టాయిలెట్ సీటు నుంచి వ్యాధులు సోకుతాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది?

టాయిలెట్ సీట్, వైరస్‌, బ్యాక్టీరియా, వ్యాధులు, అనారోగ్యం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సోఫియా క్యుయాగ్లియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రోజూ వందలమంది ఉపయోగించే టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడు మీకొకటి అనిపించవచ్చు. బాత్‌రూమ్‌లో వ్యాధి కారకాలయ్యే జీవులు ఎంతకాలం జీవించి ఉంటాయి?

మీరు పబ్లిక్ టాయిలెట్‌లోకి అడుగు పెట్టినప్పుడు, రోగాలు వస్తాయనే భయం మీకు ఏర్పడకుండా ఉండదు.

టాయిలెట్ సీటు, నేల మీద మూత్రం చిమ్ముతున్న దృశ్యం, వేరొకరి శరీర ద్రవాల ఘాటైన వాసన మీకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.

మీరు టాయిలెట్ డోర్‌ను మీ చేత్తో కాకుండా మోచేత్తో తెరవవచ్చు.

కాలితో నొక్కి నీటిని ఫ్లష్ చేయవచ్చు. టాయిలెట్ సీటును టిష్యూ పేపర్‌తో కప్పవచ్చు.

ఇదంతా అసహ్యంగా అనిపిస్తే సీటుకి తగలకుండా కూర్చునే ప్రయత్నం చేయవచ్చు.

టాయిలెట్ సీటుపై కూర్చోవడం వల్ల నిజంగానే మీకు వ్యాధులు వస్తాయా?

టాయిలెట్‌లోకి అడుగు పెట్టడం దగ్గర నుంచి చివరి వరకు ఆ ప్రదేశాన్ని ముట్టుకోకుండా ఉండటం అవసరమా?

మైక్రో బయాలజిస్టులు ఏం చెబుతున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టాయిలెట్ సీట్, వైరస్‌, బ్యాక్టీరియా, వ్యాధులు, అనారోగ్యం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టాయిలెట్ సీటును పేపర్‌తో కప్పడం వల్ల క్రిముల నుంచి రక్షణ సాధ్యం కాదు.

మీకు ఏ వ్యాధులు రాకపోవచ్చు?

"సిద్ధాంతపరంగా చూస్తే టాయిలెట్ సీటు నుంచి మీకు వ్యాధులు సోకవచ్చు. అలా రాకుండా ఉండే ప్రమాదం చాలా తక్కువగా ఉంది" అని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో పబ్లిక్ హెల్త్ అండ్ మైక్రో బయాలజీ ప్రొఫెసర్ జిల్ రాబర్ట్స్ చెప్పారు.

లైంగికంగా సంక్రమించే వ్యాధుల గురించే తీసుకోండి.

గనేరియా, క్లామిడియాకు కారణమయ్యే బ్యాక్టీరియా లేదా వైరస్‌లు ఒక జీవి వెలుపల కూడా ఎక్కువకాలం జీవించలేవు.

కానీ టాయిలెట్ సీటు వంటి చల్లని గట్టి ఉపరితలం మీద ఉండవచ్చు.

అందుకే లైంగికంగా సంక్రమించే వ్యాధులు సెక్స్‌లో శరీర ద్రవాల మార్పిడి వల్ల సంక్రమమిస్తాయని భావిస్తున్నారు.

టాయిలెట్‌లో సీటుపై వేరొకరి తాజా శరీర ద్రవాలను చేతితో లేదా టాయిలెట్ పేపర్ ద్వారా తుడవడం ద్వారా తన జననావయవాలకు అంటించుకునే వ్యక్తి ప్రమాదంలో పడినట్లేనని రాబర్ట్స్ చెప్పారు.

అందుకే, జాగ్రత్తగా ఉండటం, అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లకు దూరంగా ఉండటం లాంటి పద్ధతులను పాటించడం మంచిది.

