మార్క్ జాండీ సోషల్ మీడియాలో ప్రకటించారు.

అయితే దీనిపై ఏకాభిప్రాయం లేదు.

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నది నిజం. ఈ ఏడాది ప్రథమార్థంలో వార్షిక వృద్ధి రేటు 1.2శాతం ఉంది. 2024లో ఈ సమయంతో పోలిస్తే ఒక పర్సంటేజీ పాయింట్ తగ్గింది.

ఆర్థిక వృద్ధి బలహీనపడినప్పటికీ, వినియోగదారుల ఖర్చులు మాత్రం ఆశించినదానికంటే స్థిరంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు వినియోగదారులు ఖర్చులు తగ్గిస్తారని అంచనా వేసినప్పటికీ, ఆ స్థాయిలో ఖర్చులు తగ్గలేదు.

ఆగస్టు 1న పడిపోయిన స్టాక్ మార్కెట్లు వెంటనే కోలుకున్నాయి. షేర్లు మళ్లీ పెరుగుతున్నాయి.

‘‘మేం ఆర్థిక వృద్ధి బలహీనపడుతున్న సంకేతాలను గమనించేందుకు కష్టపడుతున్నాం’’ అయితే ‘‘మౌలికంగా వినియోగదారులు బాగానే కనిపిస్తున్నారు’’ అని అమెరికాలో అతిపెద్ద బ్యాంక్ అయిన జేపీమోర్గాన్ చేజ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గత నెలలో ఇన్వెస్టర్లతో చెప్పారు.

అయితే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ తీరు 1980ల తర్వాత గరిష్ఠమైన ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తీవ్రంగా పెరగడం వంటి సవాళ్లను కూడా దాటుకుని పుంజుకోగలదనే ఆశలు పెరిగాయి.

అమెరికా, సుంకాల ప్రభావం, ఆర్థిక వ్యవస్థ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ ప్రమాదంలో పడేస్తున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుందా?

రీటైల్ షాపులు, రెస్టారెంట్లలో ఖర్చుపెట్టే శాతం జూన్‌తో పోలిస్తే జూలైలో 0.5శాతం పెరిగిందని, గతంలో వేసిన అంచనా కన్నా జూన్‌లో ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉందని అమెరికా ప్రభుత్వం శుక్రవారం(ఆగస్టు 15) తెలిపింది.

''వినియోగదారుల సంఖ్య తగ్గింది. కానీ పూర్తిగా లేకుండా పోలేదు'' అని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌లో డిప్యూటీ చీఫ్ యూఎస్ ఎకనమిస్ట్ మైఖేల్ పియర్స్ తెలిపారు. రానున్న నెలల్లో ప్రజలు ఖర్చుపెట్టడం మరింత పెరుగుతుందని అంచనావేశారు. పన్నుల్లో కోత, స్టాక్ మార్కెట్ కోలుకోవడం నమ్మకాన్ని పెంచుతుందన్నారు.

‘‘ఆర్థికవృద్ధి మందగనంలో ఉన్నప్పటికీ, జాబ్ మార్కెట్ వేగంగా క్షీణించే అవకాశం లేదు’’

అమెరికా, సుంకాల ప్రభావం, ఆర్థిక వ్యవస్థ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలో గత ఏడాదితో పోలిస్తే జూలైలో ధరలు 2.7శాతం పెరిగాయి.

'ఖర్చులు తగ్గించుకోవాల్సిన స్థాయిలో ధరలు పెరగలేదు'

రానున్న నెలల్లో కూడా సవాళ్లు కొనసాగనున్నాయి.

ప్రస్తుతం నిత్యావసరాల ధరల్లో భారీ పెరుగుదల ఏమీ లేదు కాబట్టి, ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి లేదు.

గత ఏడాదితో పోలిస్తే జూలైలో ధరలు 2.7శాతం పెరిగాయి. జూన్‌లో ఇవే ధరలున్నాయి.

అయితే ఈ ఏడాది చివరి దాకా ఆగేపనిలేకుండా అధిక ధరల ప్రభావం ఇప్పుడే కనిపించడం మొదలయింది. ఈ నెల వరకు సుంకాల అమలను ట్రంప్ వాయిదా వేయడంతో చాలామంది దీన్ని అంచనావేయలేకపోయారు

కాఫీ, అరటిపళ్లు వంటి ప్రత్యామ్నాయం లేని వస్తువుల ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. వచ్చే నెలల్లో ధరల పెరుగులదల మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సుంకాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనేదానిపై స్పష్టత రావడంతో పన్నుల అమలు కంటే ముందున్న స్టాక్ అంతా అమ్మేసి, కంపెనీలు ధరలు పెంచుతాయి.

అందుకే అందరి దృష్టి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్‌పై ఉంది. వినియోగదారులకు చేరకముందే అమెరికా ఉత్పత్తిదారులు వసూలు చేసే హోల్‌సేల్ ధరలను ఇది లెక్కిస్తుంది. రాబోయే పరిస్థితులపై సంకేతాలందిస్తుంది.

ఇది మూడేళ్ల కంటే ఎక్కువగా జూలైలో వేగంగా పెరిగింది.

ఇంకా ఆందోళన కలిగించే విషయమేంటంటే వినియోగదారులు, ఉత్పత్తిదారుల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ధరల పెరుగుదల వస్తువులకే పరిమితం కాలేదు. దీంతో ఆర్థిక వృద్ధి ఆగిపోతుందనే ఆందోళన మరింత బలపడుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)