తెలుగునాట లేని ఆచారాన్ని థీమ్‌గా ఎంచుకున్న 'పరదా' ఎలా ఉంది?

ఫొటో సోర్స్, x.com/anupamahere
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో పరదా వచ్చింది. ఇది ఆయనకి మూడో సినిమా.
అంతకు ముందు.. సినిమా బండి, శుభం అనే సినిమాలు తీసారు. పరదా ఎలా వుందంటే...
పడతి అనే గ్రామంలో ఒక ఆచారం వుంటుంది.
ఆడవాళ్లు ముఖానికి ముసుగు (పరదా) ధరించాలి. తండ్రి, అన్నదమ్ములు తప్ప ఆమెను మగవాళ్లెవరూ చూడకూడదు.
దీని వెనుక ఒక కథ ఉంది.

ఆ ఊరి దేవత జ్వాలమ్మ. పరదా తీసిన మహిళలు జ్వాలమ్మకి ఆత్మాహుతి చేసుకోవాల్సి ఉంటుంది.
లేదంటే ఆ వూళ్లో పుట్టే పిల్లలు చనిపోతారు. ఈ శాపాన్ని జాతరలో జరిగే తోలుబొమ్మల ఆటలో ప్రేక్షకులకు వివరిస్తారు.
సుబ్బు (అనుపమ పరమేశ్వరన్)కి రాజేశ్‌కి (రాగ్ మయూర్) మధ్య ప్రేమ. సుబ్బుకి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ముఖానికి పరదా వేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్లు ఒకరికొకరు చూసుకోరు. కనపడకుండా మాట్లాడుకుంటూ వుంటారు (ఒక రైలు పెట్టెలో). నిశ్చితార్థం రోజు ఊళ్లోకి ఒక మ్యాగజైన్ వస్తుంది. దాని కవర్ ఫొటోపై సుబ్బు.
తనకి ఏ పాపం తెలియదని సుబ్బు అంటుంది.
ఫొటో తీసిన వ్యక్తి హిమాలయాల్లోని ధర్మశాలలో వుంటాడు.
అతన్ని కలిసి తాను నిర్దోషినని నిరూపించుకునే జర్నీ మిగతా కథ. ఆమెకి తోడుగా సంగీత, దర్శన్ రాజేంద్రన్ ఈ ప్రయాణంలో ఉంటారు.

ఫొటో సోర్స్, x.com/anupamahere
జర్నీ సినిమాలు ఎపుడూ వినడానికి చాలా బావుంటాయి. కానీ స్క్రీన్ మీద తేలిపోతాయి.
ఈ స్టోరీలైన్ ఎగ్జైటింగ్‌గా వున్నా, 2 గంటల 24 నిముషాలు థియేటర్‌లో కూర్చోబెట్టాలంటే చాలా కథ కావాలి.
ఫస్టాఫ్ పరవాలేదు అనిపించినా , సెకండాఫ్ ధర్మశాల దారిలో ఇరుక్కుపోయి సహనాన్ని పరీక్షిస్తుంది.
ఆడపిల్లల అణిచివేత, వివక్షపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మళ్లీ అదే చెప్పాలంటే స్క్రీన్ ప్లే కొత్తగా వుండాలి.
అనేక సంఘటనలతో క్యారెక్టర్లు రిజిస్టర్ కావాలి. అదే జరగలేదు.
సినిమాలో హీరో లేడు. లేడీ ఓరియంటెడ్ , ప్రధాన కథ సుబ్బుదే అయినా, సంగీత , దర్శ రాజేంద్రన్‌లు అదనంగా యాడ్ అవుతారు.
ముగ్గురూ ఏదో రకంగా వివక్ష బాధితులే.
ఆచారం పేరుతో సుబ్బు, కుటుంబం పేరుతో సంగీత, ఎంత కష్టపడినా కెరీర్‌లో మగవాళ్ల ముందు నిలబడలేని దర్శన.
ఈ జర్నీలో సుబ్బు తనని తాను ఎలా మార్చుకుంది, ఊరిని ఎలా మార్చింది ఇదే మెయిన్ థీమ్.

