ఏపీ, తెలంగాణల్లో గుర్తింపు కోల్పోయిన రాజకీయ పార్టీలు 18, మరో 26 పార్టీలకు త్వరలో నోటీసులు

ఫొటో సోర్స్, ECI/FB
ప్రజా ప్రాతినిధ్య చట్టం (రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్)1951 నిబంధనలకు లోబడి ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది.
దేశవ్యాప్తంగా మరో 476 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేస్తూ భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఆగస్టు 11వ తేదీన ఆదేశాలు జారీ చేసింది.
దేశంలోని రాజకీయ పార్టీలు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 29ఏ సెక్షన్ నిబంధనల ప్రకారం ఈసీఐ వద్ద నమోదవుతాయి. తద్వారా ఎన్నికల గుర్తు, పన్ను మినహాయింపు వంటి కొన్ని ప్రత్యేక హక్కులు, నిధుల సమీకరణ వంటి ప్రయోజనాలను పొందుతాయి.
ఎన్నికలలో బ్యాలెట్, స్టార్ క్యాంపెయినర్ల విషయంలో స్వతంత్ర అభ్యర్థుల కన్నా రాజకీయ పార్టీల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
అయితే, ఏదైనా రాజకీయ పార్టీ వరుసగా ఆరేళ్లపాటు ఎన్నికలలో పోటీ చేయకపోతే, నిబంధనల ప్రకారం ఆ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితా నుంచి ఈసీఐ తొలగిస్తుంది.


ఫొటో సోర్స్, ECI
ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన...
నిరంతరం కొనసాగే ఈ ప్రక్షాళనలో భాగంగా, 2019 నుంచి వరుసగా ఆరేళ్లలో కనీసం ఒక ఎన్నికల్లోనూ పోటీ చేయని రాజకీయ పార్టీల (రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు – ఆర్‌యూపీపీ)ను గుర్తించడానికి దేశవ్యాప్తంగా కసరత్తు చేస్తోంది.
నిబంధనల ప్రకారం వాటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిస్తోంది.
ఒకవేళ, ఈ ఆదేశాలతో నష్టపోయామని ఏ పార్టీ అయినా భావిస్తే 30 రోజుల్లోగా ఈసీఐకు అప్పీలు చేసుకొనే అవకాశం ఉంటుంది.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించిన పార్టీలు ఇకపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 29బి, 29సి ప్రకారం లభించే హక్కులు, ప్రయోజనాలను పొందలేవు.
తొలిదఫాలో 334 పార్టీల తొలగింపు...
ఇటీవల జరిపిన తొలి దఫా కసరత్తు తర్వాత 334 ఆర్‌యూపీపీలను ఇప్పటికే తొలగిస్తూ ఆగస్టు 9వ తేదీన ఈసీఐ ఆదేశాలిచ్చింది. దీంతో జాబితాలోని ఆర్‌యూపీపీల సంఖ్య 2,854 నుంచి 2,520కు తగ్గింది.
ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పార్టీలు, తెలంగాణ నుంచి 13 పార్టీలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ
బహుజన్ సమాజ్ పార్టీ (అంబేడ్కర్-ఫూలే)
ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ
జాగో పార్టీ
జాతీయ మహిళా పార్టీ
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్
తెలంగాణ కార్మిక రైతురాజ్యం పార్టీ
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ
తెలంగాణ మైనార్టీస్ ఓబీసీ రాజ్యం
తెలంగాణ ప్రజాసమితి (కిశోర్, రావు, కిషన్)
తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ
యువ పార్టీ
యువ తెలంగాణ పార్టీ

భారతీయ బహుజన ప్రజారాజ్యం
హిందుస్తాన్ రాష్ట్రీయ పార్టీ
జై భారత్ జనసేన పార్టీ
తెలుగు బహుజన పార్టీ
తెలుగు రాష్ట్ర శక్తి పార్టీ

