రెండు కూరలు, పప్పు, పచ్చడితో భోజనం: కానీ, ఈ కేఫ్‌లో కట్టాల్సింది డబ్బులు కాదు..

ఫొటో సోర్స్, Ritesh Saini/ Ambikapur Municipal Corporation
- రచయిత, హజ్రా ఖాతూన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నగరాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి ఆ కేఫ్ ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించే ప్రయత్నం చేస్తోంది.
అంబికాపూర్ నగరంలోని ఆ కేఫ్‌ను బీబీసీ సందర్శించింది.
2025 ప్రారంభంలో ఒక శీతాకాలపు రోజున భారదేశంలోని తొలి గార్బేజ్ కేఫ్‌లో అడుగు పెట్టినప్పుడు అక్కడ వేడి వేడి సమోసాల వాసన నోరూరించింది.
లోపల ఉన్న వాళ్లంతా పొగలు కక్కుతున్న భోజనంతో ఉన్న ప్లేట్లను చెక్క బెంచీలపై పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు.
చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ నగరంలో ఉన్న ఈ కేఫ్‌కు రోజూ అనేకమంది వేడి వేడి భోజనం లభిస్తుందని వస్తారు.
వారు భోజనం చేసిన తర్వాత డబ్బులు ఇవ్వరు.
తమతోపాటు సంచిలో తెచ్చుకున్న ప్లాస్టిక్ వస్తువులు, బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు.
ఒక కిలో ప్లాస్టిక్ చెత్త ఇస్తే అన్నం, రెండు కూరలు, పప్పు, పచ్చడి, సలాడ్‌తో కూడిన ఫుల్ మీల్స్ లభిస్తుందని అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఈ కేఫ్ నిర్వహిస్తున్న వినోద్ కుమార్ పటేల్ చెప్పారు.
"అరకిలో ప్లాస్టిక్ తీసుకొస్తే సమోసా, వడపావ్ లాంటి బ్రేక్‌ఫాస్ట్ లభిస్తుంది" అని ఆయన తెలిపారు.
అంబికాపూర్ నగరం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు, వ్యర్థాలకు ఆహారాన్ని ముడి పెట్టింది.
2019లో మోర్ ది వేస్ట్, బెటర్ ది టేస్ట్ అనే నినాదంతో 'గార్బేజ్ కేఫ్'ను ప్రారంభించారు.

అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ బడ్జెట్ నుంచి ఈ కేఫ్‌కు నిధులు కేటాయించారు. దీనిని నగరంలోని ప్రధాన బస్టాండ్ వద్ద ఏర్పాటు చేశారు.
"అంబికాపూర్‌లో ప్రస్తుతం ఉన్న రెండు సమస్యలు ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆకలి. దీనిని పరిష్కరించడం కోసమే ఈ ఆలోచన" అని వినోద్ పటేల్ చెప్పారు.
పేదలు, ముఖ్యంగా నిరాశ్రయులు, చెత్త ఏరుకునే వారు వీధులు, డంపింగ్ యార్డుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తెస్తే వారికి వేడి భోజనం అందించడం.
ఇది చాలా సింపుల్ ఐడియా.

ఫొటో సోర్స్, Getty Images
చెత్త ఏరుకునే వారికి మేలు చేసేలా..
స్థానిక మహిళ రష్మీ మండల్ ఈ కేఫ్ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొస్తారు. రోజూ ఉదయం ఆమె అంబికాపూర్ వీధుల్లో ప్లాస్టిక్ కోసం వెదుకుతారు. రోజంతా ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు సేకరిస్తారు. ఇదే ఆమెకు జీవనోపాధి.
తాను సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల కుప్పను చూపిస్తూ "అనేక ఏళ్లుగా నేనీ పని చేస్తున్నాను" అని మండల్ చెప్పారు.
గతంలో తాను సేకరించిన ప్లాస్టిక్ చెత్తను ఆమె స్థానిక వ్యాపారులకు కిలో 10 రూపాయలకు అమ్మేవారు. అది ఆమె అవసరాలకు ఏ మాత్రం సరిపోయేది కాదు.
