ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

రాధాకృష్ణన్, మోదీ

ఫొటో సోర్స్, X/CPRGUV

రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్‌డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ప్రకటించారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు.

ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఆదివారం దిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ప్రకటించారు.

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాధాకృష్ణన్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాధాకృష్ణన్

ఫొటో సోర్స్, rajbhavan-maharashtra.gov.in

ఎవరీ రాధాకృష్ణన్

చంద్రాపురం పోన్నుస్వామి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆరెస్సెస్ స్వయంసేవకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడయ్యారు.

భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎదుగుదలలో రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించారు.

ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998, 1999లో ఇక్కడ విజయం సాధించారు.

ఆ తర్వాత 2004, 2014, 2019లో వరుసగా మూడుసార్లు ఓడిపోయారు.

2023 ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు.

రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి ఉద్యమంతో ప్రారంభించారు. 2007లో తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 93 రోజుల్లో రాష్ట్రంలో 19 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

ఈ ప్రయాణంలో ప్రధానంగా నదుల అనుసంధానం, ఉగ్రవాదం, ఉమ్మడి పౌరస్మృతి, అంటరానితనం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై దృష్టి సారించారు.

ఆ తర్వాత కూడా ఆనకట్టలు, నదుల సమస్యపై 280 కిలోమీటర్లు, 230 కిలోమీటర్ల చొప్పున రెండుసార్లు పాదయాత్రలు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)