తెలంగాణ: యూరియా కొరతకు కారణమేంటి? రైతులు ఎందుకు లైన్లలో నిల్చుంటున్నారు?

యూరియా కొరత

ఫొటో సోర్స్, PTI

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వానలో తడుస్తూ యూరియా సరఫరా కేంద్రాల ముందు రైతులు క్యూ కడుతున్నారు.

పెద్ద సంఖ్యలో రైతుల బారులు.. చెప్పులు ఉంచిన దృశ్యాలు.. రాస్తారోకోలు.. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం సరిహద్దు వరకు చాలా జిల్లాలలో కనిపిస్తున్నాయి.

తెలంగాణలో యూరియా కొరతకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది.

యూరియా కొరత సమస్య రైతుల ఇబ్బందులకే పరిమితం కాలేదు. రాజకీయంగానూ తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య కాక రేపింది.

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎరువుల కోసం సరఫరా కేంద్రాల ముందు బారులు తీరాల్సి వస్తుందని ముందే చెప్పామని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.

అయితే ఎరువుల కొరతకు కేంద్రం నుంచి తగినంత సరఫరా లేకపోవడమే కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే... కేంద్రం నుంచి అవసరమైన సరఫరా జరుగుతోందని బీజేపీ అంటోంది.

ఇలా ఎవరి వాదన వారిది.

అసలు యూరియా కొరత ఎందుకు వచ్చింది? యూరియా కోసం రైతులు ఎందుకు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1.32 కోట్ల ఎకరాల్లో పంటల సాగు

వానాకాలంలో పత్తి, వరి పంటలకు యూరియా అవసరం ఎంతో ఉంటుంది. తెలంగాణలో 2025 సీజన్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలూ సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా.

ఇందులో ఆహార ధాన్యాలు 76.14 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

ఇందులో ప్రధానంగా 62.47 లక్షల ఎకరాల్లో వరి, 48.93 లక్షల ఎకరాల్లో పత్తి, 6.69 లక్షల ఎకరాల్లో కంది, 5.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలున్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ఇతర ఆహార, వాణిజ్య పంటలున్నాయి.

సీజన్ మొదట్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అక్కడక్కడ యూరియా కొరత కనిపించింది.

ఇప్పుడు వానలు పడి రైతులు పూర్తి స్థాయిలో సాగుకు సిద్ధమయ్యారు. కానీ ఏటా కంటే ఈసారి యూరియా కొరత ఎక్కువైందని, దీనివల్ల పంట వేసేందుకు ఇబ్బందికరంగా మారిందని వికారాబాద్ జిల్లా యాలాలకు చెందిన రైతు రామిరెడ్డి చెప్పారు.

యూరియా కోసం ఉదయాన్నే వెళ్తే ఒక్క బస్తా ఇచ్చి పంపించారని చెప్పారు. తమ గ్రామానికి 210 బస్తాల యూరియా వస్తే, కేవలం గంటలోనే పంపిణీ పూర్తైందని ఆయన చెబుతున్నారు.

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లోనూ ఇదే పరిస్థితి అని, అక్కడ యూరియా సరఫరా అయిన గంటన్నరలోనే అయిపోయిందని రైతులు చెబుతున్నారు.

''మేం రెండు రోజులపాటు ఎదురుచూస్తే 500 బస్తాల లోడుతో లారీ వచ్చింది. మాకు రెండు వేల బస్తాల వరకు అవసరం ఉంది'' అని బూర్గంపహాడ్‌కు చెందిన రాజేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

యూరియా

ఫొటో సోర్స్, UGC

తెలంగాణకు ఎంత యూరియా రావాలి.. ఎంత వచ్చింది?

తెలంగాణకు ఈ వానాకాలం సీజన్లో 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి యూరియా అవసరం మొదలవుతుంది. మరుసటి వ్యవసాయ సీజన్‌కు తగ్గట్టుగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది.

అయితే, 2022 నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళిక విడుదల చేయడంలేదని రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి బీబీసీకి చెప్పారు.