"టాయిలెట్ సీటు నుంచి సుఖవ్యాధులు సోకే అవకాశం ఉన్నట్లయితే, శృంగారంలో పాల్గొనని వారు, అన్ని ఏజ్ గ్రూపల వారికి తరచుగా ఆ తరహా వ్యాధులు సోకుతాయి" అని రాబర్ట్స్ చెప్పారు.

అలాగే టాయిలెట్ సీటు నుంచి రక్తం ద్వారా సోకే వ్యాధులు కూడా రావని రాబర్ట్స్ చెప్పారు.

ముందుగా ఎవరైనా టాయిలెట్ సీటు మీద రక్తం లేదా రక్తపు మరకల్ని గుర్తిస్తే, ఎందుకైనా మంచి మీరు దూరంగా ఉండాలని రాబర్ట్స్ అంటున్నారు.

లైంగిక చర్యలో పాల్గొనడం, కలుషిత ఇంజెక్షన్ల ద్వారా కాకుండా రక్తంలో జన్మించే వ్యాధులు అంత ఈజీగా సంక్రమించవని ఆమె చెప్పారు.

ఇది, ఇతరుల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు టాయిలెట్ సీట్ ద్వారా సంక్రమించకు పోవడం లాంటిదేనని రాబర్ట్స్ తెలిపారు.

టాయిలెట్‌ సీటు మీద ఉన్న మలం మూత్ర నాళానికి తాకితే మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది.

మల విసర్జన తర్వాత మలద్వారాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు అది జననేంద్రియాల వరకు వస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

టాయిలెట్ సీట్, వైరస్‌, బ్యాక్టీరియా, వ్యాధులు, అనారోగ్యం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూత్రశాలల్లో నేల మురికిగా, వైరస్‌లకు ఆవాసంగా ఉంటుంది.

ఏమేం జబ్బులు రావచ్చు?

అయితే దీర్ఘకాలిక సుఖ వ్యాధులకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. జననావయవాల మీద మొటిమల్లాంటి గుల్లలకు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) లాంటివి టాయిలెట్ సీటు ఉపరితలంపై వారం రోజుల వరకు ఉంటాయి. అయితే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

"ఈ వైరస్‌లు చాలా చిన్నవి. అందులో స్థిరమైన ప్రొటీన్ ఉంటుంది. ఆ ప్రొటీన్ వల్ల వైరస్ దీర్ఘకాలం సజీవంగా ఉంటుంది" అని నెవాడాలోని టూరో యూనివర్సిటీలో మైక్రో బయాలజీ అండ్ ఇమ్యునాలజీ ప్రొఫెసర్ కరెన్ డ్యూస్ చెప్పారు.

హెచ్‌పీవీకి శానిటైజర్లను తట్టుకునే శక్తి ఉంది.

ఆ వైరస్‌లలో ఉండే ప్రొటీన్ షెల్‌ను నాశనం చేయాలంటే 10శాతం గాఢత ఉన్న బ్లీచింగ్ అవసరమని డూస్ చెప్పారు.

మీరు టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు మీ జననేంద్రియాల దగ్గర చర్మం పరిశుభ్రంగా లేకున్నా, అక్కడ అసౌకర్యంగా ఉన్నా, పుండు పడినా వాటి ద్వారా ఇవి శరీరంలోకి చేరతాయని డూస్ తెలిపారు.

ఇలాంటి హెచ్‌పీవీలు నోరు, మల ద్వారం, యోని ద్వారా సెక్స్ చేయడం లైంగిక చర్య, శారీరక కలయిక ద్వారా మాత్రమే సంక్రమిస్తాయి.

అలాగే సిద్ధాంతపరంగా ఎవరికైనా జననేంద్రియాల వద్ద హెర్పిస్ ఉంటే అతని నుంచి టాయిలెట్ సీటు ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది.

