ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ చేసిన ప్రకటనలకు రూ. 8 కోట్ల 81లక్షలు : ఆర్టీఐ

ఫొటో సోర్స్, CMO Gujarat
- రచయిత, అర్జున్ పర్మార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక కార్యక్రమం ఐదు సంవత్సరాలు, పది సంవత్సరాలు, 25, 50 లేదా 100 సంవత్సరాల వేడుకల గురించి మీరు చూసి ఉండొచ్చు లేదా వినిండొచ్చు. కానీ, మీరెప్పుడైనా ఒక కార్యక్రమం 23 సంవత్సరాల వేడుకలను చూశారా? మరీముఖ్యంగా దాని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?
గత ఏడాది గుజరాత్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. అక్టోబర్ 7, 2024న, గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రకటనలు కనిపించాయి.
'23 సంవత్సరాల విజయవంతమైన, సమర్థ నాయకత్వం', ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ పదవిలో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు అన్నది ఈ ప్రకటనల్లో ఒకటి.
అదే సిరీస్‌లోని మరొక ప్రకటన 'డెవెలప్‌మెంట్ వీక్ - 23 సంవత్సరాల విజయవంతమైన, సమర్థ నాయకత్వం' అని సందేశమిచ్చే ప్రకటన.
ఈ ప్రకటనల కోసం చేసిన ఖర్చు వివరాలను కోరుతూ బీబీసీ గుజరాతీ గుజరాత్ ప్రభుత్వ సమాచార విభాగానికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసింది.
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియాలో ఈ రెండు ప్రకటనలకు సంబంధించి మొత్తం 8,81,01,941రూపాయలను ఖర్చు చేసినట్టు ఆ శాఖ తెలియజేసింది.
ఈ ఖర్చు పూర్తిగా అన్యాయమైనదని, ప్రజాధనాన్ని వృథా చేయడమని రాజకీయ, న్యాయనిపుణులుంటున్నారు. అలాంటి ఖర్చు ఏదైనా జరిగినా, దానికి ఎంత ఖర్చయిందో తెలియదని, ప్రభుత్వ ఖర్చులపై నిబంధనల ప్రకారమే ఆడిట్ జరుగుతుందని బీజేపీ ప్రతినిధులు అంటున్నారు.
గుజరాత్ బీజేపీ ప్రభుత్వ ప్రతినిధి, మంత్రి దీని గురించి తనకేమీ తెలియదని అన్నారు.


ఫొటో సోర్స్, Gujarat Information/FB
గుజరాత్ ప్రభుత్వ ప్రకటనల్లో ఏముంది?
ఈ ప్రకటనలలో అక్టోబర్ 7, 2024న గుజరాత్‌లోని ఒక ప్రధాన గుజరాతీ దినపత్రికలో సగం పేజీ నిలువు ప్రకటన(వర్టికల్) ఉంది.
అందులో "23 సంవత్సరాల విజయవంతమైన, సమర్థ నాయకత్వం" - 7 అక్టోబర్ 2001 - గుజరాత్ అభివృద్ధి చెందుతుందున్న విశ్వాసాన్ని పొందింది.. అని ఉంది.
2001 అక్టోబర్ 7న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ రాజీనామా తర్వాత నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం అయ్యారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా మోదీ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన 23వ వార్షికోత్సవం అక్టోబర్ 7, 2024.
ఈ సందర్భంగా, వార్తాపత్రికలలో గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో నరేంద్ర మోదీ మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి ఒక చిత్రం, అలాగే ఇటీవలి చిత్రం కూడా ఉన్నాయి.
ఆ ప్రకటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాసిన అభినందన సందేశం కూడా ఉంది. అందులో, ప్రధాన మంత్రిని సంబోధించిన విశేషణాల వెల్లువ కూడా కనిపిస్తుంది.
"అభివృద్ధి చెందిన భారతదేశ దార్శనికుడు, గుజరాత్‌ను గర్వపడేలా చేసిన వ్యక్తి, అభివృద్ధి కారకుడు, విజయవంతమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోదీకి అభినందనలు."
"అభివృద్ధి మూలస్తంభానికి అభినందనలు."
