'నేను విమానంలో లైంగిక దాడికి గురయ్యా, పరిహారం కోసం పోరాడుతున్నా'

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిమా కోటేచా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఆఫ్రికా పర్యటన ముగించుకొని యూకేకు విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు 24 ఏళ్ల కెల్లీ (పేరు మార్చాం). ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానం దోహా నుంచి లండన్‌లోని గాత్విక్‌కు ప్రయాణిస్తోంది.

చాలా రోజులు ప్రయాణం చేయడంతో కెల్లీ అలసిపోయారు. దీంతో విమానంలో ఆమె దుప్పటి కప్పుకొని, హెడ్‌ఫోన్‌లు పెట్టుకుని నిద్రపోయారు. ఆ రాత్రి రద్దీగా ఉన్న విమానంలో కెల్లీ స్క్రీన్‌పై ప్లే అవుతున్న సినిమా నుంచి వచ్చే మృదువైన స్వరాలు ఆమెకు విశ్రాంతినిచ్చాయి.

అయితే, ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు, కెల్లీ మేల్కొనగా, తన పక్కన కూర్చున్న 66 ఏళ్ల వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె కనుగొన్నారు.

ఆ వ్యక్తి ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయినప్పటికీ, కెల్లీ మామూలు మనిషి కాలేకపోయారు. పరిహారం కోసం పోరాడుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'ఆ రోజు ఏం జరిగిందంటే'

ఆ వ్యక్తి తనతో అలా చేయడానికి ముందు ఇద్దరిపై రెండో దుప్పటిని కప్పారని కెల్లీ బీబీసీతో చెప్పారు.

"ఆయన చేతులు నా ప్యాంటు లోపల ఉన్నాయి. నేను, 'ఏం చేస్తున్నావ్? ఆపు' అని అన్నాను. కానీ ఆయన, 'వద్దు, దయచేసి' అన్నారు. నేను ఆయన చేతిని దూరంగా నెట్టవలసి వచ్చింది. నేను వెంటనే లేచి నా ఫోన్, బ్యాగ్, పాస్‌పోర్ట్, బూట్లు కూడా వదిలి టాయిలెట్‌కి పరిగెత్తాను. ఆ టాయిలెట్ డోర్ తెరిచి విమాన సహాయకులకి చెప్పాను" అని ఆమె తెలిపారు.

దీంతో మొదట కెల్లీని క్యాబిన్ క్రూలో కూర్చోబెట్టి, అనంతరం విమానం ల్యాండింగ్ అయ్యే వరకు మరొక సీటుకు మార్చారు.

"నేను ప్రయాణంలో మిగిలిన సమయం అంతా కూర్చోవలసి వచ్చింది, చాలా భయంకరంగా గడిచింది" అని కెల్లీ గుర్తుచేసుకున్నారు.

"చాలా భయపడ్డా. ఎవరైనా పక్కనుంచి వెళ్లిన ప్రతిసారీ, అది ఆయనే కావచ్చని అనుకునేదాన్ని" అని ఆమె అన్నారు.

ఖతార్ ఎయిర్ వేస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

విమానం ల్యాండ్ అయ్యాక ఏం జరిగింది?

విమానం గాత్విక్‌లో దిగినప్పుడు, 66 ఏళ్ల మొమాదే జుస్సాబ్‌ను అరెస్టు చేశారు. తరువాత ఆయనపై ఒక లైంగిక దాడి కేసు, రెండు లైంగిక వేధింపుల కేసులను నమోదు చేశారు.

2025 మార్చిలో ఆయనను దోషిగా తేల్చారు. ఆరున్నరేళ్ల జైలు శిక్ష పడింది.

ఆయనకు శిక్ష పడినట్లు తెలిసిన తర్వాత ఉపశమనంగా అనిపించినప్పటికీ, తన జీవితంపై ఆ ఘటన చాలా ప్రభావం చూపిందని కెల్లీ చెప్పారు.

"నేను దాదాపు ఏడాది నుంచి నా స్నేహితులతో ఈవెంట్‌లకు, పార్టీలకు వెళ్లడం లేదు. చాలా భయమేస్తోంది. ఎవరూ నన్ను తాకడం లేదా చూడటం నాకు నచ్చడం లేదు. ఆ ఘటన తాలూకు జ్ఞాపకాలు నాతోనే ఉంటున్నాయి. నిద్రపోయే ముందు, అప్పుడు ఏం జరిగిందో ఆలోచిస్తూనే ఉంటాను" అని అన్నారు కెల్లీ.