అలాంటి వారు ఉపయోగించిన తర్వాత టాయిలెట్ సీటు ఉపయోగించే వారికి పుండు పడినా, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా హెర్పిస్ సోకే ప్రమాదం ఉందని ఆన్‌లైన్ హెల్త్‌కేర్ సర్వీసెస్ కంపెనీ ట్రీటెడ్ డాట్‌కామ్‌లో క్లినికల్ లీడ్ డేనియల్ అట్కిన్సన్ ‌చెప్పారు. అయితే అది అంత తేలిగ్గా జరక్కపోవచ్చని ఆయన అన్నారు.

టాయిలెట్ సీట్, వైరస్‌, బ్యాక్టీరియా, వ్యాధులు, అనారోగ్యం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పబ్లిక్ టాయిలెట్లలో టాయిలెట్ సీటు‌తో పాటు డోర్ హ్యాండిల్‌, ఇతర వస్తువులపైనా కాలుష్యం ఉండే అవకాశం ఉంది

టాయిలెట్ సీటును కవర్ చేయాలా లేదా తగలకుండా కూర్చోవాలా?

పబ్లిక్ టాయిలెట్‌ ఉపయోగించేటప్పుడు టాయిలెట్ సీటుపై కూర్చోవడానికి ముందు దానిని కాగితంతో కప్పడం లేదా టాయిలెట్ సీట్ కవర్ ఉపయోగించడం లాంటివి ఉత్తమ మార్గాలు.

అమెరికాలో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించే వారిలో 63శాతం మంది సీటు కవర్ ముందు భాగాన్ని టాయిలెట్ పేపర్ ఉపయోగించి కవర్ చేస్తున్నారు. 20 శాతం మంది స్క్వాటింగ్ పొజిషన్‌లో కూర్చుంటారని యూగవ్ అనే పరిశోధన సంస్థ 2023లో నిర్వహించిన సర్వేలో తేలింది.

సీటు మీద టాయిలెట్ పేపర్ పరవడం లేదా కవర్ వేయడం లాంటివి వ్యాధికారకాల నుంచి రక్షించలేవు.

ఎందుకంటే అవి పలుచగా, ద్రవాలను త్వరగా పీల్చుకునే పదార్ధాలతో తయారవుతాయి. అందుకే అవి సూక్ష్మ క్రిములు మీ జననేంద్రియాలను తాకకుండా లేదా చొచ్చుకు పోకుండా ఆపలేవు.

స్క్వాటింగ్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల లాభం కంటే ప్రమాదం ఎక్కువని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ వెక్స్‌నెర్ మెడికల్ సెంటర్‌లో పెల్విక్ హెల్త్ విభాగంలో క్లినికల్ స్పెషలిస్ట్ స్టీఫెన్ బాబింగర్ చెప్పారు.

మహిళలు మూత్ర విసర్జన కోసం టాయిలెట్ సీటు మీద కూర్చున్నప్పుడు వారు పెల్విక్ ఫ్లోర్, పెల్విక్ గిరిల్డ్ కండరాలను బిగుతుగా పట్టి ఉంచుతారు.

ఇది యూరిన్ బ్లాడర్ నుంచి మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

దీంతో మూత్రాన్ని బలంగా నెట్టేందుకు చేసే ప్రయత్నం పెల్విస్ మీద ఒత్తిడి పెంచుతుంది.

ఈ ప్రక్రియలో మహిళలు పూర్తి స్థాయిలో మూత్రాశయాన్ని ఖాళీ చేయకపోవచ్చు.

ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు దారి తీసే అవకాశం ఉంది.

టాయిలెట్ సీట్, వైరస్‌, బ్యాక్టీరియా, వ్యాధులు, అనారోగ్యం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంట్లో టాయిలెట్‌ను ప్రతి మూడు రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు

అసలు సమస్య ఏంటి?

సాధారణంగా టాయిలెట్ సీటును జననావయవాలు తాకడం వల్ల వ్యాధులేమీ రావు.

అయితే మీ చేతులు టాయిలెట్ సీటును తాకడం, శరీరంలోని చిన్న కణాలలో బ్యాక్టీరియా వైరస్‌లతో కలవడం వల్ల ,టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మురికి చేతులతో మీ మొహం, నోటిని తాకడం వల్ల వ్యాధులు సోకవచ్చని రాబర్ట్స్ చెప్పారు.

