డెంగీ, మలేరియా, టైఫాయిడ్: వర్షాకాలంలో ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వానా కాలం రాగానే ఎక్కువగా రకరకాల జ్వరాల బారిన పడినవారు కనిపిస్తుంటారు. ప్రస్తుతం వానలు ఎక్కువగా కురుస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా సీజనల్ వ్యాధులపై దృష్టి సారించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇస్తున్నాయి.
- అసలు వానా కాలం రాగానే ఎలాంటి వ్యాధులు వస్తాయి?
- ఇవి ఎందుకు వస్తాయి?
- ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


ఫొటో సోర్స్, Getty Images

వర్షాకాలంలో వైరస్‌లు, బాక్టీరియా ఇతర సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గాలిలో తేమ పెరగడం, వెలుతురు తక్కువగా ఉండడం వల్ల శిలీంధ్రాలు, ఫంగస్‌లు, బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వేగంగా పెరిగే అవకాశముంది. ఇవి అనేక రకాల వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి.
ఈ వ్యాధులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
వీటిని సకాలంలో గుర్తించడం అవసరం.
కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు, పరిశుభ్రత పాటించడం ద్వారా వీటిని నివారించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

వానాకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులను మాక్స్ హెల్త్ కేర్ వివరించింది.
- డెంగీ
- మలేరియా
- కలరా
- టైఫాయిడ్
- హెపటైటిస్ ఏ
- జలుబు, ఫ్లూ జ్వరాలు

ఈడిస్ ఈజిప్టి అనే దోమ కారణంగా డెంగీ వ్యాధి సోకుతుంది. ఈ దోమ కలుషిత నీటిలో కంటే నిల్వ ఉన్న నీటిలోనే ఎక్కువగా ఉంటుంది. దోమల నివారణ, వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే డెంగీ నుంచి కాపాడుకోవచ్చని భారత వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
ప్రస్తుతం, దేశంలో లద్ధాఖ్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో డెంగీ కేసులు నమోదవుతున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది.
వానాకాలంలో బహిరంగ ప్రదేశాలలో వర్షపు నీరు నిల్వ ఉండి దోమల సంతోనాత్పత్తికి కేంద్రంగా నిలుస్తుంటుంది. ఈ సమయంలో డెంగీ కేసులు ఎక్కువగా పెరుగుతాయి.
డెంగీ లక్షణాలు:
- హఠాత్తుగా హై ఫీవర్ రావడం
- తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి
- కండరాలు, కీళ్ల నొప్పులు
- చర్మంపై దద్దుర్లు
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- దోమ తెరలు, మస్కిటో రెపెల్లెంట్స్ వాడాలి
- ట్యాంకులలో ఉండే నిలువ నీటిని తొలగించాలి
- కుండలు, కూలర్స్‌లో నిల్వ నీటిని తొలగించాలి
- బయటకు వెళ్లేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలి
- తలుపులు, కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేసుకోవాలి
- డెంగీ జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.

ఫొటో సోర్స్, Getty Images

మలేరియా.. ప్లాస్మోడియం అనే పరాన్నజీవిని మోసే ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. దీనిని నివారించవచ్చని, నయం చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 2023లో 83 దేశాలలో 263 మిలియన్ల మలేరియా కేసులు, 597,000 మలేరియా మరణాలు సంభవించాయని పేర్కొంది.
లక్షణాలు
- చలి, పదేపదే జ్వరం తిరగబెట్టడం
- చెమటలు పట్టడం, అలసిపోవడం
- తలనొప్పి, వికారం
- కండరాల నొప్పులు
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మలేరియా ఉన్న ప్రదేశాలలో నిద్రపోయేటప్పుడు దోమతెరలను వాడాలి
- చీకటిపడ్డాక దోమల నివారణ మందులను (DEET, IR3535 లేదా ఇకారిడిన్ కలిగినవి) వాడాలి
- కాయిల్స్ వేపరైజర్లను ఉపయోగించాలి
- శరీరాన్ని మొత్తం కప్పే దుస్తులు ధరించాలి
- విండో స్క్రీన్‌లను ఉపయోగించాలి
- మందులు తీసుకోవడం ద్వారా మలేరియాను నివారించవచ్చు.
- మలేరియా ప్రబలిన ప్రాంతాలకు ప్రయాణించే ముందు కీమోప్రొఫిలాక్సిస్ వంటి మందులు తీసుకోవడం గురించి వైద్యుడితో మాట్లాడాలి
వర్షాకాలంలోనే మలేరియా ఎందుకు పెరుగుతుందంటే, నీటి గుంతలు, మురుగు కాలువలు దోమల సంతానోత్పత్తి కేంద్రాలుగా మారి మలేరియా ప్రమాదాన్ని పెంచుతాయి.