''పంటల వారీగా వ్యవసాయ ప్రణాళిక వేయాలని ఎన్నోసార్లు అడిగాం. దాన్నిబట్టి ఎరువులను డిమాండుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. అది జరగడం లేదు'' అని చెప్పారు.

యూరియా కోసం రైతుల ఎదురుచూపులు

ఫొటో సోర్స్, UGC

నెలవారీ కేటాయింపుల్లో కోత అంటున్న ప్రభుత్వం

రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం, తెలంగాణలో ఏప్రిల్ నాటికి 1.92 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది.

ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం కేంద్రం నుంచి వచ్చే నెలవారీ యూరియా కోటాలోనూ కోత పడిందని చెబుతోంది.

యూరియా కేటాయింపులు, సరఫరా

రాజకీయంగానూ వివాదం

ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి కేంద్రం నుంచి 8.30 లక్షల టన్నులకుగాను 5.12 లక్షల టన్నుల యూరియానే వచ్చినట్లుగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

ఇది కాకుండా ఏప్రిల్ నాటికి ఉన్న నిల్వలు కలుపుకొంటే 7.04 లక్షల టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

కేంద్రం నుంచి రావాల్సిన కేటాయింపుల్లో కోత కారణంగా మొత్తంగా 2.76 లక్షల టన్నుల కొరత ఏర్పడిందని మంత్రి వివరించారు.

ఈ ఆరోపణలను ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు. యూరియా సరఫరాలో ఎక్కడా కేంద్రం నుంచి లోపం జరగలేదని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం 2025 యాసంగి సీజన్ (అక్టోబర్ 2024 – మార్చి 2025)లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల టన్నులు సరఫరా చేసిందని ఆయన వివరించారు.

ఆ సీజన్‌లో 10.43 లక్షల టన్నులు రైతులకు విక్రయించగా 2.04 లక్షల టన్నులు ఈ వానాకాలం ఓపెనింగ్ స్టాక్‌గా ఉండాలని చెప్పారు. ఓపెనింగ్ స్టాక్ లెక్కల్లో తేడాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

ఇదే విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

''కేసీఆర్ ప్రభుత్వంలో ఆరు నెలల ముందు నుంచే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేసి తెప్పించాం. ప్రభుత్వ ప్రణాళికా లోపం కారణంగానే సమస్య ఏర్పడింది'' అన్నారు.

తెలంగాణకు యూరియా ఇచ్చే వారికి ఉపరాష్ర్టపతి ఎన్నికల్లో ఓటు వేస్తామని ఆయన చెబుతున్నారు. ఎరువుల కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అయితే, రాష్ర్టానికి అవసరమైన ఎరువుల వివరాలతో కేంద్రానికి ముందుగా ఇండెంట్ పంపించామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

'వ్యవసాయ ప్రణాళికా లోపం వల్లనే'

ఎరువుల పరంగా ఏ రాష్ట్రానికి ఎంత కావాలనే విషయంపై ఆయా రాష్ట్రాల నుంచి డిమాండ్ (ఇండెంట్) వెళ్తుంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి, ఎరువులు సరఫరా చేస్తుంది.

''రాష్ట్రానికి వచ్చిన తర్వాత జిల్లాల అవసరాలను బట్టి పంపించే బాధ్యత వ్యవసాయ శాఖపై ఉంది. అలా కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు బలాన్ని బట్టి తరలిస్తున్నారు'' అని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి బీబీసీతో చెప్పారు.

తెలంగాణలో యూరియా కొరతపై తీవ్ర దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం యూరియా స్టాక్ పంపించేందుకు అంగీకరించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు.

కర్ణాటక నుంచి పది వేల టన్నులు కలుపుకొని 50వేల టన్నుల యూరియాను పంపించేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు.

ఆయా ప్రాంతాల్లో ఉన్న అవసరాలను ఆధారంగా చేసుకునే సరఫరా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇది వచ్చినా యూరియా సరిపోయే పరిస్థితి లేదు. మొత్తంగా డిమాండ్, కేటాయింపులు, సరఫరా మధ్య 2.76 లక్షల టన్నుల వ్యత్యాసం ఏర్పడింది. దీన్ని అధిగమిస్తేనే, రైతులకు సరిపడా యూరియా అందించే వీలుంటుంది.