"ప్రమాదం వెనుక వైపున కాదు. మీ చేతుల ద్వారా నోటికి ఉంటుంది" అని ఆయన అన్నారు.

టాయిలెట్ సీటు మీద చుక్కలుగా పడి ఉన్న మలం అవశేషాలలో ఎస్చెరియాకోలి, సాల్మోనెల్లా, షిగెల్లా, స్టెఫిలో కాకస్, స్ట్రెప్టో కాకస్ వంటి వ్యాధి కారకాలు ఉండవచ్చు. ఇవి శరీరంలోకి పోతే వాంతులు, విరేచనాలు, జీర్ణాశయ సమస్యలకు దారి తీయవచ్చు.

మలంలో కూడా నోరో వైరస్ జాడలుంటాయి. అంటువ్యాధులకు కారణమయ్యే ఈ వైరస్ కలుషిత ఉపరితలాలు, ఆహారం, తాగే నీళ్లు లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ద్వారా సులభంగా వ్యాపిస్తుంది.

నోరో వైరస్‌లు చాలా బలంగా ఉంటాయి. కొన్ని ఉపరితలాల మీద ఇవి రెండు నెలల వరకు జీవించి ఉంటాయి.

కొన్ని ఇంకా ఎక్కువ కాలం సజీవంగా ఉండి అవి సోకిన వారిని వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. వైరస్‌లో పది నుంచి వంద కణాలు సోకితే జబ్బు చేస్తుందని భావిస్తున్నారు.

కోవిడ్-19, అడినో వైరస్‌లతో పోలిస్తే బాత్‌రూమ్‌లో కలుషితమైన ఉపరితలాలను తాకడం వల్ల ప్రజలు నోరో వైరస్‌ల బారిన పడే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో అడినో వైరస్ ప్రవేశిస్తే తీవ్ర అనారోగ్యం పాలవుతారు.

అయితే ఇలా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

"ఎందుకంటే బాత్‌రూమ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు" అని రాబర్ట్స్ చెప్పారు.

మైక్రోబయాలజీ విద్యార్థులు రకరకాల పరిస్థితులున్న నేలను శుభ్రం చేసినప్పుడు కంప్యూటర్ ల్యాబ్‌లో వారు కనుక్కున్న సూక్ష్మ జీవుల సంఖ్య టాయిలెట్లలో ఉన్న వాటితో పోలిస్తే చాలా ఎక్కువని ఆమె చెప్పారు.

"అమెరికాలో మేము చదువుకున్న యూనివర్సిటీలో పబ్లిక్ టాయిలెట్ల కంటే ఇళ్లలో ఉండే బాత్‌రూమ్‌లలో ఎక్కువ క్రిములు ఉండేవి" అని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో వైరాలజీ ప్రొఫెసర్ చార్లెస్ గెర్బా చెప్పారు.

"అనేక ప్రాంతాల్లో ఇళ్లలోని బాత్‌రూమ్‌ల కంటే పబ్లిక్ టాయిలెట్లు సురక్షితం" అని ఆమె అన్నారు.

"అనేక ప్రాంతాలలో టాయిలెట్లను క్లీన్ చేసే సిబ్బంది రోజులో అనేకసార్లు వాటిని శుభ్రం చేస్తారు. అయితే ఇళ్లలో మాత్రం వారానికి ఒకసారి మాత్రమే బాత్‌రూన్ క్లీన్ చేస్తారని గెర్బా చెప్పారు.

ప్రతీ మూడు రోజులకొకసారి ఇళ్లలో బాత్‌రూమ్‌లు క్లీన్ చేసోకోవాలని గెర్బా లేబొరేటరీ సూచిస్తోంది.

టాయిలెట్ సీట్, వైరస్‌, బ్యాక్టీరియా, వ్యాధులు, అనారోగ్యం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాత్‌రూమ్‌లో చేతితో తాకాల్సిన అవసరం లేకుండా, సెన్సర్ల ద్వారా పని చేసే ఉత్పత్తుల వాడకం పెరుగుతోందని పాటీ చెప్పారు.

