కూకట్‌పల్లి బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు, ఏమైందంటే..

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేసేలా ఉండొచ్చు.)
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను పక్కింట్లో ఉండే పద్నాలుగేళ్ల బాలుడు హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయాలనుకున్న బాలుడిని, ఇంట్లోని బాలిక చూసి అరవడంతో ఆమెను చంపేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
ఐదురోజుల పాటు పలువురిని విచారించిన పోలీసులు, చివరకు బాలుడే నిందితుడని తేల్చారు. దొంగతనం కోసం బాలుడు ఒక కాగితంపై ఇంగ్లిష్‌లో రాసుకున్న నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బాలుడిపై ఓటీటీ, ఇతర క్రైమ్ సీరియల్, సిరీస్, సినిమాల ప్రభావం ఉందంటున్నారు పోలీసులు.

అసలేం జరిగింది?
ఆగస్ట్ 18న కూకట్‌పల్లిలోని ఒక ప్రాంతంలో, ఉదయం 9 గంటల సమయంలో తన 10 ఏళ్ల కూతురు హత్యకు గురైందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు, ఆమె ఒంటిపై అనేక కత్తిపోట్లు కనిపించాయి. దీంతో పోలీసులు ఐదు బృందాలుగా విచారణ ప్రారంభించారు.
ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీ లేకపోవడంతో కేసు పోలీసులకు సవాలుగా మారింది. అక్కడ మొబైల్ ఫోన్లు వాడిన ఆనవాళ్లూ లేవు. దీంతో సాంకేతికంగా కాకుండా, పాత పద్ధతుల్లో పోలీసుల విచారణ చేపట్టారు, కేసును ఛేదించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్, ఇతర అధికారులు మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం..
హత్య జరిగిన మొదటిరోజే ఈ బాలుడిని పోలీసులు ప్రశ్నించారు.
''నేను కూడా ఆ అమ్మాయి అరవడం విన్నాను సర్. డాడీ అంటూ అరిచింది'' అంటూ పోలీసులకు సాక్ష్యం చెప్పాడు సదరు బాలుడు.
ఒక దశలో బాలిక తండ్రినీ అనుమానించారు పోలీసులు. అలాగే, ఆ అమ్మాయి ఇంటి కింద ఉంటున్న ఒడిశాకు చెందిన వ్యక్తి ఇటీవలే ఎక్కువగా పూజలు చేయించినట్టు తెలియడంతో, బలి కోణంలోనూ విచారణ చేశారు.
సదరు వ్యక్తిని కస్టడీలో ఉంచి మరీ విచారణ చేశారు. చివరగా అన్ని క్లూలు బాలుడివైపు చూపించాయి.
''ఎక్కువ ఇబ్బంది పెట్టకుండానే బాలుడు అన్ని వివరాలూ చెప్పేశాడు'' అని పోలీసు అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

ఎలా చేశాడు?
ఘటన జరిగిన తీరుపై సైబరాబాద్ పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు.
''ఆ బాలుడు పక్క ఇంట్లో నాలుగో అంతస్తులో ఉంటున్నాడు. తమ కింది అంతస్తు నుంచి బాలిక ఇంటి టెర్రస్ మీదకు దూకాడు. క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం అతను వెళ్లాడు. తాళం తెరవడానికి ఉపయోగపడుతుందని చాకు కూడా తీసుకువెళ్లాడు. కానీ, ఇంటికి తాళం వేసిలేదు.
ఇంట్లో పాప ఉన్నప్పటికీ మెల్లిగా వెళ్లి బ్యాట్ తీసుకున్నాడు. ఆ బ్యాట్ బాలిక తమ్ముడిది. బ్యాట్ తీసుకుని తిరిగి వెళ్లిపోతున్నప్పుడు ఆ అమ్మాయి అతడిని చూసి అరిచింది. గోడెక్కి వెళ్లిపోబోతున్న అతని దగ్గరకు వెళ్లి చొక్కా పట్టుకులాగింది. నాన్నతో చెబుతానంది. దీంతో భయపడిన బాలుడు ఆమెను తోసేశాడు. బాలిక అక్కడ మంచం మీద పడింది. ఆ తర్వాత, వెంటనే కత్తితో బాలికపై దాడిచేశాడు. కళ్లు మూసుకుని పొడిచేశాడు'' అని చెప్పారు పోలీసులు.