"అయితే ఇప్పుడు నేను సేకరించే ప్లాస్టిక్‌కు బదులుగా నా కుటుంబానికి ఆహారం లభిస్తుంది. ఇది మా జీవితాల్లో మార్పు తెచ్చింది" అని మండల్ చెప్పారు.
ఈ కేఫ్‌కు వచ్చే వారిలో అనేక మంది పేదవాళ్లే ఉంటారని కేఫ్ ప్రారంభించినప్పటి నుంచి అక్కడ పని చేస్తున్న శారదా సింగ్ పటేల్ చెప్పారు.
"ప్లాస్టిక్ బదులుగా ఆహారం ఇవ్వడం అంటే ఆకలితో ఉన్న వారికి కడుపు నింపడమే కాకుండా పర్యావరణాన్ని కూడా పరిరక్షించడం" అని ఆమె చెప్పారు.
ఈ కేఫ్ సగటున రోజుకు 20 మందికి ఆహారం అందిస్తోందని వినోద్ పటేల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Ritesh Saini/ Ambikapur Municipal Corporation
చెత్తలేని నగరంగా గుర్తింపు
ఈ కేఫ్ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గిస్తుందని వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న రితేష్ సైని చెప్పారు.
2019 నుంచి ఈ కేఫ్ ద్వారా 23 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారని ఆయన చెప్పారు.
2019లో నగంరంలోని డంపింగ్ యార్డులకు 5.4 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్లేవి. ఈ కేఫ్ వల్ల 2024 నాటికి ఇది రెండు టన్నులకు తగ్గిందని సైని చెప్పారు.
2024లో అంబికాపూర్‌లో 226 టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగైంది. ఈ మొత్తంతో పోల్చుకుంటే కేఫ్ ద్వారా సేకరిస్తోంది చాలా తక్కువే.
అయితే మున్సిపాలిటీ సేకరిస్తున్న చెత్తలో చాలా వరకు రీసైక్లింగ్ చేస్తున్నామని సైని చెప్పారు.
ప్లాస్టిక్ చెత్తను తగ్గించడానికి, రీసైక్లింగ్ చేయడానికి నగరంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
వ్యర్థాల క్రమబద్దీకరణ, నిర్వహణకు మెరుగైన మార్గాలను ఆచరిస్తున్నామని సైని వెల్లడించారు.
ఈ విధానాలతో అంబికాపూర్ దేశంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది.
అంబికాపూర్‌లో రోజుకు 45 టన్నుల ఘన వ్యర్థాలు పోగు పడతాయని సైని చెప్పారు.
"ఒకప్పుడు నగరానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న 16 ఎకరాల డంపింగ్ యార్డుతో నగరం ఇబ్బంది పడింది" అని ఆయన అన్నారు.
అయితే 2016లో మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో జీరో వేస్ట్ వికేంద్రీకరణ వ్యవస్థను ప్రారంభించి డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పార్కుగా మార్చేసి డంపిగ్ యార్డ్ అవసరం లేకుండా చేసింది.
సేకరించిన ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసి ఉండలుగా మారుస్తారు. వీటిని రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు లేదా రీసైక్లింగ్ ఫ్యాక్టరీలకు అమ్ముతారు.
దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
తడి వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మారుస్తారు.
రీ సైక్లింగ్‌కు పనికి రాని వ్యర్థాలను కొద్ది మొత్తంలో సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపిస్తారని 2020 నాటి ప్రభుత్వ నివేదిక తెలిపింది.
ఇలాంటి ప్రయత్నాల వల్ల అంబికాపూర్ "వ్యర్థాలు లేని నగరం"గా గుర్తింపు పొందింది.

ఫొటో సోర్స్, Ritesh Saini/ Ambikapur Municipal Corporation
దేశంలోని ఇతర నగరాల్లోనూ..
గార్బేజ్ కేఫ్ ద్వారా సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యర్థాల సేకరణ కేంద్రాలకు పంపుతారు. నగరంలో ప్రస్తుతం ఇలాంటివి 20 ఉన్నాయి. ఇక్కడ చెత్తను 60 కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ఇందులో ఎక్కువ భాగం రీ సైకిల్ చేయగలిగినవి ఉంటాయి.