వీటితో పాటు, అదే దినపత్రిక చివరి పేజీలో ఒక పూర్తి పేజీ ప్రకటనలో "అభివృద్ధి వారం(డెవెలప్‌మెంట్ వీక్)", "23 సంవత్సరాలు... విజయవంతమైన, సమర్థ నాయకత్వం" అని పెద్ద అక్షరాలతో ఉంది.
2001లో తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీ చిత్రంతో పాటు, "గౌరవనీయ భారత ప్రధానమంత్రి, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోదీ 23 సంవత్సరాల క్రితం అక్టోబర్ 7, 2001న మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు" అని ఈ ప్రకటనలో అదనంగా రాసి ఉంది.
ఈ ప్రకటనలో, 23 అనే సంఖ్యను చాలా పెద్ద పరిమాణంతో ప్రచురించారు. ఈ సంఖ్యలో గుజరాత్ సంస్కృతి, ప్రభుత్వం చెప్పుకునే అభివృద్ధి వాదనకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. అదనంగా, ఈ సంఖ్య చుట్టూ, 23 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన 'పురోగతి', ప్రభుత్వం సాధించిన 'విజయాలు' రాసి ఉన్నాయి.
నరేంద్ర మోదీ అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారని, అక్టోబర్ 7 నుంచి 15 వరకు రాష్ట్రం 'అభివృద్ధి వారోత్సవం' జరుపుకుంటుందని, ఎందుకంటే ఆయన 'సంకల్పం, నాయకత్వం' కారణంగా గుజరాత్ 'బహుముఖ అభివృద్ధికి సాక్షి'గా మారిందని 2024 అక్టోబర్ 6న గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధి, మంత్రి రుషికేశ్ పటేల్ వ్యాఖ్యానించిన విషయం గమనించాలి.
'వికాస్ సప్త' ఏడు రోజులలో గుజరాత్ ప్రభుత్వం రూ.3,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉందని ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది.

ఫొటో సోర్స్, Gujarat Information/FB/Arjun Parmar
సమాచార హక్కు దరఖాస్తులో ఏం తెలిసింది?
పైన పేర్కొన్న రెండు ప్రకటనలను ఇవ్వడానికి అయిన ఖర్చు వివరాలను తెలుసుకోవడానికి బీబీసీ గుజరాతీ సమాచార హక్కు చట్టం, 2005 (ఆర్టీఐ చట్టం, 2005) కింద గుజరాత్ సమాచార శాఖకు దరఖాస్తు చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ పదవిలో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందిస్తూ '23 సంవత్సరాల విజయవంతమైన, సమర్థ నాయకత్వం' అనే సందేశంతో వార్తాపత్రికలలో ప్రకటనల కోసం సమాచార శాఖ ప్రచార విభాగం సుమారు రూ.2 కోట్ల 12 లక్షలు ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలియజేశారు.
అదనంగా, 'వికాస్ సప్త' ప్రచారం కోసం గుజరాత్ ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలను రాష్ట్ర సమాచార శాఖ నుంచి కోరుతూ బీబీసీ గుజరాతీ ఆర్టీఐ చట్టం కింద మరొక దరఖాస్తును దాఖలు చేసింది.
దీనికి ప్రతిస్పందనగా, సమాచార శాఖ రెండు వేర్వేరు సమాధానాలను ఇచ్చింది. వాటిలో ఒకదానిలో 'వికాస్ సప్త' కింద వార్తాపత్రికలలో ప్రకటనలు ఇవ్వడానికి సమాచార శాఖ ప్రచార విభాగం ద్వారా చేసిన ఖర్చు దాదాపు 3,04,98,000 రూపాయలుగా అంచనా వేసింది.
అలాగే, రెండో సమాధానంలో, రాష్ట్ర సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ 'వికాస్ సప్త' కింద ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కోసం సుమారు రూ. 3,64,03,941రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపింది.
ఇలా ఈ రెండు ప్రకటనల ప్రచారాల కోసం గుజరాత్ ప్రభుత్వం సుమారు 8,81,01,941రూపాయలు ఖర్చు చేసింది.

ఫొటో సోర్స్, Arjun Parmar
‘ప్రజాధనాన్ని వృథా చేయడమే’
2015లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తన తీర్పులలో ఒకదానిలో ప్రభుత్వ ప్రకటనలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషనర్ తరఫున వాదించారు.
