రష్యా దగ్గర భారత్‌ ఆయిల్ కొనడాన్ని ద్రోహం అంటున్న అమెరికా, నిపుణులు ఏమంటున్నారు?

ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవార్రో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవార్రో

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా పాలకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

అయితే, అమెరికా ఆగ్రహం భారత్-రష్యా సంబంధాలపై ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని ఆయన ప్రకటించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించనున్నారు.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెట్ భారత్‌ను విమర్శిస్తున్నారు. ఇప్పుడు వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవార్రో కూడా భారత్‌ను టార్గెట్ చేశారు.

యుక్రెయిన్ యుద్ధంలో భారత్ పాత్రను పీటర్ విమర్శించారు. రష్యా చమురు భారత్‌కు అవసరమనే చర్చ అర్థరహితమన్నారు.

రష్యా చమురు కొనుగోలు ద్వారా భారత్ లాభాలను ఆర్జిస్తోందని, రష్యా చమురు లాండ్రోమార్ట్ (సెల్ఫ్ సర్వీసు లాండ్రీ)గా మారిందని ఆరోపించారు.

నవార్రో ఈ వ్యాఖ్యలు చేసిన సమయానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా చేరుకున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరా, ధరలను స్థిరీకరించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలుచేయాలని భారత్‌ను కోరింది అమెరికాయేనని జైశంకర్ వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా వాణిజ్య సలహాదారుడు పీటర్ నవార్రో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా వాణిజ్య సలహాదారుడు పీటర్ నవార్రో

అమెరికా మళ్లీ టార్గెట్ చేసింది...

భారతదేశ ఇంధన భద్రత కోసం రష్యా చమురు అవసరమని చెబుతున్నారని, కానీ భారత్‌కు ఆ అవసరం లేదని నవార్రో రిపోర్టర్లతో అన్నారు.

''వాస్తవానికి యుక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గం న్యూదిల్లీ గుండా వెళుతోంది. కానీ భారతదేశం రష్యా చమురును శుద్ధి చేసే లాండ్రోమాట్‌గా మారింది. తద్వారా తను లాభాలు ఆర్జించడమే గాకుండా, యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా నిధులు సమకూరుస్తోంది'' అని ఆయన ఆరోపించారు.

భారత్‌పై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడానికి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆగస్టు 27వ తేదీ వరకూ ఇచ్చిన గడువును పొడిగించబోరని నవార్రో హెచ్చరించారు.

''మనకు (అమెరికాకు) వస్తువులను అమ్మకం ద్వారా భారతదేశం సంపాదిస్తున్న ధనంతో రష్యా చమురును కొనుగోలు చేస్తోంది. ఆ చమురును రిఫైనరీలో శుద్ధిచేసి లాభం పొందుతోంది. కానీ ఆ డబ్బుతో రష్యా మరిన్ని ఆయుధాలను తయారుచేసి యుక్రెయిన్లను చంపుతుంది. ఫలితంగా అమెరికా పన్ను చెల్లింపుదారులు యుక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందించాల్సి వస్తోంది. ఇది పిచ్చితనం'' అని నవార్రో వ్యాఖ్యానించారు.

''యుక్రెయిన్‌ రక్తపాతంలో తన పాత్రను అంగీకరించడానికి భారత్ సిద్ధంగా లేదు. బదులుగా అది షీ జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు)కు దగ్గరవుతోంది. భారతదేశం పట్ల ప్రజల్లో సానుభూతి తీసుకురావడానికి ఆ దేశం నుంచి జరుగుతున్న ప్రచారానికి నేను స్పందించాల్సి వచ్చింది'' అని నవార్రో తెలిపారు.

భారత్ నాయకత్వ సామర్థ్యాలను ఆయన ప్రశంసించినప్పటికీ, అది తన తీరును మార్చుకోవాలని కూడా చెప్పారు.

''భారత్‌పై నాకు ప్రేమ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు. కానీ భారత్ చేస్తున్న పని యుక్రెయిన్‌లో శాంతిని తీసుకురాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన పాత్ర ఏమిటో చూడాలి. ప్రస్తుతం మీరు (భారతదేశం) శాంతిని స్థాపించడానికి బదులు యుద్ధాన్ని పొడిగిస్తున్నారు'' అని నవార్రో అన్నారు.

భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా చమురు ఎక్కువగా కొనుగోలు చేసే దేశం తాము కాదని భారత్ చెబుతోంది

'భారత్‌పై మరో ఆరు రోజుల్లో 50 శాతం సుంకాలు'

భారతదేశం అధిక సుంకాలను విధిస్తోందని, వాటితో పాటు నాన్-టారిఫ్ ఆంక్షలను విధిస్తోందని నవార్రో అన్నారు.

రిపోర్టర్ల సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే, ''వారి (భారత్) సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మహారాజా సుంకం. నాన్-టారిఫ్ ఆంక్షలు కూడా అధికంగా విధిస్తున్నారు. భారత్‌తో అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉంది. ఇది అమెరికా కార్మికులకు, వ్యాపారాలకు హాని చేస్తుంది. మనకు (అమెరికాకు) వస్తువులను అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. వాణిజ్యంలో మనల్ని మోసం చేస్తుంది కాబట్టి భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నాం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా 25 శాతం సుంకం విధిస్తున్నాం'' అని చెప్పారు.

భారత్‌పై 50 శాతం సుంకం విధించడం కేవలం ఆరు రోజుల్లో మీరు చూస్తారని నవార్రో రిపోర్టర్లను ఉద్దేశించి అన్నారు.

భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

భారత్ విదేశాంగ మంత్రి సమాధానమేమిటంటే...