ఫొటో సోర్స్, ECI
రెండో దఫాలో మరికొన్ని పార్టీలకు నోటీసులు...
రెండో దఫా కసరత్తు తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మరో 476 ఆర్‌యూపీపీలను ఈసీఐ గుర్తించింది. ఆయా పార్టీలు తమ వాదన వినిపించడానికి మరో అవకాశం కల్పిస్తూ, వాటికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈవోలు)ను ఆదేశించింది.
తదుపరి సీఈవోల నివేదిక ఆధారంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితా నుంచి ఏయూ ఆర్‌యూపీపీలను తొలగించాలనేదీ ఈసీఐ నిర్ణయం తీసుకుంటుంది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ నోటీసులు ఆంధ్రప్రదేశ్‌లో 17 పార్టీలకు, తెలంగాణలో 9 పార్టీలకు అందనున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజాబలమే ప్రాతిపదికగా హోదా...
ఏదైనా రాజకీయ పార్టీని ఎన్నికల సంఘం వద్ద 'జాతీయ పార్టీ'గా గుర్తింపు పొందాలంటే... దిగువ పేర్కొన్నవాటిలో ఏదొక నిబంధన ప్రకారం అర్హత సాధించాలి.
- నాలుగు లేదా అంతకు మించి ఏవైనా రాష్ట్రాల్లో 'రాష్ట్ర పార్టీ'గా 'గుర్తింపు' పొందాలి.
- ఏవైనా నాలుగు లేదా అంతకుమించి రాష్ట్రాల్లో జరిగిన గత లోక్‌సభ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం చెల్లిన ఓట్లలో ఆ పార్టీ అభ్యర్థులు కనీసం 6 శాతం ఓట్లను సాధించాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో కనీసం నాలుగు ఎంపీ స్థానాలు గెలవాలి.
- మొత్తం లోక్‌సభ స్థానాల్లో కనీసం 2 శాతం సీట్లను కనీసం 3 రాష్ట్రాల నుంచి గెలవాలి.
ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) జాతీయ పార్టీలుగా ఉన్నాయి.
దిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో 'రాష్ట్ర పార్టీ'గా గుర్తింపు పొందడం ద్వారా ఆప్ జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది.
ఏదైనా రాజకీయ పార్టీ 'రాష్ట్ర పార్టీ'గా గుర్తింపు పొందాలంటే... దిగువ పేర్కొన్న ఏదొక నిబంధన ప్రకారం అర్హత సాధించాలి.
- ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం చెల్లిన ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి. అలాగే, కనీసం రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలవాలి.
- ఆ రాష్ట్రంలో జరిగిన గత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం చెల్లిన ఓట్లలో 6 శాతం ఓట్లతో పాటు ఆ రాష్ట్రంలో కనీసం ఒక లోక్‌సభ స్థానంలోనైనా విజయం సాధించాలి.
- రాష్ట్ర శాసనసభకు జరిగిన గత ఎన్నికల్లో మొత్తం శాసనసభా స్థానాల్లో కనీసం 3 శాతం సీట్లు లేదా 3 ఎమ్మెల్యే స్థానాలు...వీటిలో ఏవి ఎక్కువైతే అవి దక్కించుకోవాలి.
- లోక్‌సభ ఎన్నికలలో ప్రతి 25 స్థానాలకు లేదా లోక్‌సభలో ఆ రాష్ట్రానికి కేటాయించిన స్థానాల్లో కనీసం ఒక ఎంపీ సీటు గెలవాలి.
- ఆ రాష్ట్రంలో జరిగిన గత శాసనసభ లేదా లోక్‌సభ ఎన్నికల్లో చెల్లిన మొత్తం ఓట్లలో కనీసం 8 శాతం ఓట్లను పొందాలి.
ఆర్‌యూపీపీలు అంటే...
- ఎన్నికల సంఘం వద్ద కొత్తగా నమోదైన రాజకీయ పార్టీలు
- ఎన్నికల సంఘం వద్ద నమోదైన తర్వాత కనీసం ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని పార్టీలు
- 'రాష్ట్ర పార్టీ' హోదా పొందడానికి అవసరమైన ఓట్ల వాటాను గత అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో సాధించలేని రాజకీయ పార్టీలు
వీటిని రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ (ఆర్‌యూపీపీ)లుగా ఎన్నికల సంఘం పరిగణిస్తుంది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మొత్తం స్థానాల్లో కనీసం 5 శాతం స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీ చేయిస్తామని హామీ ఇస్తే ఆ పార్టీకి ఉమ్మడి గుర్తు (కామన్ సింబల్)ను కేటాయిస్తుంది.
ఆర్‌యూపీపీ జాబితాలో ఉండాలంటే...
ప్రతి ఆర్‌యూపీపీ గత మూడు ఆర్థిక సంవత్సరాల తాలూకా ఆడిట్ అకౌంట్లను, గత రెండు ఎన్నికల్లో చేసిన వ్యయం తాలూకా వివరాలను కచ్చితంగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి.
గత ఆరేళ్లలో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేసిఉండాలి.
ఆ రాష్ట్రంలో 50 కన్నా తక్కువ నియోజకవర్గాలు ఉంటే కనీసం 5 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి.
లోక్‌సభ ఎన్నికలైతే 20 కన్నా తక్కువ స్థానాలున్న రాష్ట్రాల్లో కనీసం 2 స్థానాల్లో అయినా పోటీ చేయాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