గుజరాత్ ప్రభుత్వ ప్రకటనలను ''అధికార దుర్వినియోగం, ప్రజాధనాన్ని వృథా చేయడం''గా సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభివర్ణించారు.
"నా అభిప్రాయం ప్రకారం, ప్రధాన మంత్రి లేదా మరే ఇతర వ్యక్తి గురించి మాత్రమే ప్రచారం చేయడానికి ప్రజాధనాన్ని ఉపయోగించడం అధికార దుర్వినియోగం, ప్రజా ధనాన్ని వృథా చేయడమే" అని ఆయన చెప్పారు.
"ప్రజా ప్రయోజనకరమైన ఏదైనా పథకం ప్రకటనలో ప్రధాన మంత్రి చిత్రాన్ని ప్రభుత్వం ఉంచవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ, ఆ ప్రకటన ఉద్దేశం ప్రధానమంత్రికి ప్రచారం చేయడం కాదు. అలాంటి ప్రకటన ఉద్దేశం ప్రధానమంత్రి విజయాలను ప్రకటించడం కాదు" అని ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు నిర్ణయం గురించి మాట్లాడుతూ ఆయనన్నారు.
"ప్రభుత్వ ప్రకటనల ప్రాథమిక ఉద్దేశం ప్రభుత్వ విధానాలు, పథకాలు, సేవలు, ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ప్రజలకు తెలియజేయడమే అని సుప్రీంకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. నా అభిప్రాయం ప్రకారం, గుజరాత్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనలు సుప్రీంకోర్టు తన నిర్ణయంలో ఇచ్చిన మార్గదర్శకాల స్ఫూర్తిని ఉల్లంఘించడమే" అని ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు.
''రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనేక ప్రకటనలలో ఈ మార్గదర్శకాలను తరచుగా ఉల్లంఘించడం కనిపిస్తుంది. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతోంది బీజేపీ ప్రభుత్వాలు మాత్రమే కాదు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రకటనలు వెలువడుతున్నాయి. దురదృష్టవశాత్తూ, సుప్రీంకోర్టు నిర్ణయం సరిగ్గా అమలవ్వడం లేదు'' అని ఆయన అన్నారు.
''ఇది మోదీ అధికారంలోకి వచ్చిన 23వ లేదా 24వ సంవత్సరం. అయినా, దీనికి ప్రభుత్వ విధానాలతో సంబంధం లేదు. ఈ బుజ్జగింపు రాజకీయాల్లో, చిన్న నాయకుడు పెద్ద నాయకుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు'' అని గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఆనంద్ యాగ్నిక్ అన్నారు.
"ఇలాంటి ప్రకటనలు ప్రభుత్వ ప్రజానుకూల విధానాలను ప్రోత్సహించడానికి కాదు, ప్రజలను వారి స్వంత ప్రచారానికి బాధితులుగా మార్చడానికి" అని ఆయన విమర్శించారు.
''ప్రభుత్వ ఖజానా దగ్గర సామాన్యుల డబ్బు ఉంది. దానిని వివేకంతో ఉపయోగించడానికి, వారు ఎన్నికల ద్వారా తమ ప్రతినిధులను నియమించుకుంటారు. అందువల్ల, ఈ ఎన్నికైన ప్రతినిధి సామాన్య ప్రజల ట్రస్టీగా ఏదైనా ఆర్థిక లావాదేవీని నిర్వహిస్తారు. ఈ ఎన్నికైన ప్రతినిధులపై ప్రజల విశ్వాసం ఉంటుంది. వారు ఈ ట్రస్ట్‌ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ సొంత ప్రచారం కోసం ఉపయోగించలేరు. భారత రాజ్యాంగంలో లేదా మొత్తం దేశంలో ఉన్న ఏ చట్టంలోనూ ఏ ఎన్నికైన ప్రతినిధి అయినా ప్రజల డబ్బు ఖర్చుపెట్టి తన ఫోటోతో ప్రకటనలు ఇవ్వడం ద్వారా తనను తాను ప్రచారం చేసుకోవచ్చని నిబంధన లేదు" అని ప్రకటనలకు న్యాయపరమైన అర్ధాన్ని ఆయన వివరించారు.
''ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విధానాలు ఒకరి ద్వారా గుర్తింపు పొందవు. ఆ విధానాలు ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో దానిపై వాటి గుర్తింపు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, ఈ ప్రభుత్వాలు తమను తాము ప్రోత్సహించుకోవడానికి మన డబ్బును ఉపయోగిస్తున్నాయి. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు" అని ఆయన అన్నారు.
"ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్ని ఖర్చులను ప్రజల కోసమే చేయాలి. అన్ని నిర్ణయాలు ప్రజల కోసమే తీసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వ విధానాలను ప్రోత్సహించడం పేరుతో, వ్యక్తివాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది బీజేపీకే పరిమితం కాదు, దేశంలోని ప్రతి పార్టీకి వర్తిస్తుంది."
"ప్రకటనల ద్వారా, ప్రభుత్వాలు మీడియాను కొనుగోలు చేసి, స్వతంత్ర మీడియాను నియంతృత్వాలుగా మార్చడానికి పని చేస్తున్నాయి" అని ఆనంద్ యాగ్నిక్ అన్నారు.

ఫొటో సోర్స్, Arjun Parmar
‘అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి’
కామన్ కాజ్ అండ్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై తీర్పు సమయంలో సుప్రీంకోర్టు మే 2015లో ఆమోదించిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్టుగా గుజరాత్ ప్రభుత్వ ప్రకటనలున్నాయని బిజినెస్ స్టాండర్డ్ ఉత్తర ప్రదేశ్ బ్యూరో ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ కల్హన్స్ అన్నారు.
ఈ ఖర్చును "రాష్ట్ర ప్రజలకు, వారి అభివృద్ధికి ఉద్దేశించిన డబ్బును దుర్వినియోగం చేయడం'' అని ఆయన అన్నారు.
గుజరాత్‌లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా, ప్రజా వ్యవహారాల ప్రకటనల కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రతిరోజూ ఉల్లంఘనలకు గురవుతున్నాయని సిద్ధార్థ్ కల్హన్స్ అంటున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 23 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన ప్రకటనలను సిద్ధార్థ్ కల్హన్స్ 'స్వీయ ప్రమోషన్'గా అభివర్ణించారు.
"ఈ ప్రకటనలకు ప్రజలతో లేదా ప్రజా సంక్షేమంతో సంబంధం లేదు. ఈ ప్రకటనలు ఒక పెద్ద నాయకుడి ప్రశంసలకోసం ప్రజా సంక్షేమం డబ్బును వృథా చేసే ప్రయత్నం'' అని అన్నారు.
"ప్రభుత్వ పథకాలను ప్రకటించి, ఆ ప్రకటనల నుంచి పొందిన సమాచారం సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చినట్టయితే, ప్రభుత్వ ప్రకటనలపై చేసే ఖర్చును తగ్గింపుగా పరిగణించవచ్చు. కానీ ఒకే నాయకుడిని ప్రశంసించడానికి ప్రకటనలు ఇస్తే, అది సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చదు" అని గుజరాత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దీపల్ త్రివేది ప్రభుత్వ ప్రకటనలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"రాజకీయ ప్రకటనలకు, ప్రభుత్వ ప్రకటనలకు మధ్య తేడా ఉంది. కానీ గుజరాత్‌లో ఈ వ్యత్యాసం చాలా అస్పష్టంగా మారుతోంది" అని గుజరాత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దర్శన్ దేశాయ్ అన్నారు.
"ప్రభుత్వం ఐదేళ్లు, పదేళ్లు, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ లాంటివి ప్రకటించడం అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ 23 సంవత్సరాలు ఏమిటి? దీనివల్ల ప్రభుత్వం ప్రతి సంవత్సరం అలాంటి ప్రకటనలు ఇస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది?" అని ఆయన విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ ప్రకటనలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలేంటి?
ప్రభుత్వ పథకాల ప్రకటనలు, ప్రచారం కోసం ప్రజా నిధులను ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకునేలా, వాటి సరైన నియంత్రణ కోసం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఆదేశించాలని కోరుతూ కామన్ కాజ్, సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాయి. దీని కోసం కోర్టు ఒక కమిటీని నియమించింది.
ఈ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలు ప్రభుత్వ ప్రకటనలలో రాజకీయ పక్షపాతం ఉండకూడదని స్పష్టంగా పేర్కొన్నాయి. అలాగే ప్రకటనలలో ఏ రాజకీయ నాయకుడినీ కీర్తించకూడదని కూడా తెలిపాయి.