నవార్రో వ్యాఖ్యలపై రష్యా పర్యటనలో ఉన్న భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు.

రష్యా విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లవ్రోవ్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

భారత్ రష్యా నుంచి చమురు ఎక్కువగా కొనుగోలుచేస్తున్న దేశం కాదని, 2022 తర్వాత రష్యాతో అత్యధికంగా వాణిజ్య ప్రయోజనం పొందిన దేశం కూడా కాదని ఈ సందర్భంగా జైశంకర్ స్పష్టంచేశారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు, సరఫరా స్థిరంగా ఉంచడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని అమెరికా కోరిన దేశమే భారతదేశం అని ఆయన గుర్తుచేశారు.

''కచ్చితంగా చెప్పలేను కానీ, గ్యాస్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్నది యూరోపియన్ యూనియన్ అనుకుంటున్నా'' అని జైశంకర్ వెల్లడించారు.

రష్యా విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లవ్రోవ్‌ స్పందిస్తూ, ''2022 తర్వాత రష్యాతో అత్యధికంగా వాణిజ్యం పెరిగిన దేశం కూడా భారత్ కాదు. అవి దక్షిణాదికి చెందిన కొన్ని దేశాలని భావిస్తున్నాను. అటువంటి పరిస్థితిలో మనపై సుంకాలు ఎందుకు విధిస్తున్నారో అర్థం కావట్లేదు'' అన్నారు.

భారత్ ఎగుమతులు, అమెరికా మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ ఎగుమతుల్లో 18 శాతం వస్తువులు అమెరికా మార్కెట్‌కు వెళ్తున్నాయి

50 శాతం సుంకంతో భారత్‌కు సమస్య...

భారత్ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్. తన ఎగుమతుల్లో 18 శాతం వస్తువులు అమెరికా మార్కెట్‌కే ఎగుమతి చేస్తోంది. ఇది భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 2.2 శాతం.

కొన్ని అంచనాల ప్రకారం, 50 శాతం సుంకం వల్ల భారత్ జీడీపీ 0.2 నుంచి 0.4 శాతం వరకూ తగ్గుతుంది. దీనివల్ల ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధి 6 శాతం కన్నా తక్కువగా ఉండవచ్చు.

ఇదే సమయంలో భారత్, చైనా మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగవుతున్నాయన్న సంకేతాలు వెలువడటం మొదలైంది. అందుకే అమెరికా వాణిజ్య సలహాదారుడు పీటర్ నవార్రో తాజాగా భారత్‌ను కూడా టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేశారు.

షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నారు.

భారత్‌పై అమెరికా సుంకాలు విధించడాన్ని చైనా కూడా విమర్శించింది.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా ఈ వారమే భారత్‌ సందర్శించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాపై భారత్ కూడా ప్రతీకార సుంకాలను విధించవచ్చని దౌత్యవర్గాలు చెబుతున్నాయి

భారత్ స్పందన ఎలా ఉండవచ్చు?

అమెరికా హెచ్చరికలకు భారత్ స్పందిస్తుందా లేదా అనే ప్రశ్న దౌత్య వర్గాల్లో తలెత్తుతోంది.

భారత్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం తక్కువగా ఉందని, కానీ అది అసాధ్యం కూడా కాదని, ఎందుకంటే గతంలో ఉదాహరణలు చూశామని బార్క్‌లేస్ రీసెర్చ్‌ను ఉటంకిస్తూ బీబీసీ రిపోర్ట్ చేసింది.

''2019లో ఉక్కు, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా భారతదేశం యాపిల్, బాదం తదితర దిగుమతులపై 28 శాతం సుంకాలను విధించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) జోక్యంతో 2023లో ఈ సుంకాల్లో కొన్నింటిని ఉపసంహరించుకున్నారు'' అని బార్క్‌లేస్ రీసెర్చ్ తన నివేదికలో ప్రస్తావించింది.

ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్

ఫొటో సోర్స్, Disney via Getty Images

ఫొటో క్యాప్షన్, నవార్రో మాటలను ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ తప్పుపట్టారు

అమెరికా హెచ్చరికలపై నిపుణులు ఏమంటున్నారు?

రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్‌పై అమెరికా పాలకులు చేస్తున్న విమర్శలపై నిపుణులు స్పందించారు.

ట్రంప్ తొలి దఫా పాలనలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేసిన జాన్ బోల్టన్ ఏమన్నారంటే, ''భారతదేశం చేస్తున్న పనిని రష్యాపై విధించిన ఆంక్షలు ఆపలేదు. రష్యా చమురును భారత్ కొనడం మీకు (అమెరికా) నచ్చకపోతే, ఆంక్షలు మార్చండి. రష్యా నుంచి చమురు ఏ ఒక్క దేశమూ కొనుగోలుచేయకుండా ఆపండి'' అని హితవు పలికారు.

మరో మాజీ సలహాదారుడు ఇవాన్ ఎ.ఫీగెన్‌బామ్ కూడా స్పందించారు.

''ఇది పూర్తిగా అర్థరహితం. ఇంతకుముందు యుద్ధానికి రష్యా కారణమని చెప్పేవారు. చైనా, ఇతర దేశాలు దీనికి సహాయం చేశాయి. ఇప్పుడు యుద్ధానికి యుక్రెయిన్ కారణమని చెబుతున్నారు. ఈ యుద్ధానికి భారతదేశం సహాయం చేసింది. ఈ వ్యక్తులు యుద్ధానికి వివిధ దేశాలను నిందించడం మొదలెట్టిన విధంగానే, గత 25 ఏళ్లలో అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషిని వారు వృథా చేశారు’’ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)