ఈ కేంద్రాలలో 480 మంది మహిళలు పని చేస్తున్నారు. వీరిని 'స్వచ్ఛత దీదీ' అని పిలుస్తారు
వాళ్లు నెలకు 8 వేల నుంచి 10 వేల రూపాయలు సంపాదిస్తారు.
"రోజూ ఇక్కడకు 30 నుంచి 35 మంది ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకు వస్తారు" అని సేకరణ కేంద్రాలలో ఒక దాన్ని నిర్వహిస్తున్న సోనా టొప్పో చెప్పారు.
చెత్త సేకరణ కేంద్రంలో పని చేసే సిబ్బందికి గ్లౌజులు, మాస్కులతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే చెత్త సేకరించే వారికి ఇలాంటివేవీ లేవు.
"ప్రాథమిక రక్షణ లేకుండా చెత్తను సేకరించే వారు ప్రతీ రోజూ బ్యాక్టీరియా, పదునైన వస్తువులు, విష పూరిత వ్యర్థాల భారిన పడతారు. దీని వల్ల వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది" అని అహ్మదాబాద్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ మినల్ పాఠక్ చెప్పారు.
2016లో ప్రారంభమైన చెత్త సేకరణ కేంద్రాలు ప్లాస్టిక్, పేపర్, కార్డ్‌బోర్డ్, మెటల్స్, ఎలక్ట్రికల్ వేస్ట్ వంటి సుమారు 50వేల టన్నుల పొడి వ్యర్థాలను రీసైకిల్ చేశాయని స్వచ్ఛ అంబికాపూర్ మిషన్ సిటీ లెవల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు శశికళ సిన్హా చెప్పారు .
ఇంటింటికి వెళ్లి వ్యర్థాల సేకరణ ఆలోచన ఎంతగా పని చేసిందంటే అది "అంబికాపూర్ మోడల్"గా ప్రాచుర్యం పొందింది.
ప్రస్తుతం ఇది చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో48 వార్డుల్లో అమలవుతోంది.
దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా చెత్త కేఫ్‌లు పుట్టుకొచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులు ఆహారం అందించే పథకం 2019లో ప్రారంభించారు. అదే ఏడాది తెలంగాణలోని ములుగు పట్టణంలో ఒక కేజీ ప్లాస్టిక్‌కు ఒక కేజీ బియ్యం ఇచ్చే స్కీమ్ మొదలైంది.
కర్ణాటకలోని మైసూరులో ఇందిరా క్యాంటీన్‌లో అరకేజీ ప్లాస్టిక్ ఇస్తే అల్పాహారం, కేజీ ప్లాస్టిక్ ఇస్తే భోజనం పెట్టే పథకం 2024లో ప్రవేశపెట్టారు.
యూపీలో ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా మహిళలు శానిటరీ ప్యాడ్‌లను అందించే క్యాంపెయిన్ ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో ఎందుకు విఫలమైంది?
అయితే ఇలాంటి పథకాలన్నీ నిరాటంకంగా సాగడం లేదు.
దిల్లీ 2020లోనే ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 20కి పైగా అవుట్‌లెట్లను ఏర్పాటు చేసింది. అయితే ఇది అంతగా ఆదరణకు నోచుకోలేదు.
అంబికాపూర్‌తో పోలిస్తే దిల్లీలో తక్కువ ఆదాయం ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉన్నందు వల్లే దేశ రాజధానిలో ఈ స్కీమ్ విజయవంతం కాలేదని సైని చెప్పారు.
కంబోడియాలో వ్యర్థాలు, ఆకలి సమస్యను ఏకకాలంలో ఎదుర్కోవడానికి ఇలాంటి కార్యక్రమాలను అమలు చేశారు.
టోన్లేసాప్ సరస్సులో నీటి మీద ఇళ్లు నిర్మించుకుని ఉండే ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను బియ్యంతో మార్పిడి చేసుకోవచ్చు.
అంబికాపూర్‌లో జరిగినట్లుగా వ్యర్థాల సేకరణ కార్యక్రమాలు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన పెంచడంలో కూడా సహాయపడతాయని పాఠక్ అభిప్రాయపడ్డారు.
"ఇది మంచి ప్రారంభం. అయితే మనలో మార్పు కూడా అవసరం" అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