అధికారంలో ఉన్న పార్టీ సానుకూల ఇమేజ్‌ను, ప్రతిపక్షం ప్రతికూల ఇమేజ్‌ను ప్రదర్శించే ప్రకటనల కోసం ప్రభుత్వ డబ్బును ఉపయోగించడంపై నిషేధం ఉంది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ పాలనలోని కొన్ని రోజులు లేదా సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి విజయాలకు సంబంధించిన ప్రకటనలను ప్రచురిస్తాయి. అయితే, కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, అలాంటి ప్రకటనల ఉద్దేశం ప్రచారం కాకూడదు, ప్రభుత్వం చేసిన పనికి సంబంధించిన ఫలితాల గురించి ప్రజలకు తెలియజేయడం.
ప్రభుత్వ ప్రకటనలు, ప్రచారం ఉద్దేశం ప్రభుత్వ పథకాలు, దాని విధానాల గురించి ప్రజలకు తెలియజేయడం అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ మార్గదర్శకాలలో ప్రజలకు తెలియజేయడమనే ఉద్దేశానికి ఆమోదయోగ్యత, రాజకీయ నాయకులను కీర్తించడానికి ఆమోదయోగ్యత లేకపోవడంపై ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
అయితే, ఈ మార్గదర్శకాలను ఎంతవరకు పాటిస్తున్నారనేది చర్చనీయాంశం.

ఫొటో సోర్స్, Arjun Parmar
గుజరాత్ బీజేపీ, గుజరాత్ ప్రభుత్వం ఏం చెప్పాయి?
'23 సంవత్సరాల విజయవంతమైన, సమర్థ నాయకత్వం' 'అభివృద్ధి వారం' ప్రకటనల కోసం చేసిన ఖర్చుపై గుజరాత్ బీజేపీ ప్రతినిధి యజ్ఞేష్ దవే అభిప్రాయం తెలుసుకునేందుకు బీబీసీ గుజరాతీ ప్రయత్నించింది.
"మీరు చెబుతున్న ఖర్చు ఎంతైందనే దాని గురించి నాకు సమాచారం లేదు, దానికి సంబంధించిన అధికారిక ఆధారాలు కూడా నా దగ్గర లేవు. కాబట్టి, ఈ విషయంపై నేను మాట్లాడలేను" అని ఆయన అన్నారు.
"రెండో విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏదైనా ఖర్చు చేసినప్పుడు, ఖర్చు చేసిన ప్రతి రూపాయిని ఆడిట్ చేస్తారు. ఏదైనా తప్పుడు ఖర్చు ఉంటే, ఎవరి ప్రతిష్టనైనా పెంచేలా ఏదైనా ఖర్చు ఉంటే లేదా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా ఖర్చు ఉంటే, ఆడిటర్లు దానిని పరిగణనలోకి తీసుకుంటారు. అది కాగ్ నివేదికలో కూడా వస్తుంది. ప్రభుత్వంలో ఎక్కడా అలాంటి తప్పు జరగదు. అయితే, మీరు చెప్పిన నంబర్ గురించి నాకు తెలియదు'' అని ఆయన అన్నారు.
"నాకు దీని గురించి తెలియదు, అన్ని వివరాలు, పత్రాలను చూసిన తర్వాత ఏదైనా చెప్పగలను" అని గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధి మంత్రి రుషికేశ్ పటేల్ బీబీసీ గుజరాతీ కరస్పాండెంట్ రాక్సీ గగ్దేకర్ ఛరాతో జరిగిన సంభాషణలో అన్నారు. ఈ విషయం చెబుతూ ఆయన ఫోన్ కట్ చేశారు.
ఈ మొత్తం విషయంపై గుజరాత్ ప్రభుత్వ వైఖరి తెలుసుకోవడానికి టెలిఫోన్ ఇంటర్వ్యూ కోసం సమయం కోరుతూ బీబీసీ గుజరాతీ ప్రతినిధి మంత్రి రుషికేశ్ పటేల్, ఆయన విభాగ కార్యాలయానికి ఈమెయిల్ పంపింది. అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారు స్పందించిన తర్వాత అప్‌డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