యూరియా

ఫొటో సోర్స్, Getty Images

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎక్కువ రోజులు షట్‌డౌన్

ఈసారి ఎరువుల కొరత రావడానికి ప్రధాన కారణంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎక్కువ రోజులు షట్ డౌన్‌కు గురికావడం కూడా కనిపిస్తోంది.

ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 145 పని దినాలు (వర్కింగ్ డేస్) ఉంటే 78 రోజులు ఉత్పత్తి నిలిచిపోయిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సాంకేతిక కారణాలు, అమ్మోనియం లీకేజీతో ఉత్పత్తి నిలిచిందని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతూ వస్తోంది. ఈ ప్రభావం తెలంగాణపై పడుతోంది.

2021లో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. ఏటా 12 లక్షల టన్నుల యూరియా సామర్థ్యంలో ప్లాంటును పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ ఏడాది షట్ డౌన్ రోజులు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిలిచిపోయింది.

''రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తయ్యే యూరియాలో 11శాతం వాటా రాష్ట్రానికి ఉంటుంది. ఆ మేరకు తెలంగాణకు కేటాయించాలి'' అని సారంపల్లి మల్లారెడ్డి బీబీసీతో చెప్పారు.

యూరియా

యూరియాకు ప్రత్యామ్నాయం ఉందా?

సాధారణంగా పత్తి, వరికి మూడు నుంచి నాలుగుసార్లు యూరియా వేస్తుంటారు రైతులు. పత్తి విత్తనాలు విత్తిన 20 రోజుల నుంచి మూడు లేదా నాలుగుసార్లు యూరియా వేస్తుంటారు.

వరికి కలుపు తీసే సమయలోను, తర్వాత నుంచి 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకోసారి యూరియాను అవసరాన్ని బట్టి వేస్తుంటారు.

యూరియా వాడకం ఎక్కువ కావడంతోపాటు పంటల విస్తీర్ణం పెరగడం కొరత ఏర్పడటానికి కారణమైందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఒకరు బీబీసీతో చెప్పారు.

''రైతులు ఎకరాకు వంద కిలోల యూరియా వేస్తున్నారు. దానివల్ల మొక్క మెత్తబడుతుందని పొటాష్, ఫాస్ఫేట్ వంటివి చల్లుతున్నారు'' అని వివరించారు.

అయితే, నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను కేంద్రం ప్రోత్సహిస్తోంది. సాధారణ ఎరువులతో పోల్చితే, నానో ఎరువుల్లో నత్రజని శాతం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

''కొన్ని పంటలకు కొన్ని సందర్భాల్లో నానో యూరియా ఉపయోగపడుతోంది. అందుకే రైతులు వాటి వినియోగానికి పెద్దగా ఇష్టపడటం లేదు'' అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొ. పొదిలె అప్పారావు బీబీసీతో చెప్పారు.

ఆయన నానో యూరియా, నానో డీఏపీ ఎరువులపై పరిశోధనలు చేస్తున్నారు.

''సాధారణ యూరియాతో పోల్చితే నానో యూరియాలో నత్రజని శాతం తక్కువగా ఉంటుంది. ఇది కొన్ని పంటలకు పనిచేస్తుంది, కొన్ని పంటలకు పనిచేయదు'' అని వివరించారు.

యూరియాపై ఎక్కువగా రైతులు ఆధారపడటానికి కొన్ని కారణాలను వివరించారు ప్రొ. అప్పారావు.

''కంపోస్టు ఎరువుల వాడకం తగ్గింది. మాంసకృత్తులతో కూడిన పదార్థాలు పండించే పంటలకు ఎక్కువగా యూరియా అవసరం పడుతుంది'' అని వివరించారు.

అలాగే గాల్లో నత్రజని తీసుకునే బ్యాక్టీరియా (రైజోబియం) పంటపొలాల్లో క్రమంగా తగ్గుతోందని, అవసరమైన నత్రజని అందించేందుకు యూరియాను ఎక్కువగా పంటలకు వేస్తుంటారని ప్రొఫెసర్ అప్పారావు వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)