బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా

ఫొటో సోర్స్, Kalvakuntla kavitha
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను ఆమోదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అంటూ 'తెలంగాణ జాగృతి' అధ్యక్షురాలు కె. కవిత తెలిపారు.

ఫొటో సోర్స్, Kalvkuntlakavitha
అలాగే బీఆర్ఎస్ తరపున వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు బుధవారం నాడు జరిగిన విలేఖరుల సమావేశంలో చెప్పారు.
‘‘పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి రాజీనామాను స్పీకర్ ఫార్మాట్‌లో పంపుతున్నాను’’ అన్నారు. ఈమేరకు ఆమె రెండు లేఖలను బుధవారం విలేఖరుల సమావేశంలో చూపారు.‘

ఫొటో సోర్స్, Kalvkuntlakavitha
‘‘వీటిని (ఈ లేఖలను) ఇప్పుడే ఎందుకు చూపుతున్నను అంటే పదవులపై నాకు ఆశలేదు. నేను ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఎంత వీలైతే ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. లాఠీ దెబ్బతినడానికి, జైలుకు పోవడానికి ఉద్యమంలోకి వచ్చినాం. అధికారంలోకి వస్తుందని రాలేదు’’ అని ఈ సందర్భంగా చెప్పారు.
అసలేం జరిగింది?
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంగళవారం బీఆర్ఎస్ ప్రకటించింది.
సోమవారం నాడు విలేఖరుల సమావేశం పెట్టి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో మంగళవారం నాడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
"పార్టీ ఎమ్మెల్సీ కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

ఫొటో సోర్స్, UGC
పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు, కె.కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లోని కీలక నేతల పేరెత్తకుండా విమర్శలు చేస్తూ వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల సోమవారం (సెప్టెంబర్ 1న) విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నేరుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును లక్ష్యంగా చేసుకుని ఆమె ఆరోపణలు చేశారు.
''నా మీద ఓపెన్‌గా మీడియా మిత్రులతో రకరకాల మాటలు చెప్పినా భరించినా. నాపై పర్సనల్ అటాక్‌కు దిగినా కనీసం పిలిచి మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెబుతున్నా నేను'' అని ఆమె అన్నారు.


ఫొటో సోర్స్, facebook/Kalvakuntla Kavitha
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన రోజే.. బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె మండిపడ్డారు.
సోమవారం ఉదయమే అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఒకవైపు కేసీఆర్‌ను పొగుడుతూనే మరోవైపు హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు గుప్పించారు.
కవిత ఏమన్నారంటే..
''కేసీఆర్‌కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదు. కేసీఆర్‌కు అవినీతి మరక ఎట్లా వచ్చిందో బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలి. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ల కారణంగా ఆయనకు అవినీతి మరక అంటింది'' అన్నారు కవిత.
''హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. దగ్గర ఉండి అవినీతి అనకొండలు కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారు'' అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కోపం రావొచ్చంటూనే, అప్పుడప్పుడు మందు చేదుగా ఉన్నా సరే తీసుకోవాలని కవిత చెప్పారు.
''నా వెనుక బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నాది కేసీఆర్ బ్లడ్. నేను ఇండిపెండెంట్‌గా ఉంటాను'' అని చెప్పారు.
ఇదే సమయంలో 'కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చిందంటే.. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత?' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కవిత.
కేసీఆర్‌కు తాను రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారామె. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురయ్యారు.
''సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు'' అని ఆమె చెప్పారు .
మీడియా సమావేశం తర్వాత ''జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్'' అంటూ కవిత నినాదాలు చేశారు.
కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు, సంతోష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి స్పందించాల్సి ఉంది, వారు స్పందించగానే ఈ కథనంలో జోడిస్తాం.
మరోవైపు, కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు మౌనంగా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

ఫొటో సోర్స్, BBC/Kalvakuntla kavitha
కొొంతకాలంగా పార్టీకి దూరం
2006 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కవిత.. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాను స్థాపించిన 'తెలంగాణ జాగృతి' తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండాలు కనిపించడం లేదు.
ఇటీవల నల్గొండకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె విమర్శలు చేశారు.
గతంలో కేసీఆర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచిన సందర్భంలో చేసిన ధర్నాలో, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేసిన రిలే నిరాహార దీక్ష సమయంలోనూ పార్టీ ప్రస్తావన లేకుండానే చూసుకున్నారు కవిత. ఆమె ప్రసంగాల్లో కూడా ఎక్కడా పార్టీ నాయకుల ప్రస్తావన వినిపించలేదు.
అయితే, పరోక్షంగా వారి పేర్లు ప్రస్తావిస్తూ, ఫలానా నేతపై తన విమర్శలు అని చెప్పకనే చెప్పేవారు. ఈసారి మాత్రం నేరుగా పార్టీలో కీలకంగా ఉన్న నేతలు, కుటుంబ సభ్యులుగా ఉన్న హరీష్, సంతోష్‌లను లక్ష్యంగా చేసుకోవడం పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగించింది.