'బాలుడి ఇంట్లోనే బ్యాట్'
దొంగతనం ఎలా చేయాలనేది ఆ బాలుడు ముందుగానే ఒక కాగితంపై రాసుకున్నాడని డీసీపీ సురేశ్ కుమార్ తెలిపారు.
''గ్యాస్, టేబుల్, కత్తి ఇవన్నీ వాడాలని నిర్ణయించుకున్నాడు. తాళం వేసి ఉంటే తెరవడానికని కత్తి తీసుకెళ్లాడు. బెదిరించడానికి కూడా ఉపయోగపడుతుంది అనుకున్నాడు. దొంగతనం తరువాత సాక్ష్యాలు ఉండకుండా గ్యాస్ లీక్ చేయాలనుకున్నాడని ఒక అనుమానం. దాదాపు నెల ముందు నుంచే ప్రణాళిక ఉందని తెలుస్తోంది. మేం ఇంట్లో సోదాలు చేసినప్పుడు కత్తి, బట్టలు, నోట్, బ్యాట్ స్వాధీనం చేసుకున్నాం'' అన్నారు డీసీపీ.
''నేరం చేసిన వెంటనే కత్తిని ఆ ఇంట్లోనే కడిగాడు. తన బట్టలకు కూడా రక్తం అంటింది. ఇక ఇంటికి వెళ్లే సరికి బాలుడి తండ్రీ, అక్కా హాల్లోనే ఉండటంతో బయట ఆరేసిన చొక్కా అడ్డుగా పెట్టుకుని నేరుగా బాత్రూంకి వెళ్లి స్నానం చేశాడు. తరువాత ఆ రక్తం అంటిన బట్టలను వాషింగ్ మెషీన్లో వేశాడు. వాషింగ్ మెషీన్లో వేసినప్పటికీ ఆ బట్టలపై స్వల్పంగా రక్తపు మరకలు ఉండిపోయాయి. ఫోరెన్సిక్ సహాయంతో ఆ బట్టలపై రక్తం మరకల ఆధారాలు సేకరించాం'' అని మీడియాతో డీసీపీ చెప్పారు.
బ్యాట్ ఇంట్లో వారు కొనేవారు కదా? అని ప్రశ్నించినట్టు పోలీసులు చెప్పారు.
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనీ, తండ్రికి ఉద్యోగం లేకపోవడం, అక్క ఫీజులు కట్టాల్సి ఉన్నప్పుడు బ్యాట్ కొనాలని అడగడం ఇష్టంలేక ఇలా చేయాలనుకున్నానని బాలుడు సమాధానం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఆ బాలుడిపై మొదట్లోనే పోలీసులకు అనుమానం వచ్చింది కానీ, ఇతరుల మీద ముందుగా దృష్టి కేంద్రీకరించారు. తరువాత దొరికిన క్లూలతో ఈ అబ్బాయిని ప్రశ్నించారు.
అదే రోజు ఉదయం 8 గంటల సమయంలో అక్కడ తచ్చాడాడని పోలీసులకు సాక్ష్యాలు దొరికాయి. పైగా పోలీసులు ఈ అబ్బాయిని మొదటిరోజు విచారించినప్పుడు వారిని తప్పుదోవ పట్టించేలా సమాధానం చెప్పాడు.
''ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి అరవడం విన్నానని'' బాలుడు పోలీసులకు చెప్పాడు.
బాలుడు బలంగా లేకపోవడంతో బాలిక ఒంటిపై మరీ లోతైన గాయాలు కాలేదని, కానీ, మెడ దగ్గర అయిన గాయం వల్ల రక్తం ఎక్కువగా పోవడంతో బాలిక చనిపోయిందని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ఎవరీ బాలుడు?
ప్రస్తుతం ఆ బాలుడి తండ్రి ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి 20 వేల లోపు జీతం వచ్చే చిరుద్యోగి. అక్కలు ఉన్నారు.
గతంలో బక్కగా ఉన్నావంటూ స్నేహితులు ఎగతాళి చేస్తే బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. బాలుడు సీఐడీతో పాటు మరో సిరీస్ బాగా చూస్తాడు. పదో తరగతి చదువుతున్నాడు కానీ, చదువుపై పెద్దగా ఆసక్తి లేదు.
''ఘటన జరిగిన రోజు కొడుకు ప్రవర్తన చూసి తనకు కాస్త అనుమానం వచ్చినట్టు బాలుడి తల్లి చెప్పారు. అకస్మాత్తుగా స్నానం చేయడం, బట్టలు మెషీన్లో వేయడం, కాస్త బెరుకుగా కనిపించడంతో ప్రశ్నించానన్నారు. కానీ, బాలుడు తనకేం సంబంధం లేదన్నాడని ఆమె చెప్పారు'' అని పోలీసులు తెలిపారు.
గుచ్చి గుచ్చి అడగడంతో నువ్వే నన్ను పోలీసులకు పట్టిస్తావా? అని తల్లిని బాలుడు ప్రశ్నించినట్లు పోలీసులు బీబీసీతో చెప్పారు.
''ఆ బాలుడు యూట్యూబ్, ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్లు, సస్పెన్స్ థ్రిల్లర్లు, మిస్టరీ సిరీస్‌లు బాగా చూస్తాడు'' అని కమిషనర్ మహంతి తెలిపారు.
నాలుగు రోజులుగా జరుగుతున్న విచారణను బాలుడు గమనించాడు. మొదటిరోజు బాగా కంగారు పడ్డాడు.
ఆ బాలుడు, బాలిక తమ్ముడు కలసి క్రికెట్ ఆడేవారని తెలుస్తోంది. గతంలో ఆ బాలిక తమ్ముడు.. నిందితుడి బ్యాట్ విరగ్గొడితే, అందుకు పరిహారంగా ఈ అబ్బాయికి 500 రూపాయలు ఇచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ డబ్బుతో ఆ అబ్బాయి ఫోన్ కొనుక్కున్నాడని పోలీసుల కథనం.
ప్రస్తుతం నిందితుడైన బాలుడిని చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని వ్యవహరిస్తున్నారు.
ఈ కేసును ఎఫ్ఐఆర్ నంబర్ 1102/2025 గా నమోదు చేశారు. 103 (1) బీఎన్ఎస్ , 331, 305 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
సాంకేతిక సాక్ష్యం అంటే సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్ ఇవేమీ లేకపోవడంతో విచారణ కాస్త ఆలస్యం అయిందని, డ్రగ్స్ ప్రభావం ఏమీ లేదని పోలీసులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














