అరెస్టైన ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే బిల్లును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

ఫొటో సోర్స్, SANSADTV
130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
అవినీతి లేదా తీవ్రమైన నేరాల కేసుల్లో అరెస్టయి బెయిల్ పొందకుండా, వరసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులను 31 వ రోజున ఆ పదవి నుంచి తొలగించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుందని ది హిందూ పత్రిక పేర్కొంది.
అయితే, ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. వచ్చే పార్లమెంటరీ సమావేశాల మొదటి రోజున జేపీసీ తన నివేదికను సమర్పిస్తుంది. జేపీసీ ముందు ప్రతిపక్షాలు తమ అభ్యంతరాలను తెలిపే అవకాశం లభిస్తుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ప్రధానమంత్రితో పాటు మంత్రుల నియామకం, బాధ్యతలను వివరించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 75ను సవరించడం ఈ బిల్లు లక్ష్యం.
కాంగ్రెస్ నాయకులు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు ఈ బిల్లును వ్యతిరేకించారు. ప్రియాంక గాంధీ ఈ బిల్లును 'తీవ్రమైనది'గా అభివర్ణించారు. ఒవైసీ దీన్ని 'రాజ్యాంగ విరుద్ధం' అన్నారు.
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రి, మంత్రులు అరెస్టయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే, 31వ రోజున వారిని ఆ పదవి నుంచి తొలగిస్తామని ఈ బిల్లులో నిబంధన ఉంది.
ముసాయిదా బిల్లు ప్రకారం, ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి పాల్పడినందుకు ఒక మంత్రిని అరెస్టు చేసి, 30 రోజులు నిర్బంధించినట్లయితే, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగిస్తారు. ఇది వారి నిర్బంధం లేదా అరెస్టైన 31వ రోజున తప్పకుండా జరగాలి.


ఫొటో సోర్స్, ANI
పార్లమెంటులో ఏం జరిగింది?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ఈ బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టగానే నిరసనలు ప్రారంభమయ్యాయి. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లు ప్రతులను చించివేశారు.
"ఈ బిల్లు దేశ సమాఖ్య వ్యవస్థను నాశనం చేయబోతోంది. ఇది రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలను నాశనం చేయబోతోంది. ఈ బిల్లు రాజకీయాల్లో నైతికతను తీసుకురాబోతోందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. నేను హోంమంత్రిని ఒక ప్రశ్న అడగవచ్చా? ఆయన గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్టు అయ్యారు. ఆ సమయంలో ఆయన నైతికతను పాటించారా?" అని కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ అన్నారు.
అనంతరం, అమిత్ షా సమాధానమిస్తూ "గౌరవనీయులైన స్పీకర్, నేను రికార్డును క్లియర్ చేయాలనుకుంటున్నాను. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. అరెస్టు చేయడానికి ముందు, నేను నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశాను. కోర్టు నన్ను నిర్దోషిగా తేల్చే వరకు, ఏ రాజ్యాంగ పదవిని చేపట్టలేదు. వాళ్లు మాకు ఏ నైతికతను బోధిస్తారు? ఇలాంటి నైతిక విలువలు పెరగాలని నేను కోరుకుంటున్నాను" అని అన్నారు.
"ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. ప్రధానమంత్రిని ఎవరు అరెస్టు చేస్తారు? ఈ బిల్లుల ద్వారా మన దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోంది. మేం దాన్ని వ్యతిరేకిస్తాం. అధికారం శాశ్వతం కాదని బీజేపీ మర్చిపోతోంది" అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బిల్లును కేంద్రం ఆమోదించగలదా?
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21(గురువారం)న ముగుస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో చట్టం ప్రకారం, కేవలం ఆరోపణల ఆధారంగా మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రిని వారి పదవి నుంచి తొలగించే నిబంధన లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు దోషులుగా నిర్ధరణ అయిన తర్వాతే తమ సభ్యత్వాన్ని కోల్పోయేవారు.
కాగా, కొత్త బిల్లును ఎందుకు తీసుకువస్తున్నామనే సమాచారాన్ని లోక్‌సభ ఎంపీలకు అందించారు అమిత్ షా.
"ఎన్నికైన ప్రతినిధులు భారత ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తారు. వారు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎదగాలని, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పని చేయాలని జనం కోరుకుంటారు. పదవిలో ఉన్నప్పుడు మంత్రుల క్యారెక్టర్ అనుమానాస్పదంగా ఉండకూడదని భావిస్తుంటారు" అని అందులో తెలిపారు.
తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని అరెస్టు చేసి, అదుపులోకి తీసుకుంటే వారు రాజ్యాంగ నైతికత, సుపరిపాలన సూత్రాలకు హాని కలిగించే ఆస్కారం ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రజలకు వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది.
"తీవ్రమైన నేరారోపణల కారణంగా అరెస్టయి, నిర్బంధంలో ఉన్న మంత్రిని తొలగించే నిబంధన రాజ్యాంగంలో లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులను తొలగించడానికి ఆర్టికల్ 75, 164, 239ఏఏ లను సవరించాల్సిన అవసరం ఉంది'' అని అందులో తెలిపారు.
దేశంలో అరెస్టయిన లేదా నిర్బంధంలో ఉన్న చాలామంది మంత్రులు రాజీనామా చేయడం లేదు. మరోవైపు, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయవచ్చని ప్రతిపక్షం వాదిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేశారు. వారిని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించారని ప్రతిపక్షం ఆరోపించింది.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్రం వ్యూహం ఏమిటి?
ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పందిస్తూ "ఇది ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉద్దేశించినది. అరెస్టులలో ఎటువంటి నియమాలను పాటించడం లేదు. ప్రతిపక్ష నాయకుల అరెస్టులు పెరిగాయి. వాటిలో చాలా లొసుగులు ఉన్నాయి. అరెస్టు తర్వాత ముఖ్యమంత్రిని కొత్త ప్రతిపాదిత చట్టం వెంటనే తొలగిస్తుంది. ప్రతిపక్షాన్ని అస్థిరపరచడానికి ఇదే ఉత్తమ మార్గం" అని అన్నారు.
"ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను అరెస్టు చేయడానికి పక్షపాత కేంద్ర సంస్థలను ప్రేరేపించడం, ఎన్నికల్లో వారిని ఓడించడంలో విఫలమైనప్పటికీ, ఏకపక్షంగా అరెస్టు చేసి తొలగించడంలాంటివి చేస్తున్నారు. మరోవైపు, అధికార పార్టీకి చెందిన ఏ సిట్టింగ్ ముఖ్యమంత్రికి కూడా ఏమీ జరగదు" అని సింఘ్వి అన్నారు.
వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21న ముగియనున్నాయి. ప్రభుత్వానికి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు. మరి ఈ బిల్లును తీసుకురావడం వల్ల కేంద్రానికి ప్రయోజనం ఏమిటి?
ఈ ప్రశ్నకు ఆంగ్ల వార్తాపత్రిక హిందూస్తాన్ టైమ్స్ రాజకీయ సంపాదకుడు వినోద్ శర్మ సమాధానమిస్తూ "వారు బిల్లును ప్రవేశపెడతారు, ఆ తర్వాత అది సెలెక్ట్ కమిటీకి వెళుతుంది. తెలుగుదేశం పార్టీ ఈ బిల్లును అంగీకరిస్తుందని నేననుకోను. టీడీపీ మద్దతు కారణంగానే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. రాజకీయాలు, అవినీతిని నేరంగా పరిగణించడంపై ప్రభుత్వం చాలా కఠినంగా ఉందన్న వాతావరణాన్ని సృష్టించడం ఈ బిల్లు ఉద్దేశం" అని అన్నారు.
"ఈ బిల్లు ఆమోదిస్తే, గవర్నర్ ఏ ముఖ్యమంత్రినైనా తొలగించే అధికారం పొందుతారు. గవర్నర్ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని తరచుగా ఆరోపణలు వస్తుండటం ఇక్కడ ఇంకో విషయం. అయితే, గవర్నర్‌ను ఈ చట్టం పరిధిలోకి తేలేదు" అని వినోద్ శర్మ అన్నారు.
'ప్రతిపక్షాన్ని తొలగించడానికి ఇదొక మార్గం'
"నిందితుడు, దోషికి మధ్య వ్యత్యాసాన్ని చెరిపేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మీరు రాజకీయ క్రీడలో భాగం అవుతున్నారని ఈడీకి సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. మీరు ఎన్నికల్లో గెలవలేని చోట, ప్రతిపక్షం లేకుండా చేయడానికి ఇదొక మార్గం. హోంమంత్రి తన సొంత పార్టీలోని కొంతమందిని కూడా లక్ష్యంగా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని అనిపిస్తోంది" అని రాష్ట్రీయ జనతాదళ్ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.
ఈ బిల్లును సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య విమర్శించారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అన్నారు. ఈ బిల్లు ద్వారా కేంద్ర సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్ఐఏల దుర్వినియోగం పెరుగుతుందని దీపాంకర్ ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














