ఏపీ, తెలంగాణల్లో చర్చనీయంగా రాజకీయ నాయకుల 'డబుల్ పెన్షన్'.. ఎవరెవరంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల్లో 'డబుల్ పెన్షన్' వార్త చర్చనీయమైంది.
ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేస్తే రెండు పెన్షన్లు తీసుకోవడం సరికాదంటూ ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లికి చెందిన డబ్ల్యూడీ గణేశ్ అనే ఆర్టీఐ కార్యకర్త అభిప్రాయపడ్డారు.
చట్టసభ సభ్యులుగా పనిచేసిన మాజీలు ఏదో ఒక పెన్షన్ తీసుకుని మరొకటి వదిలేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, చట్టం అనుమతిస్తుంది కాబట్టే, వారు డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారని, ఇదేమీ నేరం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలుగునాట ఇలా డబుల్ పెన్షన్ తీసుకుంటున్న వారు 21 మంది ఉండగా, వారిలో సెలబ్రిటీలు, బడా వ్యాపారులు కూడా ఉన్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలుగా పనిచేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవితాంతం పెన్షన్లు ఇస్తాయి. వారు మరణించిన తరువాత వారి భార్య/భర్తకు కూడా పెన్షన్ ఇస్తాయి.
ఎంపీలుగా పనిచేసిన వారికి భారత ప్రభుత్వం రూ.31 వేల పెన్షన్ ఇస్తుండగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి ఏపీ ప్రభుత్వం కనిష్ఠంగా రూ.30 వేల నుంచి గరిష్ఠంగా రూ.50 వేల వరకు పెన్షన్ ఇస్తోంది.
ఇక తెలంగాణ కనిష్ఠంగా రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.70 వేల వరకు ఇస్తోందని గణేశ్ చెప్పారు.


'రద్దు చేయాలి'
సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ప్రకారం తాను చేసిన దరఖాస్తుకు అధికారుల నుంచి వచ్చిన సమాధానంలో ఎంపీలు, ఎమ్మెల్యేల పెన్షన్ల డేటా తెలుసుకున్నానని గణేశ్ చెప్పారు.
దాని ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో 2,229 మంది మాజీ ఎంపీలు పెన్షన్లు తీసుకుంటుండగా, ఏపీలో 473 మంది, తెలంగాణలో 465 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెన్షన్ తీసుకుంటున్నట్టు తెలిసిందని గణేశ్ బీబీసీతో అన్నారు.
ఇవి కాకుండా వారికి ఇతర సదుపాయాలు ఉంటాయని ఆయన చెబుతున్నారు.
పెన్షన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని, అలాంటి వారికే పెన్షన్ వస్తుందని ఆయనంటున్నారు.
''చట్ట ప్రకారం రెండు పెన్షన్లు తప్పు కాకపోవచ్చు. కానీ, రాజభరణాలను రద్దు చేసిన తీరులోనే వీటిని రద్దు చేయాల్సిన సమయం వచ్చింది. అప్పట్లో సొంత ఆస్తులు అమ్ముకున్న నాయకుల కోసం ఈ పెన్షన్లు వంటివి వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు పెన్షన్లే వద్దు అనడం లేదు. ఒక మనిషికి ఒక పెన్షన్, అది ఎమ్మెల్యేదో లేదా ఎంపీదో చాలు అంటున్నాను. ఇప్పుడు సుందరయ్య, ప్రకాశం, సంజీవయ్య వంటి వారు లేరు. పెన్షనే వద్దంటే అన్యాయం. ఒకటి చాలు, రెండు వద్దు అంటున్నాను'' అని బీబీసీతో అన్నారు గణేశ్.

ఫొటో సోర్స్, APLEGISLATURE.ORG
'చట్టసభల సభ్యులకే ఎందుకు?'
2004 తరువాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి కూడా పెన్షన్లు ఉండవు.
అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పీఎస్‌యూలలో పనిచేసే వారికి కూడా నామమాత్రపు పెన్షన్ వస్తుంది.
వారెవరికీ లేని సౌకర్యం చట్టసభల సభ్యులకు మాత్రం ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలని యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు.
''గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ వదులుకోమని చెబుతున్న ప్రభుత్వాలు, డబుల్ పెన్షన్ వదులుకోమని ఎందుకు చెప్పడం లేదు?. ఈ జాబితాలో వందల కోట్ల ఆస్తులున్న వారు కూడా ఉన్నారు. పన్ను కట్టే వ్యక్తిగా అడిగే హక్కు నాకు, నాతో పాటు మనందరికీ ఉంది'' అన్నారు గణేశ్.