టాయిలెట్ 'స్నీజ్' పట్ల జాగ్రత్త

అనేక మంది బాత్‌రూమ్‌లలోని టాయిలెట్ సీట్లను తాకరు. మనం ఊహించిన దాని కంటే తక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకుంటారు.

బాత్‌రూమ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత మీ చేతుల్ని నోట్లో పెట్టుకోకండి.

ఇన్ని చేసినా బాత్రూంలో వ్యాధి బారిన పడేందుకు మరో ప్రమాదం ఉంది.

టాయిలెట్ ఉపయోగించే ముందు లేదా తర్వాత అందులోకి నీళ్లు ఫ్లష్ చేసిన తర్వాత అందులో ఉండే క్రిములు గాలిలోకి వచ్చి బాత్‌రూమ్ అంతటా విస్తరిస్తాయి.

దీన్ని బాత్రూమ్ స్నీజ్ అంటారు

అప్పటికి మీరు కూడా బాత్‌రూమ్‌లోనే ఉంటారు కాబట్టి అవి మిమ్మల్ని కూడా తాకుతాయి.

టాయిలెట్ బౌల్ ద్వారా 40 నుంచి 60 శాతం కణాలు ప్రయాణించవచ్చని గణాంకాలు సూచిస్తున్నాయి.

క్లోస్ట్రియం డిఫిసిల్ అనే బ్యాక్టీరియా టాయిలెట్ ఫ్లష్ చేసిన తర్వాత చాలా దూరం ప్రయాణిస్తుందని అధ్యయనాల్లో తేలింది.

మనం గాలి పీల్చుకున్నప్పుడు ఇది మన శరీరంలోకి వెళుతుంది. దీన్ని వాతావరణం నుంచి నిర్మూలించడం కష్టం.

అంటే టాయిలెట్ సీట్ల నుంచే కాకుండా, వాటి మూతలు, బాత్‌రూమ్ డోర్ నాబ్స్, సింక్ హ్యాండిల్స్, బాత్‌రూమ్‌లో ఉండే టవల్స్ లాంటి వాటి ద్వారా కూడా ముప్పు ఉంది. అన్నింటి కంటే బాత్‌రూమ్‌లలో ఉండే నేల అత్యంత మురికిగా ఉండి, క్రిములకు ఆవాసంగా ఉంటుంది.

దురదృష్టత్తువశాత్తూ బాత్‌రూమ్‌లో తరచుగా ఉండే వైరస్‌లతో పాటు కొన్ని అదనపు వైరస్‌లు కూడా ఉంటాయి.

ఉదాహరణకు జలుబు, ఇతర ఫ్లూ లాంటి వైరస్‌లు కూడా బాత్‌రూమ్‌లో ఉండవచ్చు.

టాయిలెట్ సీట్, వైరస్‌, బ్యాక్టీరియా, వ్యాధులు, అనారోగ్యం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాత్‌రూమ్‌లో వీలైనన్ని తక్కువ వస్తువులు ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

టాయిలెట్‌లో వైరస్‌లు సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఇళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్, కామన్ సెన్స్ ఉపయోగించి కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా టాయిలెట్‌లో ఇలాంటి అసహ్యకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు.

టాయిలెట్‌లో వస్తువుల్ని వీలైనంత తక్కువగా తాకాలని యూకేలోని లౌబరో యూనివర్సిటీలో వాటర్ హైజీన్ ఇంజనీర్ ఎలిజబెత్ పాడీ సూచించారు

బాత్‌రూమ్‌లో చేతితో తాకాల్సిన అవసరం లేదని ఫ్లష్ మెకానిజం, సోప్ డిస్పెన్సర్స్, హ్యాండ్ డ్రైయర్స్, సెన్సర్ల ద్వారా పని చేసే వాటర్ ఫ్లష్ లాంటి ఇంకా అనేక వస్తువుల్ని తయారు చేస్తున్నాయని పాడీ చెప్పారు.