ఫొటో సోర్స్, x.com/praveenfilms
దర్శకుడు నిజాయితీగానే అటెంప్ట్ చేసాడు కానీ, ఫాంటసీతో కథని ముడిపెట్టడమే అసలు సమస్య.
కాంతార హిట్ తర్వాత మైథాలజీ, ఫాంటసీలతో మిక్స్ చేస్తే సక్సెస్ ఫార్ములా అనే పిచ్చి పట్టుకుంది దర్శకులకి.
కాంతార ఫాంటసీ వల్ల హిట్ కాలేదు. అది తండ్రికొడుకుల ఫిలాసఫికల్ జర్నీ.
దళిత కోణం, భూమి పోరాటం, సున్నితమైన ప్రేమ అనేక లేయర్స్ , క్యారెక్టర్లు ఉన్నాయి.
పాలు నెయ్యిగా మారడం వెనుక అనేక దశలుంటాయి.
అది మరిచిపోయి వెన్నలేని పాకెట్ పాలలో నుంచి నెయ్యి తీయాలని చేతులు కాల్చుకుంటారు.

ఫొటో సోర్స్, x.com/praveenfilms
నార్త్ ఇండియాలో పరదా పద్ధతి (కొన్ని వర్గాల్లో) ఉంది కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. లేని ఆచారంతో కథ మొదలవుతుంది.
పిచ్చి ఆచారాలు, శాపాలు, భయాలతో టేకాఫ్ అవగానే ప్రేక్షకుడు కనెక్ట్ కాకుండా చిరాకు పడతాడు.
తన ఫోటో కవర్ పేజీ మీద స్పష్టంగా వుంటే, ఆ ఫోటోగ్రాఫర్ని ధర్మశాలకి వెళ్లి పట్టుకుని సుబ్బు తాను నిర్దోషినని ఎలా నిరూపించుకుంటుంది.
లాజిక్ మిస్ ఆయ్యానని దర్శకుడికి కూడా తెలుసు కాబట్టి, కౌంటర్‌గా సంగీత, దర్శన పాత్రలతో ఆచారాలని ప్రశ్నిస్తూ , స్వేచ్ఛ గురించి మాట్లాడిస్తూ ఉంటారు.
జర్నీలో తనని తాను తెలుసుకోవడం, బంధనాలు వదిలించుకోవడం కొత్త పాయింటేమీ కాదు.
క్వీన్‌లో ఒంటరిగా హనీమూన్‌కి వెళ్లి మారిన యువతిగా కంగనా తిరిగి వస్తుంది. ఎవడే సుబ్రమణ్యంలో నానీ కూడా అదే.
అయితే పరదాలో హీరోయిన్ మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ సీరియస్‌గా అనిపించుకోవడం, కథ ఎటు వెళ్లాలో తెలియక ఘాట్ రోడ్డులో ఆగిపోవడం, హీరోయిన్‌లో వచ్చిన మార్పు ఎమోషన్‌లెస్‌గా వుండడం ఇవన్నీ లోపాలు.

ఫొటో సోర్స్, x.com/anupamahere
పరిధి మేరకు అనుపమ, సంగీత, దర్శన అద్భుతంగా నటించారు.
దర్శన ఎంట్రీ తర్వాతే సినిమా కాస్త గాడిన పడినట్టనిపిస్తుంది.
గౌతం మీనన్ అతిథి పాత్రలో కనిపిస్తాడు.
హర్షవర్ధన్ కామెడీ నవ్విస్తుంది కానీ, సీరియస్ సినిమాకి ఇది అనవసరం.
కెమెరా పనితనం బావుంది. సంగీతం జస్ట్ ఓకే.
నిడివి రెండు గంటలు సరిపోయేది.
మధ్యలో వచ్చే రాజేంద్రప్రసాద్ , లేడీ ఆర్మీ అధికారి వల్ల కథకి ఏమీ ఉపయోగం లేదు.
ఆచారాలని నమ్మి ఆత్మాహుతి వరకూ వెళ్లిన అమ్మాయి రెబెల్‌గా మారాలంటే చాలా కెమెస్ట్రీ జరగాలి. అదే మిస్సయ్యింది.
కామెడీని బాగా హ్యాండిల్ చేయగలిగిన ప్రవీణ్ కాండ్రేగుల ఆ జానర్‌ని నమ్ముకుంటేనే మంచిది.
ప్లస్ పాయింట్స్
1. అనుపమ నటన
2. ఫొటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
1. నత్త నడక కథనం
2. మూల కథలో బలం లేకపోవడం
3. నిడివి
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