చట్ట ప్రకారమే తీసుకుంటున్నారు : రాజకీయ విశ్లేషకులు
డబుల్ పెన్షన్ విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి.
చట్ట ప్రకారం రెండు పెన్షన్లు తీసుకోవడం నేరం కాదు కాబట్టి, వారిని విమర్శించాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
''ఇందులో విమర్శించడానికి ఏమీ లేదు. ఎవరైనా కావాలంటే స్వచ్ఛందంగా తమ పెన్షన్ వదులుకుంటే బావుంటుంది. కానీ, వారిని వ్యక్తిగతంగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే జీతం తీసుకోరు, మరికొందరు తీసుకుంటారు. అందులో ధనిక, తక్కువ ఆదాయం అన్న తేడా లేదు. మేం చేసిన దానికే ఇస్తున్నారు కదా అని వారు అనుకోవచ్చు. దానికి చట్టం అనుమతిస్తుంది. అయితే చట్టం మార్చాలి లేదా వ్యక్తిగత నిర్ణయానికి వదిలేయాలి. అంతేకానీ, చట్ట ప్రకారం తీసుకుంటున్న వారి విషయంలో ఇలా పేర్లు తీసుకుని, ఫోటోలు వేసి ఏదో నేరం చేసినట్టు చూపించడం మంచిది కాదు'' అని రాజకీయ విశ్లేషకులు కటారి శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
'సంస్కరణలు రావాలి'
ప్రస్తుతం ఈ పెన్షన్లను ఎంపీలకు 'ది శాలరీస్ అండ్ పెన్షన్ యాక్ట్' ప్రకారం, తెలుగు రాష్ట్రాల చట్టసభల సభ్యులకు స్థానిక చట్టాల ప్రకారం చెల్లిస్తున్నారు.
ఇవి 1953-54 ప్రాంతానికి చెందిన చట్టాలు. ప్రస్తుతం ఈ చట్టాలకు సవరణ చేసి డబుల్ పెన్షన్ విధానం రద్దు చేయాలని గణేశ్ డిమాండ్ చేస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తాను త్వరలో హైదరాబాద్, విజయవాడల్లో నిరసన కార్యక్రమాలు చేపడతానని గణేశ్ బీబీసీతో అన్నారు. అసలు మొత్తంగా ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేసిన వారికి పెన్షన్లు రద్దు చేయాలంటూ కొందరు గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లగా, దాన్ని కోర్టు కొట్టేసింది.
మదనపల్లికి చెందిన డబ్ల్యూడీ గణేశ్ ఓ ఆర్టీఐ యాక్టివిస్టు. తాను రెండేళ్లుగా ప్రజాస్వామ్య సంస్కరణల కోసం పోరాడుతున్నట్టు ఆయన చెప్పారు.
డబుల్ పెన్షన్ల తొలగింపుతో పాటు, పార్టీ ఫిరాయింపు నిబంధనలలో సంస్కరణలు చేసి స్పీకర్ స్థానంలో ఎన్నికల సంఘానికి బాధ్యత ఇవ్వడం, ఒక నాయకుడు ఒక పదవిలోనే ఉండేలా చూడటం, ఒకేసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా చూడటం, మంత్రి కావాలంటే ముందుగా కచ్చితంగా ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా ఎమ్మెల్సీ తప్పకుండా అయ్యేలా చూడటం – ఇలాంటి కొన్ని సంస్కరణల కోసం పోరాడుతున్నట్టు ఆయన చెప్పారు.
గణేశ్ ఆర్టీఐ దరఖాస్తుతో పొందిన సమాచారంగా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రెండు పెన్షన్లు తీసుకుంటున్న చట్ట సభల సభ్యుల జాబితా ఇదీ:
తెలంగాణ:
చెన్నమనేని విద్యాసాగర రావు
సర్వే సత్యనారాయణ
మాలోత్ కవిత
సోయం బాపూరావు
డా. అల్లాడి రాజ్ కుమార్
జి.సంజీవ రెడ్డి
దారావత్ రవీంద్ర నాయక్
రావుల చంద్రశేఖర రెడ్డి
ఆంధ్రప్రదేశ్:
నాదెండ్ల భాస్కర రావు
ఎంవీ మైసూరా రెడ్డి
కె.చిరంజీవి
టీజీ వెంకటేశ్
పుప్పాల చలపతి రావు
మోదుగుల వేణుగోపాల రెడ్డి
చేగొండి హరి రామ జోగయ్య
కొణతాల రామకృష్ణ
తోట నరసింహం
కాసు వెంకట కృష్ణా రెడ్డి
గంగుల ప్రతాప రెడ్డి
అనంత వెంకట్రామి రెడ్డి
కేఈ కృష్ణమూర్తి
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