ఫొటో సోర్స్, facebook/Kalvakuntla Kavitha
మరోవైపు, కవిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీకి పూర్తిగా దూరమైనట్లేననే పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఆమె పీఆర్వోను బీఆర్ఎస్ పార్టీ గ్రూపుల నుంచి తొలగించారు.
కవిత మీడియా సమావేశం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా హరీష్ రావును ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
''సింహం సింగిల్‌గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు'' అని పోస్టు పెట్టారు.

ఫొటో సోర్స్, X/Bmaheshgoud6666
ఇదంతా డ్రామాలో భాగమే: కాంగ్రెస్
కవిత సస్పెన్షన్ అనేది ఒక పెద్ద డ్రామాలో భాగమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ అన్నారు.
''హరీష్ రావుపై కవిత వ్యాఖ్యలు చేయడం, కవితపై హరీష్ రావు వ్యాఖ్యానించడం ఇదంతా డ్రామాలో భాగమే. కేసీఆర్ కుటుంబం మొత్తం కలిసి ప్రజా ధనాన్ని దోచుకుంది. వారంతా ఒక్కటే. కానీ, ఇప్పుడు వేర్వేరంటూ నటిస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు.
దీనికి ముందు సోమవారం కవిత చేసిన ఆరోపణలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
''కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో తేలిపోయింది'' అని ఆయన అన్నారు.
కుటుంబ కలహాలను తమ ప్రభుత్వంపై రుద్దడం ఏంటని ప్రశ్నించారాయన.
''మొదటి దఫా ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు తప్పు చేస్తే కేసీఆర్ బాధ్యతాయుతంగా హరీష్ రావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పుడే కవిత ఎందుకు మాట్లాడలేదు?'' అని ప్రశ్నించారు మహేశ్ కుమార్ గౌడ్.
కేసీఆర్ కుటుంబ కలహాలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని చెప్పారు.
''కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో కవిత చెప్పారు. ఆ దెయ్యాలు హరీష్ రావు, సంతోష్ రావేనా? ఇంకా ఎవరెవరు ఉన్నారో స్పష్టం చేయాలి'' అన్నారు మహేశ్ కుమార్ గౌడ్.
కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు, సంతోష్ రావు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఏమంటోంది?
కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది.
హరీష్ రావు అమెరికా పర్యటనలో ఉన్నందున ఆయన ఇంకా స్పందించలేదు. సంతోష్ రావు నుంచి గానీ, ఇతర నాయకులు గానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు.
వారిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది, కానీ వారు అందుబాటులోకి రాలేదు. స్పందన రాగానే ఈ కథనంలో అప్డేట్ చేస్తాం.
మరోవైపు, కవిత వ్యాఖ్యలపై పేరు రాయడానికి ఇష్టపడని ముగ్గురు బీఆర్ఎస్ సీనియర్ నేతలతో బీబీసీ మాట్లాడింది.
''ప్రస్తుత తరుణంలో కవిత గురించి ఏమీ మాట్లాడలేం. పార్టీ అధిష్టానం నుంచి వచ్చే ఆదేశాల మేరకు వ్యవహరించాలి. ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలూ మేం చేయకూడదు'' అని సోమవారం వారు చెప్పారు.
అనంతరం, మంగళవారం (సెప్టెంబర్ 2) ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన వెలువడింది.
‘‘కవిత రాజకీయంగా బలంగా నిలదొక్కుకోవాలి’’
కవిత తన ఇమేజ్‌ను పెంచుకుని రాజకీయంగా ఆచితూచి ఆడుగులు వేస్తే భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.
''ప్రస్తుతం ఆమె వెంట కీలక నేతలెవరూ లేరు. ఆమెపై ఇప్పటికే లిక్కర్ స్కాం కేసు నడుస్తోంది. ముందుగా ఈ ఇమేజ్ నుంచి బయటపడి రాజకీయంగా తనకంటూ బలంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది'' అని చెప్పారు.
''కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం చూపించేదిగానే చూడాలి. ఇది ఇతర పార్టీలకు అస్త్రంగానూ ఉంటుంది'' అని చెప్పారు.
అయితే, కేసీఆర్‌పై ఉన్న కోపంతోనే తనపై సీబీఐ కేసులు పెట్టించారనే వాదన ఆమె ముందు నుంచి వినిపిస్తూ వచ్చారని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో మరో రాజకీయ వేదికకు లేదా పార్టీకి స్థానం ఉందని చెప్పవచ్చని కె. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