టైఫాయిడ్ జ్వరమనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.
టైఫాయిడ్ ఉన్న వ్యక్తి తాకిన ఆహారం లేదా కలుషితమైన నీరు తీసుకున్నప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. దీని లక్షణాలు 1 నుంచి 3 వారాల్లోపు కనపడతాయి. తేలికపాటి లేదా తీవ్రమైన లక్షణాలు కూడా ఉండవచ్చు.
లక్షణాలు
- దీర్ఘకాలిక జ్వరం
- నీరసం
- పొట్ట నొప్పి
- అతిసారం
- ఆకలి వేయకపోవడం
- మలబద్ధకం
- ఛాతీపై గులాబీ రంగు మచ్చలు
జ్వరం తగ్గిపోయిన తరువాత కూడా కొంతమందిలో బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. వీరు ఇతరులకు ఈ ఇన్ఫెక్షన్ సోకడానికి కారణమవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. బ్యాక్టీరియా క్యారీయర్లకు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాలని తెలిపింది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మరిగించిన లేదా వడగట్టిన నీటిని తాగాలి
- బయటి ఆహారాన్ని, పచ్చి సలాడ్లను తినకూడదు
- భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి
- ఆహారాన్ని బాగా ఉడికించి తినాలి
వానాకాలంలో నీటి కాలుష్యం సర్వసాధారణం. ముఖ్యంగా పారిశుధ్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా టైఫాయిడ్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

కలుషిత నీటిలో ఉండే విబ్రియో కలరా బ్యాక్టీరియా వల్ల కలరా సోకుతంది.
లక్షణాలు
- నీళ్ల విరేచనాలు
- డీహైడ్రేషన్
- కండరాల తిమ్మిరి
- వాంతులు
నివారణ
- సురక్షితమైన మంచినీటినే తాగాలి.
- చేతుల పరిశుభ్రతను పాటించాలి.
- తాజాగా వండిన భోజనాన్నే తినాలి.
వీటితో పాటు వర్షాకాలంలో అపరిశుభ్రమైన నీరు, ఆహారం అనేక రకాల జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఫలితంగా విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సంభవిస్తాయి.
అలాగే హెపటైటిస్ ఏ కూడా కలుషితమైన నీరు, లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. దీనివల్ల కామెర్లు, అలసట, కడుపునొప్పి వంటివి కలుగుతాయి.
జలుబు, ఫ్లూ
వర్షాకాలం ప్రారంభంతో, జలుబు, ఇన్‌ఫ్లూయెంజా సహా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల రేటు పెరుగుతుంది. దీని వలన దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తడి ప్రదేశాలు, అపరిశుభ్రత కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
లక్షణాలు:
- చర్మంపై దురద, ఎర్రటి మచ్చలు
- కాలి వేళ్ల మధ్య పొట్టు ఊడటం
- రంగు మారిన గోర్లు
- నోటిలో తెల్లని మచ్చలు
నివారణ
పాదాలు, బాహుమూలలు పొడిగా ఉండేలా చూసుకోవాలి
యాంటీ ఫంగల్ పౌడర్లు లేదా క్రీములు వాడాలి
ఇతరులు వాడిన టవళ్లు, చెప్పులను వాడకూడదు
బాగా గాలి ఆడే దుస్తులు ధరించాలి

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల విషయంలో డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి, మందుల విషయంలో ఏం చేయాలనే అంశాలను విశాఖపట్నానికి చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ చేరాల వెంకట సాయి చరణి బీబీసీకి వివరించారు.
‘‘వానా కాలంలో కలుషిత నీటి ద్వారా కలరా, టైఫాయిడ్, హెపటైటిస్. దోమల ద్వారా డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్ లాంటి వ్యాధులు వస్తాయి’’ అని ఆమె తెలిపారు.
జ్వరం ఎక్కువగా ఉండటం, తీవ్రమైన వాంతులు, కడుపునొప్పి, ఎక్కువగా దాహం వేయడం, అలసట, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, మలంలో, మూత్రంలో లేదా దంతాల వద్ద రక్తస్రావం (ఇది డెంగీలో సాధారణం), కళ్లు పసుపు రంగులో కనిపించడం, మూత్రం గాఢమైన పసుపురంగులో రావడం (హెపటైటిస్ సూచన) లాంటి సందర్భాలలో డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలని ఆమె చెప్పారు.
అలాగే ‘సొంత వైద్యం చేసుకోకూడదు’ అని ఆమె హెచ్చరించారు. మన దగ్గర చాలామంది డాక్టర్ సలహా లేకుండా మందులు కొంటుంటారని, వర్షాకాలంలో ఇది చాలా ప్రమాదకరమని తెలిపారు.
‘‘యాంటీబయాటిక్స్ అవసరం లేకపోయినా వాడటం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. తరచుగా వాడే జ్వరపు మాత్రలు, నొప్పి మందులు కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి’’ అని చెప్పారు.
స్టెరాయిడ్ లేదా తక్షణం ఉపశమనాన్ని ఇచ్చే మందులు ఇన్ఫెక్షన్లను దాచిపెట్టి అవి మరింత తీవ్రమయ్యేలా చేస్తాయని తెలిపారు.
జ్వరం, వాంతులు, బలహీనత లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరని డాక్టర్ చరణి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

- ఎప్పుడూ ఇంటిలోకి తగినంత గాలి వచ్చేలా చూసుకోండి.
- కాచి చల్లార్చిన నీటిని తాగండి.
- ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూతలు పెట్టండి.
- పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.
- పిల్లలకు సకాలంలో టీకాలు వేయించండి.
- పిల్లలు బయటి నుంచి వచ్చిన తరువాత వారు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకునేలా ప్రోత్సహించండి.
- కొవ్వు, నూనె, ఉప్పును పరిమితంగా వాడండి.
- పాల ఉత్పత్తులను తగ్గించండి.
- హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించండి.
- నీరు పుష్కలంగా తాగండి. ఆరోగ్యవంతులైన పెద్దలు రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి.
- వానలో బయటకు వెళ్లేటప్పుడు రెయిన్ కోట్, గొడుగు వంటివి వాడండి.
- జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నివారణకు డాక్టర్ సూచన మేరకు విటమిన్ సి తీసుకోండి.
- వానలో తడిస్తే వెంటనే తడిబట్టలను తీసివేసి స్నానం చేయండి.
వానాకాలంలో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