టాయిలెట్‌లో గాలి ద్వారా సూక్ష్మ జీవులు వ్యాపించకుండా ఉండాలంటే కమోడ్‌లోకి నీటిని ఫ్లష్ చేయడానికి ముందు మూత వేయడం మంచిది.

అయితే మూత తెరచి మూసి వేయడం వల్ల పెద్దగా తేడా లేదని గెర్బా చెప్పారు.

"టాయిలెట్ లోపలుండే వైరస్‌లు మూత మూసినా తప్పించుకోగలవని 2024 అధ్యయనం తెలిపింది

బాత్రూమ్ తయారీదారులు టాయిలెట్ల నుండి మూతలను పూర్తిగా తొలగించాలని, తద్వారా ప్రజలు టాయిలెట్ సీట్ల మూతను పొరపాటున తాకకుండా చూడాలని ప్యాడీ భావిస్తున్నారు.

ప్రస్తుతం మూత ఉండే టాయిలెట్ బౌల్స్ తయారు చేస్తున్నారని, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉందని ప్యాడీ చెప్పారు.

టాయిలెట్‌లో వాటర్ ఫ్లష్ చేసినప్పుడు వైరస్‌లు గాలిలోకి రాకుండా ఎయిర్ స్ప్రేలు అందుబాటులోకి వచ్చాయని ఆమె చెప్పారు.

బాత్రూమ్‌లో ఎయిర్ స్ప్రే ఉపయోగించడం, నేలను తరచుగా శుభ్రం చేయడం ద్వారా వైరస్‌లు విస్తరించకుండా, వ్యాపించకుండా చేయవచ్చు.

మరో ప్రత్యామ్నాయం ఏంటంటే బాత్‌రూమ్ నుంచి త్వరగా బయటకు రావడం.

"నేను సాధారణంగా ఫ్లష్ చేసి పరుగెత్తుతా" అని గెర్బా చెప్పారు.

పబ్లిక్ టాయిలెట్‌ను ఇద్దరు వ్యక్తులు ఉపయోగించడం మధ్య 10 నిముషాల గ్యాప్ మంచిదని ఆయన సూచించారు.

బాత్‌రూమ్‌లోకి మొబైల్ ఫోన తీసుకెళ్లవద్దని రాబర్ట్స్ చెప్పారు.

"మీ ఫోన్ అప్పటికే చాలా మురికిగా ఉంది. మీరు దానిని మీతో పాటే ప్రతీ చోటకు తీసుకెళతారు. ఎక్కడ పడితే అక్కడ పెడతారు. మీరు దానిని టాయిలెట్‌లోకి తీసుకెళితే అక్కడ ఉండే వైరస్‌లు ఫోన్‌కు అంటుకోవచ్చు" అని రాబర్ట్స్ తెలిపారు.

బాత్‌రూమ్‌లో అపరిశుభ్ర వాతావరణం వల్ల వ్యాధులు రాకుండా ఉండటానికి సులువైన మరో మార్గం ఏంటంటే బాత్రూంకి వెళ్లిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవడం మంచిదని గెర్బా చెప్పారు.

ఆరిజోనాలోని టక్సన్‌లో చేతులు కడుక్కోవడానికి 11 సెకన్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలని యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సూచిస్తోంది.

పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వీలైతే శానిటైజర్ కూడా ఉపయోగించడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలన్నీ సమాచారం కోసమే. దీన్ని వైద్యుల సలహా లేదా సూచనగా పరిగణించరాదు. ఇందులో పేర్కొన్న అంశాల ఆధారంగా చేసే రోగ నిర్థరణకు బీబీసీ బాధఅయత వహించదు. ఈ కథనాన్ని వేరే సైట్లు ప్రచురించినా దానికి బీబీసీకి ఎలాంటి సంబంధం లేదు. మీ అనారోగ్యాల పరిష్కారం కోసం ఎప్పుడూ వైద్యులను సంప్రదించండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)