పోర్న్‌సైట్ చూడాలంటే వయసెంతో చెప్పాల్సిందే, కొత్త రూల్స్‌తో వ్యూయర్స్ తగ్గిపోతున్నారా?

బ్రిటన్, పోర్న్ సైట్లు, వయసు నిబంధనలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చార్లెట్ ఎడ్వర్డ్స్, క్రిస్ వేలన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

బ్రిటన్‌లో వయసు ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడంతో పోర్నోగ్రఫీ సైట్లు చూసే వారి సంఖ్య తగ్గిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

బ్రిటన్‌లో ఎక్కువ మంది చూసే పోర్న్‌హబ్ సైట్ రెండు వారాల్లో పది లక్షల మందికి పైగా విజిటర్స్‌ను కోల్పోయిందని డేటా విశ్లేషణ సంస్థ సిమిలర్ వెబ్ తెలిపింది.

18 ఏళ్ల లోపు వాళ్లు అశ్లీల దృశ్యాలు చూడకుండా కఠిన నియంత్రణ అమలు చేయాలని ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ చెప్పడంతో జులై 25న పోర్న్ హబ్‌తో పాటు మరి కొన్ని అడల్ట్ వెబ్‌సైట్లు వయసు చెక్ చేసేందుకు ఆధునిక పద్దతుల్ని అమల్లోకి తెచ్చాయి.

ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్లను జులైలో రోజుకు ఎంతమంది చూశారు... ఆ తరువాత ఆగస్టు 1 నుంచి 9 మధ్య రోజుకు ఎంతమంది చూశారు అనే వివరాలతో ఆ తరువాత సిమిలర్‌వెబ్‌కు చెందిన డేటా ఎక్స్‌పర్ట్స్ పోల్చి చూశారు.

అశ్లీల చిత్రాల కోసం బ్రిటన్‌లో ఎక్కువ మంది పోర్న్‌హబ్ అనే అశ్లీల వెబ్‌సైట్‌ను చూస్తున్నారు.

అయితే కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత జులై 24 నుంచి ఆగస్టు 8 మధ్య ఈ సైట్ చూసే వారి సంఖ్య 47 శాతం తగ్గిందని సిమిలర్‌వెబ్ డేటా చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అదే సమయంలో మరో ప్రముఖ పోర్న్ సైట్ ఎక్స్‌వీడియోస్‌ చూసే వారి సంఖ్య 47శాతం తగ్గింది.

ఓన్లీఫ్యాన్స్ సైట్ చూసే వారి సంఖ్య కూడా 10శాతం పడిపోయింది.

పోర్న్‌హబ్ రోజువారీ సగటు వీక్షకుల సంఖ్య జులైలో 32 లక్షలు ఉండగా ఆగస్ట్ మొదటి 9 రోజుల్లో అది రోజుకు 20 లక్షలకు తగ్గిపోయింది.

అయితే, కొన్ని చిన్న, నియంత్రణలు పెద్దగా లేని పోర్నోగ్రఫీ సైట్లు చూసే వారి సంఖ్య పెరిగిందని డేటా సూచిస్తోంది.

బ్రిటన్, పోర్న్ సైట్లు, వయసు నిబంధనలు

ఫొటో సోర్స్, Getty Images

"ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చట్టాల ప్రకారం ఆంక్షలు విధిస్తున్నాయి. అవి పాటించే సైట్లు చూసే వారి సంఖ్య తగ్గుతోంది. పాటించని సైట్ల వీక్షకుల సంఖ్య పెరుగుతోంది" అని పోర్న్‌హబ్ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

వయసు ధ్రువీకరణకు సంబంధించి నియమావళి అమలు తర్వాత బ్రిటన్‌లో యాపిల్ యాప్ స్టోర్‌లో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ యాప్స్ ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

మీరు ఏ ప్రాంతంలో ఉన్నారనే దాన్ని వీపీఎన్ యాప్స్ దాచిపెట్టగలవు. మీరు వేరే దేశంలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్లుగా ఇవి చూపిస్తాయి.

ఒక ప్రత్యేక ప్రాంతంలో ఎంత మంది ఏఏ వెబ్ సైట్లు చూస్తున్నారనే సమాచారాన్ని సేకరించడాన్ని ఈ యాప్స్ అడ్డుకుంటాయి.

కోటి 40 లక్షల మంది ఆన్‌లైన్‌లో పోర్నోగ్రఫీ సైట్లు చూస్తున్నారని మీడియా రెగ్యులేటర్ ఆఫ్‌కామ్ అంచనా వేసింది.

వీక్షకుల క్రెడిట్ కార్డు తనిఖీలు, ఫోటోఐడీలను మ్యాచ్ చేయడం, సెల్ఫీల ద్వారా వెబ్‌సైట్లు వయసును అంచనా వేసేందుకు మీడియా రెగ్యులేటర్ అనేక మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

తాజా మార్పుల వల్ల ఊహించని పరిణామాలు ఎదురు కావచ్చని పోర్న్ కంటెంట్ కోసం ప్రజలు డార్క్ వెబ్ లాంటి తీవ్రత ఎక్కువ ఉన్న సైట్ల వైపు వెళ్తారని విమర్శకులు అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)