‘పరిహారం ఇవ్వలేదు’

కెల్లీ ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రిమినల్ ఇంజురీస్ కాంపెన్సేషన్ స్కీమ్ (సీఐసీఎస్) ద్వారా పరిహారం పొందడానికి ప్రయత్నిస్తున్నారు.

హింసాత్మక నేరం కారణంగా శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బందిపడిన వ్యక్తులకు ఈ పథకం కింద పరిహారం అందుతుంది.

కానీ, కెల్లీ ఏప్రిల్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆమె అభ్యర్థనను తిరస్కరించారు.

న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించే క్రిమినల్ ఇంజురీస్ కాంపెన్సేషన్ అథారిటీ నుంచి వచ్చిన లేఖలో, ఈ పథకం పరిధిలోకి వచ్చే ప్రదేశంలో దాడి జరగలేదని పేర్కొంది. దీనిపై కెల్లీ అప్పీల్ చేశారు. కానీ, మేలో ఆమె కేసు మళ్లీ రిజెక్ట్ అయ్యింది.

చట్టం, కోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

'చట్టంలో మార్పులు చేయాలి'

1982 పౌర విమానయాన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం బ్రిటిష్-రిజిస్టర్డ్ విమానం అయితేనే ఆ విమానం ‘నేరం జరిగిన ప్రదేశం’గా పరిగణనలోకి తీసుకోవాలని నియమాలు చెబుతున్నాయి.

కెల్లీపై ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో దాడి జరిగినందున, ఆమె పరిహారం పొందలేరని చెప్పారు. అయితే, ఇది అన్యాయమని కెల్లీ భావిస్తున్నారు.

"ఆయనకు శిక్ష విధించారు. ఆయన చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నారనీ నాకర్థమైంది. కానీ, నా సంగతేమిటి? నా మానసిక సమస్యల చికిత్సకయ్యే డబ్బులు నా దగ్గర లేవు’’ అని కెల్లీ అన్నారు.

"నేను ఎదుర్కొన్న దానికి మద్దతు మాత్రమే కోరుకుంటున్నాను. నాకు ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి. నా వాదన వినాలని కోరుకుంటున్నాను" అని అన్నారామె.

కెల్లీ పట్ల ఈ నిర్ణయం "అహేతుకం" అని ఆమె న్యాయవాదులు అంటున్నారు.

1996లో పౌర విమానయాన చట్టంలో మార్పులు చేశారు. అందుకే యూకేలో ఎగురుతున్న విదేశీ విమానాలలో నేరాలను యూకే కోర్టులలోనే విచారించగలుగుతున్నారు. అందుకే ఖతార్ ఎయిర్‌వేస్ విమానం గాత్వి‌క్‌లో ల్యాండ్ అయినప్పుడు జుస్సాబ్‌ను అరెస్టు చేసి అభియోగాలు మోపవచ్చు.

కానీ, అలాంటి కేసుల్లో బాధితులు ఇప్పటికీ పరిహారం పొందలేరు. కెల్లీ లాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు వర్తించేలా చట్టాన్ని నవీకరించాలని ఆమెకు న్యాయ సహాయం అందించే లీ డే కోరుకుంటోంది. ఈ చట్టపరమైన అంతరాన్ని తొలగించాలని వారు న్యాయ కార్యదర్శి షబానా మొహమ్మద్‌ను కోరుతున్నారు.

"ప్రస్తుతం, బ్రిటిష్ విమానంలో లైంగిక దాడి జరిగితే, బాధితులు పరిహారం పొందవచ్చు. కానీ, అదే దాడి యూకేలో ఎగురుతున్న విదేశీ విమానంలో జరిగితే నేరస్థుడిని యూకేలోనే విచారిస్తున్నారు. ఇక్కడ బాధితులను పట్టించుకోవడం లేదు" అని లీ డేకి చెందిన క్లైర్ పావెల్ అన్నారు.

ముఖ్యంగా మహిళలు, బాలికలపై హింసను ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వం నిబంధనలు మార్చాలని క్లైర్ పావెల్ కోరారు.

ప్రభుత్వం ఏమంటోంది?

న్యాయ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ "ఆ బాధితురాలి గురించే ఆలోచిస్తున్నాం. సీఐసీఏ అనుసరించే నియమాలు, చెల్లింపు మొత్తాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. బాధితులకు ఇతర రకాల మద్దతు అందుబాటులో ఉంది" అని అన్నారు.

కాగా, ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాలనుకుంటున్నట్లు కెల్లీ చెప్పారు.

"భయపడకండి కానీ, మీకు హాని కలిగించే వ్యక్తులు ఉన్నారని తెలుసుకోండి. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఇది ఎవరికైనా జరగవచ్చు" అని అన్నారు కెల్లీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)